22, ఆగస్టు 2016, సోమవారం

కంచికి పోతావా కృష్ణమ్మా - వేటూరి భావ వీచిక


కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ

త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాది బొమ్మ రాగమేదో తీసినట్టు ఉందమ్మా
ముసిముసి నవ్వుల పూవులు పూసింది కొమ్మ మువ్వ గోపాలా మువ్వ గోపాలా మువ్వ గోపాల అన్నట్టుందమ్మా
అడుగుల్లో సవ్వళ్లు కాదమ్మా అవి ఎడదల్లో సందళ్లు లేవమ్మా

రాసలీల సాగినంక రాధ నీవేనమ్మా రాతిరేళ కంట నిదర రాదమ్మా
ముసిరిన చీకటి ముంగిట లేచింది కొమ్మ ముద్దు మురిపాల మువ్వ గోపాలా నీవు రావేల అన్నట్టుందమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా

వేటూరి సుందరరామమూర్తిగారి సాహిత్యంలో జానపద హంగులు, శాస్త్రీయ సొబగులు మేళవించి ఉంటాయి. అటువంటి గీతమే ఈ కంచి పోతావా కృష్ణమ్మా అనే గీతం. నాయిక కబుర్లు తెలుసుకునే ప్రక్రియను ఎంతో అందంగా జానపదాల్లో వేటూరి వారు మనకు అందించారు. ఆ నాయిక గాథను వర్ణించటానికి వేటూరి వారు కంచిని, చిన్ని కృష్ణుని ఎన్నుకున్నారు. కంచిలో ఉన్న ఆ ముద్దుగుమ్మ ఎలా ఉంటుందో వివరించారు. త్యాగరాజ కీర్తనల్లె ఉన్నాదీ బొమ్మ అన్నాడు. వాగ్గేయకారులలో త్యాగరాజస్వామి అగ్రగణ్యుడు. ఆయన కీర్తనలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఆ కీర్తనల ఔన్నత్యాన్ని ఈ ముద్దుగుమ్మ రూపానికి సారూప్యంగా తెలిపారు. కీర్తనల రాగం కూడా భావానికి తగినట్లుగా ఉండటం త్యాగయ్య సంకీర్తనల ప్రత్యేకత. రాగాన్ని ఆలాపిస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉందిట ఆ ముద్దు గుమ్మ. ముసి ముసి నవ్వులనే పూలు తన ముఖంలో పూయించందట ఆ నాయిక. మువ్వ గోపాలా మువ్వ గోపాలా అని పిలిచినట్లుందట. ఆమె అడుగులు వేస్తుంటే వచ్చే మువ్వల సవ్వడులు ఆమె హృదయ స్పందనలట. ఇటువంటి సాహిత్యం వేటూరి వారికే సాధ్యం. నాయిక మధురమైన భావనలు ఆమె హృదయస్పందనలుగా, ఆమె పదమంజీరముల సవ్వడులుగా కవి ప్రస్తుతించారు. బృందావనిలో రాసలీల (ఏవండోయ్ రాసలీల అంటే శృంగారం కాదు, ఒకరితో ఒకరు మైమరచి ఆడుతూ పాడుతూ జరుపుకునే వేడుక) ముగియగానే రాధ పరిస్థితి ఎలా ఉందో అలాంటిదట నాయిక పరిస్థితి. రాతిరంతా నిదుర రాదట, చీకటి తొలగకముందే (తెల్లవారకముందే) లేచిన ఆ ముద్దు గుమ్మ మువ్వ గోపాలా నీవు రావేలా అన్నట్లుగా ఉందట. ఆ నాయకుడు కృష్ణుని ద్వారా తన మనసు దోచుకున్న ఆ నాయికను తన మనసులో ఉన్న భావనను వ్యక్త పరచవలసిందిగా కోరుతున్నాడు.

నాయిక పట్ల తనకున్న భావనలను వార్తాహరునికి నాయకుడు వ్యక్తపరచే గీతం ఇది. ఆ వార్తాహరుడే కృష్ణుడు, ఆ నాయిక కంచిలో ఉన్నట్లు భావన. వేటూరి వారు నాయకుని భావ వీచికలను ఆవిష్కరించిన రీతి ఎంత అద్భుతమో బాలు గానం కూడా అంతే మధురం. ఈ గీతం ఆలాపనలో బాలు కనబరచిన భావ సౌందర్యం, లాలిత్యం సున్నితమైన ప్రేమకు ప్రతీకగా నిలిచింది. అలాగే, సుశీలమ్మ ఆలాపనలు కూడా చాలా లలితంగా ఉంటాయి. ఇక చిత్రం విషయానికొస్తే, నాయకునిగా చంద్రమోహన్ జీవితంలో ఇది మరో మంచి చిత్రం. సగటు మధ్య తరగతి మగాడి మనోవికారాలను అద్భుతంగా ప్రతిబింబించే పాత్ర ఇది. అలాగే, నాయిక పాత్రలో నటి సులక్షణ ఎంతో చక్కగా నటించారు. ప్రేమికులనుండి భార్యా భర్తలుగా మారిన ఓ జంట మధ్య ఉండే ఆటుపోట్లను వీరిద్దరు చక్కగా పాత్రలలో జీవించి మనలను అలరించారు. మామ మహదేవన్ మోహన రాగంలో కూర్చిన ఈ గీతం తెలుగు చలన చిత్ర గీతాలలో ఒక మంచి మధురమైన గీతంగా నిలిచింది. కళాతపస్వి విశ్వనాథ్ గారి దర్శకత్వంలో జంధ్యాల సంభాషణలు, నటీనటుల ప్రతిభ, సంగీత దర్శకులు, గాయనీ గాయకుల పటిమతో ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. 

20, ఆగస్టు 2016, శనివారం

నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా - ఆరుద్ర కృష్ణభక్తి గీతం


నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా
వేణువు విందామని నీతో ఉందామని నీ రాధ వేచేనయ్యా! రావయ్యా! ఓ కృష్ణయ్యా!
ఓ గిరిధర! మురహర! రాధా మనోహరా!

నీవు వచ్చే చోట నీవు నడిచే బాట మమతల దీపాలు వెలిగించాను
కుశలము అడగాలని పదములు కడగాలని కన్నీటి కెరటాలు తరలించాను
ఓ గిరిధర! మురహర! నా హృదయేశ్వరా! నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా!
కృష్ణయ్యా! ఓ కృష్ణయ్యా! కృష్ణయ్యా! ఓ కృష్ణయ్యా!
గోపాలా! గోవింద గోవింద గోవింద గోవింద గోపాలా!

నీ పదరేణువునైనా పెదవుల వేణువునైనా బ్రతుకే ధన్యమని భావించాను
నిన్నే చేరాలని నీలో కరగాలని నా మనసే హారతిగా వెలిగించాను
ఓ గిరిధర! మురహర! నా హృదయేశ్వరా! ఒకసారి దయచేసి నాతిని దయచూడరా!
కృష్ణయ్యా! ఓ కృష్ణయ్యా! కృష్ణయ్యా! ఓ కృష్ణయ్యా!
గోపాలా! గోవింద గోవింద గోవింద గోవింద గోపాలా!



రాధ మధుర భక్తిని మనోజ్ఞంగా ఆవిష్కరించిన మరో సినీ గీతం ఈ నువ్వు వస్తావని అనే గీతం. 1978లో విడుదలైన మల్లెపూవు చిత్రంలో ఆరుద్ర గారు రచించిన ఈ గీతానికి సంగీతం చక్రవర్తి గారు అందించగా రాధ మనోభావనను అద్భుతంగా వాణీ జయరాం గారు తమ గళంలో మనకు అందించారు. ఆరుద్రగారి అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. ఆరుద్ర సినీ గేయ రచయితే కాకుండా కవితలు, కథలు, నాటకాలు, గ్రంథాలు రచించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ప్రముఖమైన రచనలలో సమగ్రాంధ్ర సాహిత్యం అనే 12 భాగాల పరిశోధనాంశం. ఆయన 1950 నుండి 1993 వరకు సినీ గేయ రచయితగా, సంభాషణల రచయితగా ఎంతో పేరు ప్రతిష్ఠలు పొందారు. ప్రముఖ కవి శ్రీశ్రీ వీరి మేనమామ. అలాగే ప్రముఖ రచయిత్రి డాక్టర్ రామలక్ష్మి వీరి సతీమణి. ఆరుద్ర ఇతర ప్రముఖ రచనలలో 1948 కాలం నాటి నిజం రజాకార్ల అరాచకాల నేపథ్యంలో రచించిన త్వమేవాహం అనే అద్భుతమైన సాహితీ సౌరభం. శ్రీశ్రీ లాగానే ఆరుద్ర కూడా మంచి విప్లవ రచయిత. కమ్యూనిష్టులతో అనుబంధం ఆయన రచనలపై ప్రభావం చూపింది. తిరువళ్లువార్ రచించిన తమిళ ప్రబంధం తిరుక్కురళ్‌ను ఆయన ఆంధ్రీకరించారు. రాముడికి సీత ఏమవుతుంది అనే సంచలనాత్మకమైన రచన కూడా చేశారు. ఆయన రచించిన కొన్ని అద్భుతమైన సినీ గేయాలు:

చెట్టులెక్కగలవా ఓ నరహరి, నారాయణా హరి నారాయణా, పాలకడలిపై శేషతల్పమున, నీల గగన ఘనశ్యామ - చెంచులక్ష్మి, మనసే అందాల బృందావనం - మంచి కుటుంబం, హైలో హైలెస్సా హంస కదా నా పడవ, మహాదేవ శంభో, జో జో జోల - భీష్మ, రంభ ఊర్వశి తలదన్నే రమణీ లలామ ఎవరు? - వీరాభిమన్యు, సిరి సిరి లాలి చిన్నారి లాలి - భక్త ప్రహ్లాద, ఈ మౌనం ఈ బిడియం -  డాక్టర్ చక్రవర్తి, ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వుల, హలో హలో ఓ అమ్మాయి - ఇద్దరు మిత్రులు, కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది - ఉయ్యాల జంపాల, ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట - మంచి మనసులు, యమునా తీరమున సంధ్యా సమయమున - జయభేరి, పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండు - రాము, ధనమేరా అన్నిటికీ మూలం - లక్ష్మీ నివాసం, చింతచెట్టు చిగురు చూడు - అదృష్టవంతులు, చంటి బాబు ఓ బుజ్జిబాబు - అందరూ దొంగలే, నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా, మబ్బే మసకేసిందిలే - వయసు పిలిచింది, మరు మల్లియ కన్నా తెల్లనిది - మల్లెపూవు, గోగులు గోగులు పూచే ఓ లచ్చా గుమ్మడి - ముత్యాల ముగ్గు, అబ్బోసి చిన్నమ్మా, సమూహ భోజనంబు  - అందాల రాముడు, అమ్ము కుట్టి అమ్ము కుట్టి - పెళ్లి పుస్తకం...ఇలా ఎన్నో ఎన్నెన్నో.

ఇక ఈ గీతానికి వస్తే రాధ మధుర భక్తికి ప్రతిబింబం. తనలోని భావనలన్నిటినీ స్వామికి  తాను నాయికయై సమర్పించింది. విరహం, భక్తి, వైరాగ్యం, శృంగారం, శరణాగతి అన్నీ కలబోసిన భక్తి రాధది. ఆ భావనలను ఆరుద్రగారు అచ్చతెనుగులో అద్భుతంగా పండించారు. వేణుమాధవుని కోసం బృందావనమంతా వేచియుందిట, ఆయన వస్తే ఆయన వేణుగానం వింటూ కాస్త సమయం గడుపుదామని రాధ వేచియుందట. ఎవరా కృష్ణుడు? గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోకులాన్ని కాపాడిన గిరిధరుడు, ముర అనే రాక్షసుని సంహరించిన వాడు, రాధ మనసు దోచుకున్నవాడు.

స్వామి వచ్చే చోట, ఆయన నడిచే బాట అంతా మమతల దీపాలు వెలిగించిందట. అంటే, హృదయాన్ని ఆయనకు సమర్పించి ఆయనను ఆహ్వానిస్తోంది. స్వామి క్షేమ సమాచారం తెలుసుకొని ఆయన పాదాలు కడగటానికి కన్నీటి కెరటాలను తరలించిందట. ఆ రాధా హృదయేశ్వరుని దర్శనానికై తపిస్తున్న రాధ హృదయ స్పందన ఎంత అందంగా ఉందో కదా? అందుకే రాధ మధురభక్తికి ప్రతిబింబమైంది.

మధురభక్తిలో మరో ప్రత్యేకత ఆ స్వామి భక్తి సామ్రాజ్యంలో కించిత్ స్థానమున్నా చాలు జన్మ ధన్యమే అన్న భావన. అదే భావన రాధ మనసునుండి వెలువడింది. ఆయన పాదాలు తాకిన ధూళి అయినా, ఆయన పెదవలుపై వేణువైనా చాలు అని భావించింది రాధ మనసు కనుగొన్న కవి హృదయం. మధురభక్తికి తారాస్థాయి నేను అన్న భావన పటాపంచలై స్వామిలో ఐక్యం కావటం. ఆ స్వామిని చేరుకోవాలని ఆయనలో ఏకమవ్వాలని తన మనసును హారతిగా సమర్పించిందిట ఆ రాధ. తనపై దయచూపమని స్వామిని వేడుకునే రాధ భావనలను అత్యంత నిర్మలంగా ఆవిష్కరించారు ఆరుద్ర గారు.

మధురభక్తి సోపానంలో ఎన్నో భావవ్యక్తీకరణలు. స్వామిని నాయకునిగా భావించి, ప్రేమించి, ఆరాధించి, ఆయన రానందుకు అలిగి, కోపగించి, దుఃఖించి, వచ్చినంత అలుక చూపి, స్వామి బుజ్జగింపులో కరగి, ఆయన ప్రేమ సామ్రాజ్యంలో ఓలలాడి, తనను తాను మరచి, నాది-నేను అన్న అహంకార లక్షణాలు విడిచే సోపానం ఇది. తాను ఆయన అనే ద్వైత భావం నుండి అద్వైత భావనకు చేరుకునే కష్టతర ప్రయాణం ఇది. భౌతిక ప్రపంచంలో ఉన్న వారికి ఈ భావన అర్థం కాక విపరీతార్థాలు తీసి ఆ మధురభక్తిలో ఉన్న వారి పట్ల వివక్ష చూపి హింసించిన సందర్భాలు ఎన్నో. అన్ని ఆటుపోట్లనూ తట్టుకొని మధుర భక్తులు స్వామిలో ఐక్యమై ముక్తిని పొందారు. అటువంటి వారిలో రాధ అగ్రగణ్యురాలు. ఆ మధుర భక్తులకు దేహస్ఫురణలు, దేహానికి సంబంధించిన అవలక్షణాలు ఏవీ అంటవు. వారి తనువు, మనసు అణువణువు స్వామే. ఆ భావననే ఆరుద్రగారు ఈ గీతం ద్వారా మనకు అందించారు. కృష్ణభక్తి సామ్రాజ్యంలో ఈ గీతానికి ఒక స్థానం తప్పకుండా ఉంటుంది. మనకు ఇంతటి అద్భుతమైన గీతాన్ని అందించిన ఆరుద్రగారికి జోహార్లు. ఈ మధుర భక్తి గీతాన్ని వాణీ జయరాం గారు మనోహరంగా ఆలపించారు. చక్రవర్తి గారి సంగీతం ఆరుద్రగారి సాహిత్య క్షీరానికి తేనెలా తోడైంది. ఈ ముగ్గురి ప్రతిభకు ఫలమే ఓ సుందర కృష్ణభక్తి గీతం.



12, ఆగస్టు 2016, శుక్రవారం

శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం - ముత్తుస్వామి దీక్షితుల వరలక్ష్మీ వ్రతం కృతి


శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే
శ్రీ సారస పదే రసపదే సపదే పదే పదే

భావజ జనక ప్రాణ వల్లభే సువర్ణాభే
భానుకోటి సమాన ప్రభే భక్త సులభే
సేవకజన పాలిని  శ్రిత పంకజ మాలిని
కేవల గుణశాలిని కేశవ హృత్కేళిని

శ్రావణ పౌర్ణమీ పూర్వస్థ శుక్రవారే
చారుమతీ ప్రభ్రుతిః పూజితాకారే
దేవాది గురు గుహ సమర్పిత మణిమయ హారే
దీనజన సంరక్షణ నిపుణ కనక ధారే
భావనాభేద చతురే భారతీ సన్నుత వరే
కైవల్య వితరణపరే కాంక్షిత ఫలప్రదకరే 

సకల సంపదలను కలిగించే వరమహాలక్ష్మికి నమస్కారములు. కలువల వంటి అందమైన పాదములు కలిగిన, తీయని పలుకులు పలికే ఆ తల్లికి పదే పదే నమస్కారములు. మన్మథుని తండ్రియైన శ్రీమహావిష్ణువు పత్నియైన, బంగారు కాంతితో కోటి సూర్యుల ప్రకాశం కలిగిన, భక్తులకు సులభయమైన, సేవక జనులను పాలించే, భక్తులచే కలువల మాలలతో పూజించబడే, సకల శుభ గుణసంపన్నురాలైన, కేశవుని హృదయములో ఆటాడే ఆ వరమహాలక్ష్మికి నమస్కారములు. శ్రావణ పౌర్ణమి ముందటి శుక్రవారమునాడు చారుమతి మొదలైన వారిచే పూజించబడిన, దేవతలు, కుమారస్వామిచే మణిఖచితమైన హారములను స్వీకరించిన, దీనులను రక్షణలో నిపుణురాలైన, దారిద్య్రంలో  ఉన్నవారికి కనకధారను కురిపించే, విచక్షణలో చతురురాలైన, సరస్వతిచే కొలువబడిన, మోక్షాన్ని ప్రసాదించే పరదేవతయైన, కోరిన కోర్కెలు తీర్చే వరమహాలక్ష్మికి నమస్కారములు.

ముత్తుస్వామి దీక్షితుల వారి ఈ కృతి వరలక్ష్మి గురించి ప్రత్యేకంగా వ్రాయబడింది. శ్రీరాగంలో అందంగా కూర్చబడిన ఈ కృతిలో వరలక్ష్మీ వ్రతం శ్రావణ పౌర్ణమి ముందటి శుక్రవారం నాడు జరుపుకోవటం గురించి ప్రస్తావన ఉంది. దీక్షితులవారు సిద్ధులు. అందుకే వారి నోట వచ్చిన పలుకులు దేవతా నివాసాలైనాయి. అటువంటిదే ఈ మహాలక్ష్మి స్తుతి. పల్లవి-అనుపల్లవిలోనే ఆయన పొందిన అనుభూతిలోని ఆధ్యాత్మిక ఔన్నత్యం మనకు అర్థమవుతుంది. వసుప్రదే, శ్రీ సారస పదే, సపదే, పదే పదే అన్న పదప్రయోగంలో దీక్షితులవారి ఉపాసనా శక్తి ప్రతిబింబిస్తుంది. చరణాలలో ఆయన సంస్కృత భాషా వైభవం సువర్ణమయమై ప్రకాశిస్తుంది. నన్ను బాగా ప్రభావితం చేసిన పదాలు కేశవ హృత్కేళిని మరియు భావనాభేద చతురే అన్నవి. శ్రీమహావిష్ణువు హృదయంలో ఆడుకునే తల్లిగా దీక్షితులవారు అమ్మను వర్ణించారు. నిజమే. ఆ పరమాత్మ హృదయస్థానంలో నిలిచి ఆయనను నిత్యం రమింపజేసే తల్లికి ఆ పదం ఎంత సముచితం కదా? భావనలలో భేదాన్ని చూపించటం చతురత కలిగిన తల్లిగా వాగ్గేయకారులు స్తుతించారు. అంటే భక్తుల భావనలను బట్టి అనుగ్రహించే తల్లి అని నా అభిప్రాయం. అలాగే దుష్టశిక్షణలో పరమాత్మకు తోడుగా, భక్తసులభగా, స్వామికి హృదయేశ్వరిగా నిత్యం సేవించే తల్లికి ఎన్ని లక్షణాలో. అందుకే గుణశాలిని అని మొదటి చరణంలో చెప్పి రెండవ చరణంలో భావనా భేద చతురే అని సంపూర్ణం చేశారు. కృతి ఆఖరి పంక్తిలో కైవల్య వితరణ పరే కాంక్షిత ఫలప్రదకరే అని పలికి పరము ఇహము రెండితా మన కోరికలను తీర్చే కల్పవల్లిగా ఆ వరమహాలక్ష్మిని కొనియాడారు. ఇటువంటి భావనలు ఉపాసనలో సిద్ధి పొందిన వారి నోట మాత్రమే ఆవిష్కరించబడుతాయి.  దీక్షితుల వారి ఆధ్యాత్మిక సంపదకు శతసహస్ర వందనాలు.

అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.  శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం అనే కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ఆలపించగా వినండి.

మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్నీచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్!

7, ఆగస్టు 2016, ఆదివారం

ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మడమెలా


శ్రీకృష్ణుని లీలలను వర్ణించటం మన తరమా? ఆ స్వామి తత్త్వం తెలుసుకోవటం అంత సులభమా?  ఆయన గాథలు నమ్మశక్యంగా ఉంటాయి. ఈ భావనలను వ్యాస భగవానుడిని నుండి పోతన వరకు ఎందరో భాగవతోత్తములు మనకు తెలియజేశారు. అటువంటి భావనే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మనకు ఆపద్బాంధవుడు అనే చిత్రంలోని ఔరా అమ్మక చెల్లా అనే గీతం ద్వారా అందించారు. అద్భుతమైన జానపద ప్రయోగంతో రచించిన ఈ గీతం కృష్ణ తత్త్వ మహత్వాన్ని మనకు తెలియజేస్తుంది. వివరాలు ఈ బ్లాగు పోస్టులో.

ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మడమెలా
అంత వింత గాధల్లో ఆ నందలాలా
బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వర్ణించ వల్ల
రేపల్లె వాడల్లో ఆనందలీల
అయినవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
అయినవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా


నల్ల రాతి కండలతో కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే
నల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాలా
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలా
ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలి పెట్టే ఆ నందలాలా
జాణ జానపదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా

ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆ నందలాలా
ఆలమందుకాలుడిలా అనిపించు కాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆ నందలాలా
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా

ఉత్తర భారతంలో నందలాలా అంటే నందుని ముద్దుబిడ్డ అయిన కృష్ణుడు. లాడ్లా అనే పదం నుండి లాలాగా రూపాంతరం చెందింది. ఆయన లీలలు గోకులమంతటికీ ఆనందం కలిగించాయి కాబట్టి సిరివెన్నెల ఆయనను ఆనందలీల అన్నారు. ఈ ఆ నందలాల, ఆనందలీల అన్న రెండు ఒకేలా ధ్వనించే పద సంపుటిని పునాదిగా చేసుకొని ఈ మహత్తరమైన గీతాన్ని మనకు అందించారు. అమ్మక చెల్ల, చాంగుభళా వంటి పదాలను మళ్లీ మనకు గుర్తు చేసి తెలుగుదనం సుగంధాలను మళ్లీ గుబాళింపజేశారు. ఆ కృష్ణుని వైనాన్ని వర్ణించటం బ్రహ్మ వల్ల కూడా కాదు అని సిరివెన్నెల ఈ గీతంలో తెలిపారు. కృష్ణుని తత్త్వానికి మూలం అన్నిటా తానే ఉండి, ఏదీ తనకు అంటించుకోని తామరాకు మీది నీటిబొట్టు చందం. ఆ రహస్యాన్ని అయినవాడే అందరికీ, అయినా అందడు ఎవ్వరికీ అన్న పంక్తితో మనకు తేటతెల్లం చేశారు. ఆ కృష్ణుడు బాలుడా? గోపాలుడా? లోకాలను పాలించేవాడా? ఎలా తెలిసేది అని కృష్ణ తత్త్వంలో మునిగి తేలే ఆశ్చర్యాన్ని మనోజ్ఞంగా వ్యక్త పరచారు.

నల్లరాతి-వెన్నముద్ద..కరుకుదనం-సుతిమెత్తదనానికి ప్రతీకగా ఆ కృష్ణుని నుతించారు. ఆ పదాలను సముచితంగా గానం చేశారు బాలు, చిత్ర.  తాను ఆయుధాలను పట్టను అని దుర్యోధనుడికి మాట ఇచ్చి విజయునికి రథ సారథిగా నిలిచాడు. ఎంత గొప్ప సందేశం కదా మనకు? మనకు సారథి ఆ జగద్గురువైన శ్రీకృష్ణుడు. ఈ తత్త్వాన్ని సిరివెన్నెల మనకు ఎంతో అందంగా తెలియజేశారు. గోపకులంలో రాసలీలలతో, తన మహిమలతో మనకు జ్ఞానాన్ని గీత ద్వారా బోధించాడు ఆ కృష్ణుడు. శ్రీకృష్ణుడు పలికిన ప్రతి మాట, వేసిన ప్రతి అడుగు, ప్రతి లీల, ప్రతి చేష్ట మనకు సందేశం కలిగినదే. అన్నిటా మునిగి తేలుతూ స్థితప్రజ్ఞత ఎలా సంపాదించుకోవాలో కృష్ణుడు మనకు తెలిపాడు. ఆ గొప్ప తత్త్వాన్ని జాణ జ్ఞాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే అన్న పంక్తిలో సిరివెన్నెల తెలిపారు. పశువుల కాపరిలా కనిపించే కృష్ణుడు మరోవైపు కాలుడిలా కనిపించాడు. గోకులం కోసం గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలిపై ఎత్తిన పరమాత్మ ఆ కృష్ణుడు. కొండంత అండగా మనకు సాయం నిలిచే ఆపద్బాంధవుడు ఆ ఆనందమూర్తి. భక్తితో కొలిచి సమర్పించిన తులసీదళానికి బద్ధుడైనాడు ఆ కృష్ణుడు అన్న తులాభారం గాథను మనకు చివరి పంక్తిలో మనకు అందించారు.

సీతారామశాస్త్రి గారి తెలుగులో సౌందర్యంతో పాటు లోతైన భావ సంపద పొదిగి ఉంటుంది. అంతేనా? దివ్యత్వాన్ని అలదుకున్న పద ప్రయోగం ఉంటుంది. ముఖ్యంగా అయాన రాసిన సంగీత, నాట్య, భక్తి రస ప్రధాన గీతాలలో ఇవి మరింత ప్రకాశిస్తాయి. అటువంటి గీతమే ఔరా అమ్మక చెల్లా. మనకు అర్థమయ్యే పదాలతో అనంతమైన భావనను అందించే అరుదైన కవి సిరివెన్నెల. కృష్ణతత్త్వం తెలియాలంటే ఆ నందలాలా రాసలీలలను, నందగోపకుల్ ఆనంద పారవశ్యాన్ని, ఆ యశోదమ్మ వాత్సల్యాన్ని, రాధమ్మ ప్రేమను అనుభూతి చెందాలి. ఈ గీతం వింటుంటే సిరివెన్నెల వారి అనుభూతులు అలా హృదయఫలకంపై కదలాడుతూ కనిపిస్తాయి. కీరవాణి గారు ఈ గీతానికి సంగీతంతో అద్భుతంగా అలంకరించారు. విశ్వనాథ్ గారి దర్శకత్వ ప్రతిభ ఈ పాట చిత్రీకరణలో కనబడుతుంది. సాహిత్యానికి అనుగుణంగా దానికి గాత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసిన గాయకులు బాలు, చిత్ర గార్లు. వీరందరిలోని ప్రతిభా సరస్వతికి నా వందనాలు.

18, జులై 2016, సోమవారం

షిర్డీ సాయి వైభవం - సాయీ శరణం! బాబా శరణు శరణం!



షిర్డీ సాయి మహాత్యం, ఆయన భక్తి సామ్రాజ్యంలో ఉన్న మాధుర్యం అనుభవైకవేద్యం. మనిషికి ఉండే వికారాలకు, సంస్కారాలకు అనుగుణంగా మార్గాన్ని చూపిన సద్గురువు ఆయన. అహంకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని విభిన్నమైన రీతులలో వెలిగించిన అవతారమూర్తి సాయి. యోగి అంటే ఎలా ఉండాలో ఈ యుగంలో జీవించి చూపించిన నిర్గుణ పరబ్రహ్మ సాయి. కోట్లాది భక్తులు ఆయనను ఆరాధించి తరించినారు. శ్రద్ధ సబురీ అన్న నినాదాలతో మనకు మార్గదర్శకుడైనాడు. కలియుగ అవలక్షణమైన ధనం, స్త్రీలోలత్వం మొదలైన వాటికి, కులమత జాడ్యాలకు దూరంగా సర్వమానవ సౌభ్రాతృత్వంతో కొత్త శకానికి నాంది పలికాడు సాయి. కొందరు మాయల ఫకీరని భావించినా, మరికొందరు ఆగ్రహించే పిచ్చివాడని ప్రేలాపించినా, సాయి యోగి, సద్గురువు, అవతరా పురుషుడు అన్నది ఆయన జీవిత చరిత్ర, ఆయన మహిమలు తెలుసుకుంటే అవగతమవుతుంది. మానవత్వానికి, మోక్షానికి మతంతో సంబంధం లేదన్నది సాయి మనకు నిరూపించిన సత్యం. అందుకే ఆయన శిష్యులలో ఒకరైన ఉపాసనీ బాబా అద్భుతమైన స్తోత్రాన్ని సాయి మీద రచించారు. అందులో రెండు శ్లోకాలు:

సదా సత్స్వరూపం చిదానంద కందం
జగత్ సంభవస్థాన సంహార హేతుం
స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపంతో ప్రకాశించే, జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైన, భక్తులకై మానుష జన్మనెత్తిన సద్గుర్వు, ఈశ్వరుడైన సాయినాథునికి నమస్కారములు.

సదా నింబవ్రృక్షస్య మూలాధివాసాత్
సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

ఎల్లప్పుడూ వేపచెట్టు నీడలో నివసిస్తూ, కామ్యములను తీర్చే కల్పవృక్షాన్ని మించి సాధించి వేప చేదును అమృతంగా మార్చిన సద్గురువు, ఈశ్వరుడు అయిన సాయినాథునికి నమస్కారములు.

షిర్డీ సాయి చరిత్ర పలుమార్లు పలుభాషల్లో ప్రచురితమైంది, చలనచిత్రంగా తీయబడింది. వాటన్నిటిలోనూ, విజయచందర్ గారు బాబాగా నటించిన షిర్డీ సాయిబాబా మహాత్యం చిత్రం ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. 1986లో విడుదలైన ఈ చిత్రానికి కే వాసు దర్శకత్వం వహించగా ఇళయరాజు సంగీతం, ఆచార్యా ఆత్రేయ పాటలు గేయరచన చేశారు. ఆ చిత్రంలో బాబాను చూపినంత ఉన్నతంగా మరే చిత్రంలోనూ, టీవీ సీరియల్‌లోనూ చూపించలేదు. ఆ షిర్డీ సాయిబాబా మహాత్యం చిత్రంలోని ఒక అద్భుతమైన గీతం సాయీ శరణం బాబా శరణు శరణం అనే పాట. కేజే యేసుదాసు గారు అత్యద్భుతంగా గానం చేశారు. ఆ గీతం వివరాలు:


హే పాండురంగా! హే పండరినాథా!
శరణం! శరణం! శరణం!

సాయీ శరణం! బాబా శరణు శరణం!
సాయి చరణం గంగా యమున సంగమ సమానం!
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే!
మా పాండురంగడు కరుణామయుడు సాయే!


విద్యా బుద్ధులు వేడిన బలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై!
పిల్లాపాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై!
తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణురూపుడై!
మహళ్సా శ్యామాకు మారుతిగాను మరి కొందరికి దత్తాత్రేయుడుగా
యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యులజేశాడు!

పెను తుపాను తాకిడికి అలమటించు దీనులను ఆదరించె తాననాథ నాథుడై!
అజ్ఞానము అలముకొన్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై!
వీధి వీధి బిచ్చమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై!
పుచ్చుకున్న పాపములను ప్రక్షాళన చేసుకొనెను ధౌత్యక్రియ సిద్ధితో శుద్ధుడై!
అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో ఆత్మశక్తి చాటినాడు సిద్ధుడై!

జీవ రాశులన్నిటికీ సాయే శరణం సాయే శరణం!
దివ్యజ్ఞాన సాధనకు సాయే శరణం సాయే శరణం!
ఆస్తికులకు సాయే శరణం నాస్తికులకు సాయే శరణం!
భక్తికి సాయే శరణం ముక్తికి సాయే శరణం!

ఈ గీతం షిరిడీ సాయి తత్త్వానికి పూర్ణప్రతీక. ఎందుకంటే, సాయి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నిటినీ ఈ గీతం క్రోడీకరించింది. సాయి ప్రధాన లక్షణాలు ఏమిటి? వీధుల తిరుగుతూ ఆహారం స్వీకరించటం. దాని అర్థం వారి వారి పాప సంచయాలను తీసుకోవటం. శ్రద్ధా భక్తులతో తనకు సమర్పించిన వారికి మోక్ష మార్గాన్ని ప్రసాదించాడు సాయి. ఎన్నో సార్లు ఆపదలో ఉన్న వారిని మనకు వింత చేష్టలు అనిపించే చర్యలతో కాపాడే వాడు. అగ్నిలో ఎక్కడో పడబోతున్న బిడ్డను తన చేయిని కొలిమిలో పెట్టి కాపాడాడు. విభూతిని వేరే ఊరికి పంపించి ఒక స్త్రీకి సుఖ ప్రసవాన్నిచ్చాడు. అలాగే, పాము కాటుతో మరణభయంలో ఉన్న భక్తునిపై కోపాన్ని చూపి ఆ విషాన్ని పైకి పాకకుండా గద్దించి శమింపజేశాడు. బిడ్డలు లేని వారికి బిడ్డలను అనుగ్రహించాడు. ఊరికి కలరా వ్యాధి అంటకుండా తిరగలి తిప్పి పిండిని పొలిమేరలలో చల్లించాడు. భక్తితో తనను శివునిగా కొలిచిన మేఘుని కరుణించాడు. గంగాయమునలను తన పాదాలవద్ద ప్రత్యక్షం చేశాడు. ఎందరో యోగులకు మార్గాన్ని చూపించాడు. తనను శ్రద్ధాభక్తులతో సేవించిన లక్ష్మీబాయిని కరుణించాడు. కొందరికి హనుమంతుడైతే మరికొందరికి దత్తావతారుడైనాడు. ఈ సాయే పాండురంగడని భక్తులకు స్వప్న సాక్షాత్కారమిచ్చాడు. ఇలా ఎన్ని? ఆ మహిమలను ఈ గీతం చక్కగా ఉట్టంకిస్తుంది.

పండరినాథుడైన పాండురంగడు, ఈ బాబా ఒక్కడే అన్న నమ్మకంతో ఈ గీతం ఆరంభమవుతుంది. కలియుగంలో గురుతత్త్వానికి ఉత్తమ ఉదాహరణ సాయి అన్న భావన ఆయన భక్తులకు తప్పకుండా ఏదో ఒకరోజు కలుగుతుంది. అటువంటి వాడే దాసగణు. ఆయన నోట ఇటువంటి గీతం అందించటం దర్శకుల ప్రతిభకు తార్కాణం. సాయే అందరు దేవుళ్లు అని నమ్మే వారికి వేరే క్షేత్రాలతో పనేముంది? అందుకే వారందరూ షిర్డీలో సాయి సేవలోనే గడిపి తరించారు. ఎవరు ఎలా భావిస్తే వారికి ఆ దేవతా స్వారూపంలో కనిపించాడు. యద్భావం తద్భ్వతి అన్నది మనకు సనాతన ధర్మం చెప్పినదే. దానిని మరోమారు నిరూపించాడు సాయి. సంశయమున్న వాని అహంకారమణచి తన మహాత్యాన్ని తెలిపాడు. గర్జిస్తున్న మేఘాలను శాంతపరచి అనాథులను కాపాడాడు. జ్ఞానమంటే అజ్ఞానాన్ని తొలగించటమే అని ఎన్నో ఉదాహరణలతో మనకు తెలిపాడు. లోభిత్వంతో దీపాలకు నూనె ఇవ్వని వ్యాపారికి నీళ్లతో దీపం వెలిగించి కళ్లుతెరిపించాడు. ఆత్మశక్తితో దేనినైనా సాధించవచ్చని ఖండ యోగము ద్వారా నిరూపించాడు. భగవద్గీత, రామాయణం మొదలైన వాని సారాన్ని, ప్రయోజనాన్ని వేర్వేరు భక్తులకు వారి మనసుకు హత్తుకునేలా తెలిపాడు. అందుకే సాయి జ్ఞానసాధనకు సద్గురువుగా నిలిచాడు. మతమౌఢ్యంతో ఉన్న ప్రజలను ఏకం చేశాడు. ఉత్సవాల ద్వారా ప్రజలలో ఐక్యతను చాటాడు. అందుకే ఆయన సమర్థ సద్గురువుగా కొనియాడబడ్డాడు.

ఆచార్య ఆత్రేయ ఈ గీతంతో సాయి తత్త్వాన్ని మనోజ్ఞంగా ఆవిష్కరిస్తే ఇళయరాజా గారి సంగీతం ఆధ్యాత్మికతను, గురు వైభవాన్ని కురిపిస్తుంది. ప్రతి పదంలోనూ భక్తి, విశ్వాసాలను ఆత్రేయగారు పొందుపరచారు. అలాగే, పల్లవి నుండి ఆఖరి అక్షరం వరకు రోమాంచకంగా సాగే సంగీతాన్ని ఇళయరాజా గారు అందించారు. ఇటువంటి ప్రత్యేకమైన గీతాలకు ప్రత్యేకమైన వ్యక్తి గాయకుడిగా కావాలి. మతాతీతమైన భక్తికి యేసుదాస్ గారి కన్నా ఉత్తములెవరు? క్రైస్తవుడైనా, గురువాయూర్ కృష్ణుడిని, శబరిమలై అయ్యప్పను అద్భుతంగా నుతించిన అమృత గళం ఆయనది. అందుకే ఈ గీతం కూడా ఆయన స్వరాలలో మరింత ప్రకాశించింది. షిర్డీలో మహళ్సాపతి మొదలైన అచంచలులైన సాయి భక్తుల భక్తి విశ్వాసాలను ఆయన తన గాత్రంలో ఆవిష్కరించారు. ముప్ఫై ఏళ్ల తరువాత కూడా ఈ గీతం సాయి భక్తుల హృదయాలలో సుస్థిరంగా నిలిచి ఉంది.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!

14, జులై 2016, గురువారం

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి - వేటూరి వారి పద సమ్మోహనం


ఒక కవికి భావవ్యక్తీకరణలో ఔన్నత్యం అతనికి వచ్చే ప్రేరేపణ వల్ల కలుగుతుంది. ఒక సినీ గేయరచయితకు దర్శకుని ఆత్మసౌందర్యం ఆ గేయం యొక్క భాషా ప్రవాహంలో వెలువడుతుంది. వేటూరి వారు విశ్వనాథ్ గారి ఆత్మసౌందర్యానికి ప్రతీకగా ఎన్నో అద్భుతగీతాలు రాశారు. అందులో ఒకటి  సప్తపది చిత్రంలోఈ వ్రేపల్లియ ఎదఝల్లున అనే గీతం. సంగీత-నాట్యశాస్త్రాల పట్ల మక్కువ కలిగి ఆ విద్యను అభ్యసించిన ఇద్దరు కళాకారుల మధ్య గల ప్రేమ నేపథ్యంలో చిత్రీకరించబడిన అద్భుత రస కావ్యం ఇది. ప్రేమ భరితం, కృష్ణ తత్త్వ పూరితం, కృష్ణలీలా వినోద మిళితం. రాసలీల అనగానే కృష్ణుడు గుర్తుకు వస్తాడు. రేపల్లెలో ఆ కృష్ణుని లీలలు ఎన్ని? అనంతం, అమోఘం, అనిర్వచనీయం. అంతటా తానే, అన్నిటా తానే, అయినా ఎవరి సొంతమూ కాదు, ఏదీ ఆయనకు అంటదు. ఆ లీలాకృష్ణుని వినోదభరితమైన రాసలీలలకు అద్భుతమైన  ఆవిష్కరణ ఇచ్చారు వేటూరి వారు.  సాహిత్యం పరిశీలిద్దాం.

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి


కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలమా బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
జీవన రాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల బ్రోచిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి
వేణుగానలోలుని మురిపించిన  రవళి
నటనల సరళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి  మువ్వల మురళి ఇదేనా ఆ మురళి


మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి ఇదేనా ఇదేనా ఆ మురళి

రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి



రేపల్లె ఎద ఝల్లులో పొంగిన నాదం ఆ శ్రీకృష్ణుని మురళీధ్వని అట. ఎంత అద్భుతమైన భావన? గోకులమంతా శ్రీకృష్ణునికి దాసోహం అని ఆయన వేణుగానలహరిలో పరవశులైన సమయంలో గుండెలోతుల్లో నుండి జన్మించిన రవళి ఆ నాదంతో అనుసంధానమైతే? అదే భావన వేటూరి వారు మనకు అందించారు.

కాళింది మడుగులో కాళీయుడనే నాగరాజు విషపు పడగలపై వ్యత్యస్త పాదములతో నర్తిస్తూ వాని పొగరణచి విజేయుడై నిలచిన శ్రీకృష్ణుడు తన నాట్య భంగిమలతో ఆ గోకులవాసుల గుండెలనూదాడట. ఆహా! ఏమి సన్నివేశం!! కన్నులకు కట్టినట్లుగా రచించారు వేటూరి వారు.

ఒక రాగంలో తొలుత చెవులను అలరించిన ఆ నాదం తరువాత పలుకలేని భావనలు కలిగించి, మరల మరల వినిపించి ఆ గోపికలపై మరులు కురిపించిందట. కృష్ణుని సమ్మోహనం అక్కడి వారి జీవన రాగమైంది. అంటే, ప్రతి అడుగూ లయబద్ధమై కృష్ణం సర్వంగా సాగింది. ఆ కన్యల కళ్లు కలువలులా విచ్చుకోవటానికి కారణం స్వామి వేణుగాన ప్రేరిత చంద్రవీక్షణాలట. బృందావనంలో జరిగే ఈ రాసహేల మన మనసుల్లో ఆవిష్కరించారు వేటూరి వారు.

ఆఖరి చరణంలో రాధ తత్వం యొక్క సువాసనలు మనకు అలదారు వేటూరి వారు. యమునా తీరమున సంధ్యా సమయములో రాధ వేయి కళ్లతో వేచి చూస్తుంటే, ఆ రాధ ఆరాధనా గీతం పలికితే దానికి ప్రేరణ స్వామి వేణుగానమే కదా? భిన్నమైనా స్వామిలో ఏకమైన భక్తురాలు రాధ. సంగీతము, నాట్యము సంగమానికి కారణమైన ఆ వేణువు రాసలీలకు ఊపిరి పోసిందట.

ఇన్ని విధాలా ఆ స్వామి మురళీ రవాన్ని నుతించిన అతికొద్ది సినీగీతాలలో ఈ వేటూరి వారి గీతం ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. కారణం, అందులోని సాహితీ సంపద, భావ వ్యక్తీకరణ, తెలుగు భాషా సౌందర్యం. తెలుగు భాషలో ఉన్న గొప్పతనం నానార్థాలు. ఒకే పదం రెండు మార్లు వచ్చిందేమిటా అనుకుంటాము. కానీ, వాటిలో అద్భుతమైన  విలక్షణమైన అర్థం నిబిడీకృతమై ఉంటుంది. అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ...అన్న పద సంపుటి గమనించండి. ఆ+చెరువున (కాళింది మడుగున) అచ్చెరువున (అచ్చెరువు ఆశ్చర్యానికి వికృతి)...అద్భుతమైన పదప్రయోగం కదూ! అలాగే, అనగల రాగమై, అనలేని రాగమై అన్న పంక్తులలో వ్యక్తావ్యక్తమైన భావనలను ఆవిష్కరించారు కవి. ఆఖరి చరణంలో మళ్లీ ఒకేలా ధ్వనించే పదాల అర్థభేదాన్ని పదప్రవాహంలా సాగించారు వేటూరి వారు.

చాలా సార్లు వేటూరి వారు మాస్ పాటల కవి కదా? ఇటువంటి గీతాలు ఎలా రాశారో అనిపిస్తుంది. కానీ, దానికి ప్రేరణ దర్శకులే. కాశీనాథుని విశ్వనాథ్ గారి ఆధ్యాత్మిక, సాహిత్య, సంస్కృతీ వికాసం ఆయన ప్రతి చిత్రంలోని ప్రతి సన్నివేశంలోనూ గోచరమవుతుంది. ఆనాటి కాలానికి కాస్త వివాదాస్పదమైన కులాంతర వివాహం ఈ చిత్రం కథ అయినా, సంస్కృతి, సాంప్రదాయాలను, కళలను పూర్తిగా గౌరవిస్తూనే అద్భుతమైన చలనచిత్రాన్ని మనకు అందించారు. ఆ ప్రతిభ ఈ రేపల్లియ ఎద ఝల్లున అనే గీతంలో రవళిస్తుంది. ప్రియుడు వేణుగానంలో ప్రతిభామూర్తి అయితే ప్రేయసి వివాహిత అయిన నాట్యకళా కోవిదురాలు. వేర్వేరు కులాలలో జన్మించిన వీరు ఒకటి ఎలా అయ్యారు? దానికి ఒక నిప్పులాంటి బ్రాహ్మణుడు ఎలా వెసులుబాటు కలిగించాడు అన్నది చిత్రం యొక్క అద్భుతమైన గాథ. అందులో ఎన్ని అద్భుతమైన పాత్రలు? ఏమి గీతాలు? వేటూరి వారి కలంలో ఒక్కొక్క గీతం ఒక్కొక్క రసగుళిక. విశ్వనాథ్ గారి ప్రత్యేకత కళలతో పాటు ఉన్నతమైన సందేశాన్ని కూడా పొందుపరచటం. దానికి తగ్గట్లు పాత్రలను రూపొందించటం. ఇక మామ మహదేవన్ గారి సంగీతం బాలు-సుశీలమ్మల జంటగాత్రహేల ఈ గీతాన్ని అజరం అమరం చేశాయి. వేటూరి వారి సినీ వినీలాకాశంలో ఈ గీతం ఒక ధృవతార. ఇటువంటి గీతాలతో వేటూరి వారి తెలుగు భాషా సౌగంధికలు శాశ్వతమైపోయాయి. 

8, జులై 2016, శుక్రవారం

మొహమాటం సన్నాయి నొక్కుళ్లు

మొహమాటాల మారాజులం, మారాణులం మనం. ఇష్టాయిష్టాలు, నిజం కుండలు బద్దలు కొట్టినట్లు చెబితే అవతల వాళ్లు నొచ్చుకుంటారని మనకు మొహమాటాన్నిచ్చాడేమో దేవుడు అనిపించినా, ఈ మొహమాటంతో చాలాసార్లు మహా తంటానండోయ్. మొహమాటం వల్ల కలిగే కొన్ని సన్నివేశాలు మీకోసం

----------------------------------------------------------

"కూర ఎలా ఉందండీ వదినా?"

"అద్భుతంగా ఉందమ్మా! ఎలా చేశావు వదినా?"

(మనసులో నా ఖర్మ, ఇదీ ఓ కూరేనా, ఉప్పులేదు, కారం లేదు, కుక్కలు కూడా తినవు ఈ కూరను అని తిట్టుకుంటూ)

"అయితే ఇంకాస్త తినండి వదినా"...అని, వదిన వారిస్తున్నా కంచంలో మరింత ఆ కూర. పాపం వదిన...మింగలేక కక్కలేక మొహం అదోలా పెట్టలేక భావాలన్నీ దిగబెట్టుకొని ఓ అరగంట కష్ట పడి, సగం కూర వదిలేస్తుంది.

"చూశారా మా వదిన? నేను రెండో సారి కూర వేస్తే ఎంత పొగరుగా వదిలేసిందో? ఎంత బావుందండీ కూరా"

"నీకు బాగుంటే ఆవిడకు బాగుండాలని లేదు కదోయ్.."

"అంటే, మీ ఉద్దేశం ఏమిటి? కూర బాలేదా?"

"అబ్బా! అలా కాదు. నాకు చాలా నచ్చింది..."

"మరైతే రాత్రికి కూడా అదే తినండి. బోలెడు మిగిలింది. "

------------------------------------------------------------------
అత్తారింటికి ఓ పూజకు వెళ్లిన అల్లుడు గారి గాథ.

"వీళ్ల దుంపతెగ. ఎంత సేపైనా కానివ్వరు. నాకు గంటసేపటినుండి ఆకలి. అసలే షుగర్ పేషెంటును. ఇంకా భోజనానినికి ఎంత టైం పడుతుందోకాస్త కనుక్కో బాబూ!"

"పూజ పూర్తయింది భోజనాలు సిద్ధం అన్నయ్య గారూ"

ఇంతలో పెద్దరికం చూపించాలి కదా, అందుకని మొహమాటానికి "నాకేం తొందరమ్మా! ముందు పెద్దవాళ్లను కానీయండి."

"అలాగే అన్నయ్యా!"

ఇంకో బంతి పూర్తయ్యేలోపు ఈయనగారి ఆత్మారాముడి గగ్గోలు పెళ్లాం మీదకు మళ్లింది.

"ఏమేవ్! పుట్టింటికొస్తే చాలు మొగుడు, వాడి బాగోగులు అసలు పట్టవు. రెండు గంటలనుండి ఇక్కడ ఆకలితో నక నకలాడుతున్నా. నీకు గానీ, మీ వాళ్లకు గానీ ఇక్కడో పక్షి ఉన్నాడు వాడికి కాస్త కాఫీ, టీ చూసుకుందామని ఉండదు. అయినా ఏమి చాదస్తమో మీ వాళ్లది. ఎంతంత సేపు పూజలు. త్వరగా పూర్తి చేయరు. ఎక్కడలేని తీరికంతా పూజలోనే.."

"ఏవండీ! మా వదిన మిమ్మల్ని ఇందాకే తినమని అడిగింది. ఎందుకు తినలేదు.."

"ఆ నువ్వు చెప్పలేదని. మీ వాళ్లకు లేకపోయినా నాకు పెద్దలను గౌరవించటం తెలుసు"

"ఎందుకండీ అంతలేసి మాటలు, ఇదుగోండి తినండి" అని ప్లేటులో ఇచ్చింది.

బ్రతుకు జీవుడా అని గబ గబ లాగించాడా ఇంటి అల్లుడు. పెళ్లై దశాబ్దాలైనా దశమ గ్రహమే.

--------------------------------------------------------------------
కార్లో ఎనిమిది సీట్లు ఉన్నది 9 మంది. 6 గంటలు ప్రయాణం.

"సర్దుకు పోదాలే వదినా! మనమేగా! ఒక్క మనిషేగా ఎక్కువ, మనిద్దరం వెనకాల కూర్చుందాం"

"వద్దులే వదినా! 6 గంటలు ప్రయాణం, ఇంకో 2వేలు ఎక్కువవుతుంది అంతేగా, పెద్ద బండి మాట్లాడుకుందాం"

"పర్లేదు వదినా. డబ్బులు దండగ. 8 సీట్లదే మాట్లాడండి"

"అన్నయ్యగారూ! మీకు నడుం నొప్పి కదా, మేము ఆడవాళ్లం వెనకసీట్లో సర్దుకుంటాం లేండి. మీరు మధ్యలో కూర్చోండి. వసతిగా ఉంటుంది.."

"అలాగే అమ్మాయ్"

ఆ రోడ్డు హైదరబాదు దాటగానే గతుకులు. ఇక వెనక సీట్లో కూర్చున్న ఆ వదిన గారి సణుగుడు:

"కాళ్లు జాపుకునేందుకు లేదు. వెధవ వ్యాను. ఈ మగాళ్లకు కాస్త కూడా మనమీద ధ్యాస ఉండదు. ఈ గతుకులు దాటేలోపు మన నడుములు, మోకాళ్లు పోయేటట్టున్నాయి."

"అవునొదినా, బాత్రూంకి ఆపినప్పుడు మారుదామని చెప్పేదా?"

"వద్దులే వదినా. పెద్దవాళ్లు ఏమైనా అనుకుంటారు. మళ్లీ జీవితాంతం ఈ మాట ఉండిపోతుంది. అమ్మో అయ్యో ఈ మోకాళ్లు బిగుసుకుపోతున్నాయి..."

-----------------------------------------------------

షాపులో వదిన-ఆడపడుచు-అత్తగారు

"వదినా, అత్తయ్య గారు - మీకు ఎటువంటి చీర కావాలో చెప్పండి. తెప్పిస్తాను."

"నీ ఇష్టం అమ్మాయ్. నువ్వు ఏది కొన్నా సరే."
"నీ ఇష్టం వదినా. నేను అన్నీ కట్టుకుంటాను"

"ష్యూరా! మీరు సెలెక్టు చేసుకుంటే బాగుంటుంది కదా!"

"అలా ఏమీ లేదు. ముగ్గురికీ నువ్వే సెలెక్ట్ చెయ్యి "

"వదినా! మీకు ఈ వంగపండు రంగు చీర కొన్నాను. ఎలా ఉంది"

"బాగుంది వదినా"

"అత్తయ్యగారు! మీకు ఈ ఆకుపచ్చ చీరకొన్నాను ఎలా ఉంది"

"బాగుందమ్మాయి"

ఇంటికి వచ్చాక..

"అమ్మా! నాకు ఈ రంగు ఏం బాగుంటుందే. కొట్టొచ్చినట్టుండదూ! వదినకు అంతమాత్రం తెలీదా?"

"హా! నిజమేనే. నాది మాత్రం, నాకు ఆ ముదురు ఆకుపచ్చ అసలు నచ్చదు. లైట్ ఆకుపచ్చ అయితే బాగుంటుంది. ఏమోనమ్మా! అంతా ఆమెగారి ఇష్టం"

"పోనీ, వదినను అడిగి మార్చేసుకుందామా?"

"వద్దులేవే! తాను కొన్నవి మనం కట్టుకోలేదని సాధిస్తుంది"

------------------------------------------------------------------------------

భవనుత నా హృదయమున రమింపుము - త్యాగరాజస్వామి కృతి

భవనుత నా హృదయమున రమింపుము బడలిక దీర భవతారక నాతో బహుపల్కిన బడలిక దీర కమల సం"భవనుత" పవనసుతప్రియ తనకై తిరిగిన బడడలిక దీర భవనము చేరి న...