29, జులై 2017, శనివారం

శ్రీ రామ జయ రామ శృంగార రామ యని - త్యాగరాజస్వామి కృతి


శ్రీ రామ జయ రామ శృంగార రామ యని చింతింప రాదె ఓ మనసా

తళుకు చెక్కుల ముద్దుబెట్ట కౌసల్య మును తపమేమి చేసెనో తెలియ

దశరథుడు శ్రీ రామ రారాయనుచు బిల్వ తపమేమి చేసెనో తెలియ

తమి మీర పరిచర్య సేయ సౌమిత్రి మును తపమేమి చేసెనో తెలియ 

తన వెంట చన జూచి యుప్పొంగ కౌశికుడు తపమేమి చేసెనో తెలియ 

శాపంబణగి రూపవతియౌటకహల్య మును తపమేమి చేసెనో తెలియ

ధర్మాత్ము చరణంబు సోక శివ చాపంబు తపమేమి చేసెనో తెలియ

తన తనయ నొసగి కనులార గన జనకుండు తపమేమి చేసెనో తెలియ

దహరంబు కరగ కరమును బట్ట జానకి తపమేమి చేసెనో తెలియ

త్యాగరాజాప్తయని పొగడ నారద మౌని తపమేమి చేసెనో తెలియ

రాముని వైభవాన్ని రామావతారంలోని వేర్వేరు పాత్రలు సన్నివేశాలతో కూర్చి అద్భుతంగా వర్ణించారు త్యాగరాజస్వామి. మెరిసే బుగ్గలపైన ఆ బాలరాముని ముద్దాడటానికి కౌసల్య ఎటువంటి తపస్సు చేసిందో? నిజమే, రాముని వంటి ధర్మమూర్తికి, అవతారపురుషునకు తల్లిగా లాలించే అదృష్టం కౌసల్యకు కలగటం తపఃఫలమే. ఆడుతూ పాడుతూ బుడి బుడి అడుగులు వేస్తున్న రాముని చూచి దశరథుడు రామా రారా అని పిలవటానికి ఏమి తపస్సు చేశాడో? లేక లేక బిడ్డలు కలుగగా ఆ నలుగురూ కారణ జన్ములు కావటం, వారికి తండ్రి దశరథుడు కావటం ఆయన చేసుకున్న తపఃఫలమే. అన్న అలసట తీర సేవ చేసే భాగ్యాన్ని లక్ష్మణుడికి దక్కటం అతని తపఃఫలమే. ఆదిశేషుని అవతారంగా చెప్పబడే లక్ష్మణుడు స్వామిని వీడి ఉండలేడని తెలిసి సోదరునిగా పుట్టించి అతనికి నిరంతర సేవాభాగ్యాన్ని ప్రసాదించాడు స్వామి. ఆ సౌమిత్రి ఏమి తపస్సు చేశాడో? యాగరక్షణకై తన వెంట వచ్చిన రాముని చూసి ఉప్పొంగిన విశ్వామిత్రుడు ఏమి తపస్సు చేశాడో? రామావతారంలో వశిష్ఠ విశ్వామిత్రాది ఋషులెందరో శ్రీరామునికి బోధ చేశారు, మార్గదర్శకులైనారు. వారిలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల అతిబల విద్యలతో పాటు అస్త్ర శస్త్రాలను ప్రసాదిస్తాడు. యాగరక్షణతో పాటు వారి వివాహానికి తోడ్పడతాడు. శాపవశాత్తు వేలయేండ్లు స్థాణువై నిలిచిన అహల్య రాముని పాదము సోకి తిరిగి చేతన కావటానికి ఏమి తపస్సు చేసిందో? ఆ ధర్మమూర్తియైన రాముని స్పర్శను పొందటానికి ఆ శివధనుస్సేమి తపము చేసిందో? పరమశివుని చాపము జనకునికి పూర్వీకులనుండి పరంపరగా వచ్చింది. రాముని కోసమే వేచియున్నట్లు జానకి స్వయంవరానికి కారకమై సాద్గుణ్యతను పొందింది. సకల సద్గుణ సంపన్నుడైన రామునకు తన బిడ్డను కన్యాదానం చేసే భాగ్యం పొందటానికి జనకుడు ఏమి తపస్సు చేశాడో? లోకపావని సీత జనకుని ఇంట పెరగటం, ఇక్ష్వాకు వంశ తిలకుడైన రాముని వివాహమాడటం జనకుని తపఃఫలమే.  శివధనుసు విరచిన రాముని చూచి హృదయము కరగి వరించిన జానకి ఏమి తపస్సు చేసిందో? నారదాదులు ఆ పరమశివునికి రాముడు ఆప్తుడని నుతించటానికి ఏమి తపస్సు చేశారో? ఇవన్నీ తెలియటానికి శ్రీరామ జయరామ అని నిరంతరం స్మరించమని చెబుతున్నారు త్యాగరాజస్వామి. రాముని వైభవం, ఆయన అనుగ్రహం పొందటానికి ఆయన నామమే ఉత్తమమైన సాధనం అని సద్గురువులు తెలియజేస్తున్నారు.

నేదునూరి కృష్ణమూర్తి గారు ఈ కృతిని అద్భుతంగా గానం చేశారు.  

సరసీరుహాసన ప్రియే - దురైస్వామి అయ్యరు కృతి



సరసీరుహాసన ప్రియే! అంబ! సదా వీణా గానప్రియే! సదానంద హృదయే! మహిసదయే!

శరణాగతం మామవ! మంజుల చరణ కిసలయే!
సమ్మోదిత కవిజన హృదయే! సరోజ నిలయే! మణివలయే!

సరసీరుహాక్షి యుగళే అంబ!
శరణాగత దీన వత్సలే!
శరదిందు సుందర వదనే! విమలే!
సరస్వతీ! అంబ! సతి! దేశిక నుత గుణశాలే!
సతతం విద్యా లోలే! సదా సుశీలే!
సామజ! కుంభ స్తన యుగళే! ధవళే! 
సకల సామ్రాజ్య ప్రద! కర ధృత పుస్తక జాలే!

- పులియూరు దురైస్వామి అయ్యరు

కమలాసనుడైన చతుర్ముఖ బ్రహ్మకు ప్రియమైన అమ్మా సరస్వతీ! ఎల్లప్పుడూ వీణా గానమంటే ఇష్టపడే, సచ్చిదానందముతో నిండిన హృదయము కలిగి, ఈ భూమిపై అనుగ్రహము కలిగిన తల్లీ! చిగురులవలె మృదువైన చరణములు గలదానవు!  కవిజనుల హృదయాలకు ఆనందం కలిగించే తల్లివి! కమలములో స్థిరమై యున్న దానవు!మాకు నీవే శరణం. కలువలవంటి కన్నులు కలిగిన తల్లీ! నీవు శరణన్న దీనులపై వాత్సల్యము కలిగిన అమ్మవు. శరదృతువులో చంద్రుని వంటి సుందరమైన ముఖము కలిగిన దానవు, నిర్మలమైన తల్లివి. ఓ సరస్వతీ! ఉత్తమమైన స్త్రీవి నీవు! పుణ్యాత్ములచే పొగడబడిన గుణములకు నెలవు నీవు! ఎల్లప్పుడూ విద్యలలో నిమగ్నమైయుందువు, నిరంతరం సద్గుణ సంపన్నవు. సకల విద్యలను పూర్ణమైన స్తనములలో కలిగిన అమ్మవు, తెల్లని వస్త్రములు ధరించి, చేతిలో పుస్తకములు కలిగి సమస్త భోగములు ప్రసాదించే అమ్మవు నీవు! నీవే మాకు శరణము.

యువ గాయనీమణులు  రంజని-గాయత్రిల గాత్రంలో ఈ నాట రాగంలో ఈ కృతి వినండి

కదిరి నృసింహుడు కంబమున వెడలె - అన్నమాచార్యుల సంకీర్తన


కదిరి నృసింహుడు కంబమున వెడలె
విదితముగా సేవించరో మునులు 

ఫాల లోచనము భయదోగ్రముఖము
జ్వాలామయ కేసరములును
కాలరౌద్ర సంఘటిత దంతములు
హేలగతి ధరియించుక నిలిచె 

ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు
గడగడనదరెడి కటములును
నిడుద నాలుకయు నిక్కు కర్ణములు
నడియాలపు రూపై వెలసె 

సకలాయుధములు సహస్ర భుజములు
వికట నఖంబులు వెసబూని
వెకలియగుచు శ్రీవేంకటేశ్వరుడు
ప్రకటపు దుష్టుల భంజించేనిదివొ

- సద్గురువు తాళ్లపాక అన్నమాచార్యుల వారు

నరసింహావతారంపై అన్నమాచార్యుల వారు ఎన్నో కీర్తనలు రచించారు. వాటిలో ప్రత్యేకమైనది ఈ కదిరి నృసింహుడు కంబమున వెడలె. అనంతపురం జిల్లాలోని ఖాద్రి నరసింహస్వామి క్షేత్రం సనాతనమైనది. ఖాద్రి అనగా బ్రహ్మదారువు చెట్టుతో చేయబడిన స్థంభము. హిరణ్యాక్షుని వధించటానికి నరహరి రూపంలో శ్రీమహావిష్ణువు ఆ ఖాద్రియందు అవతరించాడు. అందుకే ఆ క్షేత్రానికి ఖాద్రి నరసింహుడు అని పేరు వచ్చింది. కాలగమనంలో కదిరిగా మారింది. ఆ కదిరి నరసింహుని అవతరణికను అన్నమయ్య ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేశారు.

కంబమునుండి వెడలిన ఆ నరసింహుని సేవించండి మునులారా అని అన్నమయ్య ఈ సంకీర్తనను ఆరంభించారు. అగ్ని నేత్రముతో, భయము కలిగించే ఉగ్రమైన ముఖముతో, జ్వలించే కేసరములతో, ప్రళయకాల రుద్రుని వలె భీకరమైన దంతములతో హేలగా నిలిచినాడు. ముడి పడిన కనుబొమ్మలు, బుసలు కొట్టే ఉచ్ఛ్వాస-నిశ్శ్వాసలతో, గడ గడ అదరుచున్న చెక్కిళ్లతో, బయటకు వెడలియున్న నాలుకతో, నిక్కబొడుచుకున్న చెవులతో, ప్రత్యేకమైన రూపంగా వెలసినాడు. సమస్త ఆయుధములు, ఎంచలేని భుజములు కలిగి భీకరమైన గోళ్లతో వేగముగా కదలుచు దుష్టులైన దానవులను సంహరించటానికి ఆ శ్రీవేంకటేశ్వరుడు (నరసింహుడు) అవతరించినాడు.ఆతని సేవించండి!

ఈ సంకీర్తన అఠాణ రాగంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు అద్భుతంగా ఆలపించారు.


తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూగెగన - అన్నమాచార్యుల సంకీర్తన


తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూగెగన చెల్లుబడి నూగీని శ్రీరంగశిశువు

కలికి కావేరి తరగల బాహులతలనే 
తలగకిటు రంగ మధ్యపు తొట్టెలను
పలుమారు దనునూచి పాడగా నూగీని
చిలుపాల సెలవితో శ్రీరంగశిశువు

వేదములే చేరులై వెలయంగ శేషుడే
పాదుకొను తొట్టెలై పరగగాను
శ్రీదేవితో గూడి శ్రీవేంకటేశుడై
సేదదీరెడి వాడె శ్రీరంగశిశువు

తొలుత మఱ్ఱాకుపై వైభవంగా తేలియాడిన వాడు,వటపత్రశాయిగా పేరొందిన వాడు ఈ శ్రీరంగ శిశువు. లతలవంటి కావేరీ తరంగాలు బాహువులుగా,  పాటలు పాడబడుచు పెదవుల మూలలలో పాలు కలిగిన అందమైన బాలుడు శ్రీరంగములో తొట్టెలలో ఊగుచున్నాడు. వేదాలే హారములుగా ఆది శేషుడే ఊయలగా ఒప్పుగా లక్ష్మీదేవితో కూడిన వేంకటేశుడు సేదదీరుచున్నాడు. అతడే శ్రీరంగ శిశువు.

- సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు.

నీలాంబరి రాగంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన ఈ అన్నమాచార్యుల వారి సంకీర్తన ఆ శ్రీరంగంలోని చిన్ని కృష్ణుడు ఊయలలో ఊగే సేవను అద్భుతంగా తలపిస్తుంది. పాలు తాగి ఊయలలో ఆ చిన్ని కృష్ణునికి తిరువారాధనలో పాటలు పాడుచుండగా ఊగే మనోజ్ఞమైన దృశ్యాన్ని అన్నమయ్య మనకు ఈ సంకీర్తన ద్వారా ఆవిష్కరించారు. పాలకడలిలో ఆదిశేషునిపై సేదదీరే లక్ష్మీపతి, మార్కండేయుని తపస్సుకు మెచ్చి అతనిని మఱ్ఱాకుపై వెలసిన బాలుని ఉదరములోనికి ప్రవేశింపజేసి విశ్వ రహస్యాన్ని తెలుపుతాడు. ఆ వటపత్రశాయే ఈ బాలకృష్ణుడు అని అన్నమయ్య తెలిపారు.


(చిత్రం వటపత్రశాయి అలంకారంలో ఉడిపి శ్రీకృష్ణుడు)

మామవ సదా జననీ - స్వాతి తిరునాళ్ కీర్తన


మామవ సదా జననీ మహిషాసుర సూదని

సోమ బింబ మనోహర సుముఖి సేవకాఖిల
కామదాన నిరత కటాక్ష విలాసిని

కురు మే కుశలం సదా కమలనాభానుజే
నిరవధి భవ ఖేద నివారణ నిరతే
చారు నూతన ఘన సదృశ రాజిత వేణి
దారుణ దనుజాళి దారణ పటు చరితే

అమ్మా పార్వతీ దేవి! మహిషాసురుని సంహరించిన నీవు నన్ను ఎల్లప్పుడూ కాపాడుము! చంద్రుని వంటి ముఖముతో మా మనసులను దోచుకొనెదవు. నిన్ను సేవించే వారికి సమస్త కామ్యములను ఎల్లప్పుడూ అనుగ్రహించే కటాక్షముతో ప్రకాశించే అమ్మవు. కమలమును నాభిలో గల శ్రీహరి సోదరివి, అనంతమైన భవసాగరపు దుఃఖములను నివారించటములో నిపుణురాలవు. అందమైన నీ కురులు క్రొత్త మేఘములవలె ప్రకాశిస్తున్నాయి. దారుణమైన గుణములు కల్గిన రాక్షస సమూహాన్ని సంహరించిన ఘనమైన చరిత గల తల్లివి. నాకు ఎల్లప్పుడూ క్షేమాన్ని కలుగజేయుము.

- మహారాజా స్వాతి తిరునాళ్ కీర్తన సుధా రఘునాథన్  గారి గాత్రంలో వినండి.


రామా నిను నమ్మినవారము గామా - త్యాగరాజస్వామి కీర్తన


రామా నిను నమ్మినవారము గామా సకల లోకాభి 

పామర జన దూర వర గుణ ఘృణాపాంగ శుభాంగ ముని హృదయాబ్జ భృంగ 

వాలాయముగాను రాను జాగేల సుగుణ దశరథ నృపాల హృదయానందకార శ్రి లోల పాల వెలయుమిక
ఫాల లోచన హృదయాలయాప్త జన పాల కనకమయ చేల ఇక పరాకేల ఇపుడు మమ్మేల నీదు మనసేల రాదు

నీవే గతి యంటిని గాని నే వేరేమి ఎరుగను ముందర రావే నీ పద పంకజ భక్తి నీవే భావజారి నుత
దేవ నీదు పద సేవా ఫలము మము గావునే పతిత పావన త్రిదశ నాధనీయ ముని జీవనానిశము బ్రోవనేల శ్రీరామ 

ధారాధర నిభ దేహ జనాధార దురితాఘ జలద సమీర త్యాగరాజ హృదయాగార సార హీన సం
సారమందు వేసారి నిన్ను మనసార నమ్ము కొన నేరలేని నే నూరక ఇక విచారమందుటకు మేర గాదు శ్రీరామ

సమస్త లోకములకు ఆనందంకు కలిగించే శ్రీరామా! మేము నిన్ను నమ్మినవారము గామా? పామరులకు దూరుడవు, శ్రేష్ఠమైన గుణములు కలవాడవు, దయాకటాక్షములు గలవాడవు, శుభమైన అంగములు కలవాడవు, మునుల హృదయకమలములకు తుమ్మెద వంటి వాడవు నీవు. దశరథ మహారాజు హృదయమునకు ఆననందము కలిగించిన వాడవు మమ్ములను కాపాడుటకు వేగముగా రావేల? వచ్చి రక్షించుము. శివుని హృదయములో నివసించే వాడవు, ఆప్తజనులను పాలించే వాడవు, బంగారు వస్త్రములు ధరించే వాడవు, ఇంక పరాకెందుకు? ఇప్పుడు మమ్ములను కాపాడుటకు నీకు మనసేల కలుగుటలేదు? నీవే శరణన్నాను, నీ పాదపద్మముల భక్తి తప్ప వేరేమీ ఎరుగను, వేగముగా వచ్చి కాపాడుము. మన్మథుని శత్రువైన శివునిచే నుతించబడిన వాడవు, నీ పాదములను సేవించే ఫలము మమ్ములను కాపాడును కదా! పతితులను పావనము చేసే వాడవు, మూడులోకములకు అధిపతివి, మునుల జీవనమైన వాడవు, ఎల్లప్పుడూ మమ్ములను బ్రోచుటకేల ఆలస్యము? మేఘముల వంటి కాంతితో శరీరము గల శ్రీరామా! జనులకు ఆధారము నీవే. పాపములనెడి మేఘములను వాయువు వలె తరిమి కొట్టేవాడవు, శివుని హృదయములో నివసించే వాడవు, ఈ సారములేని సంసార సాగరమందు వేసారి నిన్ను మనసారా నమ్ముకొన్నాను, నిస్సహాయుడైయున్న నన్ను బాధ పెట్టుట ఇంక మర్యాద కాదు శ్రీరామా! మేము నిన్ను నమ్మినవారము, వేగమే వచ్చి మమ్ము రక్షించుము.

- సద్గురువు త్యాగరాజస్వామి

మోహన రాగంలో కూర్చబడిన ఈ కృతి ద్వారా త్యాగరాజస్వామి వారు తాను రామునితో చేసుకున్న విన్నపాలు, ఫిర్యాదులు, వేడుకోలు అన్నీ కలిపి ద్వైత భావనను కురిపించారు. రాముని వైభవాన్ని కొనియాడుతూనే తనను కాపాడటం లేదని కాస్త కినుక కూడా చూపించారు. ఎందరినో  బ్రోచిన నీవు నన్నెలా  బ్రోవవు అన్న భావనను ఈ కీర్తన ద్వారా వ్యక్తపరచారు. అన్నీ వదలి  నిన్ను నమ్ముకున్నాను అని ఆర్తితో నుతించారు. మోహన రాగం ఇటువంటి భావానికి పెట్టిన పేరు. మహారాజపురం సంతానం గారి గాత్రంలో మోహన రాగం మరింత సమ్మోహనంగా ఉంటుంది. ఆయన గాత్రంలో ఈ కృతి వినండి

దేవాది దేవ! సదాశివ! - త్యాగరాజస్వామి కృతి


దేవాది దేవ! సదాశివ! దిననాధ సుధాకర దహన నయన!

దేవేశ! పితామహ మృగ్య! శమాది గుణాభరణ! గౌరీ రమణ!

భవ! చంద్ర కళాధర! నీలగళ!
భాను కోటి సంకాశ! శ్రీశ నుత!
తవ పాద భక్తిం దేహి దీన బంధో!
దర హాస వదన! త్యాగరాజ నుత!

దేవాది దేవా! సూర్య చంద్రాదులు, అగ్ని మూడు కన్నులుగా గల సదాశివా! ఓ పరమేశ్వరా! పార్వతీ పతీ! శమదమాది గుణములచే అలంకరించబడిన నీవు బ్రహ్మ కూడా అందని వాడవు! శివా! చంద్రుని శిరసుపై ధరించి, గరళమును కంఠములో నిలుపుకొని, కోటి సూర్యుల ప్రకాశిస్తూ విష్ణువుచే నుతించబడిన వాడవు. త్యాగరాజునిచే నుతించబడి, చిరునవ్వు ముఖము కలిగిన ఓ దీనబంధో! నీ పదముల యందు భక్తిని నాకు ప్రసాదించుము!

- సద్గురువులు త్యాగరాజస్వామి

తిరువాయూరులో 1986వ సంవత్సరంలో ప్రధాని రాజీవ్ గాంధీ, ముఖ్యమంత్రి ఎంజీఆర్, విదేశాంగమత్రి పీవీ నరసింహారావు గారు ఉన్న సభలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, రాధ విశ్వనాథన్ కలిసి చేసిన కచేరీలో ద్వారం మంగతాయారు గారు వయోలిన్, కేవీ ప్రసాద్ గారు మృదంగం. వీరు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారికి 15 ఏళ్లు మృదంగ సహకారం అందించారు.  ఆ సభలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి-రాధా విశ్వనాథన్ కలిసి ఆలపించిన ఈ కృతి చూడండి. .

అంతా రామమయం - భద్రాచల రామదాసు కృతి

అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడనంత రూపముల వింతలు సలుపగ సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అండాండంబులు పిండ...