29, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఏమున్నదక్కో ఏమున్నదక్కా

ఏమున్నదక్కో ఏమున్నదక్కా
కాలే కాళ్లు బతుకు ఎండమావులు
ఏరు ఎండిపాయే ఊరు ఖాళీ ఆయే
తాగ నీరు లేదు మొక్కవోడు బోయే
గంజి తాగే గతి కూడా లేకపాయే
ఏమున్నదక్కో ఏమున్నదక్కా

ఏమున్నదక్కో ఏమున్నదక్కా
కడుపు చేత బట్టి ఊరే వదిలిపోయే
భూమి రుణం తీరి బంజరు బతుకాయే
పశువులు చచ్చే భూమి బీడువోయే
కరువు రాకాసి మమ్ము కాటేసి చంపే
ఏమున్నదక్కో ఏమున్నదక్కా

ఏమున్నదక్కో ఏమున్నదక్కా
అడవుల చెరపట్టి మేడలు కట్టి
చెరువుల కాజేసి మిద్దెలు నిలబెట్టి
రాయిని రప్పను అన్నిటి మింగితి
చెట్టు చేమ చూడక పుడమిని రక్కితి
ఏమున్నదక్కో ఏమున్నదక్కా

ఏమున్నదక్కో ఏమున్నదక్కా
పాతాళానున్న నీరును అమ్మితి
చెట్టును నరికితి చేమను అమ్మితి
రక్కసుల పుట్టించి వికృతి చేసితి
అమ్మ అని చూడక పుడమిని కోసితి
ఏమున్నదక్కో ఏమున్నదక్కా

ఏమున్నదక్కో ఏమున్నదక్కా
రేపు అన్న ముందు చూపే లేదు
నేడు నేడన్న అత్యాశే నా పేరు
పిల్ల పాపలకు నేర్పిందేమి లేదు
నేడు నాది అన్న స్వార్థమే నా తీరు
ఏమున్నదక్కో ఏమున్నదక్కా

-అక్కిరాజు ప్రసాద్
(నేటి మన దుస్థితికి మనమే కారణం కదా అన్న ఆవేదనతో రాసాను)



10, ఏప్రిల్ 2016, ఆదివారం

సినీ సంగీతంలో రాగమాలిక - హాయి హాయిగా ఆమని సాగే (సువర్ణసుందరి)


స్వర్ణయుగపు నాటి తెలుగు చలనచిత్ర గీతాలలో కొన్ని ప్రత్యేకమైనవి ఉన్నాయి. వాటిలోని సాంకేతిక నైపుణ్యత, విలక్షణత, కళాకారుల ప్రతిభను వాటిని ప్రత్యేక స్థానంలో నిలిపాయి. సందర్భోచితంతో పాటు శాస్త్రీయ సంగీత పటిమ కలిగిన గీతాలను సంగీతకారులు సృష్టించారు. శాస్త్రీయ సంగీత కచేరీలలో రాగమాలికకు ఒక ప్రత్యేక స్థానమున్నట్లే సినీ సంగీతంలో కూడా ఉంది. ఈ రాగమాలిక ప్రక్రియను అలనాటి సినీ సంగీతకారులు మనకు అద్భుతమైన గీతాలుగా ఆవిష్కరించారు. వాటిలో ప్రముఖమైనది 1957లో విడుదలైన సువర్ణసుందరి చిత్రంలోని హాయి హాయిగా ఆమని సాగే అనే గీతం. ప్రేయసీ ప్రియులపై చిత్రీకరించబడిన యుగళ గీతంలో ఋతువులను బట్టి మనోభావనల మార్పును రాగమాలికగా ఆవిష్కరించారు సంగీత దర్శకులు ఆదినారాయణ రావు గారు.

హంసనాదం, కానడ, జోన్‌పురీ, యమన్ కళ్యాణి రాగాలలో ఈ గీతాన్ని మనకు అందించారు. అద్భుతమైన స్వర సంపదతో పాటు మధురమైన సాహిత్యం కలిగిన ఈ గీతాన్ని సముద్రాల రాఘవాచార్యులు గారు రచించగా ఘంటసాల మాష్టారు మరియు జిక్కి గారు పాడారు. మంచి వాద్య సహకారంతో ఈ జంట ఈ శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమైన గీతాన్ని లలితంగా మనోహరంగా సందర్భానికి తగినట్లుగా ఆలపించారు. అంతే అందమైన సెట్లను కళా దర్శకులు వాలిగారు చిత్ర దర్శకులు వేదాంతం రాఘవయ్య గారు అందించారు. ఈ చిత్రానికి నృత్య దర్శకత్వం వెంపటి చిన సత్యం గారు అందించారు. ఇంతమంది మహానుభావుల చేత చెక్కబడిన సుందర శిల్పాలు సువర్ణసుందరి చిత్రం, అందులోని ఈ రాగమాలిక గీతం.

గాత్ర సౌరభం సంగీత దర్శకుడిని బట్టే అన్న సంగతి ఈ గీతం ద్వారా మనకు తెలుస్తుంది. ఘంటసాల మాష్టారు, జిక్కి గార్ల గొంతులో తేనెలు కురిపించారు ఆదినారాయణరావు గారు. అంతే అద్భుతంగా నటించారు అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గార్ల జంట. ఈ చిత్రాన్ని అదే పేరుతో హిందీలోకి అనువదించారు. ఈ గీతాన్ని కుహు కుహు బోలే అన్న పాటగా చిత్రీకరించారు. దానిని లతా మంగేష్కర్ గారు, మహమ్మద్ రఫీ గారు పాడారు. ఈ హిందీ చిత్రానికి ఆదినారాయణరావు గారికి ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు లభించింది. గీత సాహిత్యం పరిశీలిద్దాం.

హాయి హాయిగా ఆమని సాగే హాయి హాయిగా ఆమని సాగే
సోయగాల గనవోయి సఖా హాయి సఖా హాయి హాయిగా ఆమని సాగే

లీలగా పువులు గాలికి ఊగ
లీలగా పువులు గాలికి ఊగ
లీలగా పువులు గాలికి ఊగ
సనిద మదనిస గమ గమదనిస 
రిసని దని సరి సని సరి సని 
దనిని దనిని దని మదద మదద మద గరిగమదని
లీలగా పువులు గాలికి ఊగ
కలిగిన తలపుల వలపులు రేగ
కలిగిన తలపుల వలపులు రేగ
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా 
హాయి హాయిగా ఆమని సాగే

ఏమో ఏమో తటిల్లతిక మేమెరుపో ఏమో తటిల్లతిక మేమెరుపో
మైమరపేమో మొయిలురాజు దరి మురిసినదేమో
మైమరపేమో మొయిలురాజు దరి మురిసినదేమో
వలపు కౌగిలుల వాలి సోలి
వలపు కౌగిలుల వాలి సోలి
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా
హాయి హాయిగా ఆమని సాగే

చూడుమా చందమామా అటు చూడుమా చందమామా
కనుమా వయ్యారి శారద యామిని కవ్వించే ప్రేమా
చూడుమా చందమామా
వగల తూలే విరహిణుల
మనసున మోహము రేపు నగవుల 
మనసున మోహము రేపు నగవుల 
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా 
హాయి హాయిగా ఆమని సాగే

కనుగవా తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా
కనుగవా తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా కనుగవా తనియగా  
చెలువము కనుగొన మనసానంద నాట్యాలు సేయునోయి 
ఆనంద నాట్యాలు సేయునోయి
నిరి గమ దనిస దనిస 
సని సగరిగ సరినిస దని మదనిస 
నిరి నిరి దని దని మద మద 
గమ గమ గమ దనిస గమ దనిస దనిస

ఈ గీతంలో సముద్రాల వారి ముద్ర మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన వాడిన తెలుగు పదాలు, వాటిలోని మాధుర్యం అజరామరం. హాయి హాయిగా సాగే ఆమని సోయగాలను కనవోయి అనే పల్లవితో మొదలయ్యే గీతంలో ఆయన కనబరచిన సాహితీ ప్రతిభ అసమానం. లీలగా పువులు గాలికి ఊగితే, ఆ పూల నాట్యానికి వాటి వల్ల కలిగిన తలపులలో నుండి వలపులు రేగాయట. ఆ వలపులలో మనసు ఉయ్యాల జంపాలగా ఊగిపోయిందట. తటిల్లతిక అనే పదం ఎంత అద్భుతమైన ప్రయోగమో గమనించండి. అందమైన తీగను ప్రతిపాదించటానికి ఈ పదాన్ని ఉపయోగించారు. ఆ మేఘాల రాజు గర్జించే సరికి ఈ లత మైమరపుతో మురిసిందట, మనసు ఉయ్యాలగా జంపాలగా ఊగిందట. ప్రేయసీ ప్రియులు చందమామతో ఎలా ముచ్చటిస్తునారో చూడండి - "ఓ చందమామా! శరదృతువులోని రాత్రి ప్రేమతో కవ్విస్తోంది, ఆమెను చూడుము. వగలను ఒలికించే విరహిణిలా, మనసులో మోహాన్ని కలిగించే నవ్వులతో ఆమె అందాన్ని చూడు" అని పలికారు కవి.  "రెండు కళ్లకు తృప్తి కలిగేలా విరిసిన కలువలను చూడు ప్రియతమా! ఆ కలువ అందాలను చూసి మనసు ఆనంద నాట్యాల చేసింది" అంటున్నారు కవి. వసంత, వర్ష, శరఋతువులను ఎంత అందంగా వర్ణించారో! కవి యొక్క సాహితీ ప్రకీర్తిలో లలిత శృంగార గీతం పలికి మనలను మురిపించేలా చేసింది. అందుకే ఈ గీతం తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని నిలుపుకొని సంగీత సాహిత్య సౌరభాలను ఇప్పటికీ గుబాళిస్తూనే ఉంది.  ఈ గీతం వీడియోలో చూడండి

20, మార్చి 2016, ఆదివారం

సీతారామ వైభవం-5: రామచంద్రుడితడు (అన్నమాచార్యుల వారి రచన)



శ్రీరాముని వైభవాన్ని త్యాగరాజు, రామదాసు వంటి రామభక్తులు అద్భుతంగా తమ సంకీర్తనలలో చాటారు. వారి జీవితమంతా రామభక్తి సామ్రాజ్యంలోనే సాగిపోయింది. సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు వీరిద్దరికన్నా ముందే తిరుమల శ్రీవేంకటేశ్వరునిపై కొన్ని వేల సంకీర్తనలు రచించి పరమాత్మను నుతించారు. ఆయన సంకీర్తనలలో ఎన్నో శ్రీరామునిపై కూడా ఉన్నాయి. రాముని వైభవాన్ని అద్భుతంగా ఈ సంకీర్తనలలో ఆయన వర్ణించారు. వాటిలో ఒకటి రామచంద్రుడితడు. శ్రీరాముడు ఎవరెవరిని ఎలా అనుగ్రహించాడో ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారు.


రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలము లియ్యగలిగె నిందరికి

గౌతము భార్యపాలిటి కామధేను వితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
ఈతడు దాసుల పాలిటి ఇహపర దైవము

పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు
సరి హనుమంతు పాలి సామ్రాజ్యము
నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు
గరిమ జనకు పాలి ఘనపారిజాతము

తలప శబరి పాలి తత్వపు రహస్యము
అలరి గుహుని పాలి ఆదిమూలము
కలడన్న వారి పాలి కన్ను లెదటి మూరితి
వెలయ శ్రీ వేంకటాద్రి విభుడితడు

తాత్పర్యము:

రఘువీరుడైన శ్రీరామచంద్రుడు ఎందరికో ఈ విధముగా కామ్యములను ఇచ్చాడు. భర్త గౌతమముని శాపానికి గురై వేల సంవత్సరాలు నిర్జీవంగా ఉన్న అహల్యను తన పాద స్పర్శతో ఉద్ధరించినవాడు ఆయన. లోకకళ్యాణార్థం యాగం చేయ తలపెట్టిన విశ్వామిత్రునికి రాక్షసుల బెడద కలగటంతో ఆయన కోరిక మేరకు శ్రీరాముడు ఆ యాగ సంరక్షణ చేశాడు. సీతకు కోరుకున్న వెంటనే కోర్కెలు తీర్చేవాడు ఆ రాముడు. దాసులకు ఇహమునందు పరమునందు దైవము ఈ రాముడు. అన్నచే మోసగించబడిన సుగ్రీవునికి ఇతడు ఒప్పుగా పరమ బంధువైనాడు. తననే నిరంతరము కొలిచే హనుమంతునికి ఈయనే సామ్రాజ్యం. చెడును వీడి మంచి కోరి వచ్చి శరణనన్న విభీషణునికి నిధి ఈ రాముడు. తన బిడ్డకు ఎటువంటి భర్త దొరుకుతాడో అని ఆలోచనలో ఉన్న రాజర్షి జనకుని పాలిట శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడి గొప్ప పారిజాతమైనాడు రాముడు. తన గురువుల మాట ప్రకారం తనను ఉద్ధరించటానికై వేచి ఉన్న శబరికి మోక్షాన్ని ప్రసాదించిన వాడు రాముడు. గుహుని పాలిట సనాతనుడు ఈ రాముడు. కలడు అనుకునే వారికి కన్నులెదుట నిలిచే ప్రభువు శ్రీవేంకటాద్రిలో వెలసిన వాడు.

వివరణ:


అన్నమాచార్యుల వారి సాహిత్యంలో ఉన్న గొప్పతనం అందులోని లోతైన ఆధ్యాత్మిక సౌరభం. రాముడు ఎవెరెవరి కోర్కేలను ఎలా తీర్చాడు అన్నది ఈ సంకీర్తన ప్రధాన ప్రాతిపదిక అయినా అందులో నిగూఢమైన తత్త్వనిధి ఉంది. ఇంద్రుని పన్నాగములో అపవిత్రమైన అహల్య గౌతముని శాపము వలన వేల సంవత్సరాలు భస్మ రూపములో వాయు భక్షణ చేస్తూ ఎవరికీ అగుపించక ఉంటుంది. అదే గౌతముడు రామచంద్రుడు ఈ ఆశ్రమంలోకి వచ్చినంతనే పునీతవై తిరిగి రూపాన్ని పొందుతావు ఆమెకు శాపవిముక్తి చెబుతాడు. వేల సంవత్సరాలు అలా భస్మశాయినివై ఉన్న అహల్య రాముడు ఆ ఆశ్రమంలో ప్రవేశించగానే పవిత్రయై తన దివ్యరూపాన్ని తిరిగి పొందుతుంది. అంటే రాముడు ఎంతటి ధర్మాతుడో ఊహించండి. జీవహీనమైన ప్రాణికి జీవాన్నిచ్చే అద్భుత పురుషుడు రాముడు. ధర్మ రక్షణలో తిరుగులేని వాడు కాబట్టే విశ్వామిత్రుడు లేతవయసులోనే రాముడిని అడవులకు తీసుకువెళతాడు. అందులో ఆ ధర్మ రక్షణ లోక కళ్యాణార్థం చేయటం రాజుల విధి, దానిని సఫలీకృతం కావించుట మునుల కర్తవ్యం. అందుకే ఆయన విశ్వామిత్రుని పాలిట కల్పవృక్షమైనాడు. ఆదర్శ పతిగా సీతాదేవి కోరికలను తీర్చినవాడు రాముడు. ఇక్కడ చింతామణి అనగా కామ్యములను తీర్చే మణి అని అర్థము. సీతారాముల మధ్య ఎక్కడా లేదు, కుదరదు అన్న వాటికి తావే లేదు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని ఒకరి కోసం ఒకరు జీవించారు. లోకానికే ఆదర్శమైనారు. భర్తగా తన ధర్మాన్ని ముమ్మాటికీ పాటించిన రాముడు అందుకే సీతమ్మ పాలిట చింతామణి అయినాడు. మొదటి చరణంలో అతి ముఖ్యమైన వాక్యం - దాసుల పాలిట ఇహము పరము రెండిటా దైవము అన్నారు. జన్మను తరించటానికి, భవసాగరాన్ని దాటటానికి రామనామమే శరణము, అలాగే పరములో కూడా అనంతమైన శక్తినిచ్చేవాడు రాముడు.


తమ్ముడైన సుగ్రీవుడిని వాలి మోసం చేసి ఆతని భార్యను చెరబట్టి కిష్కింధను ఏలుతాడు. ధర్మం కాపాడటానికి రాముడు సుగ్రీవునికి బాసటగా నిలచి వాలిని వధిస్తాడు. తారకు విముక్తి కలిగిస్తాడు. బంధువనే వాడి ప్రథమ కర్తవ్యం తోడునీడగా నిలబడటం. అది రాముడు పాటించిన ధర్మం వలన ఏర్పడిన బంధం. అన్నీ తానే అనుకుని రాముడిని కొలిచిన వాడు హనుమంతుడు. రామనామమే అతనికి శ్వాస. రాముడే స్వామి. అందుకే హనుమ ఉత్తమ భక్తుడు అని రాముడు చెప్పాడు. ఆ హనుమంతుడికి వేరే సామ్రాజ్యం అక్కరలేదు. రామభక్తే అతని సామ్రాజ్యం. విభీషణుడు హరిభక్తుడు, ధర్మ పరాయణుడు.  అన్న రావణుడు అధర్మానికి ఒడిగడితే అతనిని హెచ్చరించి హితబోధ చేశాడు. దూతగా వచ్చిన హనుమను సంహరించమని రావణుడు ఆదేశిస్తే అది అధర్మమని తెలిపి అతని ఆలోచనను సరిచేశాడు. రామరావణ యుద్ధంలో ధర్మం వైపు నిలచి ధర్మ విజయానికి తోడ్పడిన వాడు విభీషణుడు. రావణుని వధ తరువాత రాముడు అతనిని లంకకు రాజుగా చేస్తాడు. అందుకే అన్నమాచార్యుల వారు విభీషణుని పాలిట పెన్నిధి అని రాముని నుతించారు. ఇక జనకుడి వంటి ఉత్తమునికి రాముడు ఘన పారిజాతం ఎలా అయ్యాడు? సమస్త శాస్త్రములు, ధర్ములు తెలిసిన జనకుడు తన వంశం వారికి శివుని ద్వారా అందిన ధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడే తన బిడ్డ అయిన సీతను పెండ్లాడటానికి తగిన వరుడు అని నిశ్చయించుకుంటాడు. శివ ధనుర్భంగం తరువాత జనకునికి విశ్వామిత్రుడు ఇక్ష్వాకు వంశ వృత్తాంతము తెలిపి ఆ వంశజుల కీర్తిని చాటుతాడు. అటువంటి శ్రీరాముడు అయోనిజ అయిన సీతను చేపట్టి జనుకుడి వంశాన్ని కూడా ఉద్ధరించాడు. అలాగే సీతమ్మ నిమి వంశంలో జన్మించి ఇక్ష్వాకు వంశానికి వచ్చి ఆ పూర్వీకులు ఘన కీర్తిని ఇనుమడింపజేసింది. రాముని సత్యవాక్పరిపాలన, ధర్మపరాయణత జనకుని పాలిట పారిజాతం.


శబరి మతంగమహర్షి శిష్యురాలు. సన్యాసం స్వీకరించి గురువులను ఎంతో భక్తిప్రపత్తులతో సేవిస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటుంది. సీతారామలక్ష్మణులు చిత్రకూటం చేరుకున్నప్పుడు మతంగమహర్షి పరమపదానికి చేరుకుంటారు. దేహాన్ని విడిచే ముందు ఆయన శబరితో నువ్వు చేసిన సేవలు చాల గొప్పవి. శ్రీరాముడు ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు నీ సేవకు సాఫల్యం కలిగి నీకు ముక్తిని ప్రసాదించును అని చెబుతాడు. ఆ మహర్షి మాటల ఫలాన శ్రీరాముడు మతంగవనానికి వచ్చి శబరి చేసిన పూజలు స్వీకరించి ఆమెకు కైవల్యాన్ని ప్రసాదిస్తాడు. ఇదీ, శబరి తత్త్వ రహస్యము. గుహుడు శ్రీరాముడు దేవుడని ఎరిగిన వాడు. అతని రామభక్తి అనుపమానమైనది. రాముడు అరణ్యవాసానికి వెళ్లేటపుడు, భరతుడు శ్రీరాముని కోసం అరణ్యానికి వచ్చినపుడు గుహుని పాత్ర ఎంతో ముఖ్యమైనది. అతని సేవకు మెచ్చి శ్రీరాముడు అతని అనుగ్రహిస్తాడు. అందుకే గుహుని పాలిట ఆది మూలము అన్నారు అన్నమాచార్యుల వారు. ఇక కలడు అని తలచిన వారికి కళ్లెదుటి దైవము రాముడు అన్నారు.  ఎలా? ఎంత మంది రామభక్తులు ఆయన నామస్మరణతో ఆయన పదచింతనతో భవసాగరాన్ని దాటి ముక్తిని పొందలేదు? తులసీదాసు మొదలైన మహాభక్తులు ఈ కోవకు చెందిన వారు. మరి ఆ శ్రీరాముడే కలియుగంలో మనకు దగ్గరగా శ్రీవేంకటాద్రిలో వెలసిన ప్రభువు అని అన్నమాచార్యుల వారు తగురీతిన కొనియాడారు.

అన్నమాచార్యుల వారు అందించిన ఈ శ్రీరామవైభవ వర్ణన పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. అందుకే ఆయన సంకీర్తనలు మంత్రసమానమై అలరారుతున్నాయి. రామచంద్రుడితడు అనే కీర్తన ద్విజావంతి రాగంలో కూర్చబడింది. దీనిని శ్రావ్యంగా ఆలపించిన కళాకారుల పేరు తెలియదు. 

16, మార్చి 2016, బుధవారం

అత్త-కోడలు - ఆధిపత్యపు పోరు

కోడలు: అత్తయ్యా పెళ్లై ఇన్నేళ్లయ్యింది. మీకు ఏది ఇష్టమో తెలుసుకోవటం నా వల్ల కాలేదు...
అత్తగారు: అది మీ మామగారి వల్లే కాలేదు. ఇంక నీ వల్ల ఏమవుతుంది. అయినా, ఇష్టాలు అయిష్టాలు ఇష్టమున్న మనుషులతోనే లేమ్మా.

అత్తగారు: కోడలు పిల్లా! డబ్బేమన్నా దాస్తున్నారా? వాడికి వచ్చింది వచ్చినట్లు స్వాహాయేనా?
కోడలు: ఆ మీరు మామయ్యగారి జీతమంతా ఏం చేశారో మీ బీరువాల్లో చీరలే చెబుతాయి. నేను మాత్రం తక్కువ తిన్నానా?

అత్తగారు: పిల్ల కళ్లు ముక్కు అన్ని నావేనే. చక్కగా తీరుగా ఉంటాయి మా వాళ్ల పోలికలు.
కోడలు: అందరూ పిల్ల నలుపు మీదే వచ్చిందంటున్నారు అత్తయ్యా!
అత్తగారు: అమ్మాయ్! నలుపు అదృష్టమే. తెల్లతోలుంటేనే అందముటే...
కోడలు:  మరి మీ అబ్బాయి నన్ను చేసుకుంది నా తెల్లతోలు చూసేగా?

కోడలు: వెధవ పోలికలు, వద్దనుకుంటే వస్తాయి. ఆ కోపం, ఆ హఠం వేయటం అన్నీ దిగిపడ్డాయి.
అత్తగారు: ఆ నిజమే. మీ అమ్మ పోలికే అని నేను మీ మామగారు ఎప్పుడూ అనుకుంటాం.

అత్తగారు: వెధవ గోదారి వంటలు, ప్రతి దాంట్లోనూ బెల్లం, ఆవ కూరలు. ఒంటికి వాతం, వేడి. తినలేక చస్తున్నా.
కోడలు: ముదనష్టపు గుంటూరు వంటలు. నోట్లో పెట్టుకుంటే నాలు ఊడాల్సిందే. ఒక రుచా పచా!

అత్తగారు: ఈ తూగోజీ వాళ్లున్నారు చూడండీ, భలే మాటలు చెబుతారండీ. అండీ అండీ అంటూనే వెనకాతల గోతులు తవ్వుతారు.
కోడలు: అబ్బో ఈ గుంటూరు కృష్ణా జిల్లాల వాళ్లతో పడలేము తల్లో. యమ టెక్కు, ఓ మాట పడలేరు, నోట్లోంచి మాట వస్తే విరిచినట్లే. మా అహంబోతులండీ.

13, మార్చి 2016, ఆదివారం

అసమాన సాహస మహిళ నీరజ భనోత్


మానవత్వం కోసం, తన ధర్మం కోసం ప్రాణాలొడ్డి పోరాడి వందలాది మంది ప్రాణాలు కాపాడిన వీర వనిత, భరతజాతి గర్వంతో చెప్పుకోగలిగిన ధీర నారి, ఊహించలేని సంక్లిష్టకరమైన సమయంలో సమయస్ఫూర్తి, తెగింపు, ఓర్పు చూపి విలువైన ప్రాణాలు కాపాడి తన ప్రాణాలు కోల్పోయిన త్యాగమూర్తి....ఇలా ఆమె కనబరచిన ధైర్య సాహసాలను ఎన్ని రీతుల చెప్పినా అవి తక్కువే. ఎవరని ఆలోచిస్తున్నారా? స్త్రీ శక్తిని, మానవ జన్మ లక్ష్యాన్ని తన అసమాన సాహసోపేతమైన చర్యలతో ప్రపంచానికి చాటిన మహిళ నీరజ భనోత్. తీవ్రవాదులతో పోరాడి విమాన ప్రయాణికులను కాపాడి తన ప్రాణాలను కోల్పోయిన ఈ అసమాన మహిళ వివరాలు తెలుసుకుందాం.

1963 సెప్టెంబర్ 7న పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్‌లో హరీష్ మరియు రమా భనోత్ దంపతులకు నీరజ జన్మించింది. అప్పటికే అఖిల్ మరియు అనీష్ అనే ఇద్దరబ్బాయిలు వారికి పుట్టారు. నీరజ చండీగఢ్‌లోని సేక్రెడ్  హార్ట్ స్కూల్, ముంబైలోని బాంబే స్కాటిష్ స్కూల్‌లో చదివిన తరువాత అక్కడే సెయింట్ క్సేవియర్స్ కళాశాలలో చదువు పూర్తి చేసింది. తరువాత మోడలింగ్ కెరీర్ మొదలు పెట్టింది. అప్పుడే పాన్ ఆం ఎయిర్లైన్స్ వాళ్లు ఫ్లైట్ అటెండెంట్స్ పోస్టులకు పత్రికలలో ప్రకటన చేస్తే నీరజ అప్ప్లై చేసి అమెరికాలోని మయామీలో శిక్షణ పొందింది. ఆమె ప్రతిభకు మెచ్చి ఆ సంస్థ వాళ్లు ఆమెను ఛీఫ్ ఫ్లైట్ అటెండెంట్‌గా నియమించారు.

1986వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన పాన్ ఆం 73 విమానం 361 మంది ప్రయాణికులు 19 మంది సిబ్బందితో ముంబై నుండి కరాచీ మరియు ఫ్రాంక్‌ఫర్ట్ మీదుగా న్యూయార్కుకు బయలు దేరింది. ముంబై నుండి కరాచీ విమానాశ్రయం చేరుకున్న విమానాన్ని నలుగురు అబు నిదల్ సంస్థకు చెందిన తీవ్రవాదులు హైజాక్ చేశారు. దానిని సైప్రస్ మళ్లించాలని అనుకున్నారు. ప్రయాణికుల విడులకు బదులుగా తమ సంస్థకు చెందిన ఖైదీలను విడుదల చేయాలని వారి డిమాండ్లు.

నీరజ సమయస్ఫూర్తితో కాక్‌పిట్‌లో ఉన్న పైలట్లకు హైజాక్ గురించి తెలియజేసింది. విమానం ఇంకా రన్‌వే మీదనే ఉండటంతో పైలట్లు కాక్‌పిట్ నుండి సురక్షితంగా బయట పడ్డారు. దీనితో విమానాన్ని నడిపే పరిస్థితిని నీరజ వలన తప్పింది. కానీ, విమానంలో ఉన్న మిగిలిన ఉద్యోగులలో నీరజే సీనియర్ కావటంతో భారమంతా ఆమెపై పడింది. ఆ తీవ్రవాదులు తమ డిమాండ్లకై అమెరికా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావటానికి నీరజను విమానంలో ఉన్న అమెరికన్ పౌరసత్వమున్న ప్రయాణికుల పాస్‌పోర్టులన్నీ సేకరించమని చెప్పారు. నీరజ చాలా తెలివిగా అమెరికన్ పాస్‌పోర్టులన్నీ సీట్ల కింద కొన్ని, చెత్త బుట్టలో కొన్ని దాచమని సిబ్బందిని నిర్దేశించింది. తాను కూడా అదే చేసింది. మొత్తం మీద 41 మంది అమెరికన్ ప్రయాణీకులు ఉన్నా నీరజ కనబరచిన సమయ స్ఫూర్తితో తీవ్రవాదులు వారిని వేరు చేయలేకపోయారు.

17 గంటలు దాటినా విమానం నడిపించటానికి విమానాశ్ర్య అధికారులు పైలట్లను పంపక పోవడంతో తీవ్రవాదులు పేలుడు పదార్థాలు, గన్లను ఉపయోఇంచటం మొదలు పెట్టారు. వారి వద్ద ఇక ఆయుధాలలో తూట్లు, పేలుడు పదార్థాల నిల్వలు నిండుకున్నాయి. అప్పుడు, ప్రాణాలకు తెగించి నీరజ ప్రయాణికుల సాయంతో ఎమెర్జెన్సీ డోర్లు తెరుస్తుంది. తన ప్రాణాలను కాపాడుకోవటానికి తాను ముందు దూకవచ్చు, కానీ ముగ్గురు చిన్నపిల్లలను ఆ తీవ్రవాదుల కాల్పులనుండి రక్షించటానికి వారితోనే ఉంటుంది. తీవ్రవాదుల కాల్పుల్లో మొత్తం 20 మంది ప్రయాణికులు మరణించారు. అందులో 12 మంది భారతీయులు ఇద్దరు అమెరికన్లు మిగిలిన వారు పాకీస్తాన్, యూకే మరియు మెక్సికోకు చెందినవారు. మిగిలిన 340 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి నీరజ తన ప్రాణాలను కోల్పోయింది. పసిపిల్లల కోసం, తోటి ప్రయాణికుల కోసం సాహసోపేతంగా పోరాడి వీరమరణం పొందింది. పాకిస్తానీ సైన్యానికి చెందిన స్పెషల్ సెక్యూరిటీ గ్రూపుకు చెందిన సైనికులు ఆ తీవ్రవాదులను చెరబట్టారు.

అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన నీరజకు భారత ప్రభుత్వం 1987లో మరణానంతరం ఆశోకచక్ర అవార్డును ప్రకటించింది. నీరజ తల్లి రమ అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్ చేతుల మీదుగా రిపబ్లిక్ డే నాడు ఆ అవార్డును స్వీకరించింది. అటు తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం ఆమెకు తంఘా-ఎ-ఇన్సానియత్ అవార్డును, అమెరికా ప్రభుత్వం జస్టిస్ ఫర్ క్రైంస్ మరియు  స్పెషల్ కరేజ్ అవార్డును ప్రదానం చేసింది. 2004వ సంవత్సరంలో భారత తపాలా శాఖ ఆమె సంస్మరణార్థం ఒక ప్రత్యేక తపాలా బిళ్లను విడుల చేసింది.


నీరజ తల్లిదండ్రులు ఆమె మరణాంతరం జీవిత భీమాతో వచ్చిన డబ్బుతో నీరజ భనోత్ -పాన్ ఆం అనే ట్రస్ట్ ఏర్పాటు చేశారు. విమానయానంలో డ్యూటీని మించి సేవాదృక్పథాన్ని కనబరచే వారికి ఒక అవార్డును, వరకట్నం వంటి సామాజిక అంశాలపై పోరాడే వారికి నీరజ భనోత్ అవార్డును ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ఈ రెండవ అవార్డుకు కూడా కారణం ఉంది. నీరజకు 1985లో గల్ఫ్‌లో ఉన్న ఒక వ్యక్తితో వివాహమైంది. కానీ, వరకట్న వేధింపులతో రెండు నెలలకే నీరజ తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చి తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఆ దురాచారానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు ఈ అవార్డును ఇస్తున్నారు. నీరజ కాపాడిన పిల్లలలో ఒకరు ఇప్పుడు పైలట్. ఇది నీరజ చేసిన సాహసానికి ఉత్తమమైన సాఫల్యము మరియు సార్థకత.

నీరజ తండ్రి హరీష్ 2007లో, తల్లి రమ 2015 డిసెంబరులో మరణించారు. ఇటీవలే నీరజ సాహస చరిత్రను తెరకెక్కించారు.  సోనం కపూర్ నీరజగా నటించింది. ప్రఖ్యాత నటి షబనా అజ్మీ నీరజ తల్లి రమగా నటించారు. నీరజ సోదరులు అఖిల్ మరియు అనీష్ ఈ చిత్రాన్ని చూసి ఎంతో సంతోషించారు. వాస్తవాన్ని యథాతథంగా తీసినందుకు నిర్మాతను, దర్శకుడిని అభినందించారు. ఈ చిత్రం ప్రతి మహిళ, ప్రతి బాలిక చూడవలసినది. ఆడది అబల కాదు అని మరో సారి చాటి చెప్పిన నీరజ సాహస గాథ తరతరాల పాటు మార్గదర్శకం. ఆమె కథను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశాలలో చేర్చి దేశ పౌరులను మరింత సాహసవంతులుగా, దేశభక్తులుగా, మానవత్వంతో నిండిన మనుషులుగా తీర్చిదిద్దటానికి తోడ్పడాలి.

అంతా రామమయం - భద్రాచల రామదాసు కృతి

అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడనంత రూపముల వింతలు సలుపగ సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అండాండంబులు పిండ...