11, మార్చి 2016, శుక్రవారం

వేణువాద్య సమ్మోహనం - ప్రతిభామూర్తి జయప్రద రామమూర్తి


సంగీతం కొంతమందికి దైవానుగ్రహమైతే కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చే వారసత్వం. రెండూ కలగలిపితే ఇక అది అద్భుతమైన ప్రతిభావిష్కరణే అవుతుంది. సంగీతం వారసత్వంగా వస్తే అది జీవితంలో ఒక అంతర్భాగమై ప్రత్యేకంగా నేర్చుకున్నట్లు అనిపించదు. ఎలాగైతే మాట్లాడటం, ఆడటం నేర్చుకుంటారో, అలాగే కొన్ని సంగీత కుటుంబాలలో సంగీతన్ని కూడా పిల్లలు చిన్నప్పటినుంచే నేర్చుకుంటారు. అటువంటి ఒక అసమాన కళాకారిణి జయప్రద రామమూర్తిగారు. తెలుగుగడ్డపై పుట్టిన తొలి వేణువాద్య ఏ గ్రేడ్ కళాకారిణిగా జయప్రదగారు ఈరోజు ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆవిడ వివరాలు తెలుసుకుందాం.

గతంలో నేను ప్రముఖ వేణు వాద్య కళాకారిణులు సిక్కిల్ సోదరీమణులు నీల కుంజుమణి గార్ల గురించి రాసినప్పుడు వాయిద్యాలలో వేణువు ఎందుకు కష్టమైనదో తెలిపాను. శ్వాసకు సంబంధించిన వాయిద్యం ఇది. ఆ శ్వాసలో స్వరాలను పలికించాలంటే తప్పకుండా ప్రత్యేకమైన సాధన కావాలి. అందులో వేర్వేరు కాలాలలో వాయించేటప్పుడు ఊపిరిని నియంత్రించటానికి ఎంతో శ్రమ పడాలి. అందుకే వేణుగాన విద్వాంసులు చాలా తక్కువమంది ఉంటారు. మరి జయప్రదగారు ఎంతటి పరిశ్రమ, సాధన చేసుంటే ఈనాడు విద్వాంసులయ్యుంటారో ఊహించండి.

జయప్రద గారు గురుముఖత విద్య నేర్చుకోక మునుపే సంగీతంలో మెళకువలన్నీ తల్లి వద్ద నేర్చుకున్నారు. జయప్రద గారు ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ప్రేమా రామమూర్తి గారు. తండ్రి కీర్తిశేషులు శ్రీ ఓవీ రామామూర్తిగారు. ప్రేమ గారి తాత గారు బళ్లారి జమీందారు గారు శ్రీనివాస శాస్త్రిగారు వేణువాద్య విద్వాంసులు. ప్రేమ గారు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి శిష్యురాలు, ఆలిండియా రేడియోలో ఏ గ్రేడ్ కళాకారిణిగా పనిచేశారు. జయప్రద గారు చిన్ననాడే సంగీతంలో ప్రావీణ్యం సంపాదించి ఆకాశవాణిలో దూరదర్శన్‌లో కచేరీలు చేసినా,  తల్లి సలహా మేరకు ప్రఖ్యాత వేణువాద్య విద్వాంసులు డాక్టర్ ఎన్. రమణి గారి వద్ద చెన్నైలో, హైదరాబాదులో శ్రీ శ్రీనివాసన్ వద్ద నేర్చుకున్నారు. తరువాత శ్రీ సుదర్శనాచార్యుల వద్ద మృదంగం కూడా నేర్చుకున్నారు. తరువాత బంగ్లాదేశ్‌లో జరిగిన భారతీయ ఉత్సవాలలో ప్రఖ్యాత హిందూస్థానీ వేణువాద్య విద్వాంసులు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారితో పరిచయం ఏర్పడింది. ఆయన సలహా మేరకు హిందూస్థానీ వేణువాదనం కూడా నేర్చుకున్నారు. కళతో పాటు తన విద్యాభ్యాసాన్ని కూడ అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లారు. కామర్స్‌లో పీహేచ్‌డీ పూర్తి చేశారు జయప్రదగారు. తన చదువును సంగీతంతో ముడిపెట్టి పీహెచ్‌డీని మార్కెటింగ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే అంశంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఆ విధంగా తనను డాక్టర్ జయప్రదగా చూడాలనుకున్న తల్లి ప్రేమ గారి ఆకాంక్షను నెరవేర్చారు.

జయప్రద గారు పాశ్చాత్య మరియు భారతీయ శాస్త్రీయ సంగీతాల మేళనను శాస్త్రీయత కోల్పోకుండా చేయటాన్ని ఇస్టపడతారు. ఆమె వేణువాద్యానికి కావలసిన శక్తిని యోగా మరియు ప్రాణాయం ద్వారా పొందారు. ఊపిరితిత్తుల మరియు చేతి వేళ్ల దృఢత్వాన్ని వీటి ద్వారా పొందారు. వేణువాద్యం సహజ ప్రాణాయామం కాబట్టి దానివలన నాడీమండలం ఆరోగ్యంగా ఉంటుంది అని మానసిక రోగులకు ఈ వాద్యాన్ని నేర్చుకోమని  జయప్రదగారు సలహా ఇస్తారు. శబ్దానికి మానసిక ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని జయప్రదగారు అందరికీ చెప్పాలన్న యోచనతో దానిపై పరిశోధన చేస్తున్నారు.

జయప్రద గారు నవీనతకు చిహ్నంగా వేగంగా వాయించే రోలింగ్ ఫింగర్స్ అని కొత్త విధానాన్ని కనిపెట్టి ప్రపంచ మరియు జాతీయ రికార్డులను సొంతం చేసుకున్నారు. రకరకాల వేణువులలో రాగాలను ఆయా వేణువుల ధర్మానికి అనుగుణంగా మలచుకుంటూ వేలి కదలికను సృజనాత్మకంగా చేయటంలో జయప్రదగారు రికార్డులను సొంతం చేసుకున్నారు. దీనిని ట్రాన్స్పోస్ ఫింగరింగ్ అంటారు. మనోధర్మాన్ని ఈ ప్రక్రియ ద్వారా వాయించి ఈ రికార్డులకెక్కారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది పురస్కారం, ఢిల్లీ ప్రభుత్వం వారి పురస్కారం వంటి ఎన్నో గుర్తింపులు పొందారు. ఎన్నో దేవస్థానాలలో వీరి వేణువాద్యం అక్కడి దేవతామూర్తుల సేవలలో వినియోగిస్తున్నారు.  పండిట్ రవిశంకర్ గారు వీరిలోని ప్రతిభను గుర్తించి ఎంతో ప్రశంసించి ఆశీర్వదించారు. విజయాలు సాధించినప్పుడు బాధ్యత పెరుగ్తుంది అన్న సత్యాన్ని జయప్రదగారు పరిపూర్ణంగా నమ్ముతారు.

సంగీతం అంటే ధ్యానం, దానితో వేరే ఆలోచనలన్నీ తొలగి మనసు ప్రశాంతతను పొందుతుందని పరిపూర్ణంగా విశ్వసించే నిష్ణాతురాలు జయప్రదగారు. ఆవిడ వేణువాదన వింటుంటే మనసు తేలిపోతుంది, తేలికపడుతుంది. శ్రీకృష్ణుడు ఎదుట నిలచినట్లనిపిస్తుంది. మనోవికారాలన్నీ తొలగి ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఆవిడ పలికించే గమకాలు, ఆవిడ చేసే శబ్ద విన్యాసాలు మనసును కట్టి పడేస్తాయి. తన గురువుల వద్ద నేర్చుకున్న విద్యను, తన సాధన ద్వారా పరిపక్వత చెందిన సంగీతాన్ని జయప్రదగారు తన శిష్యులకు అందజేస్తున్నారు. దేశవిదేశాల్లో ఎన్నో కచేరీలు చేసిన జయప్రదగారు మాండోలిన్ వంటి తీగలతో కూడిన వాయిద్యాలను కూడ ఇష్ట పడతారు. ఛందస్సు లేని చుటుకులను స్వరపరచే అవకాశాన్ని మైసూర్ దత్తపీఠాధిపతులు గణపతి సచ్చిదానంద స్వామి వారు జయప్రద గారికి అనుగ్రహించారు.

ఫ్లూట్ ఐకాన్ ఆఫ్ ఏషియా, ఫ్లూట్ మేస్ట్రో, దివా ఆఫ్ డక్కన్, ఆస్థాన విదుషీ, వేణుగాన వినోదిని, మురళీధర మృదుపద మంజీరం, నాదయోగ వంటి బిరుదులు పొందారు. జయప్రదగారిని భారత రాష్ట్రపతులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు వేర్వేరు సందర్భాలలో సత్కరించారు. గ్లోబల్ వరల్డ్ రికార్డ్, యునిక్ రికార్డ్, ఏషియాస్ టాప్ 100 టాలెంట్, నేషనల్ ఫెలోషిప్, భారతి గౌరవ పురస్కార్, గోల్డెన్ బ్రేస్లెట్ అవార్డ్, బెస్ట్ ఫ్లూటిస్ట్, ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మర్ అవార్డులు పొందారు.

భగవంతుడు జయప్రదగారికి మరింత వేణువాద్య సేవాభాగ్యాన్ని, మరెన్నో గుర్తింపులను, పురస్కారాలను కలిగేలా అనుగ్రహించాలని ప్రార్థన. తెలుగుజాతి ముద్దుబిడ్డ జయప్రద గారి సంగీత సోపానం మరింత జయప్రదంగా సాగాలని ఆకాంక్షిద్దాం. వారి ప్రతిభ తరతరాలకు అందాలని ఆశిద్దాం. వారు వాయించిన కాంభోజి రాగ కీర్తనను వినండి. 

పాత్రం, అపాత్రం - యోగ్యం, అయోగ్యం


దాత, గ్రహీత ఇద్దరూ అయోగ్యులైతే ఎన్నో చిక్కులు - సహాయం పొందిన వాడికి, చేసినవాడికి ఆ సహాయం యొక్క విలువ ఒకటిగా ఉండదు, ఒకరిపై ఒకరికి అభిప్రాయాలూ అంత గొప్పగా కూడా ఉండవు. చేసినవాడికి గోరంత కొండంతైతే పొందిన వాడికి కొండంత గోరంత అవుతుంది. ఊరికే చేయలేదు అని పొందిన వాడనుకుంటే, పొందిన వాడు కృతఘ్నుడు అని చేసినవాడనుకుంటాడు. ఒక్కసారి సాయం చేస్తే జీవితాంతం దాసోహం కావాలా అని పొందిన వాడు అనుకుంటే నేను చేయకపోతే వాడి బతుకు బస్‌స్టాండే అనుకుంటాడు చేసిన వాడు. నేను చేశాను కాబట్టి నేను మహనీయుడిని అని చేసినవాడు భావిస్తే అది ఆయన ప్రతిఫలాపేక్షతో చేశాడు అని పొందినవాడనుకుంటాడు. చూశారా? మంచి కోసం జరగాల్సిన కర్మలో ఎన్ని వికృతాలో? వీటన్నిటిలో మనిషి చాలా సార్లు మరచిపోయే విషయం - ఇవ్వటం ఉపకారం కాదు, అది మానవ జన్మ ఎత్తినందుకు ఒక కనీస ధర్మం. ఈ విశ్వంలో ఎక్కువ నుండి తక్కువకు, తక్కువ నుండి ఎక్కువకు నిరంతరం బదిలీ జరుగుతూ ఉండాల్సిందే. లేకపోతే విశ్వ పరిణామమే ఆగిపోతుంది. అది ఆలోచన కావచ్చు, ధనం, వస్తువు, బంగారం, వాహనం, ఏదైనా కావచ్చు. అందుకే చాలా సార్లు మేము జీవితమంతా ఇతరులకు మంచే చేశాము అనుకునే వాళ్లకు కూడా చెప్పుకోలేని కష్టాలు, బాధలు, వ్యాథలు. చేసినవారి మనసులు బరువులు, పొందిన వారి మనసులు చీడ పురుగులు...అందుకే పాత్రం, అపాత్రం అనే విచక్షణ ఉపయోగించకపోతే, యోగ్యం, అయోగ్యం అన్నది ఆలోచించకపోతే ఇద్దరికీ మిగిలేది పాపమే. మరి కావలసింది ఏమిటి?

1. సాయం చేసేటప్పుడు యోగ్యునికి, పాత్రమైనది చేయటం
2. ఫలాపేక్ష లేకుండా ఉండటం
3. సాయం పొందినందుకు భగవంతునికి కృతజ్ఞత తెలుపటం, మరొకరికి ఫలాపేక్ష లేకుండా చేయటం.
4. భగవంతుడంటే రాయో, ఆకాశమో, నేలో కాదు. యోగ్యమైనది ఏదైనా భగవంతుడే. కాబట్టి యోగ్యుడైన మానవుడు భగవంతుడే.
5. మనం చేసేది భగవంతుని కోసం అన్న భావన. అన్నీ చెందినవానికి, అన్నీ తానైన వానికి తిరిగి ఇవ్వటం లెక్క పెట్టకూడదు కదా? ఇది అదే.

మంచి జరిగిన తరువాత నకారాత్మకమైన ఆలోచనలు వచ్చి దగ్గర కావలసిన మనుషులు దూరమెందుకు అవుతున్నరు అని మీరు ఆలోచిస్తే చాలా సార్లు అపాత్రము, అయోగ్యత మరియు ప్రతిఫలాపేక్షే కారణాలు. ఇది బయట వాళ్లతోనే కాదు, రక్తసంబంధీకుల మధ్య కూడా ఉంటుంది. అందుకే కుటుంబాలు విడిపోతాయి. ఎప్పుడైతే ఈ మూడు కారణాలు రంగంలో ఉంటాయో అప్పుడు అసలు లక్ష్యం, అసలు ధర్మం పక్కకు నెట్టబడుతుంది. అందుకే సనాతన ధర్మం ఫలాపేక్షకు, అపాత్రమునకు పాప ప్రమాణము నిర్ణయించింది.

కలియుగంలో అధర్మం పాళ్లు, తద్వారా మనుషులలో అయోగ్యం, అపాత్రము పాళ్లు, ప్రతిఫలాపేక్ష ఎక్కువ ఉంటాయి కాబట్టి నిజాయితీతో సాయం చేయదలచుకుంటే పాత్రమును బాగా నిశింతంగా పరిశీలించి, ఫలాపేక్షలేకుండా చేయాలి. అప్పుడు పాప సంచయము మనకు రాదు. ఈ విచక్షణ చేయాలంటే మంచి-చెడు, ధర్మం-అధర్మం వివరాలు బాగా తెలియాలి. మనస్తత్త్వం అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉండాలి. వీటన్నిటికీ అంతర్ముఖమైన సాధన ఉండాలి. ఆచరంచి మరింత ముందుకు వెళ్లగలిగే ఓర్పు సహనం ఉండాలి. మొత్తం మీద శుద్ధమైన అంతఃకరణం ఉంటే ఈ పాత్రము-అపాత్రము విచక్షణ చేసే శక్తి వస్తుంది. మన పురాణ ఇతిహాసాలు, యోగుల చరిత్రలు, వారి రచనలు కూడా చాల ఉపయోగపడతాయి. ఎందుకంటే అవి, కాలగమనం యొక్క పరీక్షలను తట్టుకొని ఎప్పటికీ సముచితంగా ఉండేలా రూపొందించబడినవి. ధర్మాధర్మ విచక్షణ నుండి పాత్రాపాత్ర విచక్షణ కలుగుతుంది. అప్పుడు అయోగ్యములైన వాటిని వీలైనంత త్వరగ మనకు దూరం చేసుకునే శక్తి కలుగుతుంది. యోగ్యములైన వాటిమీదే ధ్యాస ఉండి యత్నం సఫలమవుతుంది. కర్మ సాఫల్యం పొందుంతుంది. చేసే కర్మలు సఫలమైతే పాప పుణ్య సంచయం పటాపంచలై అకర్మ వైపు మనలను తీసుకువెళుతుంది.

ఇదం శరీరం ఖలు ధర్మ సాధనం. ఎంతో దుర్లభమైన మానవ శరీరాన్ని ఇతరులకు సాయపడేలా ఉపయోగించితేనే మానవ జన్మ సార్థకము. 

10, మార్చి 2016, గురువారం

బ్యాడ్మింటన్ ద్రోణాచార్యుడు - తెలుగుతేజం పుల్లెల గోపీచంద్


ప్రశాంతమైన వదనం, చక్కని చిరునవ్వు, కొండంత వినమ్రత, చక్కని భాషణ, అపారమైన క్రీడా కీర్తి - కలబోస్తే? పుల్లెల గోపీచంద్. తెలుగుజాతికి కీర్తి పతాకలు తెచ్చిన క్రీడాకారుడు, బ్యాడ్మింటన్‌లో ద్రోణాచార్యుడు ఈ ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ. నలభై రెండేళ్ల వయసుకే పద్మ భూషణ్, పద్మశ్రీ, ద్రోణాచార్య, అర్జున మరియు రాజీవ్ ఖేల్ రత్న అవార్డులు పొందాడు. దేశంలో క్రీడలలో అత్యున్నత శిఖరాలను చూశాడు గోపీచంద్. ఆయన పేరు చెప్పగానే హైదరబాద్‌లోని అకాడెమీ, అక్కడ తీర్చిదిద్దబడిన సైనా నెహ్వాల్ వంటి అగ్రశ్రేణి క్రీడాకారులు గుర్తుకు వస్తారు. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి?

చదువుకునే రోజుల్లోనే బ్యాడ్మింటన్‌లో ప్రావీణ్యం సాధించిన గోపీచంద్ భారత సంయుక్త యూనివర్శిటీస్ జట్టుకు నేతృత్వం వహించాడు. మొదట ఎస్ ఎం ఆరిఫ్ వద్ద, తరువాత ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఆల్ ఇంగ్లాండ్ టోర్నమెంట్ గెలిచిన ప్రకాష్ పడుకోనే వద్ద, తరువాత ప్రసాద్ గంగులీ వద్ద శిక్షణ పొందాడు. 1996లో తొలి జాతీయ చాంపియన్‌షిప్ గెలిచాడు. ఐదేళ్లపాటు వరుసగా ఈ టోర్నమెంట్ గెలిచాడు. ఏళ్లపాటు భారతదేశ బ్యాడ్మింటన్ కీర్తిని మరింత పెంచాడు. గోపీచంద్ క్రీడా జీవితంలో చారిత్రాత్మక ఘట్టం 2001లో వచ్చింది. బ్యాడ్మింటన్ వింబుల్డన్‌గా భావించబడే ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలుచుకున్నాడు. 1980లో ప్రకాష్ పడుకోనే గెలిచిన తరువాత ఈ టోర్నమెంట్ గెలిచిన ఏకైక భారతీయుడు గోపీచంద్. తన బలహీనతలను కోచ్ గంగులీ ప్రసాద్ సాయంతో గమనించుకొని వేగాన్ని పెంచుకొని, శరీర దారుఢ్యాన్ని నిర్మించుకొని ఆ ఛాంపియన్‌షిప్ గెలిచాడు. బెంగుళూరులో ప్రకాష్ పడుకోనే అకాడెమీలో ఆయన వద్ద కోచింగ్ తన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా గోపీచంద్ చెబుతారు. ఆయన వద్ద గెలవగలం అన్న మనోస్థైర్యాన్ని నేర్చుకున్నాను అని గోపీచంద్ అంటారు.

క్రీడాకారుడిగా గోపీచంద్ సాధించిన విజయాలు ఒక ఎత్తైతే కోచ్‌గా ఆయన విజయాలు దానికి పదిరెట్లు. క్రీడాకారులను ఆడటం కోసం కాకుండా గెలవటం కోసం ఆడేలా శిక్షణ ఇవ్వటం, దేహ మరియు మానసిక దారుఢ్యాన్ని పెంచుకొని విజయాలు సాధించేలా సిద్ధం చేయటం గోపీచంద్ ప్రత్యేకత. ఆటగాళ్ల వ్యక్తిత్వానికి సరిపడా కోచింగ్ ఇచ్చి, ఆట ఆడే సమయంలో ఎక్కువ సేపు ఆడే సామర్థ్యాన్ని పెంచటం ఆయన గొప్పతనం. ముఖ్యమైన పోటీలకు దాదాపు ఏడాది ముందునుంచే శిక్షణ మొదలు పెట్టటం వంటి ప్రణాళికల వలన భారత క్రీడాకారులు అంతర్జాతీయ పోటీలలో నిలబడటమే కాదు ఒకటి తరువాత మరొకటి గెలిచేలా చేశాడు.

భారతదేశ బ్యాడ్మింటన్ చరిత్రలో గోపీచంద్ స్థాపించిన అకాడెమీ ఒక ముఖ్యమైన పేజీ. అప్పటివరకు బ్యాడ్మింటన్ అంటే చైనా ఆటగాళ్ల ఏకచ్ఛత్రాధిపత్యంగా ఉండేది. కానీ, గోపీచంద్ అకాడెమీ మొదలుపెట్టిన తరువాత ఈ దుర్భేద్యమైన చైనా ఆటగాళ్ల కోటను బద్దలు కొట్టగలిగారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి ఆటగాళ్లు అగ్రశ్రేణి ఆటగాళ్లుగా ప్రపంచస్థాయిలో నిలబడగలిగారు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపటం గోపీచంద్ కోచింగ్ ముద్ర. ఒత్తిడిలో ఆడుతున్నప్పుడు ఒక స్థాయిని దాటి గెలిచే శక్తిని ఆటగాళ్లలో తీసుకురాగలిగిన కోచ్ గోపీచంద్. టోర్నీలు ఒకటి తరువాత ఒకటి చిన్నవయసులోనే గెలిచేలా ఆటగాళ్లను రూపకల్పన చేశాడు గోపీచంద్. తన అనుభవంతో, ఆటపై గల పట్టుతో ఆటగాళ్లకు మార్గదర్శిగా నిలిచాడు. సైనా నెహ్వాల్ ప్రపంచంలో మొదటి ర్యాంకుకు వెళ్లగలిగిందంటే దానిలో గోపీచంద్ పాత్ర ఎంతో ఉంది.

ఐదారుగురు అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను తయారు చేయటం వలన భారతదేశంలో మూడవస్థాయి ఆటగా (క్రికెట్,  టెన్నిస్ తరువాత) ఉన్న బ్యాడ్మింటన్‌ను వేలాది మంది పిల్లలు నేర్చుకునేలా స్ఫూర్తిని నింపాడు. ఈరోజు బ్యాడ్మింటన్‌లో ప్రీమియర్ లీగ్ మంచి ఆదరణతో నడుస్తోంది అంటే దానికి ఆద్యుడు గోపీచంద్ అనే చెప్పుకోవచ్చు. ఆటగాళ్లు ఓటమి పాలై నిరాశలో ఉన్నప్పుడు వారిని ఉత్సాహ పరచి విజయ పథంలో నడిపించిన ఆచార్యుడు గోపీచంద్. 2012లో సైనా నెహ్వాల్ లండన్ ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకోవటంలో గోపీచంద్ పాత్ర మరువలేనిది. ఆమె సూపర్ సిరీస్ విజాయలకు కూడా రథసారథి గోపీచందే. సైనా ఫోర్‌హ్యాండ్, కోర్టులో నెట్ వద్ద ఆటలో నైపుణ్యతను అభివృద్ధి చేసి ఆమెను నంబర్ వన్ క్రీడాకారిణిగా గోపీచంద్ రూపొందించాడు. శరీర దారుఢ్యాన్ని, మానసికంగా గెలవాలి అన్న తపనను ఆమెలో నిరంతరం ఉండేలా చేశాడు గోపీచంద్.

ఈరోజు భారతదేశానికి సైనా నెహ్వాల్, పీవీ సింధు, పారుపల్లి కాశ్యప్, శ్రీకాంత్ కిడాంబి, అరుంధతి పంతవనె, ప్రణయ్ కుమార్, గురుసాయి దత్, అరుణ్ విష్ణు, రుత్విక శివాని వంటి ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఉన్నారంటే గోపీచంద్ అకాడెమీలో ఆయన వద్ద పొందిన అద్భుతమైన శిక్షణ వలన అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. అందుకే ఆయనకు చిన్న వయసులోనే అన్ని అవార్డులు వచ్చాయి. గోపీచంద్ వంటి మంచి వ్యక్తి భారతదేశ క్రీడారంగంలో ఉండటం ఈ దేశం అదృష్టం. ఈ దేశంలో బ్యాడ్మింటన్ అంటే గోపీచంద్ పేరు రాకుండా ఉండదు. అది ఆయన ఈ ఆటపై చూపిన ప్రభావం, ఆయన మన ఆటగాళ్లలో తెచ్చిన అనూహ్యమైన మార్పు, వారికి తెచ్చిపెట్టిన గుర్తింపు. తెలుగుజాతి ముద్దుబిడ్డ గోపీచంద్ గారు వందలాదిమంది ప్రపంచస్థాయి ఆటగాళ్లను సిద్ధం చేయాలని అభిలషిద్దాం. 

9, మార్చి 2016, బుధవారం

సీతారామ వైభవం-4: ఇక్ష్వాకు-నిమి వంశజుల వివరాలు



సాధారణంగా పెళ్లి అనుకోగానే కుటుంబాల వివరాలు తెలుసుకుంటాము. ఇది మనకు సనాతన ధర్మం నుండి వచ్చిందే. శివధనుర్భంగం చేసిన తరువాత జనకుడు తన మంత్రులను పంపించి దశరథ మహారాజును మిథిలకు ఆహ్వానిస్తాడు. దశరథుడు సంతోషించి వశిష్ఠాదులతో మిథిల చేరుకుంటాడు. జనకుడితో తన వంశవృత్తాంతాన్ని వశిష్ఠుల వారు తెలుపుతారు అని అంటాడు. వశిష్ఠుడు ఇలా వివరంగా ఇక్ష్వాకు వంశ వివరాలు తెలుపుతాడు:

"ఓ జనక మహారాజా! అవ్యక్తమైన పరబ్రహ్మమునుండి చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. ఆయనకు మరీచి, మరీచికి కాశ్యపుడు, కాశ్యపునికి సూర్యుడు జన్మించాడు. సూర్యుని కుమారుడు వైవస్వత మనువు. ఇతడు మొదటి ప్రజాపతి. ఇతని కుమారుడు ఇక్ష్వాకువు. ఈయన అయోధ్యకు మొదటి ప్రభువు. కుక్షి అనేవాడు ఇక్ష్వాకు పుత్రుడు. అతని కుమారుడు వికుక్షి. అతని కుమారుడు బాణుడు. మహాపరాక్రమశాలి అనరణ్యుడు బాణుని కుమారుడు. అతని కొడుకు పృథువు. పృథువు కొడుకు త్రిశంకువు. అతని కుమారుడు దుందుమారుడు. అతని కుమారుడు యువనాశ్వుడు. అతని కుమారుడు మాంధాత. అతని కుమారుడు సుసంధి. సుసంధి కుమారులు ధ్రువసంధి, ప్రసేనజిత్తు. ధ్రువసంధి కుమారుడు భరతుడు. అసితుడు భరతుని కుమారుడు. అసితుని కుమారుడు సగరుడు. సగరుని కుమారుడు అసమంజుడు. అతని కుమారుడు అంశుమంతుడు. ఆయన కుమారుడు దిలీపుడు. దిలీపుని కుమారుడు భగీరథుడు. ఆయన కుమారుడు కకుత్‌స్థుడు. అతని కుమారుడు రఘుమహారాజు. అతని కుమారుడు ప్రవృద్ధుడు. అతని కుమారుడు శంఖణుడు. అతని కుమారుడు సుదర్శనుడు. అతని పుత్రుడు అగ్నివర్ణుడు. అతని కుమారుడు శీఘ్రగుడు. అతని కుమారుడు మరువు. అతని కుమారుడు ప్రశుక్రుడు. ఆయన పుత్రుడు అంబరీషుడు. ఆయన కుమారుడు నహుషుడు. నహుషుని కొడుకు యయాతి. అతని కుమారుడు నాభాగుడు. ఆయన తనయుడు అజుడు. అజుని కుమారుడే దశరథుడు. ఇక్ష్వాకు వంశము మొదటినుండీ అతి పవిత్రమైనది. ఆ వంశములో పుట్టిన రాజులందరూ మహాధార్మికులు, వీరులు,సత్యసంధులు. ఓ రాజా! ఆ మహావంశసంజాతులైన రామలక్ష్మణులకు మీ కుమార్తెలను ఇచ్చి వివాహము చేయుట ఎంతో యుక్తము. వంశవైభవము వలన, సద్గుణసౌశీల్యముల వలన, ఈడు-జోడు బట్టి కూడా ఈ రాజకుమారులు మీ కుమార్తెలు వివాహమాడుటకు తగిన వారు" అని చెబుతాడు.

అప్పుడు జనకుడు మంగళ వచనాలు పలికి వశిష్ఠునికి ఇలా వివరాలు చెబుతాడు. "మహర్షీ మా వంశం కూడా చాలా గొప్పది. కన్యాదాత వివాహ సమయంలో వంశవృత్తాంతాన్ని పూర్తిగా వివరించటం సమంజసం. మా వంశానికి మూల పురుషుడు నిమి మహారాజు. ఆయన ముల్లోకాలలో ప్రసిద్ధి చెందిన వాడు. ఎంతో ధర్మాత్ముడు. అతని కుమారుడు మిథి. అతడే మిథిలా నగర నిర్మాత. ఆయన కుమారుడు ఉదావసుడు. అతని కుమారుడు నందివర్ధనుడు. అతని సుతుడు సుకేతుడు. అతని కుమారుడు దేవరాతుడు. ఆయన పుత్రుడు బృహద్రథుడు. ఆయన కుమారుడు మహావీరుడు. అతని కుమారుడు సుధృతి. అతని తనయుడు దృష్టకేతువు. అతని తనయుడు హర్యశ్వుడు. వీరందరూ ధర్మపరాయణులు. హర్యశ్వుని కుమారుడు మరువు.  అతని పుత్రుడు ప్రతింధకుడు. అతని సుతుడు కీర్తిరథ మహారాజు. అతని తనయుడు దేవమీఢుడు. ఆయన కొడుకు విబుధుడు.  ఆతని తనయుడు మహీధ్రకుడు. కీర్తిరాతుడు అతని కుమారుడు. అతని పుత్రుడు మహారోముడు. అతని తనయుడు స్వర్ణరోముడు. అతని పుత్రుడు హ్రస్వరోముడు. వీరందరూ రాజర్షులే. హ్రస్వరోముని కుమారులలో పెద్దవాడిని నేను. నా తమ్ముడు కుశధ్వజుడు మహావీరుడు. మా తండ్రిగారు జ్యేష్ఠుడనైన నన్ను రాజుగా చేశాడు. కుశధ్వజుడు నిర్మల హృదయుడు, దేవతుల్యుడు. ఓ మునీశ్వరా!  చాలా సంతోషముగా నేను నా కుమార్తెలలో సీతను రామునికి, ఊర్మిళను లక్ష్మణునికిచ్చి వివాహం చేసెదను. ఓ దశరథ మహారాజా! నేను ఈ విషయం మూడు మార్లు చెబుతున్నాను. ఇందులో సందేహము లేదు. రామలక్ష్మణులచే స్నాతకము చేయించుము. నీకు శుభము కలుగు గాక. వివాహానికి సంబంధించిన నాందీవిధులను నిర్వహింపుము. ఉత్తర ఫల్గుణీ నక్షత్రమున వివాహ కార్యక్రమమును జరిపింపుము. రామలక్ష్మణులకు సుఖశాంతులు కలగటానికి దానాలు ఇప్పింపుము" అని పలుకుతాడు.

అపుడు విశ్వామిత్రుడు జనకునితో "రాజా! నీ తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలు మాండవి శ్రుతకీర్తి  అనుపమానమైన సౌందర్యవతులు. మాండవిని భరతునకిచ్చి, శ్రుతకీర్తిని శతృఘ్నునికిచ్చి వివాహము చేయుట యుక్తము" అని పలుకుతాడు. దశరథుడు, జనకుడు అందుకు వెంటనే సంతోషించి అంగీకరిస్తారు.

వివరణ:

వివాహానికి కేవలం అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడటంతో సరిపోదు, వివరాలు తెలుసుకొని ఆ వంశస్థుల వివరాలు కూడా ముఖ్యం. ఎందుకంటే, ఒక సంసారం హాయిగా సాగటానికి కుటుంబాలలో పాటించే పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు తెలుసుకొని ఆ జంట అన్యోన్యంగా ఉండటానికి దోహదపడతాయి. అలాగే ఆయా వంశాలలో గొప్పవారి వివరాలు తెలుసుకోవటం ద్వారా వియ్యాలవారిని సముచితంగా గౌరవించే అవకాశముంటుంది.

ఇక్కడ ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వారందరూ మహావీరులుగా, ధర్మపరాయణులుగా చెప్పబడ్డారు. అలాగే, జనకుని పూర్వజులందరూ రాజర్షులే. రాజ్యపాలనతో పాటు ధర్మసూక్ష్మాలు పాటిస్తూ, యజ్ఞ యాగాది క్రతువులు చేసి దివ్యశక్తులు పొందిన వారు. రెండు పవిత్రమైన వంశాల కలయిక సీతారాముల వివాహం. దానికి నాంది విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగరక్షణకై తీసుకువెళ్లటం. మన పురాణాలలోని గొప్పతనం ఇదే. రాజులకు ఋషులు, మహర్షులు, యోగులు ఎప్పటికప్పుడు ధర్మాన్ని బోధించి లోకకళ్యాణార్థం సముచిత కార్యాలు చేయించే వారు. దీనివలన రాజులకు యశస్సు, రాజ్యానికి సుఖశాంతులు, ఋషులకు సత్కర్మ ఫలం దక్కేది. వశిష్ఠాదులు ఇక్ష్వాకు వంశాన్ని ఇలా కంటికి రెప్పలా కాపాడగా శతానందుడు మొదలైన వారు జనకుని వంశాన్ని ఉద్ధరించారు. వివాహమనేది ఒక పవిత్రమైన కార్యం. దాని వలన రెండు వైపులా  తరాలు ఉద్ధరించబడతాయి. లోకోద్ధరణకు బీజం పడుతుంది. అందుకే మన వివాహ వ్యవస్థ అత్యంత శక్తివంతమైనది, సనాతనమైనా పుష్టికరమైనది. 

అలుపులేని యోధురాలు ఇరోం షర్మిల


ఇరోం షర్మిల - పేరు వినగానే ఆమె ముక్కుకున్న పైపు, విరబోసుకున్న జుట్టు, ముఖంలో పోరాట పటిమ గుర్తుకొస్తాయి. మణిపూర్ రాష్ట్రంలో ఆర్ముడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ (ఏఎఫెస్పీఏ చట్టం 1958) రద్దు చేయాలని 780 వారాలకు, అనగా 15 ఏళ్లకు పైగా ఆహారాన్ని విసర్జించి శాంతియుగ నిరాహార దీక్ష చేస్తున్న అసమాన మహిళ. ఈ చట్టం శాంత్రిభద్రతలు అదుపులో లేని సరిహద్దు రాష్ట్రాల్లో ఆర్మీకి ప్రత్యేక అధికారాలు ఇవ్వటానికి భారత ప్రభుత్వం 1958లో రూపొందించింది. ఈ చట్టం ప్రకారం ఆయా రాష్ట్రాలలో ఆర్మీ వాళ్లు ఎటువంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి నిర్బంధించవచ్చు, పెద్దగా పర్మిషన్లు లేకుండా అల్లర్లు సృష్టించే వారిని కాల్చి వేయవచ్చు.

2000 సంవత్సరం నవంబర్ 2వ తేదీన మణిపూర్ రాజధాని ఇంఫాల్ సమీపంలో మలోం అనే ఊరు దగ్గర 10 మంది పౌరులు కాల్చబడ్డారు. దాని వెనుక భారత పారామిలటరీలో ఒక భాగమైన అస్సాం రైఫిల్స్ హస్తముందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో కలతకు గురై ఇరోం ఆ సంవత్సరం నవంబర్ 5 నుండి ఆమరణ నిరాహారదీక్ష మొదలు పెట్టింది. ఏఎఫెస్పీఏ చట్టాన్ని మణిపూర్‌లో ఉపసంహరించాలని, అంత వరకు ఆహారం, నీరు ముట్టనని, తల దువ్వుకోనని ప్రతిజ్ఞ చేసింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు షర్మిల తన మాటకు కట్టుబడే ఉంది. ఆమెకు శాశ్వతంగా ముక్కు-గొంతు ద్వార పొట్టకు ఒకపైపు వేసి ఆరోగ్యం క్షీణించనప్పుడల్లా ప్రభుత్వం దాని ద్వారా శరీరానికి కావలసిన శక్తిని అందజేస్తోంది.

వివాదాస్పద చట్టం ఏఎఫెస్పీఏను వెనక్కు తీసుకోవటానికి ఇరోం షర్మిల 2006లో ఢిల్లీ జంతర్-మంతర్‌లో దీక్ష చేసింది. ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, హోం మంత్రికి లేఖలు రాసింది. 15 ఏళ్లుగా తన పోరాటం సాగిస్తూనే ఉంది. ఎన్నో సార్లు అరెస్టు అయి విడుదలైంది. ఆమెను గృహనిర్బంధంలో కూడా ఉంచారు. కొద్దికాలం క్రితం షర్మిలను కాపాడండి అనే ఉద్యమం కూడా ఆరంభమైంది. పుణే యూనివర్సిటీ వారు ఈమె పేరిట 39 మంది మణిపూర్ యువతీ యువకులకు ఉచిత డిగ్రీ కోర్సులను అందించింది. ఎన్నో విధాలుగా తన రాష్ట్రంలో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈమె పోరాడుతూనే ఉంది.

అంతర్జాతీయంగా ఇరోం షర్మిలకు మానవ హక్కుల సంఘాలనుండి ఎన్నో గుర్తింపులు అందాయి. 2007లో గ్వాంగ్‌జూ మానవ హక్కుల అవార్డు, పీపుల్స్ విజిలన్స్ కమిటీ ఆన్ హ్యూమన్ రైట్స్ అవార్డు, 2009లో మయిలమ్మ అవార్డు, 2010లో ఆసియా మానవ హక్కుల సంఘం నుండి జీవిత సాఫల్య పురస్కారం, రవీంద్రనాథ్ శాంతి బహుమతి, సర్వ గుణ సంపన్న అవార్డులు లభించాయి. 2013లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆమెను ప్రిజనర్ ఆఫ్ కాన్షియెన్స్ (మనస్సాక్షి ఖైదీ)గా గుర్తించింది.

ఏఎఫెస్పీఏను మణిపూర్‌నుండి ఉపసంహరించేంత వరకు తన తల్లిని కూడా కలువనని అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్న ఇరోం షర్మిల గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జోహారులు. స్త్రీ అబల కాదు, స్త్రీకి అనంతమైన శక్తి ఉంది ఉన్నదానికి షర్మిల నిలువుటద్దం.

ఈమె లక్ష్యం భారత సైన్యంపై కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల చట్టం పేరుతో దౌర్జన్యం కూడదు అన్నది ఆమె పోరాటం వెనుక సారాంశం. మణిపూర్‌లో  గత ఐదేళ్లలో ఐదు వేలమంది హింసలో మరణించారు. ఇందులో ఎంతో మంది అమాయకులు. చట్టవ్యతిరేక శక్తులను చర్చలకు పిలిచి శాంతియుతంగా త్వరగా ఈ సమస్యను భారత మరియు మణిపూర్ ప్రభుత్వాలు పరిష్కరించి ఇరోం షర్మిలకు విముక్తి కలిగిస్తారని ఆశిద్దాం. 

6, మార్చి 2016, ఆదివారం

తిల్లానాలు - బాలమురళీరవం - నా దిర్ దిర్ ధీం తనన నోం


కర్ణాటక సంగీత సాంప్రదాయంలో రకరకాల అంశాలు ఉన్నాయి. వర్ణం, గీతం, కృతి, రాగమాలిక, పదం, జావళి,తిల్లాన..ఇలా ఎన్నో. ఒక్కో రకానికి ఒక్కో ప్రత్యేకత ఉంది, సముచిత స్థానముంది. వీటిల్లో తిల్లానాకు ప్రత్యేకమైన  లక్షణాలు ఉన్నాయి. తిల్లానాలు సంగీత కచేరీలలోనే కాదు, నాట్య ప్రదర్శనలో కూడా అద్భుతంగా ప్రదర్శిస్తారు. మిగిలిన ప్రక్రియలతో పోలిస్తే తిల్లాన చిన్నది. ఎక్కువ సాహిత్యం ఉండదు, శ్రావ్యంగా లయ బద్ధంగా తి ల న అనే అక్షరాల కలయికతో ఉంటుంది. ఎక్కువ శాతం జతులతో నిండి ఉండే తిల్లాన వినటానికి సొంపుగా ఉంటుంది, అందుకే నాట్య ప్రదర్శనకు కూడా అనువైన అంశం.

తిల్లానలకు మూలం మధ్యయుగానిక చెందిన కైవార ప్రబంధాలు. ఈ ప్రబంధాలలో జతులు కార్యక్రమాల చివరలో ఉండేవి. ఈ ప్రబంధాల ప్రేరణతోనే 18వ శతాబ్ది కాలంలో తిల్లానాలు పుట్టాయి.తిల్లానాలు సంగీత కచేరీలో రాగం తానం పల్లవి అనే సమయం పట్టే అంశం తరువాత వస్తుంది. నాట్య ప్రదర్శనలలో పదాల తరువాత తిల్లాన ఉంటుంది. కథా కాలషేపాలలో కూడా తిల్లాన వేగంగా ప్రేక్షకులను రంజింపజేసేలా ఉపయోగించబడుతుంది.  తిల్లానాలో పల్లవి, అనుపల్లవులలో జతులు, చరణంలో మొదటి భాగం సాహిత్యం, రెండవ భాగం జతి ఉంటుంది. చాలా మటుకు తిల్లానాలలో పల్లవి మొదటి కాలంలో ఉంటుంది. అనుపల్లవి మొదటి, మధ్యమ కాలంలో ఉంటుంది. చరణం మధ్యమ కాలంలో ఉండి చిట్టస్వరాలు కలిగి ఉంటుంది. కృతులకు భిన్నంగా తిల్లానాలో అనుపల్లవి చరణం తరువాత వచ్చి అటు తరువాత పల్లవి వస్తుంది.

తిల్లానాల కూర్పులో సాహిత్యకారుడికి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అందుకనే అవి చాలా ప్రాచుర్యం పొందాయి. జతులు మొదటి, రెండవ కాలములతో పేర్చి కూర్చటంతో వినటానికి సొంపుగా, ఉత్సాహకరంగా ఉంటాయి. అనురూపత్వం (సిమెట్రీ) ఉండటంతో తిల్లానాల అనుపల్లవిలో ఒక మకుటం కూడా పొందుపరస్తారు సాహిత్యకారులు.

తిల్లానలో ప్రత్యేకత దిర్, థక్కు, ధిక్కు, తక తఢింగు, తళాంగు, కిటక మొదలైన ప్రబంధ శబ్దాలతో ఉండటం. వీటితో సంగీత కచేరీలు రక్తి కడతాయి.

తిల్లానలలో రకాలు

1. నాట్య ప్రదర్శనల కోసం రాసినవి - లయ  ప్రాధాన్యమైన జతులతో నిండి ఉంటాయి. మొట్ట మొదటి తిల్లానాలు ఈ కోవకు చెందినవే. మేలత్తూర్ వీరభద్రయ్య గారు, తంజావూర్ చతుష్టయంగా పేరొందిన  పొన్నయ్య, చిన్నయ్య, శేషయ్యర్, జీఎన్ బాలసుబ్రహ్మణ్యం గార్లు ఈ తిల్లానాలను రచించారు
2. ఉపపాదన కోసం రాసినవి - అనగా బోధనకు ఉపయోగించేవి. ఇవి అంగ, క్రియ, అక్షర కాలం మొదలైన పరిజ్ఞానం అందించటానికి రాసినవి. మహా వైద్యనాథ అయ్యరు, రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ మొదలైనవారు రాశారు.
3. సంగీత కచేరీల కోసం  రాసినవి - వీటిలో రాగ మాధుర్యానికి ప్రాధాన్యత ఉంటుంది. స్వర సంగతులను కూడ ప్రతిపాదిస్తారు. మైసూర్ వాసుదేవాచార్య, ముత్తయ్య భాగవతార్, బాలమురళీకృష్ణ, లాల్గూడి జయరామన్ మొదలైన వారు ఈ  రకమైన తిల్లానాలు రచించారు

తిల్లానాలకు హిందూస్థానీ సంగీతంలో కూడా చోటు ఉంది. వీటిని తరానాలు అంటారు. ఇవి ఒధని, తధని, తధీం మొదలైన పదాలతో నిండి ఉంటాయి. ఈ పదాలు పర్షియన్ మరియు అరబిక్ భాషల నుండి వచ్చినవి. 13వ శతాబ్దంలో అమీర్ ఖుస్రో ఈ ప్రయోగం మొదలు పెట్టాడు. సూఫీ సంగీతంలో, హిందూస్థానీ సంగీతంలో తరానాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది.

కర్ణాటక సంగీతంలోని తిల్లానాలలో డాక్టర్ బాలమురళీకృష్ణ గారి రచనలకు ప్రత్యేక స్థానం ఉంది. అవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఎందరో కళాకారులు ఆయన తిల్లానలను సంగీత నృత్య కచేరీలలో ప్రదర్శిస్తారు. ఆయన రాగమాలికగా, బృందావని, కుంతలవరాళి, కదనకుతూహలం, ద్విజావంతి రాగాలలో కూర్చిన తిల్లానాలు ఈనాడు ప్రమాణాలు. ఆ తిల్లానాలలో  కదనకుతూహలం రాగంలో కూర్చిన తిల్లానా వివరాలు పరిశీలిద్దాం.

సాహిత్యం:

నా దిర్ దిర్ ధీం తనన నోం తదరదాని నా దిర్ దిర్ తోం నా దిర్ దిర్ తోం ధిత్తిల్లిల్లాన

తదర దాని దిరన నిద ఉదర దాని దిరన
తకిటఝం మ ద ని తకిట ఝం గ ప స
తతకిట తోం స ని ద ప మ గ రి స

నా దిర్ దిర్ ధీం తనన నోం తదరదాని నా దిర్ దిర్ తోం నా దిర్ దిర్ తోం ధిత్తిల్లిల్లాన

తరికిట తోం తరికిట తోం త ఝణుత
తత్తరికిట తక తక ధిత్తళాంగు తక తరి కిటతక తక ధిత్తళాంగు తోం దిర్ దిర్ తోం దిర్ తోం
తిల్లాన ధిత్తిల్లాన ధిత్తిల్లాన
స రి మ గ రి స రి మ మ ద ద ని గ గ ప స స ని ద ప మ గ రి

వదనమదే విరిసెనే అధరమదే మురిసేనే
మధుర గానంబదే నా మురళీమనోహరుడదే
మదన కదన కుతూహలుడు రమ్మనె బిరాన బిరాన బిరాన రావే

ఈ తిల్లానాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

1. ఉత్సాహంగా రాగానికి సముచితమైన జతులు, సాహిత్యం
2. అద్భుతమైన జతులు మరియు స్వర సంగతులు
3. రాగం పేరు, రచయిత పేరు రెండూ మకుటంగా రావటం
4. ఓలలాడించే గానంతో అద్భుతమైన కాలగతిలో కూర్చబడటం
5. గాయకునితో పాటు మృదంగం, వయోలిన్, ఘటం మొదలైన వాద్య కళాకారులకు కూడా ప్రతిభను కనబరచే అవకాశం ఉండటం

శ్రీకృష్ణునితో అనుబంధం కల ఎటువంటి రచనైనా ఆయన మోహన మురళీరవం లాగా మధురంగానే ఉంటుంది. అందుకనే, ఈ తిల్లానా కూడా మధురంగా, లయబద్ధంగా, కదనోత్సాహం కలిగించేలా ఉంటుంది. బాలమురళీకృష్ణ గారి గాత్ర సంగీత ప్రతిభ గురించి మాట్లాడనక్కరలేదు, కానీ వారి రచనలను చూస్తే ఆయనలోని బహుముఖ ప్రజ్ఞ అర్థమవుతుంది. తిల్లానా రచించాలంటే మాటలు కాదు. అందులో జనరంజకం చేయాలాంటే అది గాయకుల నోట నిరంతరం పలికేలా ఉండాలి. ఈ తిల్లాన ఆ కోవకు చెందినదే. వినగానే ఆనందం కలుగుతుంది. మళ్లీ వినాలి, పాడాలి అనిపిస్తుంది. అందుకే భాషా భేదాలు లేకుండా అన్ని ప్రాంతాలకు చెందిన సంగీత కళాకారులు ఈ తిల్లానాను తమ కచేరీలలో అంతర్భాగం చేసుకున్నారు.

సంగీతం దైవంతో ముడి పడి ఉన్నదానికి మరో నిదర్శనం తిల్లానాలు. ఎందుకంటే - సందేశంతో పాటు మనలను ఆనందం ఓలలాడించ గలిగే శక్తి దానిలో ఉంది. శబ్దం అమ్మ రూపమైతే లయ పరమశివుని ప్రతి రూపం. ఆ శబ్ద లయ విన్యాసమే తిల్లాన. బాలమురళీకృష్ణ గారి ఈ తిల్లానా విని ఆస్వాదించండి.




4, మార్చి 2016, శుక్రవారం

స్పూర్తిదాయక గీతాలు - మౌనంగానే ఎదగమని, కలకానిది విలువైనది


అపజయాలు, ఒత్తిళ్లు, కష్టాలు, పరాభవాలు, కుంగుబాట్లు, ఒంటరితనాలు, అన్యాయం జరిగిందన్న ఆవేశం, ఆక్రోశం...ఇలా మనిషికి నిజజీవితంలో ఎన్నో మనోవికారాలు. వాటి వల్ల జీవిత రథం దారి తప్పే అవకాశం ఉంది. ఇవన్నీ సహజమే, చాలా సార్లు ఎలా ఈ జీవితం అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడే కావాలి ప్రేరణ. ఒక్కసారి ఆలోచనలు అనే చీకటి గదిలోంచి బయటకు వెళ్లి చూస్తే ఈ కష్టాలు, బాధలు పడేది మనం ఒక్కళ్లమే కాదు అని అర్థమవుతుంది. సమాజంలో మనకన్నా కష్టాలలో ఉండి కూడా స్ఫూర్తితో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే వారిని చూస్తే ప్రేరణ కలుగుతుంది, ముందడుగు వేయాలన్న సంకల్పం చిగురిస్తుంది. ఎప్పుడైతే ఇవి దాటలేనివి, ఇవ నాకొక్కరికే వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అన్న ఆలోచనలు వస్తాయో ఆ క్షణమే సమాజం వైపు చూడాలి, అంతర్ముఖులం కావాలి.

ఈ మానసిక స్ఫూర్తికి ఆది మనలోనే. ఏదో ఒక దానిపై నమ్మకం ఉండాలి. అది దైవం కావచ్చు, గురువు కావచ్చు, ఇంకో వ్యక్తి కావచ్చు, లేదా స్వయం శక్తి కావచ్చు. చాలా సార్లు కష్టాల కడలి అనిపిస్తుంది. ఆ సమయంలో మనకు సనాతన ధర్మం అందించిన వాఙ్మయం తప్పకుండా తోడ్పడతాయి. అనాదిగా మానవ జన్మ ఎత్తిన ప్రతి వానికీ కష్టాలు తప్పలేదు. ఇది అవతార పురుషులైనా, యోగులైనా, మహాత్ములైనా...ఎవ్వరైనా సరే. వారు నమ్ముకున్న ధర్మం వారికి ఎలా ఈ సాగరాన్ని దాటడానికి సహాయ పడింది అన్నది మనకు రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు, భగవద్గీత స్పష్టంగా తెలిపాయి. రాముడి జీవితంలో ఎన్ని కష్టాలు రాలేదు? పాండవుల జీవితంలో ఎన్ని బాధలు? ధర్మమే వారికి బాసటగా నిలిచింది.

కలియుగ లక్షణమే అశాంతి, కల్లోలం, మోసం. కాబట్టి మానవునికి కష్టాలు దాటాలంటే మరింత స్ఫూర్తి, వ్యక్తిత్వ వికాసం, ధర్మము మరియు దైవంపై నమ్మకం కావాలి. స్ఫూర్తి మనలోనే కలగాలంటే కొంత కష్టమే. అందుకే ఓ గ్రంథమో, ఓ మహనీయుని చరిత్రో, ఓ చిత్రమో, ఓ కథో, ఓ గీతమో, లేకుంటే మరో వ్యక్తి సాంగత్యమో...ఇలా ఏదో ఒకటి స్ఫూర్తినిస్తుంది. బాధల్లో ఉన్న మనిషికి సంగీతం సాంత్వనను ఎందుకిస్తుందో తెలుసా? అది హృదయాన్ని తాకే కళ కాబట్టి, దైవం అందులో నివాసముంటుంది కాబట్టి. సంగీతానికి అక్షరం ప్రాణవాయువు. ఆ అక్షరం మనిషి మనోభావాలకు ప్రతిరూపం. అందుకే మన మనుసులోని భావాలను కవి అక్షరాలతో స్వరయుక్తంగా తాకితే వెంటనే స్పందన ఉంటుంది. అందుకే, మనోవికారాలతో మనం క్రుంగిపోతున్నప్పుడు భావయుక్తమైన గీతాలు మనలను ఉత్తేజపరచి వికారాన్ని కాస్త తగ్గిస్తాయి. అటువంటి రెండు గీతాలు మీకోసం.

1. మొదటిది నా ఆటోగ్రాఫ్ చిత్రంలో చిత్ర పాడిన మౌనంగానే ఎదగమని అన్న గీతం. ప్రేమలో దారుణంగా విఫలమైన ఒక యువకుడు దారుణంగా క్రుంగిపోతాడు. జీవించటం వ్యర్థం అన్న దిగులుతో హైదరబాదు వచ్చి తిండికి కూడా అవస్థ పడుతూ ఉంటాడు. ఆ సందర్భంలో అంధులచే ఒక సంగీత విభావరి ఏర్పాటు చేసి వారికి స్ఫూర్తిదాయకురాలైన ఒక యువతి పాడే పాట అతనికి మార్గదర్శకంవుతుంది. అతనిలో మార్పు మొదలవుతుంది. ఎటువంటి వైకల్యాలు ఉన్నా, ఆటుపోట్లు ఎదురైనా ముందుకు సాగమని ఉద్బోధిస్తుంది. మన తలరాతను మనం మార్చుకోవచ్చన్న అద్భుతమైన సత్యాన్ని తెలుపుతుంది. ఎక్కువ ఆర్భాటాలు లేకుండ ఎదగటం, ఎదిగిన కొద్దీ వినయంతో మెలగాలని చెబుతుంది. అపజయం కలిగితే క్రుంగిపోరాదని ఋతువుల సమయంలో ఆకులురాలిన చొటే కొత్త చిగురు వస్తుంది అన్న సారూప్యంతో మనలకు ధైర్యాన్నిస్తుంది. మజిలీ చేరటానికి ఎంతో దూరం అన్నదాని గురించి ఎక్కువ ఆలోచించంకుండా ఎన్నోదారులున్నాయి అని ఆలోచిస్తే మంచిందని సలహా ఇస్తుంది. యుగయుగాలుగా మనకు తెలుస్తున్న సత్యం - ఏ బాధ కూడా శాశ్వతం కాదు. తప్పకుండా తిరిగి చిరునవ్వు నవ్వే రోజు వస్తుంది. ఏ గొప్ప పని మొదలు పెట్టినా మొదట ఎన్నో అవరోధాలు వస్తాయి. కానీ, వాటికి భయపడక ముందుకు సాగాలి. విశ్వకళ్యాణానికి చేసిన సాగరమథనంలో తొలుగ గరళమే పుట్టింది, తరువాతే అమృతం. అలాగే ప్రతి మంచిపనికి ముందు విఘ్నాలుంటాయి, తరువాతే విజయం. కష్టాలు దాటితే ఆనందమనే నిధి మనం సొంతమవుతుంది. ఇది జీవిత సత్యం అని పలుకుతుంది. నుదుటి రాతలు, చేతి గీతలు అన్నీ మన ప్రయత్నంతో మార్చ వచ్చు. కావలసింది శ్రమ, ధైర్యం. అటువంటి ధీర శ్రామికుల ముందు విధి కూడా తలవంచుతుంది, దైవం వారిని అనుగ్రహిస్తుంది. ఆ విధంగా ముందుకు సాగి చరిత్రలు రాయాలి అని హితవు పలుకుతుంది.

గీతం మనలోని బలహీనతలను పక్కకు పెట్టి, శక్తులకు జీవం పోసి మనకు మంచి ప్రేరణనిస్తుంది. మానవ జన్మ అన్న తరువాత ఏదో ఒక లోపం తప్పదు. ఆ లోపాలను అధిగమించి స్వశక్తులై ముందుగు సాగించటానికి ఇలాంటి గీతాలు ఎంతో ఉపయోగపడతాయి. చంద్రబోస్ గారు ఇటువంటి గీతం ఒక మంచి సందేశాత్మక చిత్రమైన నా ఆటోగ్రాఫ్‌లో అందించటం మన అదృష్టం. కీరవాణి గారి సంగీతం కూడా సందేశానికి సముచితంగా ఉంటుంది. చిత్ర గారి గానం దానికి శాశ్వతత్వాన్ని ఆపాదించింది.

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది

అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలినచోటే కొత్త చిగురు కనిపిస్తుంది.


దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా
బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగరమథనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమొచ్చింది.
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది
తెలుసుకొంటే సత్యమిది
తలచుకుంటే సాధ్యమిది

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో
మారిపోని కథలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే వ్రాయాలి
మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి

2. రెండవ గీతం వెలుగునీడలు చిత్రంలోని శ్రీశ్రీ గారి రచన "కలకానిది విలువైనది" అనే గీతం. మనిషికి ఎన్ని రకాల కష్టాలో? చిత్రంలో నాయికకు వివాహం చేసుకున్న కొన్నాళ్లకే భర్త యాక్సిడెంటులో మరణిస్తాడు. తీరని దుఃఖంలో జీవితం దుర్భరమయమనే భావనలో నలిగిపోతున్న ఆమెకు స్నేహితుడు ఈ గీతం ద్వారా సాంత్వననిచ్చి ఆమెలో మళ్లీ జీవించాలన్న సంకల్పాన్ని కలిగిస్తాడు. డాక్టర్ వృత్తిలోకి తిరిగి ప్రవేశించేలా చేస్తాడు. భార్యా భర్తలలో ఎవరు ఇలా అకాల మరణం చెందినా ఉన్న వారికి వర్ణించలేని వ్యథే. కానీ, అది వారు కోరి తెచ్చుకున్నది కాదు. అలాగే జీవితాంతం నిరర్థకంగా ఆనందానికి దూరంగా ఉండటం కూడా సరి కాదు. జీవిత భాగస్వామి మరణించినా కుటుంబం, సమాజం, దేశం పట్లా బాధ్యతలున్నాయి. ఆయుష్షు ఉన్నంత కాలం సకారాత్మక ధోరణితో జీవించాలి, ఏదో ఒకటి సాధించాలి. అన్నది ఈ గీతం సందేశం. కలకాదు, బ్రతుకు ఎంతో విలువైనది, దానిని కన్నీళ్లతో వృథా చేయకు అని చెబుతుంది ఈ గీతం. దానికి సారూప్యంగా, గాలి వీచినప్పుడు పూల తీగ నేల కూలితే దానిని అలానే వదిలేస్తామా? మృదువుగా నిలబెట్టి నీళ్లు పోసి మళ్లీం జీవం పోయమూ? జీవితం కూడా అంతే. అకాల మరణమనే పెనుగాలి వస్తే అంతటితో జీవితాన్ని ముగించకూడదు. మళ్లీ నిలబెట్టాలి. చీకటిలోనే అలమటించటమెందుకు? కలతలకు లొంగి మానసిక స్థైర్యాన్ని కోల్పోయి కవరించటం ఎందుకు? సాహసమే జ్యోతిగా చేసుకొని ముందుకు సాగాలి అని ఎంతో అద్భుతంగా చెబుతుంది. సముద్రపు లోతుల్లో ఆణిముత్యాలు ఉన్నట్లు శోకాల సముద్రం చాటున సుఖము కూడా ఉంది. జీవితంలో ఏదీ కూడా మన దగ్గరికి రాదు. మనమే కష్టపడి సాధించుకోవాలి అని ఒక దిశను నిర్దేశిస్తుంది.

శ్రీశ్రీగారు ఎంతటి ఉదాత్తమైన గీతాన్ని అందించారో సాహిత్యం చూస్తే అర్థమవుతుంది. యోగ్యత ఉన్న కవి హృదయం నుండి వెలువడే అక్షర సత్యాలు ఇవి. ఘంటసాల మాష్టారు భావ సౌందర్యం ప్రకాశించేలా అద్భుతంగా గానం చేశారు. పెండ్యాల వారి సంగీతం , ఏఎన్నార్ సావిత్రిల నటన ఈ పాటను సంపూర్ణం చేసి అత్యుత్తమ గీతాలలో ఒకటిగా నిలిపాయి.

కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనె బలి చేయకు
కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనె బలి చేయకు

గాలి వీచి పూవుల తీగ నేల వాలి పోగ
జాలి వీడి అటులేగాని వదులవైతువా
చేర దీసి నీరు పోసి చిగురించ నీయవా

అలముకున్న చీకటిలోనె అలమటించనేల
కలతలకే లొంగి పోయి కలువరించనేల
సాహసమను జ్యోతిని చేకొని సాగిపో

అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఏది తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీర గుణం


మడిసి అన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా చెప్పండి!. శోకం, మానసిక వ్యధ, ఆందోళన, కన్నీళ్లు ఇవన్ని అందరికి ఎప్పుడోకప్పుడు వచ్చేవే. మరి అప్పుడు ఏమిటి చెయ్యటం?.  ఏమి చెయ్యొచ్చో అన్నదానికి ఈ పాటలు మంచి ఉదాహరణలు . పాజిటివ్ ఆలోచనలతో పోరాడమని వీటి సారాంశం. ఎందుకంటే అనుకూల (పాజిటివ్) ఆలోచనలు వ్యతిరేక (నెగటివ్)  ఆలోచనల కన్నా చాలా బలమైనవి. కొన్ని అనుకూల ఆలోచనలతో ఒక వ్యతిరేక ఆలోచనను పోరాడటం దీనిలో మొదటి మెట్టు. రెండోది - ఉన్న పరిస్థితిలోంచి బయటకు ఎవ్వరు లాగలేరు. అది మనం అడుగు వేస్తె తప్ప అవ్వని పని. అడుగు వెయ్యటానికి, ఆలోచనలు రావటానికి పక్కనవాళ్ళు సాయపడగలరు.

ఆశ వదలకుండా ఒక అడుగు అనుకూల ఆలోచనతో వేస్తె అక్కడ తప్పకుండా మనకున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అందుకనే మన పెద్దలు అన్నారు - సమస్య ఉంటే పది మందితో చెప్పుకోవాలిరా అని. దాని అర్థం సానుభూతి పొందటానికి కాదు - కష్టంలో ఉన్న మనిషి యొక్క మానసిక పరిస్థితి అడుగు ముందుకు వేసే ఆలోచనలను రానివ్వకపోవచ్చు. అలాంటప్పుడు నలుగురితో కలిసి, మాట్లాడితే - కొత్త ఆలోచనలు మన మనస్సులోకి వెళ్లే అవకాశం ఎక్కువ. అలాగే, నలుగురుతో మాట్లాడితే మనకున్న సమస్యకన్నా ఇంకా పెద్ద సమస్య కనిపించొచ్చు. అప్పుడు మన సమస్యను 'ఆ ఇది చాలా చిన్నది, నన్నేమి చెయ్యలేదు, పాపం వాళ్ళు ఇంకా ఎంత పెద్ద భవసాగరంలో ఉన్నారో' అని కొట్టి పారేసే అవకాశం వస్తుంది. అంటే - ఒక అనుకూల ఆలోచన మొదలయ్యినట్టే కదా? అది చాలు సమస్యను పూర్తిగా అధిగమించటానికి.

మరి కష్టాలు దాటడానికి సాధనాలు ఏమిటి? 1. ముందడుగు వేసే ధైర్యం - ఇక్కడ మనకు ఆ పరిస్థితిలో ధైర్యం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మన చుట్టూ ఉన్న వ్యవస్థను ఆశ్రయించాలి - కుటుంబం, బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, గురువులు, తోటి పనివారు, పుస్తకాలు.  కానీ మొట్టమొదటి అడుగు మనమే వెయ్యాలి. పక్కవాళ్ళు వేయించారు అని అనిపించినా అది మన మనస్సు చెప్పనిదే జరగదు. 2. పరిష్కారం ఉంది అనే నమ్మకం, భగవంతుడు ఎప్పటికీ మనల్ని ఇలానే ఉంచడు అన్న విశ్వాసం.

గీతలో కృష్ణ పరమాత్మ, శంకరాచార్యుల వారు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు....ఇలా ఎందరో మనకు కష్టమయమైన జీవితాన్ని ఎలా సాగించాలో చక్కగా బోధించారు.  ఈ రెండు గీతాలు కూడా ఆ కోవకు చెందినవే . ఈ రెండు గీతాలు అప్పుడప్పుడూ వింటూ ఉంటే జీవితంలో మనం దిగులుతో కుంగిపోకుండా, మనకు వచ్చే సమస్యలను అధిగమిస్తూ ఖచ్చితంగా ముందుకు  సాగిపోతాము. 


దేహి తవ పద భక్తిం - త్యాగరాజస్వామి కృతి

దేహి తవ పద భక్తిం! వైదేహి! పతిత పావని మే సదా! ఐహికాముష్మిక ఫల దే! కమలాసనాన్యజ వర జనని! కలశవారాశిజనితే! కనక భూషణ లసితే! కలశజ గీత ముదితే! కాకు...