రామా నిను నమ్మినవారము గామా సకల లోకాభి
పామర జన దూర వర గుణ ఘృణాపాంగ శుభాంగ ముని హృదయాబ్జ భృంగ
వాలాయముగాను రాను జాగేల సుగుణ దశరథ నృపాల హృదయానందకార శ్రి లోల పాల వెలయుమిక
ఫాల లోచన హృదయాలయాప్త జన పాల కనకమయ చేల ఇక పరాకేల ఇపుడు మమ్మేల నీదు మనసేల రాదు
నీవే గతి యంటిని గాని నే వేరేమి ఎరుగను ముందర రావే నీ పద పంకజ భక్తి నీవే భావజారి నుత
దేవ నీదు పద సేవా ఫలము మము గావునే పతిత పావన త్రిదశ నాధనీయ ముని జీవనానిశము బ్రోవనేల శ్రీరామ
ధారాధర నిభ దేహ జనాధార దురితాఘ జలద సమీర త్యాగరాజ హృదయాగార సార హీన సం
సారమందు వేసారి నిన్ను మనసార నమ్ము కొన నేరలేని నే నూరక ఇక విచారమందుటకు మేర గాదు శ్రీరామ
- సద్గురువు త్యాగరాజస్వామి
మోహన రాగంలో కూర్చబడిన ఈ కృతి ద్వారా త్యాగరాజస్వామి వారు తాను రామునితో చేసుకున్న విన్నపాలు, ఫిర్యాదులు, వేడుకోలు అన్నీ కలిపి ద్వైత భావనను కురిపించారు. రాముని వైభవాన్ని కొనియాడుతూనే తనను కాపాడటం లేదని కాస్త కినుక కూడా చూపించారు. ఎందరినో బ్రోచిన నీవు నన్నెలా బ్రోవవు అన్న భావనను ఈ కీర్తన ద్వారా వ్యక్తపరచారు. అన్నీ వదలి నిన్ను నమ్ముకున్నాను అని ఆర్తితో నుతించారు. మోహన రాగం ఇటువంటి భావానికి పెట్టిన పేరు. మహారాజపురం సంతానం గారి గాత్రంలో మోహన రాగం మరింత సమ్మోహనంగా ఉంటుంది. ఆయన గాత్రంలో ఈ కృతి వినండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి