నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా
వేణువు విందామని నీతో ఉందామని నీ రాధ వేచేనయ్యా! రావయ్యా! ఓ కృష్ణయ్యా!
ఓ గిరిధర! మురహర! రాధా మనోహరా!
నీవు వచ్చే చోట నీవు నడిచే బాట మమతల దీపాలు వెలిగించాను
కుశలము అడగాలని పదములు కడగాలని కన్నీటి కెరటాలు తరలించాను
ఓ గిరిధర! మురహర! నా హృదయేశ్వరా! నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా!
కృష్ణయ్యా! ఓ కృష్ణయ్యా! కృష్ణయ్యా! ఓ కృష్ణయ్యా!
గోపాలా! గోవింద గోవింద గోవింద గోవింద గోపాలా!
నీ పదరేణువునైనా పెదవుల వేణువునైనా బ్రతుకే ధన్యమని భావించాను
నిన్నే చేరాలని నీలో కరగాలని నా మనసే హారతిగా వెలిగించాను
ఓ గిరిధర! మురహర! నా హృదయేశ్వరా! ఒకసారి దయచేసి నాతిని దయచూడరా!
కృష్ణయ్యా! ఓ కృష్ణయ్యా! కృష్ణయ్యా! ఓ కృష్ణయ్యా!
గోపాలా! గోవింద గోవింద గోవింద గోవింద గోపాలా!
రాధ మధుర భక్తిని మనోజ్ఞంగా ఆవిష్కరించిన మరో సినీ గీతం ఈ నువ్వు వస్తావని అనే గీతం. 1978లో విడుదలైన మల్లెపూవు చిత్రంలో ఆరుద్ర గారు రచించిన ఈ గీతానికి సంగీతం చక్రవర్తి గారు అందించగా రాధ మనోభావనను అద్భుతంగా వాణీ జయరాం గారు తమ గళంలో మనకు అందించారు. ఆరుద్రగారి అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. ఆరుద్ర సినీ గేయ రచయితే కాకుండా కవితలు, కథలు, నాటకాలు, గ్రంథాలు రచించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ప్రముఖమైన రచనలలో సమగ్రాంధ్ర సాహిత్యం అనే 12 భాగాల పరిశోధనాంశం. ఆయన 1950 నుండి 1993 వరకు సినీ గేయ రచయితగా, సంభాషణల రచయితగా ఎంతో పేరు ప్రతిష్ఠలు పొందారు. ప్రముఖ కవి శ్రీశ్రీ వీరి మేనమామ. అలాగే ప్రముఖ రచయిత్రి డాక్టర్ రామలక్ష్మి వీరి సతీమణి. ఆరుద్ర ఇతర ప్రముఖ రచనలలో 1948 కాలం నాటి నిజం రజాకార్ల అరాచకాల నేపథ్యంలో రచించిన త్వమేవాహం అనే అద్భుతమైన సాహితీ సౌరభం. శ్రీశ్రీ లాగానే ఆరుద్ర కూడా మంచి విప్లవ రచయిత. కమ్యూనిష్టులతో అనుబంధం ఆయన రచనలపై ప్రభావం చూపింది. తిరువళ్లువార్ రచించిన తమిళ ప్రబంధం తిరుక్కురళ్‌ను ఆయన ఆంధ్రీకరించారు. రాముడికి సీత ఏమవుతుంది అనే సంచలనాత్మకమైన రచన కూడా చేశారు. ఆయన రచించిన కొన్ని అద్భుతమైన సినీ గేయాలు:
చెట్టులెక్కగలవా ఓ నరహరి, నారాయణా హరి నారాయణా, పాలకడలిపై శేషతల్పమున, నీల గగన ఘనశ్యామ - చెంచులక్ష్మి, మనసే అందాల బృందావనం - మంచి కుటుంబం, హైలో హైలెస్సా హంస కదా నా పడవ, మహాదేవ శంభో, జో జో జోల - భీష్మ, రంభ ఊర్వశి తలదన్నే రమణీ లలామ ఎవరు? - వీరాభిమన్యు, సిరి సిరి లాలి చిన్నారి లాలి - భక్త ప్రహ్లాద, ఈ మౌనం ఈ బిడియం - డాక్టర్ చక్రవర్తి, ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వుల, హలో హలో ఓ అమ్మాయి - ఇద్దరు మిత్రులు, కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది - ఉయ్యాల జంపాల, ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట - మంచి మనసులు, యమునా తీరమున సంధ్యా సమయమున - జయభేరి, పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండు - రాము, ధనమేరా అన్నిటికీ మూలం - లక్ష్మీ నివాసం, చింతచెట్టు చిగురు చూడు - అదృష్టవంతులు, చంటి బాబు ఓ బుజ్జిబాబు - అందరూ దొంగలే, నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా, మబ్బే మసకేసిందిలే - వయసు పిలిచింది, మరు మల్లియ కన్నా తెల్లనిది - మల్లెపూవు, గోగులు గోగులు పూచే ఓ లచ్చా గుమ్మడి - ముత్యాల ముగ్గు, అబ్బోసి చిన్నమ్మా, సమూహ భోజనంబు - అందాల రాముడు, అమ్ము కుట్టి అమ్ము కుట్టి - పెళ్లి పుస్తకం...ఇలా ఎన్నో ఎన్నెన్నో.
ఇక ఈ గీతానికి వస్తే రాధ మధుర భక్తికి ప్రతిబింబం. తనలోని భావనలన్నిటినీ స్వామికి తాను నాయికయై సమర్పించింది. విరహం, భక్తి, వైరాగ్యం, శృంగారం, శరణాగతి అన్నీ కలబోసిన భక్తి రాధది. ఆ భావనలను ఆరుద్రగారు అచ్చతెనుగులో అద్భుతంగా పండించారు. వేణుమాధవుని కోసం బృందావనమంతా వేచియుందిట, ఆయన వస్తే ఆయన వేణుగానం వింటూ కాస్త సమయం గడుపుదామని రాధ వేచియుందట. ఎవరా కృష్ణుడు? గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోకులాన్ని కాపాడిన గిరిధరుడు, ముర అనే రాక్షసుని సంహరించిన వాడు, రాధ మనసు దోచుకున్నవాడు.
స్వామి వచ్చే చోట, ఆయన నడిచే బాట అంతా మమతల దీపాలు వెలిగించిందట. అంటే, హృదయాన్ని ఆయనకు సమర్పించి ఆయనను ఆహ్వానిస్తోంది. స్వామి క్షేమ సమాచారం తెలుసుకొని ఆయన పాదాలు కడగటానికి కన్నీటి కెరటాలను తరలించిందట. ఆ రాధా హృదయేశ్వరుని దర్శనానికై తపిస్తున్న రాధ హృదయ స్పందన ఎంత అందంగా ఉందో కదా? అందుకే రాధ మధురభక్తికి ప్రతిబింబమైంది.
మధురభక్తిలో మరో ప్రత్యేకత ఆ స్వామి భక్తి సామ్రాజ్యంలో కించిత్ స్థానమున్నా చాలు జన్మ ధన్యమే అన్న భావన. అదే భావన రాధ మనసునుండి వెలువడింది. ఆయన పాదాలు తాకిన ధూళి అయినా, ఆయన పెదవలుపై వేణువైనా చాలు అని భావించింది రాధ మనసు కనుగొన్న కవి హృదయం. మధురభక్తికి తారాస్థాయి నేను అన్న భావన పటాపంచలై స్వామిలో ఐక్యం కావటం. ఆ స్వామిని చేరుకోవాలని ఆయనలో ఏకమవ్వాలని తన మనసును హారతిగా సమర్పించిందిట ఆ రాధ. తనపై దయచూపమని స్వామిని వేడుకునే రాధ భావనలను అత్యంత నిర్మలంగా ఆవిష్కరించారు ఆరుద్ర గారు.
మధురభక్తి సోపానంలో ఎన్నో భావవ్యక్తీకరణలు. స్వామిని నాయకునిగా భావించి, ప్రేమించి, ఆరాధించి, ఆయన రానందుకు అలిగి, కోపగించి, దుఃఖించి, వచ్చినంత అలుక చూపి, స్వామి బుజ్జగింపులో కరగి, ఆయన ప్రేమ సామ్రాజ్యంలో ఓలలాడి, తనను తాను మరచి, నాది-నేను అన్న అహంకార లక్షణాలు విడిచే సోపానం ఇది. తాను ఆయన అనే ద్వైత భావం నుండి అద్వైత భావనకు చేరుకునే కష్టతర ప్రయాణం ఇది. భౌతిక ప్రపంచంలో ఉన్న వారికి ఈ భావన అర్థం కాక విపరీతార్థాలు తీసి ఆ మధురభక్తిలో ఉన్న వారి పట్ల వివక్ష చూపి హింసించిన సందర్భాలు ఎన్నో. అన్ని ఆటుపోట్లనూ తట్టుకొని మధుర భక్తులు స్వామిలో ఐక్యమై ముక్తిని పొందారు. అటువంటి వారిలో రాధ అగ్రగణ్యురాలు. ఆ మధుర భక్తులకు దేహస్ఫురణలు, దేహానికి సంబంధించిన అవలక్షణాలు ఏవీ అంటవు. వారి తనువు, మనసు అణువణువు స్వామే. ఆ భావననే ఆరుద్రగారు ఈ గీతం ద్వారా మనకు అందించారు. కృష్ణభక్తి సామ్రాజ్యంలో ఈ గీతానికి ఒక స్థానం తప్పకుండా ఉంటుంది. మనకు ఇంతటి అద్భుతమైన గీతాన్ని అందించిన ఆరుద్రగారికి జోహార్లు. ఈ మధుర భక్తి గీతాన్ని వాణీ జయరాం గారు మనోహరంగా ఆలపించారు. చక్రవర్తి గారి సంగీతం ఆరుద్రగారి సాహిత్య క్షీరానికి తేనెలా తోడైంది. ఈ ముగ్గురి ప్రతిభకు ఫలమే ఓ సుందర కృష్ణభక్తి గీతం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి