RightClickBlocker

11, డిసెంబర్ 2015, శుక్రవారం

ఎందుకయా సాంబశివా - దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి శివభక్తి గీతం


ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ

ఈ అల్లరి చేతలు ఈ బూడిత పూతలు ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ సాంబశివా సాంబశివా సాంబశివా

అలలతోటి గంగ పట్టి తలపాగా చుట్టి
నెలవంకను మల్లెపూవు కలికి తురాయిగ పెట్టి
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ సాంబశివా సాంబశివా సాంబశివా

తోలు గట్టి పటకాగా కాలాగ్నిని కుట్టి
కేల త్రిశూలము పట్టి ఫాలమందు కీల పెట్టి
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ సాంబశివా సాంబశివా సాంబశివా

రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర
ఎందుకయా ఈ దాసునికందవయా దయామయా
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ సాంబశివా సాంబశివా సాంబశివాలలితమైన భక్తి గీతాల ప్రపంచంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది అగ్రస్థానమని చెప్పుకోవాలి. ఎందుకంటే, తెలుగు భాషలో ఆయన ఉపయోగించిన పదాలు, కనబరచిన భావ సౌందర్యం ఎవ్వరికీ అందనంత స్థాయిలో ఉంటాయి. ఆయన భక్తి గీతాలలో కనుమరుగవుతున్న పదాలు చెక్కుచెదరకుండా ప్రకాశిస్తుంటాయి. పదములె చాలు రామా అని ఆయన రాస్తే అది రాముని పాదాలను తాకిన ఒక సువర్ణ పుష్పంలా సాఫల్యాన్ని పొందింది. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు అని రాస్తే అది ఆ శ్రీహరి మెడలోని తులసి మాలలా రాజిల్లింది. ఏమి రామకథ శబరి శబరి అని రాస్తే, రామకథా సుధ యొక్క మాధుర్యాన్ని ఇప్పటికీ మనకు అందిస్తూనే ఉంది. అలాగే, కొలువైతివా రంగశాయి అని రచించితే ఆ శ్రీరంగ శాయి వైభవాన్ని మన కళ్లముందుంచుతుంది.

అలాగే, శివునిపై ఆయన ఎన్నో భక్తి గీతాలు రచించారు. ఆయన భక్తి సాహిత్య సంపదంతా ఆకాశవాణి ద్వారా, తెలుగు చలనచిత్రాల ద్వారా మనకు అందాయి. ఆ శివభక్తి గీతాలలో ఒకటి ఎందుకయా సాంబశివా.

శివతత్త్వం గమనిస్తే మొదట నిజంగానే అల్లరి చేష్టల లాగా అనిపిస్తుంది. కానీ, లయకారునికి కావలసిన లక్షణాలలో అదొకటి. మంచిని చెడును వైవిధ్యంగా కనబరుస్తూనే ప్రళయకాలంలో వాటి అతీతంగా ఉండటం, బూడిద పూతలు, నృత్యాలు, వేషభూషలు శివతత్త్వాన్ని కొంత సంశ్లిష్టంగా చేసినట్లు అనిపించినా శివుడు బోళాశంకరుడు. భక్తితో చెంబెడు నీళ్లు పోసినా, ఒక్క మారేడు దళం వేసినా, కాస్త విభూది పూసినా, ఎలుగెత్తి పాడినా, నర్తించినా అనుగ్రహిస్తాడు. ఏమీ లేకున్నా ఓం నమశ్శివాయ అని తలచితే చాలు పలుకుతాడు. ఆ పరమశివునితో సంభాషణలాంటి ఈ గీతంలో ఆయన రూపగుణ వైభవాలను నుతిస్తూనే తనకు ఎందుకు కనిపించటం లేదని ప్రశ్నిస్తున్నారు కృష్ణశాస్త్రి గారు. సాంబశివ అనే పదానికి విశేషమైన అర్థముంది. స+అంబ = సాంబ...అంబతో కూడిన శివుడు. అంటే సాంబశివుడు అవిభాజ్యమైన అర్థనారీశ్వర తత్త్వాన్ని సూచిస్తుంది. శివుని నుతిస్తే అమ్మను నుతించినట్లే అని సాంబశివ నామం చెబుతుంది.

ఓ సాంబశివా! ఈ బూడిదలు పూసుకోవటం, ఈ అల్లరి చేష్టలు చేయటం ఎందుకు. ఎవరు నీకు చెప్పేది? అలలతో ఉరకలేసి పరుగెడుతున్న గంగను పట్టి తలపాగాలా ఉన్న నీ జటాఝూటాలలో చుట్టావు. చంద్రవంకను తెల్లని కలికితురాయిగా పెట్టావు. కరి మరియు పులి చర్మాన్ని ధరించి, దానికి నడుము కట్టుగా కాలాగ్నిని చుట్టి, చేతిలో త్రిశూలము పట్టుకొని, నుదుటన అగ్నిని మూడో కన్నుగా పెట్టావు. ఓ శివా! నువ్వు ప్రళయాన్ని కలిగించే రుద్రుడవో, కరుణాసముద్రుడవో! ఓ దయామయా! ఈ దాసునికి ఎందుకు కనిపించవు?

ఈ గీతంలో శివుని విలక్షణమైన లక్షణాలను ఎన్నో ప్రస్తావించారు దేవులపల్లి వారు. గంగావతరణంలో భగీరథుడు తన పూర్వీకులకు ముక్తిని కలిగించటానికి బ్రహ్మకై తపస్సు చేయగా, బ్రహ్మ ప్రత్యక్షమై సురగంగను భువికి తీసుకు రావాలంటే ఆ గంగ ఉధృతిని లోకాలు తట్టుకోలేవు, కాబట్టి శంకరుని ప్రార్థించమంటాడు. శంకరుడు భగీరథుని తపస్సుకు మెచ్చి తన శిరస్సులో గంగను ధరించటానికి అంగీకరిస్తాడు. తరువాత భువి మీదకు ప్రవహింప జేస్తాడు. అలా ఆ గంగమ్మ ఈ కర్మభూమిలో ప్రవేశించి సగర పుత్రులతో పాటు ఇప్పటికీ మనందరికీ ముక్తిని కలిగిస్తూనే ఉంది. గంగను ధరించాడు కాబట్టి గంగను కూడా శివుని భార్యగానే భావిస్తారు. అదీ ఈ జటాఝూటాలలోని గంగమ్మ గాథ.

ఇక తరువాత సిగపై నెలవంక...దీనికి కూడా వివరణ ఉంది. దక్షప్రజాపతి 27 మంది కూతుళ్లను చంద్రుడు వివాహమాడుతాడు. కానీ, అతనికి ఒక్క రోహిణి అంటేనే ఎక్కువ మక్కువ. అందుకు మిగిలిన వారు కోపగించి తండ్రికి చెప్పగా, దక్షుడు చంద్రునికి హితవు పలుకుతాడు. అయినా చంద్రుడు మార్చుకోడు. అప్పుడు దక్షుడు చంద్రుని ఆతని ప్రకాశం క్షీణించేలా శపిస్తాడు. ఏమి చేయాలో తోచక చంద్రుడు బ్రహ్మదేవుని ప్రార్థించగా బ్రహ్మ చంద్రుని శివుని ప్రార్థించమంటాడు. చంద్రుడు ప్రభాస తీర్థం వెళ్లి సరస్వతీ నది తీర్థం వద్ద శివలింగం చేసి శివుని పూజిస్తాడు. అతని ప్రార్థనకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై దక్షుని శాపానికి పూర్తి నివృత్తి లేదు కానీ పక్షం రోజులు క్షీణ దశ, పక్షం రోజులు వృద్ధిగా ఉంటుంది అని వరమిస్తాడు. కానీ కృష్ణ పక్షంలో చంద్రుడు తన క్షీణతను చూసి సిగ్గు పడి తండ్రి అయిన సముద్రుని గర్భంలో దాగుంటాడు. చంద్రుడు లేకపోవడంతో లోకంలో చంద్రకాంతి అవసరమైన ఔషధ మొక్కలు ఔషధ గుణాలను కోల్పోతాయి. అంతే కాకుండా, చంద్రుడు లేనందువలన లోకంలో ఎన్నో అనర్థాలు కలుగుతాయి. అప్పుడు దేవతలు చంద్రుడిని మళ్లీ శివుని ప్రార్థించమంటారు. శివుడు చంద్రుని ప్రార్థనను మెచ్చి తన శిరసుపై ధరించి చంద్రుని క్షీణతను, వృద్ధిని నియంత్రిస్తూ,  చంద్రునికి ప్రాభవమిచ్చి లోక కళ్యాణానికి తోడ్పడ్డాడు.

శివుడు కరి చర్మాన్ని ధరిస్తాడు కాబట్టి తోలు కట్టి అన్నారు కృష్ణ శాస్త్రి గారు. దానికి కూడా గాథ ఉంది, గజాసురుని సంహారం తరువాత ఆతనికిచ్చిన వరం మేరకు అతని చర్మాన్ని ధరిస్తాడు. ఇక కాలాగ్నిని నడుం కట్టుగా ధరిస్తాడు అన్నదానికి పటకాగా కాలాగ్నిని చుట్టి అన్నారు కవి. ప్రళయకాలంలో కాలాగ్నిని శివుడు ప్రత్యక్షం చేసి దానితో విలయ తాండవం చేస్తాడు. మిగిలిన సమయమంతా ఆ కాలాగ్నిని తన నడుముకు చుట్టుకొని ఉంటాడు. అనగా కాలాన్ని శాసించే వాడు శివుడు.  శివుని త్రిశూలానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. త్రిమూర్తులకు, త్రిగుణాలకు, త్రిశక్తులు (ఇచ్ఛా, క్రియా, జ్ఞానములు), త్రినాడులకు (ఇడ, పింగళ,సుషుమ్న) , త్రికాలములకు (భూత, వర్తమాన, భవిష్యత్) ప్రతీకగా నిలిచింది. జ్ఞానానికి, బుద్ధికి, చేతనకు ప్రతీకగా మూడవ నేత్రము చెప్పబడింది. అందుకనే అక్కడ అగ్నిని నిలిపాడు శివుడు.

కృష్ణశాస్త్రి గారి గీతాలలో ఈ శైలి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది పైకి ఆకృతి వర్ణనగా అనిపించినా పదప్రయోగాన్ని పరిశీలిస్తే ఎంతో లోతైన భావం దాగి ఉంటుంది. శివుని ఆయుధాలు, రూపము వెనుక నిగూఢార్థములు తెలిసిన యోగి కృష్ణశాస్త్రిగారు. పాలగుమ్మి విశ్వనాథం గారు ఈ గీతానికి సంగీతం కూర్చగా దీనిని ఆకాశవాణి భక్తిరంజని కార్యక్రమంలో ప్రసారం చేయబడింది. కేబీకే మోహన్‌రాజు గారు బృందంతో కలిసి ఈ గీతాన్ని పాడారు. దశాబ్దాలు గడిచిపోయినా ఇప్పటికీ పాట తనకున్న ప్రత్యేక స్థానాన్ని కోల్పోలేదు. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి