ప్రశాంతమైన వదనం, చక్కని చిరునవ్వు, కొండంత వినమ్రత, చక్కని భాషణ, అపారమైన క్రీడా కీర్తి - కలబోస్తే? పుల్లెల గోపీచంద్. తెలుగుజాతికి కీర్తి పతాకలు తెచ్చిన క్రీడాకారుడు, బ్యాడ్మింటన్‌లో ద్రోణాచార్యుడు ఈ ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ. నలభై రెండేళ్ల వయసుకే పద్మ భూషణ్, పద్మశ్రీ, ద్రోణాచార్య, అర్జున మరియు రాజీవ్ ఖేల్ రత్న అవార్డులు పొందాడు. దేశంలో క్రీడలలో అత్యున్నత శిఖరాలను చూశాడు గోపీచంద్. ఆయన పేరు చెప్పగానే హైదరబాద్‌లోని అకాడెమీ, అక్కడ తీర్చిదిద్దబడిన సైనా నెహ్వాల్ వంటి అగ్రశ్రేణి క్రీడాకారులు గుర్తుకు వస్తారు. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి?
చదువుకునే రోజుల్లోనే బ్యాడ్మింటన్‌లో ప్రావీణ్యం సాధించిన గోపీచంద్ భారత సంయుక్త యూనివర్శిటీస్ జట్టుకు నేతృత్వం వహించాడు. మొదట ఎస్ ఎం ఆరిఫ్ వద్ద, తరువాత ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఆల్ ఇంగ్లాండ్ టోర్నమెంట్ గెలిచిన ప్రకాష్ పడుకోనే వద్ద, తరువాత ప్రసాద్ గంగులీ వద్ద శిక్షణ పొందాడు. 1996లో తొలి జాతీయ చాంపియన్‌షిప్ గెలిచాడు. ఐదేళ్లపాటు వరుసగా ఈ టోర్నమెంట్ గెలిచాడు. ఏళ్లపాటు భారతదేశ బ్యాడ్మింటన్ కీర్తిని మరింత పెంచాడు. గోపీచంద్ క్రీడా జీవితంలో చారిత్రాత్మక ఘట్టం 2001లో వచ్చింది. బ్యాడ్మింటన్ వింబుల్డన్‌గా భావించబడే ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలుచుకున్నాడు. 1980లో ప్రకాష్ పడుకోనే గెలిచిన తరువాత ఈ టోర్నమెంట్ గెలిచిన ఏకైక భారతీయుడు గోపీచంద్. తన బలహీనతలను కోచ్ గంగులీ ప్రసాద్ సాయంతో గమనించుకొని వేగాన్ని పెంచుకొని, శరీర దారుఢ్యాన్ని నిర్మించుకొని ఆ ఛాంపియన్‌షిప్ గెలిచాడు. బెంగుళూరులో ప్రకాష్ పడుకోనే అకాడెమీలో ఆయన వద్ద కోచింగ్ తన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా గోపీచంద్ చెబుతారు. ఆయన వద్ద గెలవగలం అన్న మనోస్థైర్యాన్ని నేర్చుకున్నాను అని గోపీచంద్ అంటారు.
క్రీడాకారుడిగా గోపీచంద్ సాధించిన విజయాలు ఒక ఎత్తైతే కోచ్‌గా ఆయన విజయాలు దానికి పదిరెట్లు. క్రీడాకారులను ఆడటం కోసం కాకుండా గెలవటం కోసం ఆడేలా శిక్షణ ఇవ్వటం, దేహ మరియు మానసిక దారుఢ్యాన్ని పెంచుకొని విజయాలు సాధించేలా సిద్ధం చేయటం గోపీచంద్ ప్రత్యేకత. ఆటగాళ్ల వ్యక్తిత్వానికి సరిపడా కోచింగ్ ఇచ్చి, ఆట ఆడే సమయంలో ఎక్కువ సేపు ఆడే సామర్థ్యాన్ని పెంచటం ఆయన గొప్పతనం. ముఖ్యమైన పోటీలకు దాదాపు ఏడాది ముందునుంచే శిక్షణ మొదలు పెట్టటం వంటి ప్రణాళికల వలన భారత క్రీడాకారులు అంతర్జాతీయ పోటీలలో నిలబడటమే కాదు ఒకటి తరువాత మరొకటి గెలిచేలా చేశాడు.
భారతదేశ బ్యాడ్మింటన్ చరిత్రలో గోపీచంద్ స్థాపించిన అకాడెమీ ఒక ముఖ్యమైన పేజీ. అప్పటివరకు బ్యాడ్మింటన్ అంటే చైనా ఆటగాళ్ల ఏకచ్ఛత్రాధిపత్యంగా ఉండేది. కానీ, గోపీచంద్ అకాడెమీ మొదలుపెట్టిన తరువాత ఈ దుర్భేద్యమైన చైనా ఆటగాళ్ల కోటను బద్దలు కొట్టగలిగారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి ఆటగాళ్లు అగ్రశ్రేణి ఆటగాళ్లుగా ప్రపంచస్థాయిలో నిలబడగలిగారు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపటం గోపీచంద్ కోచింగ్ ముద్ర. ఒత్తిడిలో ఆడుతున్నప్పుడు ఒక స్థాయిని దాటి గెలిచే శక్తిని ఆటగాళ్లలో తీసుకురాగలిగిన కోచ్ గోపీచంద్. టోర్నీలు ఒకటి తరువాత ఒకటి చిన్నవయసులోనే గెలిచేలా ఆటగాళ్లను రూపకల్పన చేశాడు గోపీచంద్. తన అనుభవంతో, ఆటపై గల పట్టుతో ఆటగాళ్లకు మార్గదర్శిగా నిలిచాడు. సైనా నెహ్వాల్ ప్రపంచంలో మొదటి ర్యాంకుకు వెళ్లగలిగిందంటే దానిలో గోపీచంద్ పాత్ర ఎంతో ఉంది.
ఐదారుగురు అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను తయారు చేయటం వలన భారతదేశంలో మూడవస్థాయి ఆటగా (క్రికెట్, టెన్నిస్ తరువాత) ఉన్న బ్యాడ్మింటన్‌ను వేలాది మంది పిల్లలు నేర్చుకునేలా స్ఫూర్తిని నింపాడు. ఈరోజు బ్యాడ్మింటన్‌లో ప్రీమియర్ లీగ్ మంచి ఆదరణతో నడుస్తోంది అంటే దానికి ఆద్యుడు గోపీచంద్ అనే చెప్పుకోవచ్చు. ఆటగాళ్లు ఓటమి పాలై నిరాశలో ఉన్నప్పుడు వారిని ఉత్సాహ పరచి విజయ పథంలో నడిపించిన ఆచార్యుడు గోపీచంద్. 2012లో సైనా నెహ్వాల్ లండన్ ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకోవటంలో గోపీచంద్ పాత్ర మరువలేనిది. ఆమె సూపర్ సిరీస్ విజాయలకు కూడా రథసారథి గోపీచందే. సైనా ఫోర్‌హ్యాండ్, కోర్టులో నెట్ వద్ద ఆటలో నైపుణ్యతను అభివృద్ధి చేసి ఆమెను నంబర్ వన్ క్రీడాకారిణిగా గోపీచంద్ రూపొందించాడు. శరీర దారుఢ్యాన్ని, మానసికంగా గెలవాలి అన్న తపనను ఆమెలో నిరంతరం ఉండేలా చేశాడు గోపీచంద్.
ఈరోజు భారతదేశానికి సైనా నెహ్వాల్, పీవీ సింధు, పారుపల్లి కాశ్యప్, శ్రీకాంత్ కిడాంబి, అరుంధతి పంతవనె, ప్రణయ్ కుమార్, గురుసాయి దత్, అరుణ్ విష్ణు, రుత్విక శివాని వంటి ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఉన్నారంటే గోపీచంద్ అకాడెమీలో ఆయన వద్ద పొందిన అద్భుతమైన శిక్షణ వలన అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. అందుకే ఆయనకు చిన్న వయసులోనే అన్ని అవార్డులు వచ్చాయి. గోపీచంద్ వంటి మంచి వ్యక్తి భారతదేశ క్రీడారంగంలో ఉండటం ఈ దేశం అదృష్టం. ఈ దేశంలో బ్యాడ్మింటన్ అంటే గోపీచంద్ పేరు రాకుండా ఉండదు. అది ఆయన ఈ ఆటపై చూపిన ప్రభావం, ఆయన మన ఆటగాళ్లలో తెచ్చిన అనూహ్యమైన మార్పు, వారికి తెచ్చిపెట్టిన గుర్తింపు. తెలుగుజాతి ముద్దుబిడ్డ గోపీచంద్ గారు వందలాదిమంది ప్రపంచస్థాయి ఆటగాళ్లను సిద్ధం చేయాలని అభిలషిద్దాం.
చక్కటి వ్యాసం అందించారు అన్నయ్య. కృతఙ్ఞతలు.
రిప్లయితొలగించండిGreat Patriot ! God bless him !
రిప్లయితొలగించండి👌👌👌👌👌👌
రిప్లయితొలగించండి