25, జనవరి 2016, సోమవారం

గుళ్లో రామాయణాలు - 2:

గుళ్లో రామాయణాలు - 2
==================


భార్య - "ఏవండీ! తిరుమల వెళదాము ఏదాది పైన అయిపోయింది. పైగా మొక్కుంది. మొన్న పిల్లవాడు పదో తరగతి పాసైతే వస్తానని మొక్కుకున్నాను."

భర్త - "తిరుమల అంటే ఏమన్నా పక్క వీధిలోని గుడి అనుకున్నావా? దర్శనం, ఉండటానికి ఏర్పాట్లు, రైలు టికెట్లు..."

భార్య - "మన పక్కింటి అన్నయ్యగారి స్నేహితుడు తిరుమలలో ఎక్జిక్యూటివ్ ఆఫీసరు కింద పని చేస్తారుట. అడుగుదామా?"

భర్త - "అలాగే! వివరాలన్నీ కనుక్కో, నేను రైలు టికెట్ల సంగతి చూస్తాను"

పక్కింటాయన ద్వారా సిఫారసు లెటరు తీసుకొని తిరుమల చేరుకున్నారు. ఎలా దర్శనం టికెట్లు సంపాదించాలన్నదే ధ్యాస. పరుగు పరుగున పద్మావతీ గెస్ట్ హౌజ్ వద్ద ఉన్న కార్యాలయానికి వెళ్లాడు.

"ఈ సిఫారసులు నడవవండీ. ఈ మధ్యనే యాజమాన్యం ఈ కోటాను రద్దు చేసింది..."...

ఎంత సేపు ప్రయత్నించినా ఆ ఉద్యోగి ఒప్పుకోలేదు. వెంటనే భర్త మదిలో లంచం అనే అస్త్రం మెరిసింది.

"అయ్యా! మేము హైదరాబాదునుండి వచ్చాము. పిల్లాడి పరీక్ష పాసైన మొక్కు ఉంది. మళ్లీ రావటం కష్టం. ఈ వెయ్యి రూపాయలు..."

"ఇదిగో! నేనెల కనబడుతున్నాను? ఆ వేంకటేశ్వరుడు కోపగిస్తే ఇంకేమైనా ఉందా?"

నిరాశతో వెనుదిరిగి కార్యాలయం గుమ్మం దాటబోతున్నాడు. వెనుకనుండి తితిదే ఉద్యోగి పిలుపు..

పక్కకు పిలిచి "ఇంకో వెయ్యి ఇస్తే నీ పనవుతుంది..."...ఎగిరి గంతేశాడు ఆ వ్యక్తి. జేబులోంచి రెండు వేలు తీసి ఆ ఉద్యోగి చేతులో పెట్టాడు. బ్రేక్ దర్శనం టికెట్లు, పద్మావతీ గెస్ట్ హౌజ్‌లో బస సంపాదించాడు.

బ్రేక్ దర్శనం క్యూలో భార్యా భర్తలు పిల్లలు...తమతో వచ్చిన వాళ్ల కన్నా ముందు దర్శనం, ప్రత్యేక దర్శనం అవుతుందన్న ఆనందం..ఆ ధ్యాసలో భగవంతుడి ఊసే లేదు.

భార్య - "ఏవండీ! మన అదృష్టం కదా! పోతే పోనీ రెండు వేలు. ఎంచక్కా గంటన్నరలో బయట పడతాము. లడ్లు కూడా ఎక్కువ వస్తాయి.  తోపుడుండదు"

"అవునే! అందుకే ఒక్క నిమిషం అని కూడా ఆలోచించకుండా రెండు వేలకు ఒప్పుకున్నా. ఆ 300 రూపాయల టికెట్టు క్యూ అయితే 4-5 గంటల పని. ఆకళ్లు, కాళ్లనొప్పులు, తోపులాట..."...గర్వంగా పలికాడు భర్త.

వాళ్ల అమ్మాయి 8వ క్లాసు..

"నాన్నా! లంచం ఇవ్వటం నేరం కదా! మరి మనం చేసింది ఆ భగవంతుడు ఎలా ఒప్పుకుంటాడు?"...ప్రశ్నార్థకంగా, సందేహంతో, అపరాధం చేశామన్న భావనతో అడిగింది.

"నువ్వు నోరు ముయ్యవే! పక్కన వాళ్లు వింటారు. ఏదో మీ నాన్న తెలివితో టికెట్లు తీసుకుంటే పాపం, పుణ్యం అనే నీ గోల ఏంటి?"

కొడుకు 10వ క్లాసు...

"నాన్నా! మీరు జుట్టు ఇస్తామని మొక్కుకున్నారు కదా! అలాగే అమ్మ మెట్లు ఎక్కి వెళదాం అని చెప్పింది. మర్చిపోయారా?"....

"అన్నీ గుర్తున్నాయి రా. టికెట్లు తీసుకుందామన్న ధ్యాసలో ఈ మొక్కులు మర్చిపోయాను. తలనీలాలు దర్శనం అయిన తరువాత ఇద్దాములే. మెట్లు ఈ మారు వచ్చినప్పుడు ఎక్కుతాననని మొక్కుకున్నానులే...." - తల్లిదండ్రుల సవరణ.

క్యూ అంతా భార్యాభర్తలకు తాము చేసిన ఘనకార్యం గురించి ఆలోచనలే తప్ప శ్రీనివాసుడి గురించి లేదు. పక్కవాళ్లతో సంభాషణలు కూడా ఇవే. గర్భగుడిలో స్వామి ముందున్న 5 సెకండ్ల సమయం కళ్లుమూసుకొని ఏవేవో కోర్కెలు కోరేశారు...బయటకు వచ్చి ప్రసాదం తీసుకునే క్యూలో ఉన్నారు.

భార్య - "ఏవండీ! ఆ పక్కనే పొంగలి, దద్ధ్యోజనం ప్రసాదం ఉంది. ఆ పూజారి చేతిలో ఒక వంద పెట్టి చెరో పొట్లం తీసుకోండి..."

పిల్ల - "అమ్మా అది ఇప్పుడిస్తున్న లడ్డూ ప్రసాదం అయిపోతే ఇచ్చేందుకు పెట్టారు. ప్రసాదంలో కూడా కక్కుర్తి ఏమిటి?"....

తల్లి - "నీకు తెలియదు ఊరుకోవే. మన పక్కింటావిడ మొన్న వచ్చినప్పుడు వాళ్లకు బ్రేక్ దర్శనంలో బోలెడంత ప్రసాదాలు ఇలాగే ఇచ్చారుట. వాటి రుచి గురించి కథలు కథలుగా చెప్పింది. నేను కూడ చెప్పద్దూ? "...

పిల్ల నిర్ఘాంతపోయింది. తల్లికి కోపం వస్తుందని తన భావనలను లోపలే దాచుకుంది.

వందరూపాయలు పూజారి చేతిలో పెట్టబోగా అతను అసహ్యం నటిస్తూ తిరిగి ఇచ్చి "నేను నిన్ను అడిగానా? దేనికి ఈ డబ్బులు?"...

"అయ్యా! పొంగలి, దద్ధ్యోజనం ప్రసాదం..."

"ఆ పక్కన నిలబడు. కాసేపు ఆగి ఇస్తాను"... అని వంద రూపాయలో పంచెలో దోపుకున్నాడు. సీసీటీవీ కెమేరాలున్నాయి. అయినా ఇద్దరికీ భయం లేదు.

దర్శనం తరువాత తలనీలాలు, భోజనాలు, విహార యాత్ర, షాపింగ్...క్రిందకు బస్సులో దిగుతున్నారు. వేగంగా బస్సు ఘాటు అంచులను గుద్దుకుంది. భార్యా భర్తలకు బాగా గాయాలు. పిల్లలకు ఏమీ కాలేదు. చావు తప్పి కన్నులొట్ట పోయి క్రిందకు దిగారు. ప్రాణాలు పోకుండా రక్షించినందుకు మళ్లీ కాలినడకన వస్తామని మొక్కు....

అన్నీ చూస్తునే ఉన్నాడు శ్రీనివాసుడు. ఆయన లెక్కలు ఆయన వేస్తూనే ఉన్నాడు. వీళ్ల మొక్కులు వీళ్లు మొక్కుతునే ఉన్నారు...

గుళ్లో రామాయణాలు - 1:

గుళ్లో రామాయణాలు - 1:
=================

అందంగా, పట్టు చీర కట్టుకొని, నగలు అలకరించుకొని, మేకప్ వేసుకొని, సిగలో పూలు కొప్పుకు అలంకరించుకొని వయ్యారంగా నడుచుకుంటూ వస్తోంది ఒక 30 ఏళ్ల స్త్రీ.
అప్పటివరకు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతున్న స్త్రీల దృష్టి ఆవిడపై పడింది. అంతే ఇక విష్ణువు లేడు, సహస్రమూ లేదు, నామాలూ లేవూ. అంతా ఆ స్త్రీ వేషభూషణాలకు అర్పణం. స్తోత్రాలు పఠిస్తున్న పురుషుల దృష్టి కూడా మరల భగవంతునిపై ధ్యాస చెదరింది.
మొదటి స్త్రీ: "ఇదేమి కలికాలమో? గుళ్లోకి వస్తూ ఈ అలంకరణలేమిటో? కాస్తైనా ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదా వదినా?"
రెండవ స్త్రీ: "అవును వదినా. నాక్కాంగ నగలు ఉన్నాయని దిగేసుకొచ్చింది. అయినా ఇదేమైనా పెళ్లా పేరంటమా? పవిత్రమైన శ్రీనివాస కళ్యాణానికి వస్తూ ఏమిటి ఈ చోద్యం?"
మూడవ స్త్రీ: "మనం ఆ వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండే వాళ్లం? గుడికి అనగానే పట్టుచీర కట్టుకునే వాళ్లమే, కానీ ఇలా ఉన్న నగలన్నీ దిగేసి, మేకప్ వేసుకొని, అసహ్యం పుట్టేలానా? "
నాలుగవ స్త్రీ: "అసలు గుడికి స్త్రీలు పూలు పెట్టుకోకూడదని ఇటీవలే ప్రవచనాలలో విన్నాను. ఇది పాపం కదూ?"
అందరు స్త్రీలూ వంత పాడారు...అందరికీ మానసిక ప్రశాంతత చెదిరింది. భగవంతుడు సాక్షీభూతుడై మౌనంగా ఈ నాటకాన్ని చూస్తున్నాడు. నవ్వుకుంటున్నాడు.
ఇక రెండోవైపు పురుషులు:
మొదటి పురుషుడు: "ఏవిటండోయ్..ఈ రోజు గుడి మామూలు కన్నా కళకళలాడిపోతోంది..ఎవరీ అందాల భామ..మేకప్ చూస్తే కాస్త ఓవర్ అయినట్లు లేదూ...ఇది వరకెప్పుడూ చూడలేదే ఈ ప్రత్యేక పాత్రను? "
రెండవ పురుషుడు: "ఎవరైతే మనకెందుకండీ? అందాన్ని ఆస్వాదించండి. వీలైతే వివరాలు కనుక్కోండీ..."
మూడవ పురుషుడు: "ఈవిడను ఎక్కడో చూశానండీ. ఆ గుర్తుకొచ్చింది. ఓ సినిమా సభలో ఓ నటుడి పక్కన చూశా! ఓసి దీని అఘాయిత్యం కూల. ఆ వేషం గుళ్లో కూడానా?"
పూజారి (మనసులో): "అపచారం, అపచారం, దేవుడి ముందు ఏమిటీ లేకి వేషాలు? భగవంతుడు క్షమించడు..."
ఇంకేముంది, అప్పటి వరకు ఎవరి పనుల్లో వారు భగవంతుని ధ్యాసలో ఉన్న సమూహం అంతా ఈ చర్చలో మునిగిపోయింది. కలకలం మొదలయ్యింది. మనసులు చెదిరాయి. దేవుడినుండి స్త్రీపైకి మళ్లింది మొత్తం దృష్టి. త్రికరణములలో దేనిలోనూ శుద్ధి లేకుండా పోయింది. ఇంకెక్కడి భగవంతుడు? అప్పటివరకు అక్కడ నిలచి వారి భక్తిని గమనిస్తున్న ఆయన మళ్లీ స్థాణువైపోయాడు.

ఇంతలో ఆ ఆలయ ధర్మాధికారి ఆ అమ్మాయిని పిలిచాడు. "అమ్మా జాహ్నవీ! షోడశోపచారములలో నృత్య సేవ అందించు తల్లీ!" అని గర్భగుడి ముంగిటకు పిలిచాడు.
జాహ్నవి చిరునవ్వుతో కాళ్లకు గజ్జెలు కట్టింది. అలంకరణ అంతా సవరించుకుంది. మనసులో స్వామికి ఈ సేవ అంకితం అనుకుంది. పద్మావతీ శ్రీనివాసుల వైభవాన్ని నుతించే "ఏమొకొ చిగురుటధరమున" అనే అన్నమాచార్యుల వారి కీర్తనను క్యాసెట్టులో శోభారాజు గారు పాడుతుండగా, అద్భుతంగా తానే శ్రీనివాసుడై, తానే పద్మావతియై, తానే పరిచారికయై, తానే అన్నమాచార్యులై అభినయించింది.స్వామి మరల శిలనుండి వచ్చి గర్భగుడిలో అంతటా నిలిచాడు. ఆమె సేవను అంగీకరించాడు.
భౌతికమైన ఆమె వేషభూషణలను చూసి దారితప్పిన మనసులతో ఉన్న 'భక్తులు ' సిగ్గుతో తలవంచుకున్నారు. తాము కోల్పోయిన అమూల్యమైన సమయాన్ని గుర్తించారు...ఏమీ పట్టకుండా ఆ కళాకారిణి స్వామి ప్రసాదం స్వీకరించి పూర్ణాత్మయై అక్కడి నుండి కదిలింది.

19, జనవరి 2016, మంగళవారం

సంక్రాంతి అరిసెలు

సంక్రాంతి అరిసెల ప్రహసనం గురించి ఈ చిన్ని కథ....

"అమ్మాయ్ సరస్వతీ! బియ్యం నానబోసావుటే? సరిగ్గా నానకపోతే నా చేతులు పడిపోయేలా దంచినా అవి నలగవే. పాకం బెల్లం తెప్పించావా? నీదేం పోయింది? నా దుంప తెగుతుందే" - తిరుమలమ్మ గారు మంచం మీది నుంచి కేకలు వేస్తోంది.

"ఇదిగో అత్తయ్యగారూ! నేను ఇక్కడ పెద్ద ముగ్గు పెట్టుకున్నా. క్షణానికోసారి మీరు అరిసెల గురించి కేకలు పెడితే నాకు చుక్కలు లెక్క తప్పుతున్నాయి. ఇప్పటికిది పదోసారి చుక్కలు మొదలు పెట్టటం..మీదేం పోయింది...ఓ అచ్చటా ముచ్చటా ఎప్పుడూ తిండి యావే.."

"ఓసి నీ జిమ్మడా! సంక్రాంతికి అరిసెలు నా చిన్నప్పటినుంచీ ఆనవాయితే...ఇదిగో నీ ధర్మాన బతుకున్న తరువాత మంచి అరిసె తినే భాగ్యం పోయింది. అయినా నిన్నని ఏమి ఉపయోగంలే. పోయిన ఆ పెద్ద మనిషిని అనాలి. నన్ను నీ పాలిట వదిలేసి ఆయన ఎంచక్కా ముందు వెళ్లిపోయారు. అంతా నా ప్రారబ్ధం".

"ఈవిడ అఘాయిత్యం కూల. ప్రతియేడూ గంపెడు అరిసెలు చేస్తూనే ఉంటా. కనుమునాటికి ఒక్కటి మిగిలితే ఒట్టు. అది నోరా, చెత్త కుండీనా. నా ఖర్మ, ఎర్రగా బుర్రగా ఉంటాడని మేన బావను చేసుకున్నా చూడు. అదీ నేను చేసిన తప్పు. మేనత్తైనా ఇసుమంత ప్రేమ కూడా లేదు..." అని మనసులో ఉక్రోషపడింది సరస్వతి.

గబగబా లేచి వెళ్లి క్రితం రోజు నానబోసిన రెండు కిలోల బియ్యం చూసింది. అమ్మో! చేయాల్సిన పని గుర్తుకు వచ్చేసరికి గుండె జారింది. పిండి కొట్టాలి, పాకం కుదరాలి, చలిమిడి చేయలి, వేయించాలి, అరిసెలను వత్తాలి...దీని దుంప తెగ. ఇది అవసరమా...అమ్మో! చేయకపోతే ఈవిడ నా బుర్ర తినేస్తుందే....అని విసుగ్గా లేచి వెళ్లి ముగ్గులో మగ్నమైంది.

ఉదయం 6 గంటలకు మొదలు పెట్టిన ముగ్గు తీరుగా వేసి రంగులు అద్ది, గొబ్బెమ్మలు పెట్టి, గుమ్మడి పూలు అలంకరించే సరికి ఎనిమిది. "ఓ సరసా! ముగ్గులేనా? కాఫీ ఏమన్నా ఉందా?" సుబ్బారావు కేక. సరస్వతి చేతి ఫిల్టర్ కాఫీ తాగితే కానీ సుబ్బారావు దినచర్య మొదలు కాదు. ఇంతలో తిరుమలమ్మ "సరస్వతీ! గుక్కెడు కాఫీ ఏమన్నా పోస్తావా లేదా? ప్రతిదీ అడగాలటే?"...మొదలు రామాయణం. ఉక్కిరిబిక్కిరి అయ్యేలా ఆర్డర్లు. గబగబా స్నానం చేసి వచ్చి అందరికీ కాఫీలు అందించింది సరస్వతి. ఫలహారాలు అయ్యాయి. "అత్తయ్యా! పిండి కొడదాం రండీ" అని పిలిచింది.

అరిసెల పిండి అనగానే తిరుమలమ్మకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది.

"సరస్వతీ! ఆ రోలు, రోకలి, కుదురు శుభ్రంగా కడిగి ఆరనివ్వు. లేకపోతే నిన్న నూరిన చింతకాయ పచ్చడి వాసన వస్తుంది బియ్యప్పిండి"...

"అబ్బా అత్తయ్యా! నా పెళ్లై ఇరవై ఏళ్లు. ప్రతి యేడాదీ చేసే పనే. మీరు మొదటి ఏడు చెప్పినట్లు చెప్పక్కర్లేదు..".

"అంతేనే! నిరుడు చూసానుగా! ముందు రోజు రోట్లో నువ్వు రుబ్బిన పండు మిరపకాయ కారం ఘాటు నాకు అరిసెల్లో తగిలి తీపి కారం అప్పాల్లా దేభ్యంగా వచ్చాయి..వాంతులు విరేచనాలు...ఎన్నాళ్లయ్యిందో చక్కటి నేతి అరిసెలు తిని"...తిరుమలమ్మ ఎకసెక్కాలు.

"ఆ! ఎందుకు గుర్తు లేదూ! అర్ధరాత్రి నాకు పండుమిరపకాయం కావాలి అని ఎవరో లేచి వంటిల్లంతా వెదుక్కుంటుంటే పోనీలే పాపం ముసలావిడ జిహ్వ చాపల్యం అని మర్నాడే కాయలు తెచ్చి నూరి పచ్చడి చేశా. కష్టపడి రుబ్బింది కదా, రోలు కడిగి పెడదాం అని ఒక్కరికి ఉండదు ఈ కొంపలో...నేను చెబుతున్నా వినకుండా ఆత్రంతో వెళ్లి మీ చత్వారపు కళ్లతో ఆ రోలును సరిగ్గా శుభ్రం చేయకుండా అరిసెల పిండి నూరింది మీరు...."...సరస్వతి ఉక్రోషం.

"అవునే! అరిసెలు చెడితే నేను కారణం, కుదిరితే నీ గొప్పతనం. ఎంత గడుగ్గాయివే సరస్వతీ! నేను అరిసెలు చేస్తేనా ఊళ్లో వాళ్లందరూ చెప్పుకునే వాళ్లు. నువ్వు చేస్తేనో ఇంట్లో వాళ్ల పళ్ళు ఊడాల్సిందే..." అని నసుగుకుంటూ వాకిట్లోకి వెళ్లింది తిరుమలమ్మ. అక్కడ కోడలు వేసిన ముగ్గు చూసి అవాక్కయ్యింది. "ఏమి పనితనం సరస్వతిది!? ఏడాది మీద ఏడాది దీని ముగ్గులు ఇంకా బాగా వస్తున్నాయి.  అమ్మో నా దిష్టి తగులుతుందేమో" అని గబ గబ లోపలికి వచ్చి "సరస్వతీ! ఆ ముగ్గు..." అని అనబోయింది. "ఆ నేనే వేశాను" అని అత్తగారి కళ్లలోకి చూసి ఆమె మెప్పును గ్రహించి గర్వపడి సమాధానం చెప్పింది.

అత్తా కోడలు పిండి దంచటం మొదలు పెట్టారు. తిరుమలమ్మ వయసులో ఉన్ననాటి రోకళ్లను దాచి కోడలికి ఇచ్చింది. ముందుగా తిరుమలమ్మ రోకటికి పసుపు తాడు కట్టి, నమస్కరించి దరువు మొదలు పెట్టింది. అత్తగారి ఉత్సాహానికి ముచ్చట పడి సరస్వతి కూడా లయబద్ధంగా దంచటం మొదలు పెట్టింది, రోకళ్లు కొట్టుకోకుండా ఒకరి తరువాత ఒకరు దంచటం మొదలు పెట్టారు. ఇంతలో సరస్వతి మదిలో చిలిపితనం విరిసింది. దానికి తిరుమలమ్మ వంత పాడింది

"అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మా కోడలు లేని అత్త గుణవంతురాలు ఆహుం ఆహుం"


"కోడలా కోడలా కొడుకు పెళ్లామా! పచ్చి పాల మీద మీగడేదమ్మ వేడి పాల లోన వెన్న ఏదమ్మా ఆహుం ఆహుం!"

"అత్తమ్మ నీ  చేత ఆరళ్లే గానీ ఓలెమ్మా పచ్చి పాల మీద మీగడుంటుందా వేడి పాల పైన వెన్న ఉంటుందా ఆహుం ఆహుం!"...

ఇలా ఒక వాయి బియ్యం చక చకా దంచేశారు. తిరుమలమ్మకు ఉత్సాహం రెట్టింపైంది.

"నోమీ నోమల్లాల నోమనన్నలాలో చందమామ చందమామ
 ఆవూరి మారాజు అయిదాణాలు ఇస్తేను ఈవూరి రాజు ముప్పావలిచ్చాడు.."

"రామ లచ్చన్నలాటి రాజులు లేరు సీతమ్మలాటి ఇల్లాలు లేదు
రామనా చందలాలో...."

అని వింజమూరి సోదరీమణులు పాడిన జానపద గీతాలు అందుకుంది. అత్తగారి ప్రతిభకు సరస్వతి ముచ్చటపడి మరింత వేగంగా దరువు వేసింది. ఆడుతూ పాడుతూ అత్తాకోడళ్లు పిండి దంచేశారు. "ఒరేయ్ సుబ్బారావ్! ఇక్కడ ఆడాళ్లం కష్టపడుతుంటే ఆ మడత కుర్చీలో నువ్వు విలాసం చూస్తున్నావా? వచ్చి పిండి జల్లెడ పట్టు"...అని కొడుకును కేక వేసింది. అమ్మ పిలుపుకు భయపడి ఒక్క ఉదుటున వచ్చి పిండి జల్లెడ పట్టాడు. వేళ్లతో పిండిని నులిమితే ఒక్క పలుకు తగిలితే ఒట్టు. అలాంటి జల్లెడ రోలు, రోకలి, కుదురుతో పాటు తిరుమలమ్మకు వారసత్వంగా వచ్చాయి. వాటిని అపురూపంగా చూసుకుంటుంది.

పిండికొట్టి అలిసిపోయిన అత్తాకోడళ్లకు మంచి ఫిల్టర్ కాఫీ ఇచ్చాడు సుబ్బారావు. "ఒరేయ్! ప్రాణం లేచి వచ్చింది రా కాఫీ తాగి. ఈ డెబ్బై ఏళ్ల వయసులో పిండి కొట్టే ఓపిక లేకపోయిన అరిసెలనేసరికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.." అమ్మ, భార్యల పనితనం చూసి నవ్వుకున్నాడు సుబ్బారావు. హిమాలయాలపై మంచులా నున్నగా మెరుస్తోంది అత్తాకోడళ్లు కొట్టిన బియ్యప్పిండి. దాన్ని గిన్నెలోకి ఎత్తి, గట్టిగా ఒత్తి మూత పెట్టింది సరస్వతి. అంతా గమనిస్తూనే ఉంది తిరుమలమ్మ.


"సరస్వతీ! పాకం బెల్లం తెప్పించమన్నాను తెప్పించావా?"...అత్త గారి అరుపు విని "అబ్బా! తెప్పించాను. నేను చూస్తున్నాను కదా?". మూతి తిప్పింది సరస్వతి. "ఆ! త్వరగా రా! అరిసెలలో అసలు పని ఇప్పుడే మొదలు"....నొక్కులు నొక్కింది తిరుమలమ్మ. వంటింట్లో అటకపైన ఉన్న బూందీ బాణలి, చిల్లుల గరిట, తను పెళ్లి సమయంలో అమ్మ ఇచ్చిన అరిసెలు ఒత్తుకునే చెక్కలు తీసింది. పుట్టింటి వాళ్లు గుర్తుకొచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి. సముదాయించుకొని వంటింట్లో అడుగు పెట్టింది.

ఇక మొదలైంది తిరుమలమ్మ రామాయణం "మా చిన్నప్పుడు మా అమ్మ అరిసెలు చేస్తే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండేవి. పదా ఇరవయ్యా, రెండొందల అరిసెలు చేసేది. మాలక్షమ్మ గారి అరిసెలంటే ఊరంతా ఎదురు చూసేవాళ్లు. ఎలా వస్తాయో ఏమిటో ఈరోజు...సరస్వతీ! పాకం బెల్లం రుచి చూడవే. ఉప్పు వేసిన బెల్లమైతే అరిసెలు రావే"..."అబ్బా! మనకు ఎప్పుడూ ఇచ్చే కొట్లోనే తెచ్చాను అత్తయ్యా! ఇదిగోండి" అని తురిమిన బెల్లం కాస్త తిరుమలమ్మ చేతిలో పెట్టి రుచి చూడమని సైగ చేసింది. బెల్లం రుచి చూసిన తిరుమలమ్మ నోటికి తాళం పడింది.  సత్తు గిన్నెలో బెల్లం పాకం పడుతూ తిరుమలమ్మ

"శుభములు కలిగించుమా విఘ్న వినాశక
అఘములు తొలగించుమా ముక్తి ప్రదాయక"

అని గణపతిని ప్రార్థించి పాకాన్ని పరీక్షించింది. "సరస్వతీ పాకం అయిపోయిందేవ్! పిండివేస్తాను కలుపుదువు రా" అని పాకంలో కాస్త నెయ్యి, ఏలకులు, పంచదార పొడి వేసింది. కమ్మని వాసన ఇల్లంతా గుబాళించింది.

"ఏవండీ! కాస్త ఆ కుండలో నిన్న కాచి పెట్టిన నెయ్యి ఉంది. తీసుకురండీ! నేతితో చేస్తేనే అరిసెలు..." అని భర్తను ఆదేశించింది సరస్వతి. నెలరోజులనుండి తన ఇంట్లో పిదికిన పాలు కాచి, తోడెసి, చిలికి వెన్న తీసి, కాచిన నెయ్యిని ఎవ్వరికీ కనపడకుండా కుండలో దాచింది సరస్వతి. తనకు నేతి అరిసెలు అంటే ప్రాణం.

అత్తగారి పిలుపుతో సరస్వతి వచ్చి పిండి పాకం గిన్నెలో వేసి కలపటం మొదలు పెట్టింది. గరిటె తిప్పుతూ,

"అందగాడే విష్ణుమూరితి వానికి అందించినాను అరిసెలీరీతి
విందులాయే విష్ణుమూరితి ఏలిక వరములిచ్చేటి వైభవకీర్తి...."

అని అత్తగారు పెళ్లైన కొత్తల్లో నేర్పిన పాటపాడింది. "సరస్వతీ నీ గొంతులో ఈ పాట ఎంత బాగుంటుందే" అని కోడలిని మెచ్చుకుంది తిరుమలమ్మ. అత్తగారు చలివిడిని చక్కగా ఒత్తి కోడలికిస్తే, కోడలు వాటిని కమ్మని నేతిలో వేయించి, అత్తగారికి తిరిగి ఇస్తే అత్తగారు వైనంగా వాటిని ఒత్తి ఆరబెట్టటం. నువ్వులద్ది కొన్ని, కొబ్బరి అరిసెలు కొన్ని, ఇలా రెండు గంటల పాటు అత్తాకోడళ్లు అరిసెల యజ్ఞం చేశారు. గంపెడు అరిసెలు అందంగా పేర్చింది సరస్వతి. అరిసెలు నివేదన చేసి, పెద్దలకు నమస్కరించి, అందరికీ తలా ఒకటి పెట్టింది.

"అబ్బా సరస్వతీ! అరిసెలు ఎంత మధురంగా ఉన్నాయే..." - తిరుమలమ్మ
"సరసా! అరిసెలు నీ అంత తీయగా ఉన్నాయోయ్...." - సుబ్బారావు
"అమ్మా! నీ అరిసెల రుచి ఇంకెక్కడా రాదు..." - పిల్లలు
"చిన్నమ్మగోరూ! మీ అరిసెలు తింటేనే సంకురోత్రి పండగమ్మా!.." - పాలేరు

ఇలా అందరూ పొగిడే సరికి పడ్డ కష్టమంతా మరచి మురిసిపోయింది సరస్వతి. అత్తగారి దగ్గరకు వెళ్లి "అత్తయ్యా! అరిసెలు చేయటం కష్టమైనా, మీరు ఉత్సాహంగా పక్కన ఉన్నారు కాబట్టి హాయిగా శ్రమ తెలియలేదు.." అంది కృతజ్ఞతా పూర్వకంగా.

"సరస్వతీ! పండగంటే నలుగురూ కలిసి చేసుకునే సంబరాలు. ఇందులో ప్రతిదీ కలిసి చేస్తే మరింత పండగ వాతావరణం వస్తుంది. ఆ ముగ్గులు, గొబ్బెమ్మలు, ఈ అరిసెలు, నీ చేతి పొంగలి, జంతికలు...ఇవేనే నాకున్న నిజమైన సంబరాలు. మీ మామయ్య పోయి పదిహేనేళ్లు అయినా ఇంకా బతికి ఉన్నానంటే నీ ప్రేమ అప్యాయతల వల్లనే. అదంతా నువ్వు చేసే పనుల్లో కనిపిస్తుంది. అదే పదివేలు..."

ఇల్లంతా పండగ వాతావరణం నిండిపోయింది. తెలుగులోగిలి వెలిగిపోయింది. 

5, జనవరి 2016, మంగళవారం

మటర్ పన్నీర్


మటర్ పన్నీర్




కావలసిన పదార్థాలు:

ఫ్రోజెన్ బఠాణీలు పావుకిలో
పన్నీర్ పావుకిలో
ఉల్లిపాయలు పెద్దవి మూడు
టమాటోలు పెద్దవి నాలుగు
కాస్త తరిగిన అల్లం
(కావలసిన వారు వెల్లుల్లి ముక్కలు)
ధనియాల పొడి
గరం మసాలా పొడి
తగినంత వంట నూనె, ఉప్పు, పసుపు మరియు కారం


చేసే విధానం:

ముందుగా ఉల్లిపాయలను సన్నగా తరుగుకోవాలి. టమాటో ముక్కలను గ్రైండర్లో వేసి గుజ్జు చేయాలి. బాణలిలో 3-4 చెంచాల నూనె వేసి అందులో ఉల్లిపాయలను, అల్లం తురుమును వేసి (వెల్లుల్లి తినేవారు ఆ ముక్కలను) ఎర్రబడేంత వరకు వేయించుకోవాలి. ఇవి రంగు మారిన తరువాత బాణలిలో టమాటో గుజ్జును వేసి కాసేపు తిప్పుతూ ఉండాలి. అందులో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి ఉడకనివ్వాలి. ఒక ఐదు నిమిషాల తరువాత ఫ్రోజెన్ బఠాణీలను బాగా కడిగి ఆ బాణలిలోని మిశ్రమంలో వేయాలి. బఠాణీలు మెత్తబడేలోపు పన్నీర్‌ను 1/2 అంగుళం పరిమాణంలో క్యూబ్స్‌గా కోసి బాణలిలో వేయాలి. ఒక ఐదు నిమిషాలు ఉడికిన తరువాత దించేయాలి. ఈ కూర వేడి వేడిగా చపాతీలు, పూరీలు లేదా అన్నంతో తింటే బాగుంటుంది. 

29, డిసెంబర్ 2015, మంగళవారం

కైలాసగిరి నుండి కాశికై - దేవులపల్లి వారి శివ భక్తి గీతం


కైలాసగిరి నుండి కాశికై
కాశికాపురి నుండి దాసికై
దాసికై ఈ దక్షవాటికై దయచేసినావయా 
హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర

విరిసె జాబిలి మల్లెరేఖగా కురిసె తేనియల మువ్వాకగా
దరిసి నీ దయ నిండు గోదావరీ నది ఝరులాయెరా 
హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర

ముక్కోటి దేవతల నేతరా ముల్లోకముల కిష్టదాతరా
వెలిబూది పూతరా నలవిసపు మేతరా 
హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మరో శివ భక్తి గీతం ఇది. ద్రాక్షారామంలోని భీమేశ్వరుడిపై రాసినట్లుగా చెబుతారు.ద్రాక్షారామ క్షేత్రం దక్షవాటిక అని పురాణాలలో చెప్పబడింది. పంచారమాలలో ప్రముఖమైనది ద్రాక్షారామం. వేల ఏళ్ల క్రితం నిర్మించబడిన ఈ క్షేత్రం దక్ష వాటిక అని నమ్మకం. భీమేశ్వరుడు మాణిక్యాంబతో కూడి వెలసిన క్షేత్రం ఇది. కాకినాడకు సమీపంలో ఉంటుంది ఈ క్షేత్రం. దేవులపల్లివారి స్వస్థలమక్కడి దగ్గరలోని పిఠాపురం.

దేవులపల్లివారి సాహిత్యంలో లాలిత్యంతో పాటు తెలుగుదనం నిండి విలక్షణంగా ఉంటుంది. తెలియని వారు ఆయన రాసిన గీతలాను వినగానే ఇది దేవులపల్లివారిదా అని అడుగుతారు. దానికి కారణం ఆయన గీతంలో కనబరచే భక్తితో పాటు ప్రత్యేకమైన పదప్రయోగం. దేవులపల్లి వారి శివ రచనలలో తప్పకుండా శివుని శిరసున ఉన్న చంద్రుని, ఒంటిన విభూతి, కంఠంలో గరళము మొదలైన భౌతిక లక్షణాలలో ఒక్కటైనా తప్పకుండా ప్రస్తావన చేస్తారు. శివుడు దయాసముద్రుడు. ప్రార్థన చేసినంతనే కరగిపోయే భక్తవశంకరుడు.

గౌతమముని ప్రార్థనతో శిరసునున్న గంగమ్మను గోదావరిగా శివుడు భువిపైకి పంపాడని శివపురాణం చెబుతుంది. ఆ పరమశివుని దయారూపమైన గోదావరి నది పరవళ్లను పాపికొండల వద్ద చూడవచ్చు. అందుకే గోదావరి నది ఒడ్డున, సమీపాన అనేక శైవ క్షేత్రాలు వెలిసాయి. కృష్ణశాస్త్రి గారి ఇతర భక్తి గీతాలలో లాగనే ఇందులో కూడా తెలుగుదనం ఉట్టిపడే పదప్రయోగం చేశారు.వెలిబూది, నలవిసం వంటి అరుదైన తెలుగు పదాలతో ఈ పాటకు ప్రాణం పోశారు దేవులపల్లి వారు. 1970వ దశకంతో ఆకాశవాణి హైదరాబాద్ మరియు విజయవాడ కేంద్రాల ద్వారా భక్తిరంజని కార్యక్రమంలో దేవులపల్లి వారి గీతాలు ప్రసారమయ్యేవి. అందులో ఈ కైలాసగిరి నుండి ఒకటి. పాలగుమ్మి విశ్వనాథం గారి సంగీతంలో వెలువడిన ఈ గీతం ఎంతో ప్రాచుర్యం పొందింది.

(పైన ఇచ్చిన లింకులో మూడవ నిమిషం వద్ద ఈ పాట మొదలవుతుంది)

24, డిసెంబర్ 2015, గురువారం

వేణు గానమ్ము వినిపించెనే - ఆచార్య ఆత్రేయ గీతం


వేణు గానమ్ము వినిపించెనే చిన్ని కృష్ణయ్య కనిపించడే

దోర వయసున్న కన్నియల హృదయాలను 
దోచుకున్నాడని విన్నాను చాడీలను
అంత మొనగాడటే వట్టి  కథలేనటే ఏది కనబడితే నిలవేసి అడగాలి వానినే

మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందటా
లేదు లేదనుచు లోకాలు చూపాడట
అంత మొనగాడటే వింత కథలేనటే ఏది కనబడితే కనులారా చూడాలి వానినే

దుడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
ఘల్లు ఘల్ఘల్లన ఒళ్లు ఝల్ఝల్లన తాను ఫణిరాజు పడగపై తారంగమాడేనట

కృష్ణునిపై రాయబడిన ప్రతిపాటలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే, ఆయన చూపిన లీలలను ఆయా విధముగా అనుభూతి చెంది రాసిన విలక్షణమైన ఆవిష్కరణలు అవి. హే కృష్ణా ముకుందా మురారీ అని సముద్రాల రాఘవాచార్యులు వారి రాస్తే అందులో లీలలను భక్తితో వర్ణించారు. అలాగే హే కృష్ణా యదుభూషణా అని  కొసరాజు గారి రాస్తే అది ఒక బ్రాహ్మణునికి కృష్ణునిపై గల సర్వస్య శరణాగతితో కూడిన భక్తికి ప్రతీకగా నిలిచింది. ఎన్నాళ్లని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా అని శాంతకుమారి పాడిన ఆత్రేయ గారి గీతం శ్రీనివాసునికై ఎదురు చూసే వకుళమాత అనన్యమైన కృష్ణుని భక్తిని సూచిస్తుంది. అలాగే, తెలవార వచ్చే తెలియక నా సామి అని మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి రాసిన గీతం బాలకృష్ణుని నిద్దురలేపే తల్లి యశోదమ్మ ప్రేమకు ప్రతీకగా శాశ్వతమైంది. ఇలా ఎన్నో సినీ గీతాలు కృష్ణ భక్తి సామ్రాజ్యంలో ప్రకాశిస్తునే ఉన్నాయి. కృష్ణభక్తిలో సింహ భాగం రాధ-గోపికలదే. ఎందుకంటే వారందరూ నేను అన్న భావనను మరచి స్వామిని ఆరాధించి తరించిన వారు. వారు సామాన్యమైన స్త్రీపురుష సంబంధాలకు అతీతమైన వారు. పరమపురుషుని హృదయాన నిలుపుకొని రమించి ముక్తులైన వారు. అందుకే వారితో స్వామి రాసలీలాడినా,చీరలు దోచినా, వెన్న దొంగిలించి తిన్నా,అన్ని పవిత్రమైన లీలలగానే నిలిచాయి.

అటువంటి ముగ్గురు గోపికల మనసును ప్రతింబించేదే ఈ వేణుగానమ్ము వినిపించెనే అన్న గీతం. ముగ్గురు అక్కచెల్లెళ్ల మీద చిత్రీకరించిన ఈ గీతాన్ని సిరిసంపదలు అన్న చిత్రానికి ఆచార్య ఆత్రేయ గారు రచించారు. శ్రీకృష్ణుని లీలలను చిలిపిగా వర్ణించి ప్రశ్నించే ఈ గీతంలో సోదరీమణులుగా సావిత్రి, వాసంతి, గిరిజ నటించారు. అద్భుతమైన అభినయ కౌశలాన్ని ప్రదర్శించారు. సావిత్రి గారి సినీ జీవితంలో ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. నాయకునిగా ఏఎన్నార్, ప్రధాన నాయికగా సావిత్రి నాటి సామాజిక పరిస్థితులను, విద్యావంతుల ఆలోచనలకు అద్దం పట్టారు.

ఇక గీతానికి వస్తే, మధురమైన వేణుగానం కృష్ణ ప్రేమకు ప్రతిబింబం. ఆ గానం వినిపిస్తోంది కానీ కృష్ణుడు కనిపించటం లేదు అని గోపికలు ప్రశ్నించే సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు నాయికలు. కృష్ణుడి జీవితంలో లీలలు ఎనలేనన్ని అయినా, ఆత్రేయ గారు గోపికల మనసులు దోచుకోవటం, మన్ను తిన్న నోట విశ్వాన్ని తల్లికి చూపించటం, కాళీయ మర్దనం అనే మూడు ఘట్టాలను తీసుకున్నారు. వీటికి భాగవతంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. దేహము వలననే మనకు నేను అన్న భావనతో మాయలో చిక్కుకుంటాము. గోపికలు ఈ భావనను తొలగించటానికే వారి వస్త్రాలను దొంగిలించి తిరిగి యిచ్చాడు కృష్ణుడు. నా బిడ్డ అన్న మాయలో గారాబంగా పెంచుతున్న యశోదకు విశ్వాన్ని చూపించి మాయను తొలగించాడు. లోకరక్షణకై కాళీయుని పొగరణచటానికి అతని తలపై ఎక్కి నాట్యం చేశాడు.ఇవన్నీ అద్భుతమైన లీలలు. ఈ విధంగా కృష్ణుని లీలావినోదంలో గోపకులమంతా మాయనుండి దూరం చేసి తనతో అనుసంధానం చేశాడు. ఈ లీలలను ఆత్రేయ గారు అద్భుతమైన పదజాలంతో వర్ణించారు. చిలిపిగా కృష్ణుని లీలలను ప్రశ్నించే రీతిలో సాగుతుంది ఈ గీతం. ఇన్ని చేష్టలు నిజంగా చేశాడా లేక ఉట్టి కథలేనా అని నాయికలు ప్రశ్నిస్తున్నట్లుగా అనిపించినా వారి హృదయాలలో ఆరాధనా భావం ఉందని అభినయంలో కనబరచారు. ముఖ్యంగా సావిత్రిగారి నటన ఈ పాటల ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆవిడ మహానటి అని ఎందుకన్నారో ఈ పాటలో ఓ గోపిక భావంతో ఆమె నటించి తీరు చూస్తే అర్థమవుతుంది.


ఈ పాటలోని కొన్ని అచ్చతెలుగు పదాలను గమనించండి - దోర వయసు,చాడీలు,తారంగం, ఘల్లు ఘల్లు, ఝల్లు ఝల్లు. ఈ పదాలే పాటకు ఆయువు పట్టు. కృష్ణుని చేష్టలకు గోపికలు యశోదమ్మకు చేసిన ఫిర్యాదులు ఎన్నో, చెప్పుకున్న చాడీలు ఎన్నో. వాటన్నిటిలో కన్నె మనసుల హృదయాలను దోచుకోవటం గురించి చెప్పటం గోకులం యొక్క వైభవాన్ని చాటుతుంది. తారంగమనేది చేతులతో చేసే విన్యాసం. కాళింది మడుగులో విషం చిమ్ముతున్న కాళీయుని పడగలపై నాట్యం చేస్తూ చేతులు తిప్పే కృష్ణుని లీలను తారంగమంటారు. దీనిని చిన్నపిల్లలకు తల్లులు చేసి వారిని ఆడించే సాప్రదాయం దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా తెలుగుజాతిలో ఉంది. కృష్ణుడు వేసే పద విన్యాసానికి తెలుగు భాష ఇచ్చిన అందమైన జంట పదం ఘల్లు ఘల్లు. అలాగే ఆనందంలో ఒళ్లు పులకరించటానికి ఝల్లు-ఝల్లున అనే జంట పదం. భాషకు ఆయువు పట్టు భావంతో పాటు, శబ్దము. కృష్ణుని తారంగం ఘల్లు-ఘల్లున చేస్తున్నాడు అనగానే ఆ బాలకృష్ణుని రూపము, ఆయన వేసే వ్యత్యస్త పాదములు, కాళ్లకు గజ్జలు కళ్ల ముందు నిలుస్తాయి. ఆత్రేయగారు వీటిని ఉపయోగించి గీతాన్ని శాశ్వతం చేశారు. కృష్ణ భక్తిలో నేనుకు తావిలేదు. అందుకే కృష్ణప్రాప్తి కలిగిన వారికి వేరేమీ అక్కరలేదు. ఎన్ని ఉన్నా అన్నిటికీ దూరమే. ప్రభువొక్కడే కావలసింది.

ఈ గీతానికి ఇంకో విశేషమేమిటంటే ముగ్గురు మేటి గాయనీమణులు కలిసిన పాడిన గీతం ఇది. సావిత్రి గారికి సుశీలమ్మ, వాసంతి గారికి జానకమ్మ, గిరిజ గారికి జిక్కి కృష్ణవేణి గారు మాధుర్య భరితమైన, విలక్షణమైన గానాన్ని అందించారు. మాష్టరు వేణు గారు మధుర్య ప్రధానమైన సంగీతానికి మరోపేరు. ఆయన ఇచ్చిన సంగీతం, ముగ్గురమ్మల గాత్రం, ముగ్గురు నటీమణుల నటనా చాతుర్యం ఈ గీతానికి ప్రత్యేకతనిచ్చాయి. ఇన్నేళ్లైన, ఎన్నిమార్లు విన్నా ఈ పాట వింటే అబ్బ ఎంత బాగుంది అనిపిస్తుంది.

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. 

11, డిసెంబర్ 2015, శుక్రవారం

ఎందుకయా సాంబశివా - దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి శివభక్తి గీతం


ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ

ఈ అల్లరి చేతలు ఈ బూడిత పూతలు ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ సాంబశివా సాంబశివా సాంబశివా

అలలతోటి గంగ పట్టి తలపాగా చుట్టి
నెలవంకను మల్లెపూవు కలికి తురాయిగ పెట్టి
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ సాంబశివా సాంబశివా సాంబశివా

తోలు గట్టి పటకాగా కాలాగ్నిని కుట్టి
కేల త్రిశూలము పట్టి ఫాలమందు కీల పెట్టి
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ సాంబశివా సాంబశివా సాంబశివా

రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర
ఎందుకయా ఈ దాసునికందవయా దయామయా
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ సాంబశివా సాంబశివా సాంబశివా



లలితమైన భక్తి గీతాల ప్రపంచంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది అగ్రస్థానమని చెప్పుకోవాలి. ఎందుకంటే, తెలుగు భాషలో ఆయన ఉపయోగించిన పదాలు, కనబరచిన భావ సౌందర్యం ఎవ్వరికీ అందనంత స్థాయిలో ఉంటాయి. ఆయన భక్తి గీతాలలో కనుమరుగవుతున్న పదాలు చెక్కుచెదరకుండా ప్రకాశిస్తుంటాయి. పదములె చాలు రామా అని ఆయన రాస్తే అది రాముని పాదాలను తాకిన ఒక సువర్ణ పుష్పంలా సాఫల్యాన్ని పొందింది. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు అని రాస్తే అది ఆ శ్రీహరి మెడలోని తులసి మాలలా రాజిల్లింది. ఏమి రామకథ శబరి శబరి అని రాస్తే, రామకథా సుధ యొక్క మాధుర్యాన్ని ఇప్పటికీ మనకు అందిస్తూనే ఉంది. అలాగే, కొలువైతివా రంగశాయి అని రచించితే ఆ శ్రీరంగ శాయి వైభవాన్ని మన కళ్లముందుంచుతుంది.

అలాగే, శివునిపై ఆయన ఎన్నో భక్తి గీతాలు రచించారు. ఆయన భక్తి సాహిత్య సంపదంతా ఆకాశవాణి ద్వారా, తెలుగు చలనచిత్రాల ద్వారా మనకు అందాయి. ఆ శివభక్తి గీతాలలో ఒకటి ఎందుకయా సాంబశివా.

శివతత్త్వం గమనిస్తే మొదట నిజంగానే అల్లరి చేష్టల లాగా అనిపిస్తుంది. కానీ, లయకారునికి కావలసిన లక్షణాలలో అదొకటి. మంచిని చెడును వైవిధ్యంగా కనబరుస్తూనే ప్రళయకాలంలో వాటి అతీతంగా ఉండటం, బూడిద పూతలు, నృత్యాలు, వేషభూషలు శివతత్త్వాన్ని కొంత సంశ్లిష్టంగా చేసినట్లు అనిపించినా శివుడు బోళాశంకరుడు. భక్తితో చెంబెడు నీళ్లు పోసినా, ఒక్క మారేడు దళం వేసినా, కాస్త విభూది పూసినా, ఎలుగెత్తి పాడినా, నర్తించినా అనుగ్రహిస్తాడు. ఏమీ లేకున్నా ఓం నమశ్శివాయ అని తలచితే చాలు పలుకుతాడు. ఆ పరమశివునితో సంభాషణలాంటి ఈ గీతంలో ఆయన రూపగుణ వైభవాలను నుతిస్తూనే తనకు ఎందుకు కనిపించటం లేదని ప్రశ్నిస్తున్నారు కృష్ణశాస్త్రి గారు. సాంబశివ అనే పదానికి విశేషమైన అర్థముంది. స+అంబ = సాంబ...అంబతో కూడిన శివుడు. అంటే సాంబశివుడు అవిభాజ్యమైన అర్థనారీశ్వర తత్త్వాన్ని సూచిస్తుంది. శివుని నుతిస్తే అమ్మను నుతించినట్లే అని సాంబశివ నామం చెబుతుంది.

ఓ సాంబశివా! ఈ బూడిదలు పూసుకోవటం, ఈ అల్లరి చేష్టలు చేయటం ఎందుకు. ఎవరు నీకు చెప్పేది? అలలతో ఉరకలేసి పరుగెడుతున్న గంగను పట్టి తలపాగాలా ఉన్న నీ జటాఝూటాలలో చుట్టావు. చంద్రవంకను తెల్లని కలికితురాయిగా పెట్టావు. కరి మరియు పులి చర్మాన్ని ధరించి, దానికి నడుము కట్టుగా కాలాగ్నిని చుట్టి, చేతిలో త్రిశూలము పట్టుకొని, నుదుటన అగ్నిని మూడో కన్నుగా పెట్టావు. ఓ శివా! నువ్వు ప్రళయాన్ని కలిగించే రుద్రుడవో, కరుణాసముద్రుడవో! ఓ దయామయా! ఈ దాసునికి ఎందుకు కనిపించవు?

ఈ గీతంలో శివుని విలక్షణమైన లక్షణాలను ఎన్నో ప్రస్తావించారు దేవులపల్లి వారు. గంగావతరణంలో భగీరథుడు తన పూర్వీకులకు ముక్తిని కలిగించటానికి బ్రహ్మకై తపస్సు చేయగా, బ్రహ్మ ప్రత్యక్షమై సురగంగను భువికి తీసుకు రావాలంటే ఆ గంగ ఉధృతిని లోకాలు తట్టుకోలేవు, కాబట్టి శంకరుని ప్రార్థించమంటాడు. శంకరుడు భగీరథుని తపస్సుకు మెచ్చి తన శిరస్సులో గంగను ధరించటానికి అంగీకరిస్తాడు. తరువాత భువి మీదకు ప్రవహింప జేస్తాడు. అలా ఆ గంగమ్మ ఈ కర్మభూమిలో ప్రవేశించి సగర పుత్రులతో పాటు ఇప్పటికీ మనందరికీ ముక్తిని కలిగిస్తూనే ఉంది. గంగను ధరించాడు కాబట్టి గంగను కూడా శివుని భార్యగానే భావిస్తారు. అదీ ఈ జటాఝూటాలలోని గంగమ్మ గాథ.

ఇక తరువాత సిగపై నెలవంక...దీనికి కూడా వివరణ ఉంది. దక్షప్రజాపతి 27 మంది కూతుళ్లను చంద్రుడు వివాహమాడుతాడు. కానీ, అతనికి ఒక్క రోహిణి అంటేనే ఎక్కువ మక్కువ. అందుకు మిగిలిన వారు కోపగించి తండ్రికి చెప్పగా, దక్షుడు చంద్రునికి హితవు పలుకుతాడు. అయినా చంద్రుడు మార్చుకోడు. అప్పుడు దక్షుడు చంద్రుని ఆతని ప్రకాశం క్షీణించేలా శపిస్తాడు. ఏమి చేయాలో తోచక చంద్రుడు బ్రహ్మదేవుని ప్రార్థించగా బ్రహ్మ చంద్రుని శివుని ప్రార్థించమంటాడు. చంద్రుడు ప్రభాస తీర్థం వెళ్లి సరస్వతీ నది తీర్థం వద్ద శివలింగం చేసి శివుని పూజిస్తాడు. అతని ప్రార్థనకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై దక్షుని శాపానికి పూర్తి నివృత్తి లేదు కానీ పక్షం రోజులు క్షీణ దశ, పక్షం రోజులు వృద్ధిగా ఉంటుంది అని వరమిస్తాడు. కానీ కృష్ణ పక్షంలో చంద్రుడు తన క్షీణతను చూసి సిగ్గు పడి తండ్రి అయిన సముద్రుని గర్భంలో దాగుంటాడు. చంద్రుడు లేకపోవడంతో లోకంలో చంద్రకాంతి అవసరమైన ఔషధ మొక్కలు ఔషధ గుణాలను కోల్పోతాయి. అంతే కాకుండా, చంద్రుడు లేనందువలన లోకంలో ఎన్నో అనర్థాలు కలుగుతాయి. అప్పుడు దేవతలు చంద్రుడిని మళ్లీ శివుని ప్రార్థించమంటారు. శివుడు చంద్రుని ప్రార్థనను మెచ్చి తన శిరసుపై ధరించి చంద్రుని క్షీణతను, వృద్ధిని నియంత్రిస్తూ,  చంద్రునికి ప్రాభవమిచ్చి లోక కళ్యాణానికి తోడ్పడ్డాడు.

శివుడు కరి చర్మాన్ని ధరిస్తాడు కాబట్టి తోలు కట్టి అన్నారు కృష్ణ శాస్త్రి గారు. దానికి కూడా గాథ ఉంది, గజాసురుని సంహారం తరువాత ఆతనికిచ్చిన వరం మేరకు అతని చర్మాన్ని ధరిస్తాడు. ఇక కాలాగ్నిని నడుం కట్టుగా ధరిస్తాడు అన్నదానికి పటకాగా కాలాగ్నిని చుట్టి అన్నారు కవి. ప్రళయకాలంలో కాలాగ్నిని శివుడు ప్రత్యక్షం చేసి దానితో విలయ తాండవం చేస్తాడు. మిగిలిన సమయమంతా ఆ కాలాగ్నిని తన నడుముకు చుట్టుకొని ఉంటాడు. అనగా కాలాన్ని శాసించే వాడు శివుడు.  శివుని త్రిశూలానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. త్రిమూర్తులకు, త్రిగుణాలకు, త్రిశక్తులు (ఇచ్ఛా, క్రియా, జ్ఞానములు), త్రినాడులకు (ఇడ, పింగళ,సుషుమ్న) , త్రికాలములకు (భూత, వర్తమాన, భవిష్యత్) ప్రతీకగా నిలిచింది. జ్ఞానానికి, బుద్ధికి, చేతనకు ప్రతీకగా మూడవ నేత్రము చెప్పబడింది. అందుకనే అక్కడ అగ్నిని నిలిపాడు శివుడు.

కృష్ణశాస్త్రి గారి గీతాలలో ఈ శైలి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది పైకి ఆకృతి వర్ణనగా అనిపించినా పదప్రయోగాన్ని పరిశీలిస్తే ఎంతో లోతైన భావం దాగి ఉంటుంది. శివుని ఆయుధాలు, రూపము వెనుక నిగూఢార్థములు తెలిసిన యోగి కృష్ణశాస్త్రిగారు. పాలగుమ్మి విశ్వనాథం గారు ఈ గీతానికి సంగీతం కూర్చగా దీనిని ఆకాశవాణి భక్తిరంజని కార్యక్రమంలో ప్రసారం చేయబడింది. కేబీకే మోహన్‌రాజు గారు బృందంతో కలిసి ఈ గీతాన్ని పాడారు. దశాబ్దాలు గడిచిపోయినా ఇప్పటికీ పాట తనకున్న ప్రత్యేక స్థానాన్ని కోల్పోలేదు. 

భవనుత నా హృదయమున రమింపుము - త్యాగరాజస్వామి కృతి

భవనుత నా హృదయమున రమింపుము బడలిక దీర భవతారక నాతో బహుపల్కిన బడలిక దీర కమల సం"భవనుత" పవనసుతప్రియ తనకై తిరిగిన బడడలిక దీర భవనము చేరి న...