సంగీతం కొంతమందికి దైవానుగ్రహమైతే కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చే వారసత్వం. రెండూ కలగలిపితే ఇక అది అద్భుతమైన ప్రతిభావిష్కరణే అవుతుంది. సంగీతం వారసత్వంగా వస్తే అది జీవితంలో ఒక అంతర్భాగమై ప్రత్యేకంగా నేర్చుకున్నట్లు అనిపించదు. ఎలాగైతే మాట్లాడటం, ఆడటం నేర్చుకుంటారో, అలాగే కొన్ని సంగీత కుటుంబాలలో సంగీతన్ని కూడా పిల్లలు చిన్నప్పటినుంచే నేర్చుకుంటారు. అటువంటి ఒక అసమాన కళాకారిణి జయప్రద రామమూర్తిగారు. తెలుగుగడ్డపై పుట్టిన తొలి వేణువాద్య ఏ గ్రేడ్ కళాకారిణిగా జయప్రదగారు ఈరోజు ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆవిడ వివరాలు తెలుసుకుందాం.
గతంలో నేను ప్రముఖ వేణు వాద్య కళాకారిణులు సిక్కిల్ సోదరీమణులు నీల కుంజుమణి గార్ల గురించి రాసినప్పుడు వాయిద్యాలలో వేణువు ఎందుకు కష్టమైనదో తెలిపాను. శ్వాసకు సంబంధించిన వాయిద్యం ఇది. ఆ శ్వాసలో స్వరాలను పలికించాలంటే తప్పకుండా ప్రత్యేకమైన సాధన కావాలి. అందులో వేర్వేరు కాలాలలో వాయించేటప్పుడు ఊపిరిని నియంత్రించటానికి ఎంతో శ్రమ పడాలి. అందుకే వేణుగాన విద్వాంసులు చాలా తక్కువమంది ఉంటారు. మరి జయప్రదగారు ఎంతటి పరిశ్రమ, సాధన చేసుంటే ఈనాడు విద్వాంసులయ్యుంటారో ఊహించండి.
జయప్రద గారు గురుముఖత విద్య నేర్చుకోక మునుపే సంగీతంలో మెళకువలన్నీ తల్లి వద్ద నేర్చుకున్నారు. జయప్రద గారు ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ప్రేమా రామమూర్తి గారు. తండ్రి కీర్తిశేషులు శ్రీ ఓవీ రామామూర్తిగారు. ప్రేమ గారి తాత గారు బళ్లారి జమీందారు గారు శ్రీనివాస శాస్త్రిగారు వేణువాద్య విద్వాంసులు. ప్రేమ గారు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి శిష్యురాలు, ఆలిండియా రేడియోలో ఏ గ్రేడ్ కళాకారిణిగా పనిచేశారు. జయప్రద గారు చిన్ననాడే సంగీతంలో ప్రావీణ్యం సంపాదించి ఆకాశవాణిలో దూరదర్శన్‌లో కచేరీలు చేసినా, తల్లి సలహా మేరకు ప్రఖ్యాత వేణువాద్య విద్వాంసులు డాక్టర్ ఎన్. రమణి గారి వద్ద చెన్నైలో, హైదరాబాదులో శ్రీ శ్రీనివాసన్ వద్ద నేర్చుకున్నారు. తరువాత శ్రీ సుదర్శనాచార్యుల వద్ద మృదంగం కూడా నేర్చుకున్నారు. తరువాత బంగ్లాదేశ్‌లో జరిగిన భారతీయ ఉత్సవాలలో ప్రఖ్యాత హిందూస్థానీ వేణువాద్య విద్వాంసులు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారితో పరిచయం ఏర్పడింది. ఆయన సలహా మేరకు హిందూస్థానీ వేణువాదనం కూడా నేర్చుకున్నారు. కళతో పాటు తన విద్యాభ్యాసాన్ని కూడ అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లారు. కామర్స్‌లో పీహేచ్‌డీ పూర్తి చేశారు జయప్రదగారు. తన చదువును సంగీతంతో ముడిపెట్టి పీహెచ్‌డీని మార్కెటింగ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే అంశంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఆ విధంగా తనను డాక్టర్ జయప్రదగా చూడాలనుకున్న తల్లి ప్రేమ గారి ఆకాంక్షను నెరవేర్చారు.
జయప్రద గారు పాశ్చాత్య మరియు భారతీయ శాస్త్రీయ సంగీతాల మేళనను శాస్త్రీయత కోల్పోకుండా చేయటాన్ని ఇస్టపడతారు. ఆమె వేణువాద్యానికి కావలసిన శక్తిని యోగా మరియు ప్రాణాయం ద్వారా పొందారు. ఊపిరితిత్తుల మరియు చేతి వేళ్ల దృఢత్వాన్ని వీటి ద్వారా పొందారు. వేణువాద్యం సహజ ప్రాణాయామం కాబట్టి దానివలన నాడీమండలం ఆరోగ్యంగా ఉంటుంది అని మానసిక రోగులకు ఈ వాద్యాన్ని నేర్చుకోమని జయప్రదగారు సలహా ఇస్తారు. శబ్దానికి మానసిక ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని జయప్రదగారు అందరికీ చెప్పాలన్న యోచనతో దానిపై పరిశోధన చేస్తున్నారు.
జయప్రద గారు నవీనతకు చిహ్నంగా వేగంగా వాయించే రోలింగ్ ఫింగర్స్ అని కొత్త విధానాన్ని కనిపెట్టి ప్రపంచ మరియు జాతీయ రికార్డులను సొంతం చేసుకున్నారు. రకరకాల వేణువులలో రాగాలను ఆయా వేణువుల ధర్మానికి అనుగుణంగా మలచుకుంటూ వేలి కదలికను సృజనాత్మకంగా చేయటంలో జయప్రదగారు రికార్డులను సొంతం చేసుకున్నారు. దీనిని ట్రాన్స్పోస్ ఫింగరింగ్ అంటారు. మనోధర్మాన్ని ఈ ప్రక్రియ ద్వారా వాయించి ఈ రికార్డులకెక్కారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది పురస్కారం, ఢిల్లీ ప్రభుత్వం వారి పురస్కారం వంటి ఎన్నో గుర్తింపులు పొందారు. ఎన్నో దేవస్థానాలలో వీరి వేణువాద్యం అక్కడి దేవతామూర్తుల సేవలలో వినియోగిస్తున్నారు. పండిట్ రవిశంకర్ గారు వీరిలోని ప్రతిభను గుర్తించి ఎంతో ప్రశంసించి ఆశీర్వదించారు. విజయాలు సాధించినప్పుడు బాధ్యత పెరుగ్తుంది అన్న సత్యాన్ని జయప్రదగారు పరిపూర్ణంగా నమ్ముతారు.
సంగీతం అంటే ధ్యానం, దానితో వేరే ఆలోచనలన్నీ తొలగి మనసు ప్రశాంతతను పొందుతుందని పరిపూర్ణంగా విశ్వసించే నిష్ణాతురాలు జయప్రదగారు. ఆవిడ వేణువాదన వింటుంటే మనసు తేలిపోతుంది, తేలికపడుతుంది. శ్రీకృష్ణుడు ఎదుట నిలచినట్లనిపిస్తుంది. మనోవికారాలన్నీ తొలగి ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఆవిడ పలికించే గమకాలు, ఆవిడ చేసే శబ్ద విన్యాసాలు మనసును కట్టి పడేస్తాయి. తన గురువుల వద్ద నేర్చుకున్న విద్యను, తన సాధన ద్వారా పరిపక్వత చెందిన సంగీతాన్ని జయప్రదగారు తన శిష్యులకు అందజేస్తున్నారు. దేశవిదేశాల్లో ఎన్నో కచేరీలు చేసిన జయప్రదగారు మాండోలిన్ వంటి తీగలతో కూడిన వాయిద్యాలను కూడ ఇష్ట పడతారు. ఛందస్సు లేని చుటుకులను స్వరపరచే అవకాశాన్ని మైసూర్ దత్తపీఠాధిపతులు గణపతి సచ్చిదానంద స్వామి వారు జయప్రద గారికి అనుగ్రహించారు.
ఫ్లూట్ ఐకాన్ ఆఫ్ ఏషియా, ఫ్లూట్ మేస్ట్రో, దివా ఆఫ్ డక్కన్, ఆస్థాన విదుషీ, వేణుగాన వినోదిని, మురళీధర మృదుపద మంజీరం, నాదయోగ వంటి బిరుదులు పొందారు. జయప్రదగారిని భారత రాష్ట్రపతులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు వేర్వేరు సందర్భాలలో సత్కరించారు. గ్లోబల్ వరల్డ్ రికార్డ్, యునిక్ రికార్డ్, ఏషియాస్ టాప్ 100 టాలెంట్, నేషనల్ ఫెలోషిప్, భారతి గౌరవ పురస్కార్, గోల్డెన్ బ్రేస్లెట్ అవార్డ్, బెస్ట్ ఫ్లూటిస్ట్, ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మర్ అవార్డులు పొందారు.
భగవంతుడు జయప్రదగారికి మరింత వేణువాద్య సేవాభాగ్యాన్ని, మరెన్నో గుర్తింపులను, పురస్కారాలను కలిగేలా అనుగ్రహించాలని ప్రార్థన. తెలుగుజాతి ముద్దుబిడ్డ జయప్రద గారి సంగీత సోపానం మరింత జయప్రదంగా సాగాలని ఆకాంక్షిద్దాం. వారి ప్రతిభ తరతరాలకు అందాలని ఆశిద్దాం. వారు వాయించిన కాంభోజి రాగ కీర్తనను వినండి.
ప్రముఖ వేణు వాద విద్వాంసురాలు డాక్టర్ జయప్రదా రామమూర్తి గారిని పరిచయం చేస్తౄ రాసిన వ్యాసం అద్భుతంగా ఉంది. ఆమెకు ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచఅచి గౌరవించ వలసిన అవసరం ఉంది
రిప్లయితొలగించండి