RightClickBlocker

14, జులై 2016, గురువారం

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి - వేటూరి వారి పద సమ్మోహనం


ఒక కవికి భావవ్యక్తీకరణలో ఔన్నత్యం అతనికి వచ్చే ప్రేరేపణ వల్ల కలుగుతుంది. ఒక సినీ గేయరచయితకు దర్శకుని ఆత్మసౌందర్యం ఆ గేయం యొక్క భాషా ప్రవాహంలో వెలువడుతుంది. వేటూరి వారు విశ్వనాథ్ గారి ఆత్మసౌందర్యానికి ప్రతీకగా ఎన్నో అద్భుతగీతాలు రాశారు. అందులో ఒకటి  సప్తపది చిత్రంలోఈ వ్రేపల్లియ ఎదఝల్లున అనే గీతం. సంగీత-నాట్యశాస్త్రాల పట్ల మక్కువ కలిగి ఆ విద్యను అభ్యసించిన ఇద్దరు కళాకారుల మధ్య గల ప్రేమ నేపథ్యంలో చిత్రీకరించబడిన అద్భుత రస కావ్యం ఇది. ప్రేమ భరితం, కృష్ణ తత్త్వ పూరితం, కృష్ణలీలా వినోద మిళితం. రాసలీల అనగానే కృష్ణుడు గుర్తుకు వస్తాడు. రేపల్లెలో ఆ కృష్ణుని లీలలు ఎన్ని? అనంతం, అమోఘం, అనిర్వచనీయం. అంతటా తానే, అన్నిటా తానే, అయినా ఎవరి సొంతమూ కాదు, ఏదీ ఆయనకు అంటదు. ఆ లీలాకృష్ణుని వినోదభరితమైన రాసలీలలకు అద్భుతమైన  ఆవిష్కరణ ఇచ్చారు వేటూరి వారు.  సాహిత్యం పరిశీలిద్దాం.

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి


కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలమా బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
జీవన రాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల బ్రోచిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి
వేణుగానలోలుని మురిపించిన  రవళి
నటనల సరళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి  మువ్వల మురళి ఇదేనా ఆ మురళి


మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి ఇదేనా ఇదేనా ఆ మురళి

రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళిరేపల్లె ఎద ఝల్లులో పొంగిన నాదం ఆ శ్రీకృష్ణుని మురళీధ్వని అట. ఎంత అద్భుతమైన భావన? గోకులమంతా శ్రీకృష్ణునికి దాసోహం అని ఆయన వేణుగానలహరిలో పరవశులైన సమయంలో గుండెలోతుల్లో నుండి జన్మించిన రవళి ఆ నాదంతో అనుసంధానమైతే? అదే భావన వేటూరి వారు మనకు అందించారు.

కాళింది మడుగులో కాళీయుడనే నాగరాజు విషపు పడగలపై వ్యత్యస్త పాదములతో నర్తిస్తూ వాని పొగరణచి విజేయుడై నిలచిన శ్రీకృష్ణుడు తన నాట్య భంగిమలతో ఆ గోకులవాసుల గుండెలనూదాడట. ఆహా! ఏమి సన్నివేశం!! కన్నులకు కట్టినట్లుగా రచించారు వేటూరి వారు.

ఒక రాగంలో తొలుత చెవులను అలరించిన ఆ నాదం తరువాత పలుకలేని భావనలు కలిగించి, మరల మరల వినిపించి ఆ గోపికలపై మరులు కురిపించిందట. కృష్ణుని సమ్మోహనం అక్కడి వారి జీవన రాగమైంది. అంటే, ప్రతి అడుగూ లయబద్ధమై కృష్ణం సర్వంగా సాగింది. ఆ కన్యల కళ్లు కలువలులా విచ్చుకోవటానికి కారణం స్వామి వేణుగాన ప్రేరిత చంద్రవీక్షణాలట. బృందావనంలో జరిగే ఈ రాసహేల మన మనసుల్లో ఆవిష్కరించారు వేటూరి వారు.

ఆఖరి చరణంలో రాధ తత్వం యొక్క సువాసనలు మనకు అలదారు వేటూరి వారు. యమునా తీరమున సంధ్యా సమయములో రాధ వేయి కళ్లతో వేచి చూస్తుంటే, ఆ రాధ ఆరాధనా గీతం పలికితే దానికి ప్రేరణ స్వామి వేణుగానమే కదా? భిన్నమైనా స్వామిలో ఏకమైన భక్తురాలు రాధ. సంగీతము, నాట్యము సంగమానికి కారణమైన ఆ వేణువు రాసలీలకు ఊపిరి పోసిందట.

ఇన్ని విధాలా ఆ స్వామి మురళీ రవాన్ని నుతించిన అతికొద్ది సినీగీతాలలో ఈ వేటూరి వారి గీతం ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. కారణం, అందులోని సాహితీ సంపద, భావ వ్యక్తీకరణ, తెలుగు భాషా సౌందర్యం. తెలుగు భాషలో ఉన్న గొప్పతనం నానార్థాలు. ఒకే పదం రెండు మార్లు వచ్చిందేమిటా అనుకుంటాము. కానీ, వాటిలో అద్భుతమైన  విలక్షణమైన అర్థం నిబిడీకృతమై ఉంటుంది. అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ...అన్న పద సంపుటి గమనించండి. ఆ+చెరువున (కాళింది మడుగున) అచ్చెరువున (అచ్చెరువు ఆశ్చర్యానికి వికృతి)...అద్భుతమైన పదప్రయోగం కదూ! అలాగే, అనగల రాగమై, అనలేని రాగమై అన్న పంక్తులలో వ్యక్తావ్యక్తమైన భావనలను ఆవిష్కరించారు కవి. ఆఖరి చరణంలో మళ్లీ ఒకేలా ధ్వనించే పదాల అర్థభేదాన్ని పదప్రవాహంలా సాగించారు వేటూరి వారు.

చాలా సార్లు వేటూరి వారు మాస్ పాటల కవి కదా? ఇటువంటి గీతాలు ఎలా రాశారో అనిపిస్తుంది. కానీ, దానికి ప్రేరణ దర్శకులే. కాశీనాథుని విశ్వనాథ్ గారి ఆధ్యాత్మిక, సాహిత్య, సంస్కృతీ వికాసం ఆయన ప్రతి చిత్రంలోని ప్రతి సన్నివేశంలోనూ గోచరమవుతుంది. ఆనాటి కాలానికి కాస్త వివాదాస్పదమైన కులాంతర వివాహం ఈ చిత్రం కథ అయినా, సంస్కృతి, సాంప్రదాయాలను, కళలను పూర్తిగా గౌరవిస్తూనే అద్భుతమైన చలనచిత్రాన్ని మనకు అందించారు. ఆ ప్రతిభ ఈ రేపల్లియ ఎద ఝల్లున అనే గీతంలో రవళిస్తుంది. ప్రియుడు వేణుగానంలో ప్రతిభామూర్తి అయితే ప్రేయసి వివాహిత అయిన నాట్యకళా కోవిదురాలు. వేర్వేరు కులాలలో జన్మించిన వీరు ఒకటి ఎలా అయ్యారు? దానికి ఒక నిప్పులాంటి బ్రాహ్మణుడు ఎలా వెసులుబాటు కలిగించాడు అన్నది చిత్రం యొక్క అద్భుతమైన గాథ. అందులో ఎన్ని అద్భుతమైన పాత్రలు? ఏమి గీతాలు? వేటూరి వారి కలంలో ఒక్కొక్క గీతం ఒక్కొక్క రసగుళిక. విశ్వనాథ్ గారి ప్రత్యేకత కళలతో పాటు ఉన్నతమైన సందేశాన్ని కూడా పొందుపరచటం. దానికి తగ్గట్లు పాత్రలను రూపొందించటం. ఇక మామ మహదేవన్ గారి సంగీతం బాలు-సుశీలమ్మల జంటగాత్రహేల ఈ గీతాన్ని అజరం అమరం చేశాయి. వేటూరి వారి సినీ వినీలాకాశంలో ఈ గీతం ఒక ధృవతార. ఇటువంటి గీతాలతో వేటూరి వారి తెలుగు భాషా సౌగంధికలు శాశ్వతమైపోయాయి. 

1 వ్యాఖ్య:

  1. అద్భుత మైన పాటకు అత్యద్భతమైన విశ్లేషణ. ఇలాంటివి మనసునెంత ఆహ్లాదపరుస్తాయో చెప్పలేను.

    ప్రత్యుత్తరంతొలగించు