29, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఏమున్నదక్కో ఏమున్నదక్కా

ఏమున్నదక్కో ఏమున్నదక్కా
కాలే కాళ్లు బతుకు ఎండమావులు
ఏరు ఎండిపాయే ఊరు ఖాళీ ఆయే
తాగ నీరు లేదు మొక్కవోడు బోయే
గంజి తాగే గతి కూడా లేకపాయే
ఏమున్నదక్కో ఏమున్నదక్కా

ఏమున్నదక్కో ఏమున్నదక్కా
కడుపు చేత బట్టి ఊరే వదిలిపోయే
భూమి రుణం తీరి బంజరు బతుకాయే
పశువులు చచ్చే భూమి బీడువోయే
కరువు రాకాసి మమ్ము కాటేసి చంపే
ఏమున్నదక్కో ఏమున్నదక్కా

ఏమున్నదక్కో ఏమున్నదక్కా
అడవుల చెరపట్టి మేడలు కట్టి
చెరువుల కాజేసి మిద్దెలు నిలబెట్టి
రాయిని రప్పను అన్నిటి మింగితి
చెట్టు చేమ చూడక పుడమిని రక్కితి
ఏమున్నదక్కో ఏమున్నదక్కా

ఏమున్నదక్కో ఏమున్నదక్కా
పాతాళానున్న నీరును అమ్మితి
చెట్టును నరికితి చేమను అమ్మితి
రక్కసుల పుట్టించి వికృతి చేసితి
అమ్మ అని చూడక పుడమిని కోసితి
ఏమున్నదక్కో ఏమున్నదక్కా

ఏమున్నదక్కో ఏమున్నదక్కా
రేపు అన్న ముందు చూపే లేదు
నేడు నేడన్న అత్యాశే నా పేరు
పిల్ల పాపలకు నేర్పిందేమి లేదు
నేడు నాది అన్న స్వార్థమే నా తీరు
ఏమున్నదక్కో ఏమున్నదక్కా

-అక్కిరాజు ప్రసాద్
(నేటి మన దుస్థితికి మనమే కారణం కదా అన్న ఆవేదనతో రాసాను)



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అహోబిలహరిని అర్చింతును - సాయికృష్ణ యాచేంద్ర గారి భక్తి గీతం

అహోబిలహరిని అర్చింతును నా అంతరంగమే అర్పింతును నరమృగప్రవృత్తులు ధరలో కలవని ఎరిగింప ఈ రూపు ధరియించిన భయావహం ఆ రూపం అయినా దయామయం హృదయం కన్నులలో...