కర్ణాటక సంగీత సాంప్రదాయంలో రకరకాల అంశాలు ఉన్నాయి. వర్ణం, గీతం, కృతి, రాగమాలిక, పదం, జావళి,తిల్లాన..ఇలా ఎన్నో. ఒక్కో రకానికి ఒక్కో ప్రత్యేకత ఉంది, సముచిత స్థానముంది. వీటిల్లో తిల్లానాకు ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. తిల్లానాలు సంగీత కచేరీలలోనే కాదు, నాట్య ప్రదర్శనలో కూడా అద్భుతంగా ప్రదర్శిస్తారు. మిగిలిన ప్రక్రియలతో పోలిస్తే తిల్లాన చిన్నది. ఎక్కువ సాహిత్యం ఉండదు, శ్రావ్యంగా లయ బద్ధంగా తి ల న అనే అక్షరాల కలయికతో ఉంటుంది. ఎక్కువ శాతం జతులతో నిండి ఉండే తిల్లాన వినటానికి సొంపుగా ఉంటుంది, అందుకే నాట్య ప్రదర్శనకు కూడా అనువైన అంశం.
తిల్లానలకు మూలం మధ్యయుగానిక చెందిన కైవార ప్రబంధాలు. ఈ ప్రబంధాలలో జతులు కార్యక్రమాల చివరలో ఉండేవి. ఈ ప్రబంధాల ప్రేరణతోనే 18వ శతాబ్ది కాలంలో తిల్లానాలు పుట్టాయి.తిల్లానాలు సంగీత కచేరీలో రాగం తానం పల్లవి అనే సమయం పట్టే అంశం తరువాత వస్తుంది. నాట్య ప్రదర్శనలలో పదాల తరువాత తిల్లాన ఉంటుంది. కథా కాలషేపాలలో కూడా తిల్లాన వేగంగా ప్రేక్షకులను రంజింపజేసేలా ఉపయోగించబడుతుంది. తిల్లానాలో పల్లవి, అనుపల్లవులలో జతులు, చరణంలో మొదటి భాగం సాహిత్యం, రెండవ భాగం జతి ఉంటుంది. చాలా మటుకు తిల్లానాలలో పల్లవి మొదటి కాలంలో ఉంటుంది. అనుపల్లవి మొదటి, మధ్యమ కాలంలో ఉంటుంది. చరణం మధ్యమ కాలంలో ఉండి చిట్టస్వరాలు కలిగి ఉంటుంది. కృతులకు భిన్నంగా తిల్లానాలో అనుపల్లవి చరణం తరువాత వచ్చి అటు తరువాత పల్లవి వస్తుంది.
తిల్లానాల కూర్పులో సాహిత్యకారుడికి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అందుకనే అవి చాలా ప్రాచుర్యం పొందాయి. జతులు మొదటి, రెండవ కాలములతో పేర్చి కూర్చటంతో వినటానికి సొంపుగా, ఉత్సాహకరంగా ఉంటాయి. అనురూపత్వం (సిమెట్రీ) ఉండటంతో తిల్లానాల అనుపల్లవిలో ఒక మకుటం కూడా పొందుపరస్తారు సాహిత్యకారులు.
తిల్లానలో ప్రత్యేకత దిర్, థక్కు, ధిక్కు, తక తఢింగు, తళాంగు, కిటక మొదలైన ప్రబంధ శబ్దాలతో ఉండటం. వీటితో సంగీత కచేరీలు రక్తి కడతాయి.
తిల్లానలలో రకాలు
1. నాట్య ప్రదర్శనల కోసం రాసినవి - లయ ప్రాధాన్యమైన జతులతో నిండి ఉంటాయి. మొట్ట మొదటి తిల్లానాలు ఈ కోవకు చెందినవే. మేలత్తూర్ వీరభద్రయ్య గారు, తంజావూర్ చతుష్టయంగా పేరొందిన పొన్నయ్య, చిన్నయ్య, శేషయ్యర్, జీఎన్ బాలసుబ్రహ్మణ్యం గార్లు ఈ తిల్లానాలను రచించారు
2. ఉపపాదన కోసం రాసినవి - అనగా బోధనకు ఉపయోగించేవి. ఇవి అంగ, క్రియ, అక్షర కాలం మొదలైన పరిజ్ఞానం అందించటానికి రాసినవి. మహా వైద్యనాథ అయ్యరు, రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ మొదలైనవారు రాశారు.
3. సంగీత కచేరీల కోసం రాసినవి - వీటిలో రాగ మాధుర్యానికి ప్రాధాన్యత ఉంటుంది. స్వర సంగతులను కూడ ప్రతిపాదిస్తారు. మైసూర్ వాసుదేవాచార్య, ముత్తయ్య భాగవతార్, బాలమురళీకృష్ణ, లాల్గూడి జయరామన్ మొదలైన వారు ఈ రకమైన తిల్లానాలు రచించారు
తిల్లానాలకు హిందూస్థానీ సంగీతంలో కూడా చోటు ఉంది. వీటిని తరానాలు అంటారు. ఇవి ఒధని, తధని, తధీం మొదలైన పదాలతో నిండి ఉంటాయి. ఈ పదాలు పర్షియన్ మరియు అరబిక్ భాషల నుండి వచ్చినవి. 13వ శతాబ్దంలో అమీర్ ఖుస్రో ఈ ప్రయోగం మొదలు పెట్టాడు. సూఫీ సంగీతంలో, హిందూస్థానీ సంగీతంలో తరానాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది.
కర్ణాటక సంగీతంలోని తిల్లానాలలో డాక్టర్ బాలమురళీకృష్ణ గారి రచనలకు ప్రత్యేక స్థానం ఉంది. అవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఎందరో కళాకారులు ఆయన తిల్లానలను సంగీత నృత్య కచేరీలలో ప్రదర్శిస్తారు. ఆయన రాగమాలికగా, బృందావని, కుంతలవరాళి, కదనకుతూహలం, ద్విజావంతి రాగాలలో కూర్చిన తిల్లానాలు ఈనాడు ప్రమాణాలు. ఆ తిల్లానాలలో కదనకుతూహలం రాగంలో కూర్చిన తిల్లానా వివరాలు పరిశీలిద్దాం.
సాహిత్యం:
నా దిర్ దిర్ ధీం తనన నోం తదరదాని నా దిర్ దిర్ తోం నా దిర్ దిర్ తోం ధిత్తిల్లిల్లాన
తదర దాని దిరన నిద ఉదర దాని దిరన
తకిటఝం మ ద ని తకిట ఝం గ ప స
తతకిట తోం స ని ద ప మ గ రి స
నా దిర్ దిర్ ధీం తనన నోం తదరదాని నా దిర్ దిర్ తోం నా దిర్ దిర్ తోం ధిత్తిల్లిల్లాన
తరికిట తోం తరికిట తోం త ఝణుత
తత్తరికిట తక తక ధిత్తళాంగు తక తరి కిటతక తక ధిత్తళాంగు తోం దిర్ దిర్ తోం దిర్ తోం
తిల్లాన ధిత్తిల్లాన ధిత్తిల్లాన
స రి మ గ రి స రి మ మ ద ద ని గ గ ప స స ని ద ప మ గ రి
వదనమదే విరిసెనే అధరమదే మురిసేనే
మధుర గానంబదే నా మురళీమనోహరుడదే
మదన కదన కుతూహలుడు రమ్మనె బిరాన బిరాన బిరాన రావే
ఈ తిల్లానాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
1. ఉత్సాహంగా రాగానికి సముచితమైన జతులు, సాహిత్యం
2. అద్భుతమైన జతులు మరియు స్వర సంగతులు
3. రాగం పేరు, రచయిత పేరు రెండూ మకుటంగా రావటం
4. ఓలలాడించే గానంతో అద్భుతమైన కాలగతిలో కూర్చబడటం
5. గాయకునితో పాటు మృదంగం, వయోలిన్, ఘటం మొదలైన వాద్య కళాకారులకు కూడా ప్రతిభను కనబరచే అవకాశం ఉండటం
శ్రీకృష్ణునితో అనుబంధం కల ఎటువంటి రచనైనా ఆయన మోహన మురళీరవం లాగా మధురంగానే ఉంటుంది. అందుకనే, ఈ తిల్లానా కూడా మధురంగా, లయబద్ధంగా, కదనోత్సాహం కలిగించేలా ఉంటుంది. బాలమురళీకృష్ణ గారి గాత్ర సంగీత ప్రతిభ గురించి మాట్లాడనక్కరలేదు, కానీ వారి రచనలను చూస్తే ఆయనలోని బహుముఖ ప్రజ్ఞ అర్థమవుతుంది. తిల్లానా రచించాలంటే మాటలు కాదు. అందులో జనరంజకం చేయాలాంటే అది గాయకుల నోట నిరంతరం పలికేలా ఉండాలి. ఈ తిల్లాన ఆ కోవకు చెందినదే. వినగానే ఆనందం కలుగుతుంది. మళ్లీ వినాలి, పాడాలి అనిపిస్తుంది. అందుకే భాషా భేదాలు లేకుండా అన్ని ప్రాంతాలకు చెందిన సంగీత కళాకారులు ఈ తిల్లానాను తమ కచేరీలలో అంతర్భాగం చేసుకున్నారు.
సంగీతం దైవంతో ముడి పడి ఉన్నదానికి మరో నిదర్శనం తిల్లానాలు. ఎందుకంటే - సందేశంతో పాటు మనలను ఆనందం ఓలలాడించ గలిగే శక్తి దానిలో ఉంది. శబ్దం అమ్మ రూపమైతే లయ పరమశివుని ప్రతి రూపం. ఆ శబ్ద లయ విన్యాసమే తిల్లాన. బాలమురళీకృష్ణ గారి ఈ తిల్లానా విని ఆస్వాదించండి.
చాలా బాగుంది. థిల్లానా గురించి మంచి వివరాలు అందించారు. ధన్యవాదాలు
రిప్లయితొలగించండిఅద్భుతం
రిప్లయితొలగించండిhttps://youtu.be/JCB-eJpQV3Q has 6 thillanas of Balamurali for 48 minutes of audio pleasure
రిప్లయితొలగించండిGood informative article sir. Balamurali Thillanas are pure gold. He makes them 'THRILLANAS' with his masterly rendition.
రిప్లయితొలగించండిRespected Prasad akkiraju gaaru accidentally through FB I got chance to read the article on GREAT MBK by you.Later with interest gone through your blog posts.Once I got chance to listen Thillanaas on violin by Sri KKVaidyanathan.Same time I could get a cassette of Thillanaas by SRI MBK.I could listen them after few years and enjoyed.But after reading your article it was more tasty to ears and mind.In child hood I used to enjoy HINDI songs though not knowing the language.But I could appreciate more after knowing the meaning.
రిప్లయితొలగించండిAll your posts are really very informative and make people like me more richer of divine knowledge.
Please permit me to post some in my known WhatsApp group of relatives who too interested in music , literature.
A GREAT THANKS and hard off to your knowledge on various topics.
Om NAMAH SIVAAYAH
MV CHALAPATHI