29, జులై 2017, శనివారం

శ్రీ రామ జయ రామ శృంగార రామ యని - త్యాగరాజస్వామి కృతి


శ్రీ రామ జయ రామ శృంగార రామ యని చింతింప రాదె ఓ మనసా

తళుకు చెక్కుల ముద్దుబెట్ట కౌసల్య మును తపమేమి చేసెనో తెలియ

దశరథుడు శ్రీ రామ రారాయనుచు బిల్వ తపమేమి చేసెనో తెలియ

తమి మీర పరిచర్య సేయ సౌమిత్రి మును తపమేమి చేసెనో తెలియ 

తన వెంట చన జూచి యుప్పొంగ కౌశికుడు తపమేమి చేసెనో తెలియ 

శాపంబణగి రూపవతియౌటకహల్య మును తపమేమి చేసెనో తెలియ

ధర్మాత్ము చరణంబు సోక శివ చాపంబు తపమేమి చేసెనో తెలియ

తన తనయ నొసగి కనులార గన జనకుండు తపమేమి చేసెనో తెలియ

దహరంబు కరగ కరమును బట్ట జానకి తపమేమి చేసెనో తెలియ

త్యాగరాజాప్తయని పొగడ నారద మౌని తపమేమి చేసెనో తెలియ

రాముని వైభవాన్ని రామావతారంలోని వేర్వేరు పాత్రలు సన్నివేశాలతో కూర్చి అద్భుతంగా వర్ణించారు త్యాగరాజస్వామి. మెరిసే బుగ్గలపైన ఆ బాలరాముని ముద్దాడటానికి కౌసల్య ఎటువంటి తపస్సు చేసిందో? నిజమే, రాముని వంటి ధర్మమూర్తికి, అవతారపురుషునకు తల్లిగా లాలించే అదృష్టం కౌసల్యకు కలగటం తపఃఫలమే. ఆడుతూ పాడుతూ బుడి బుడి అడుగులు వేస్తున్న రాముని చూచి దశరథుడు రామా రారా అని పిలవటానికి ఏమి తపస్సు చేశాడో? లేక లేక బిడ్డలు కలుగగా ఆ నలుగురూ కారణ జన్ములు కావటం, వారికి తండ్రి దశరథుడు కావటం ఆయన చేసుకున్న తపఃఫలమే. అన్న అలసట తీర సేవ చేసే భాగ్యాన్ని లక్ష్మణుడికి దక్కటం అతని తపఃఫలమే. ఆదిశేషుని అవతారంగా చెప్పబడే లక్ష్మణుడు స్వామిని వీడి ఉండలేడని తెలిసి సోదరునిగా పుట్టించి అతనికి నిరంతర సేవాభాగ్యాన్ని ప్రసాదించాడు స్వామి. ఆ సౌమిత్రి ఏమి తపస్సు చేశాడో? యాగరక్షణకై తన వెంట వచ్చిన రాముని చూసి ఉప్పొంగిన విశ్వామిత్రుడు ఏమి తపస్సు చేశాడో? రామావతారంలో వశిష్ఠ విశ్వామిత్రాది ఋషులెందరో శ్రీరామునికి బోధ చేశారు, మార్గదర్శకులైనారు. వారిలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల అతిబల విద్యలతో పాటు అస్త్ర శస్త్రాలను ప్రసాదిస్తాడు. యాగరక్షణతో పాటు వారి వివాహానికి తోడ్పడతాడు. శాపవశాత్తు వేలయేండ్లు స్థాణువై నిలిచిన అహల్య రాముని పాదము సోకి తిరిగి చేతన కావటానికి ఏమి తపస్సు చేసిందో? ఆ ధర్మమూర్తియైన రాముని స్పర్శను పొందటానికి ఆ శివధనుస్సేమి తపము చేసిందో? పరమశివుని చాపము జనకునికి పూర్వీకులనుండి పరంపరగా వచ్చింది. రాముని కోసమే వేచియున్నట్లు జానకి స్వయంవరానికి కారకమై సాద్గుణ్యతను పొందింది. సకల సద్గుణ సంపన్నుడైన రామునకు తన బిడ్డను కన్యాదానం చేసే భాగ్యం పొందటానికి జనకుడు ఏమి తపస్సు చేశాడో? లోకపావని సీత జనకుని ఇంట పెరగటం, ఇక్ష్వాకు వంశ తిలకుడైన రాముని వివాహమాడటం జనకుని తపఃఫలమే.  శివధనుసు విరచిన రాముని చూచి హృదయము కరగి వరించిన జానకి ఏమి తపస్సు చేసిందో? నారదాదులు ఆ పరమశివునికి రాముడు ఆప్తుడని నుతించటానికి ఏమి తపస్సు చేశారో? ఇవన్నీ తెలియటానికి శ్రీరామ జయరామ అని నిరంతరం స్మరించమని చెబుతున్నారు త్యాగరాజస్వామి. రాముని వైభవం, ఆయన అనుగ్రహం పొందటానికి ఆయన నామమే ఉత్తమమైన సాధనం అని సద్గురువులు తెలియజేస్తున్నారు.

నేదునూరి కృష్ణమూర్తి గారు ఈ కృతిని అద్భుతంగా గానం చేశారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి