షిర్డీ సాయి మహాత్యం, ఆయన భక్తి సామ్రాజ్యంలో ఉన్న మాధుర్యం అనుభవైకవేద్యం. మనిషికి ఉండే వికారాలకు, సంస్కారాలకు అనుగుణంగా మార్గాన్ని చూపిన సద్గురువు ఆయన. అహంకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని విభిన్నమైన రీతులలో వెలిగించిన అవతారమూర్తి సాయి. యోగి అంటే ఎలా ఉండాలో ఈ యుగంలో జీవించి చూపించిన నిర్గుణ పరబ్రహ్మ సాయి. కోట్లాది భక్తులు ఆయనను ఆరాధించి తరించినారు. శ్రద్ధ సబురీ అన్న నినాదాలతో మనకు మార్గదర్శకుడైనాడు. కలియుగ అవలక్షణమైన ధనం, స్త్రీలోలత్వం మొదలైన వాటికి, కులమత జాడ్యాలకు దూరంగా సర్వమానవ సౌభ్రాతృత్వంతో కొత్త శకానికి నాంది పలికాడు సాయి. కొందరు మాయల ఫకీరని భావించినా, మరికొందరు ఆగ్రహించే పిచ్చివాడని ప్రేలాపించినా, సాయి యోగి, సద్గురువు, అవతరా పురుషుడు అన్నది ఆయన జీవిత చరిత్ర, ఆయన మహిమలు తెలుసుకుంటే అవగతమవుతుంది. మానవత్వానికి, మోక్షానికి మతంతో సంబంధం లేదన్నది సాయి మనకు నిరూపించిన సత్యం. అందుకే ఆయన శిష్యులలో ఒకరైన ఉపాసనీ బాబా అద్భుతమైన స్తోత్రాన్ని సాయి మీద రచించారు. అందులో రెండు శ్లోకాలు:
సదా సత్స్వరూపం చిదానంద కందం
జగత్ సంభవస్థాన సంహార హేతుం
స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం
ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపంతో ప్రకాశించే, జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైన, భక్తులకై మానుష జన్మనెత్తిన సద్గుర్వు, ఈశ్వరుడైన సాయినాథునికి నమస్కారములు.
సదా నింబవ్రృక్షస్య మూలాధివాసాత్
సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం
ఎల్లప్పుడూ వేపచెట్టు నీడలో నివసిస్తూ, కామ్యములను తీర్చే కల్పవృక్షాన్ని మించి సాధించి వేప చేదును అమృతంగా మార్చిన సద్గురువు, ఈశ్వరుడు అయిన సాయినాథునికి నమస్కారములు.
షిర్డీ సాయి చరిత్ర పలుమార్లు పలుభాషల్లో ప్రచురితమైంది, చలనచిత్రంగా తీయబడింది. వాటన్నిటిలోనూ, విజయచందర్ గారు బాబాగా నటించిన షిర్డీ సాయిబాబా మహాత్యం చిత్రం ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. 1986లో విడుదలైన ఈ చిత్రానికి కే వాసు దర్శకత్వం వహించగా ఇళయరాజు సంగీతం, ఆచార్యా ఆత్రేయ పాటలు గేయరచన చేశారు. ఆ చిత్రంలో బాబాను చూపినంత ఉన్నతంగా మరే చిత్రంలోనూ, టీవీ సీరియల్‌లోనూ చూపించలేదు. ఆ షిర్డీ సాయిబాబా మహాత్యం చిత్రంలోని ఒక అద్భుతమైన గీతం సాయీ శరణం బాబా శరణు శరణం అనే పాట. కేజే యేసుదాసు గారు అత్యద్భుతంగా గానం చేశారు. ఆ గీతం వివరాలు:
హే పాండురంగా! హే పండరినాథా!
శరణం! శరణం! శరణం!
సాయీ శరణం! బాబా శరణు శరణం!
సాయి చరణం గంగా యమున సంగమ సమానం!
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే!
మా పాండురంగడు కరుణామయుడు సాయే!
విద్యా బుద్ధులు వేడిన బలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై!
పిల్లాపాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై!
తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణురూపుడై!
మహళ్సా శ్యామాకు మారుతిగాను మరి కొందరికి దత్తాత్రేయుడుగా
యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యులజేశాడు!
పెను తుపాను తాకిడికి అలమటించు దీనులను ఆదరించె తాననాథ నాథుడై!
అజ్ఞానము అలముకొన్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై!
వీధి వీధి బిచ్చమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై!
పుచ్చుకున్న పాపములను ప్రక్షాళన చేసుకొనెను ధౌత్యక్రియ సిద్ధితో శుద్ధుడై!
అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో ఆత్మశక్తి చాటినాడు సిద్ధుడై!
జీవ రాశులన్నిటికీ సాయే శరణం సాయే శరణం!
దివ్యజ్ఞాన సాధనకు సాయే శరణం సాయే శరణం!
ఆస్తికులకు సాయే శరణం నాస్తికులకు సాయే శరణం!
భక్తికి సాయే శరణం ముక్తికి సాయే శరణం!
ఈ గీతం షిరిడీ సాయి తత్త్వానికి పూర్ణప్రతీక. ఎందుకంటే, సాయి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నిటినీ ఈ గీతం క్రోడీకరించింది. సాయి ప్రధాన లక్షణాలు ఏమిటి? వీధుల తిరుగుతూ ఆహారం స్వీకరించటం. దాని అర్థం వారి వారి పాప సంచయాలను తీసుకోవటం. శ్రద్ధా భక్తులతో తనకు సమర్పించిన వారికి మోక్ష మార్గాన్ని ప్రసాదించాడు సాయి. ఎన్నో సార్లు ఆపదలో ఉన్న వారిని మనకు వింత చేష్టలు అనిపించే చర్యలతో కాపాడే వాడు. అగ్నిలో ఎక్కడో పడబోతున్న బిడ్డను తన చేయిని కొలిమిలో పెట్టి కాపాడాడు. విభూతిని వేరే ఊరికి పంపించి ఒక స్త్రీకి సుఖ ప్రసవాన్నిచ్చాడు. అలాగే, పాము కాటుతో మరణభయంలో ఉన్న భక్తునిపై కోపాన్ని చూపి ఆ విషాన్ని పైకి పాకకుండా గద్దించి శమింపజేశాడు. బిడ్డలు లేని వారికి బిడ్డలను అనుగ్రహించాడు. ఊరికి కలరా వ్యాధి అంటకుండా తిరగలి తిప్పి పిండిని పొలిమేరలలో చల్లించాడు. భక్తితో తనను శివునిగా కొలిచిన మేఘుని కరుణించాడు. గంగాయమునలను తన పాదాలవద్ద ప్రత్యక్షం చేశాడు. ఎందరో యోగులకు మార్గాన్ని చూపించాడు. తనను శ్రద్ధాభక్తులతో సేవించిన లక్ష్మీబాయిని కరుణించాడు. కొందరికి హనుమంతుడైతే మరికొందరికి దత్తావతారుడైనాడు. ఈ సాయే పాండురంగడని భక్తులకు స్వప్న సాక్షాత్కారమిచ్చాడు. ఇలా ఎన్ని? ఆ మహిమలను ఈ గీతం చక్కగా ఉట్టంకిస్తుంది.
పండరినాథుడైన పాండురంగడు, ఈ బాబా ఒక్కడే అన్న నమ్మకంతో ఈ గీతం ఆరంభమవుతుంది. కలియుగంలో గురుతత్త్వానికి ఉత్తమ ఉదాహరణ సాయి అన్న భావన ఆయన భక్తులకు తప్పకుండా ఏదో ఒకరోజు కలుగుతుంది. అటువంటి వాడే దాసగణు. ఆయన నోట ఇటువంటి గీతం అందించటం దర్శకుల ప్రతిభకు తార్కాణం. సాయే అందరు దేవుళ్లు అని నమ్మే వారికి వేరే క్షేత్రాలతో పనేముంది? అందుకే వారందరూ షిర్డీలో సాయి సేవలోనే గడిపి తరించారు. ఎవరు ఎలా భావిస్తే వారికి ఆ దేవతా స్వారూపంలో కనిపించాడు. యద్భావం తద్భ్వతి అన్నది మనకు సనాతన ధర్మం చెప్పినదే. దానిని మరోమారు నిరూపించాడు సాయి. సంశయమున్న వాని అహంకారమణచి తన మహాత్యాన్ని తెలిపాడు. గర్జిస్తున్న మేఘాలను శాంతపరచి అనాథులను కాపాడాడు. జ్ఞానమంటే అజ్ఞానాన్ని తొలగించటమే అని ఎన్నో ఉదాహరణలతో మనకు తెలిపాడు. లోభిత్వంతో దీపాలకు నూనె ఇవ్వని వ్యాపారికి నీళ్లతో దీపం వెలిగించి కళ్లుతెరిపించాడు. ఆత్మశక్తితో దేనినైనా సాధించవచ్చని ఖండ యోగము ద్వారా నిరూపించాడు. భగవద్గీత, రామాయణం మొదలైన వాని సారాన్ని, ప్రయోజనాన్ని వేర్వేరు భక్తులకు వారి మనసుకు హత్తుకునేలా తెలిపాడు. అందుకే సాయి జ్ఞానసాధనకు సద్గురువుగా నిలిచాడు. మతమౌఢ్యంతో ఉన్న ప్రజలను ఏకం చేశాడు. ఉత్సవాల ద్వారా ప్రజలలో ఐక్యతను చాటాడు. అందుకే ఆయన సమర్థ సద్గురువుగా కొనియాడబడ్డాడు.
ఆచార్య ఆత్రేయ ఈ గీతంతో సాయి తత్త్వాన్ని మనోజ్ఞంగా ఆవిష్కరిస్తే ఇళయరాజా గారి సంగీతం ఆధ్యాత్మికతను, గురు వైభవాన్ని కురిపిస్తుంది. ప్రతి పదంలోనూ భక్తి, విశ్వాసాలను ఆత్రేయగారు పొందుపరచారు. అలాగే, పల్లవి నుండి ఆఖరి అక్షరం వరకు రోమాంచకంగా సాగే సంగీతాన్ని ఇళయరాజా గారు అందించారు. ఇటువంటి ప్రత్యేకమైన గీతాలకు ప్రత్యేకమైన వ్యక్తి గాయకుడిగా కావాలి. మతాతీతమైన భక్తికి యేసుదాస్ గారి కన్నా ఉత్తములెవరు? క్రైస్తవుడైనా, గురువాయూర్ కృష్ణుడిని, శబరిమలై అయ్యప్పను అద్భుతంగా నుతించిన అమృత గళం ఆయనది. అందుకే ఈ గీతం కూడా ఆయన స్వరాలలో మరింత ప్రకాశించింది. షిర్డీలో మహళ్సాపతి మొదలైన అచంచలులైన సాయి భక్తుల భక్తి విశ్వాసాలను ఆయన తన గాత్రంలో ఆవిష్కరించారు. ముప్ఫై ఏళ్ల తరువాత కూడా ఈ గీతం సాయి భక్తుల హృదయాలలో సుస్థిరంగా నిలిచి ఉంది.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!
ఓం సాయి రాం. సాయితత్వం దివ్యానుభూతినిస్తుంది
రిప్లయితొలగించండి