శ్రీరాముని వైభవాన్ని త్యాగరాజు, రామదాసు వంటి రామభక్తులు అద్భుతంగా తమ సంకీర్తనలలో చాటారు. వారి జీవితమంతా రామభక్తి సామ్రాజ్యంలోనే సాగిపోయింది. సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు వీరిద్దరికన్నా ముందే తిరుమల శ్రీవేంకటేశ్వరునిపై కొన్ని వేల సంకీర్తనలు రచించి పరమాత్మను నుతించారు. ఆయన సంకీర్తనలలో ఎన్నో శ్రీరామునిపై కూడా ఉన్నాయి. రాముని వైభవాన్ని అద్భుతంగా ఈ సంకీర్తనలలో ఆయన వర్ణించారు. వాటిలో ఒకటి రామచంద్రుడితడు. శ్రీరాముడు ఎవరెవరిని ఎలా అనుగ్రహించాడో ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారు.
రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలము లియ్యగలిగె నిందరికి
గౌతము భార్యపాలిటి కామధేను వితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
ఈతడు దాసుల పాలిటి ఇహపర దైవము
పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు
సరి హనుమంతు పాలి సామ్రాజ్యము
నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు
గరిమ జనకు పాలి ఘనపారిజాతము
తలప శబరి పాలి తత్వపు రహస్యము
అలరి గుహుని పాలి ఆదిమూలము
కలడన్న వారి పాలి కన్ను లెదటి మూరితి
వెలయ శ్రీ వేంకటాద్రి విభుడితడు
తాత్పర్యము:
రఘువీరుడైన శ్రీరామచంద్రుడు ఎందరికో ఈ విధముగా కామ్యములను ఇచ్చాడు. భర్త గౌతమముని శాపానికి గురై వేల సంవత్సరాలు నిర్జీవంగా ఉన్న అహల్యను తన పాద స్పర్శతో ఉద్ధరించినవాడు ఆయన. లోకకళ్యాణార్థం యాగం చేయ తలపెట్టిన విశ్వామిత్రునికి రాక్షసుల బెడద కలగటంతో ఆయన కోరిక మేరకు శ్రీరాముడు ఆ యాగ సంరక్షణ చేశాడు. సీతకు కోరుకున్న వెంటనే కోర్కెలు తీర్చేవాడు ఆ రాముడు. దాసులకు ఇహమునందు పరమునందు దైవము ఈ రాముడు. అన్నచే మోసగించబడిన సుగ్రీవునికి ఇతడు ఒప్పుగా పరమ బంధువైనాడు. తననే నిరంతరము కొలిచే హనుమంతునికి ఈయనే సామ్రాజ్యం. చెడును వీడి మంచి కోరి వచ్చి శరణనన్న విభీషణునికి నిధి ఈ రాముడు. తన బిడ్డకు ఎటువంటి భర్త దొరుకుతాడో అని ఆలోచనలో ఉన్న రాజర్షి జనకుని పాలిట శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడి గొప్ప పారిజాతమైనాడు రాముడు. తన గురువుల మాట ప్రకారం తనను ఉద్ధరించటానికై వేచి ఉన్న శబరికి మోక్షాన్ని ప్రసాదించిన వాడు రాముడు. గుహుని పాలిట సనాతనుడు ఈ రాముడు. కలడు అనుకునే వారికి కన్నులెదుట నిలిచే ప్రభువు శ్రీవేంకటాద్రిలో వెలసిన వాడు.
వివరణ:
అన్నమాచార్యుల వారి సాహిత్యంలో ఉన్న గొప్పతనం అందులోని లోతైన ఆధ్యాత్మిక సౌరభం. రాముడు ఎవెరెవరి కోర్కేలను ఎలా తీర్చాడు అన్నది ఈ సంకీర్తన ప్రధాన ప్రాతిపదిక అయినా అందులో నిగూఢమైన తత్త్వనిధి ఉంది. ఇంద్రుని పన్నాగములో అపవిత్రమైన అహల్య గౌతముని శాపము వలన వేల సంవత్సరాలు భస్మ రూపములో వాయు భక్షణ చేస్తూ ఎవరికీ అగుపించక ఉంటుంది. అదే గౌతముడు రామచంద్రుడు ఈ ఆశ్రమంలోకి వచ్చినంతనే పునీతవై తిరిగి రూపాన్ని పొందుతావు ఆమెకు శాపవిముక్తి చెబుతాడు. వేల సంవత్సరాలు అలా భస్మశాయినివై ఉన్న అహల్య రాముడు ఆ ఆశ్రమంలో ప్రవేశించగానే పవిత్రయై తన దివ్యరూపాన్ని తిరిగి పొందుతుంది. అంటే రాముడు ఎంతటి ధర్మాతుడో ఊహించండి. జీవహీనమైన ప్రాణికి జీవాన్నిచ్చే అద్భుత పురుషుడు రాముడు. ధర్మ రక్షణలో తిరుగులేని వాడు కాబట్టే విశ్వామిత్రుడు లేతవయసులోనే రాముడిని అడవులకు తీసుకువెళతాడు. అందులో ఆ ధర్మ రక్షణ లోక కళ్యాణార్థం చేయటం రాజుల విధి, దానిని సఫలీకృతం కావించుట మునుల కర్తవ్యం. అందుకే ఆయన విశ్వామిత్రుని పాలిట కల్పవృక్షమైనాడు. ఆదర్శ పతిగా సీతాదేవి కోరికలను తీర్చినవాడు రాముడు. ఇక్కడ చింతామణి అనగా కామ్యములను తీర్చే మణి అని అర్థము. సీతారాముల మధ్య ఎక్కడా లేదు, కుదరదు అన్న వాటికి తావే లేదు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని ఒకరి కోసం ఒకరు జీవించారు. లోకానికే ఆదర్శమైనారు. భర్తగా తన ధర్మాన్ని ముమ్మాటికీ పాటించిన రాముడు అందుకే సీతమ్మ పాలిట చింతామణి అయినాడు. మొదటి చరణంలో అతి ముఖ్యమైన వాక్యం - దాసుల పాలిట ఇహము పరము రెండిటా దైవము అన్నారు. జన్మను తరించటానికి, భవసాగరాన్ని దాటటానికి రామనామమే శరణము, అలాగే పరములో కూడా అనంతమైన శక్తినిచ్చేవాడు రాముడు.
తమ్ముడైన సుగ్రీవుడిని వాలి మోసం చేసి ఆతని భార్యను చెరబట్టి కిష్కింధను ఏలుతాడు. ధర్మం కాపాడటానికి రాముడు సుగ్రీవునికి బాసటగా నిలచి వాలిని వధిస్తాడు. తారకు విముక్తి కలిగిస్తాడు. బంధువనే వాడి ప్రథమ కర్తవ్యం తోడునీడగా నిలబడటం. అది రాముడు పాటించిన ధర్మం వలన ఏర్పడిన బంధం. అన్నీ తానే అనుకుని రాముడిని కొలిచిన వాడు హనుమంతుడు. రామనామమే అతనికి శ్వాస. రాముడే స్వామి. అందుకే హనుమ ఉత్తమ భక్తుడు అని రాముడు చెప్పాడు. ఆ హనుమంతుడికి వేరే సామ్రాజ్యం అక్కరలేదు. రామభక్తే అతని సామ్రాజ్యం. విభీషణుడు హరిభక్తుడు, ధర్మ పరాయణుడు. అన్న రావణుడు అధర్మానికి ఒడిగడితే అతనిని హెచ్చరించి హితబోధ చేశాడు. దూతగా వచ్చిన హనుమను సంహరించమని రావణుడు ఆదేశిస్తే అది అధర్మమని తెలిపి అతని ఆలోచనను సరిచేశాడు. రామరావణ యుద్ధంలో ధర్మం వైపు నిలచి ధర్మ విజయానికి తోడ్పడిన వాడు విభీషణుడు. రావణుని వధ తరువాత రాముడు అతనిని లంకకు రాజుగా చేస్తాడు. అందుకే అన్నమాచార్యుల వారు విభీషణుని పాలిట పెన్నిధి అని రాముని నుతించారు. ఇక జనకుడి వంటి ఉత్తమునికి రాముడు ఘన పారిజాతం ఎలా అయ్యాడు? సమస్త శాస్త్రములు, ధర్ములు తెలిసిన జనకుడు తన వంశం వారికి శివుని ద్వారా అందిన ధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడే తన బిడ్డ అయిన సీతను పెండ్లాడటానికి తగిన వరుడు అని నిశ్చయించుకుంటాడు. శివ ధనుర్భంగం తరువాత జనకునికి విశ్వామిత్రుడు ఇక్ష్వాకు వంశ వృత్తాంతము తెలిపి ఆ వంశజుల కీర్తిని చాటుతాడు. అటువంటి శ్రీరాముడు అయోనిజ అయిన సీతను చేపట్టి జనుకుడి వంశాన్ని కూడా ఉద్ధరించాడు. అలాగే సీతమ్మ నిమి వంశంలో జన్మించి ఇక్ష్వాకు వంశానికి వచ్చి ఆ పూర్వీకులు ఘన కీర్తిని ఇనుమడింపజేసింది. రాముని సత్యవాక్పరిపాలన, ధర్మపరాయణత జనకుని పాలిట పారిజాతం.
శబరి మతంగమహర్షి శిష్యురాలు. సన్యాసం స్వీకరించి గురువులను ఎంతో భక్తిప్రపత్తులతో సేవిస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటుంది. సీతారామలక్ష్మణులు చిత్రకూటం చేరుకున్నప్పుడు మతంగమహర్షి పరమపదానికి చేరుకుంటారు. దేహాన్ని విడిచే ముందు ఆయన శబరితో నువ్వు చేసిన సేవలు చాల గొప్పవి. శ్రీరాముడు ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు నీ సేవకు సాఫల్యం కలిగి నీకు ముక్తిని ప్రసాదించును అని చెబుతాడు. ఆ మహర్షి మాటల ఫలాన శ్రీరాముడు మతంగవనానికి వచ్చి శబరి చేసిన పూజలు స్వీకరించి ఆమెకు కైవల్యాన్ని ప్రసాదిస్తాడు. ఇదీ, శబరి తత్త్వ రహస్యము. గుహుడు శ్రీరాముడు దేవుడని ఎరిగిన వాడు. అతని రామభక్తి అనుపమానమైనది. రాముడు అరణ్యవాసానికి వెళ్లేటపుడు, భరతుడు శ్రీరాముని కోసం అరణ్యానికి వచ్చినపుడు గుహుని పాత్ర ఎంతో ముఖ్యమైనది. అతని సేవకు మెచ్చి శ్రీరాముడు అతని అనుగ్రహిస్తాడు. అందుకే గుహుని పాలిట ఆది మూలము అన్నారు అన్నమాచార్యుల వారు. ఇక కలడు అని తలచిన వారికి కళ్లెదుటి దైవము రాముడు అన్నారు. ఎలా? ఎంత మంది రామభక్తులు ఆయన నామస్మరణతో ఆయన పదచింతనతో భవసాగరాన్ని దాటి ముక్తిని పొందలేదు? తులసీదాసు మొదలైన మహాభక్తులు ఈ కోవకు చెందిన వారు. మరి ఆ శ్రీరాముడే కలియుగంలో మనకు దగ్గరగా శ్రీవేంకటాద్రిలో వెలసిన ప్రభువు అని అన్నమాచార్యుల వారు తగురీతిన కొనియాడారు.
అన్నమాచార్యుల వారు అందించిన ఈ శ్రీరామవైభవ వర్ణన పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. అందుకే ఆయన సంకీర్తనలు మంత్రసమానమై అలరారుతున్నాయి. రామచంద్రుడితడు అనే కీర్తన ద్విజావంతి రాగంలో కూర్చబడింది. దీనిని శ్రావ్యంగా ఆలపించిన కళాకారుల పేరు తెలియదు.
రామ చంద్ర మూర్తి అవతార తత్వం, ఆయనను కేవలం మర్యాదా పురుషోత్తమునిగా కాకుండా, హరి అవతారముగా గ్రహించి, సేవించి ముక్తి పొందిన భాగ్యశాలురు గురించి అన్నమయ్య రాసిన రామచంద్రుడితడు రఘువీరుడు కీర్తనకు మంచి వ్యాఖ్యానం ఇచ్చారు. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు వదినా. అంతా రామమయం.
రిప్లయితొలగించండిI always heard the above song rendered by susheela garu composed by KVM-Puhalendi. It is good.
రిప్లయితొలగించండి