కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ
త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాది బొమ్మ రాగమేదో తీసినట్టు ఉందమ్మా
ముసిముసి నవ్వుల పూవులు పూసింది కొమ్మ మువ్వ గోపాలా మువ్వ గోపాలా మువ్వ గోపాల అన్నట్టుందమ్మా
అడుగుల్లో సవ్వళ్లు కాదమ్మా అవి ఎడదల్లో సందళ్లు లేవమ్మా
రాసలీల సాగినంక రాధ నీవేనమ్మా రాతిరేళ కంట నిదర రాదమ్మా
ముసిరిన చీకటి ముంగిట లేచింది కొమ్మ ముద్దు మురిపాల మువ్వ గోపాలా నీవు రావేల అన్నట్టుందమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
వేటూరి సుందరరామమూర్తిగారి సాహిత్యంలో జానపద హంగులు, శాస్త్రీయ సొబగులు మేళవించి ఉంటాయి. అటువంటి గీతమే ఈ కంచి పోతావా కృష్ణమ్మా అనే గీతం. నాయిక కబుర్లు తెలుసుకునే ప్రక్రియను ఎంతో అందంగా జానపదాల్లో వేటూరి వారు మనకు అందించారు. ఆ నాయిక గాథను వర్ణించటానికి వేటూరి వారు కంచిని, చిన్ని కృష్ణుని ఎన్నుకున్నారు. కంచిలో ఉన్న ఆ ముద్దుగుమ్మ ఎలా ఉంటుందో వివరించారు. త్యాగరాజ కీర్తనల్లె ఉన్నాదీ బొమ్మ అన్నాడు. వాగ్గేయకారులలో త్యాగరాజస్వామి అగ్రగణ్యుడు. ఆయన కీర్తనలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఆ కీర్తనల ఔన్నత్యాన్ని ఈ ముద్దుగుమ్మ రూపానికి సారూప్యంగా తెలిపారు. కీర్తనల రాగం కూడా భావానికి తగినట్లుగా ఉండటం త్యాగయ్య సంకీర్తనల ప్రత్యేకత. రాగాన్ని ఆలాపిస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉందిట ఆ ముద్దు గుమ్మ. ముసి ముసి నవ్వులనే పూలు తన ముఖంలో పూయించందట ఆ నాయిక. మువ్వ గోపాలా మువ్వ గోపాలా అని పిలిచినట్లుందట. ఆమె అడుగులు వేస్తుంటే వచ్చే మువ్వల సవ్వడులు ఆమె హృదయ స్పందనలట. ఇటువంటి సాహిత్యం వేటూరి వారికే సాధ్యం. నాయిక మధురమైన భావనలు ఆమె హృదయస్పందనలుగా, ఆమె పదమంజీరముల సవ్వడులుగా కవి ప్రస్తుతించారు. బృందావనిలో రాసలీల (ఏవండోయ్ రాసలీల అంటే శృంగారం కాదు, ఒకరితో ఒకరు మైమరచి ఆడుతూ పాడుతూ జరుపుకునే వేడుక) ముగియగానే రాధ పరిస్థితి ఎలా ఉందో అలాంటిదట నాయిక పరిస్థితి. రాతిరంతా నిదుర రాదట, చీకటి తొలగకముందే (తెల్లవారకముందే) లేచిన ఆ ముద్దు గుమ్మ మువ్వ గోపాలా నీవు రావేలా అన్నట్లుగా ఉందట. ఆ నాయకుడు కృష్ణుని ద్వారా తన మనసు దోచుకున్న ఆ నాయికను తన మనసులో ఉన్న భావనను వ్యక్త పరచవలసిందిగా కోరుతున్నాడు.
నాయిక పట్ల తనకున్న భావనలను వార్తాహరునికి నాయకుడు వ్యక్తపరచే గీతం ఇది. ఆ వార్తాహరుడే కృష్ణుడు, ఆ నాయిక కంచిలో ఉన్నట్లు భావన. వేటూరి వారు నాయకుని భావ వీచికలను ఆవిష్కరించిన రీతి ఎంత అద్భుతమో బాలు గానం కూడా అంతే మధురం. ఈ గీతం ఆలాపనలో బాలు కనబరచిన భావ సౌందర్యం, లాలిత్యం సున్నితమైన ప్రేమకు ప్రతీకగా నిలిచింది. అలాగే, సుశీలమ్మ ఆలాపనలు కూడా చాలా లలితంగా ఉంటాయి. ఇక చిత్రం విషయానికొస్తే, నాయకునిగా చంద్రమోహన్ జీవితంలో ఇది మరో మంచి చిత్రం. సగటు మధ్య తరగతి మగాడి మనోవికారాలను అద్భుతంగా ప్రతిబింబించే పాత్ర ఇది. అలాగే, నాయిక పాత్రలో నటి సులక్షణ ఎంతో చక్కగా నటించారు. ప్రేమికులనుండి భార్యా భర్తలుగా మారిన ఓ జంట మధ్య ఉండే ఆటుపోట్లను వీరిద్దరు చక్కగా పాత్రలలో జీవించి మనలను అలరించారు. మామ మహదేవన్ మోహన రాగంలో కూర్చిన ఈ గీతం తెలుగు చలన చిత్ర గీతాలలో ఒక మంచి మధురమైన గీతంగా నిలిచింది. కళాతపస్వి విశ్వనాథ్ గారి దర్శకత్వంలో జంధ్యాల సంభాషణలు, నటీనటుల ప్రతిభ, సంగీత దర్శకులు, గాయనీ గాయకుల పటిమతో ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి