వేణు గానమ్ము వినిపించెనే చిన్ని కృష్ణయ్య కనిపించడే
దోర వయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను
అంత మొనగాడటే వట్టి కథలేనటే ఏది కనబడితే నిలవేసి అడగాలి వానినే
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందటా
లేదు లేదనుచు లోకాలు చూపాడట
అంత మొనగాడటే వింత కథలేనటే ఏది కనబడితే కనులారా చూడాలి వానినే
దుడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
ఘల్లు ఘల్ఘల్లన ఒళ్లు ఝల్ఝల్లన తాను ఫణిరాజు పడగపై తారంగమాడేనట
కృష్ణునిపై రాయబడిన ప్రతిపాటలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే, ఆయన చూపిన లీలలను ఆయా విధముగా అనుభూతి చెంది రాసిన విలక్షణమైన ఆవిష్కరణలు అవి. హే కృష్ణా ముకుందా మురారీ అని సముద్రాల రాఘవాచార్యులు వారి రాస్తే అందులో లీలలను భక్తితో వర్ణించారు. అలాగే హే కృష్ణా యదుభూషణా అని కొసరాజు గారి రాస్తే అది ఒక బ్రాహ్మణునికి కృష్ణునిపై గల సర్వస్య శరణాగతితో కూడిన భక్తికి ప్రతీకగా నిలిచింది. ఎన్నాళ్లని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా అని శాంతకుమారి పాడిన ఆత్రేయ గారి గీతం శ్రీనివాసునికై ఎదురు చూసే వకుళమాత అనన్యమైన కృష్ణుని భక్తిని సూచిస్తుంది. అలాగే, తెలవార వచ్చే తెలియక నా సామి అని మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి రాసిన గీతం బాలకృష్ణుని నిద్దురలేపే తల్లి యశోదమ్మ ప్రేమకు ప్రతీకగా శాశ్వతమైంది. ఇలా ఎన్నో సినీ గీతాలు కృష్ణ భక్తి సామ్రాజ్యంలో ప్రకాశిస్తునే ఉన్నాయి. కృష్ణభక్తిలో సింహ భాగం రాధ-గోపికలదే. ఎందుకంటే వారందరూ నేను అన్న భావనను మరచి స్వామిని ఆరాధించి తరించిన వారు. వారు సామాన్యమైన స్త్రీపురుష సంబంధాలకు అతీతమైన వారు. పరమపురుషుని హృదయాన నిలుపుకొని రమించి ముక్తులైన వారు. అందుకే వారితో స్వామి రాసలీలాడినా,చీరలు దోచినా, వెన్న దొంగిలించి తిన్నా,అన్ని పవిత్రమైన లీలలగానే నిలిచాయి.
అటువంటి ముగ్గురు గోపికల మనసును ప్రతింబించేదే ఈ వేణుగానమ్ము వినిపించెనే అన్న గీతం. ముగ్గురు అక్కచెల్లెళ్ల మీద చిత్రీకరించిన ఈ గీతాన్ని సిరిసంపదలు అన్న చిత్రానికి ఆచార్య ఆత్రేయ గారు రచించారు. శ్రీకృష్ణుని లీలలను చిలిపిగా వర్ణించి ప్రశ్నించే ఈ గీతంలో సోదరీమణులుగా సావిత్రి, వాసంతి, గిరిజ నటించారు. అద్భుతమైన అభినయ కౌశలాన్ని ప్రదర్శించారు. సావిత్రి గారి సినీ జీవితంలో ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. నాయకునిగా ఏఎన్నార్, ప్రధాన నాయికగా సావిత్రి నాటి సామాజిక పరిస్థితులను, విద్యావంతుల ఆలోచనలకు అద్దం పట్టారు.
ఇక గీతానికి వస్తే, మధురమైన వేణుగానం కృష్ణ ప్రేమకు ప్రతిబింబం. ఆ గానం వినిపిస్తోంది కానీ కృష్ణుడు కనిపించటం లేదు అని గోపికలు ప్రశ్నించే సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు నాయికలు. కృష్ణుడి జీవితంలో లీలలు ఎనలేనన్ని అయినా, ఆత్రేయ గారు గోపికల మనసులు దోచుకోవటం, మన్ను తిన్న నోట విశ్వాన్ని తల్లికి చూపించటం, కాళీయ మర్దనం అనే మూడు ఘట్టాలను తీసుకున్నారు. వీటికి భాగవతంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. దేహము వలననే మనకు నేను అన్న భావనతో మాయలో చిక్కుకుంటాము. గోపికలు ఈ భావనను తొలగించటానికే వారి వస్త్రాలను దొంగిలించి తిరిగి యిచ్చాడు కృష్ణుడు. నా బిడ్డ అన్న మాయలో గారాబంగా పెంచుతున్న యశోదకు విశ్వాన్ని చూపించి మాయను తొలగించాడు. లోకరక్షణకై కాళీయుని పొగరణచటానికి అతని తలపై ఎక్కి నాట్యం చేశాడు.ఇవన్నీ అద్భుతమైన లీలలు. ఈ విధంగా కృష్ణుని లీలావినోదంలో గోపకులమంతా మాయనుండి దూరం చేసి తనతో అనుసంధానం చేశాడు. ఈ లీలలను ఆత్రేయ గారు అద్భుతమైన పదజాలంతో వర్ణించారు. చిలిపిగా కృష్ణుని లీలలను ప్రశ్నించే రీతిలో సాగుతుంది ఈ గీతం. ఇన్ని చేష్టలు నిజంగా చేశాడా లేక ఉట్టి కథలేనా అని నాయికలు ప్రశ్నిస్తున్నట్లుగా అనిపించినా వారి హృదయాలలో ఆరాధనా భావం ఉందని అభినయంలో కనబరచారు. ముఖ్యంగా సావిత్రిగారి నటన ఈ పాటల ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆవిడ మహానటి అని ఎందుకన్నారో ఈ పాటలో ఓ గోపిక భావంతో ఆమె నటించి తీరు చూస్తే అర్థమవుతుంది.
ఈ పాటలోని కొన్ని అచ్చతెలుగు పదాలను గమనించండి - దోర వయసు,చాడీలు,తారంగం, ఘల్లు ఘల్లు, ఝల్లు ఝల్లు. ఈ పదాలే పాటకు ఆయువు పట్టు. కృష్ణుని చేష్టలకు గోపికలు యశోదమ్మకు చేసిన ఫిర్యాదులు ఎన్నో, చెప్పుకున్న చాడీలు ఎన్నో. వాటన్నిటిలో కన్నె మనసుల హృదయాలను దోచుకోవటం గురించి చెప్పటం గోకులం యొక్క వైభవాన్ని చాటుతుంది. తారంగమనేది చేతులతో చేసే విన్యాసం. కాళింది మడుగులో విషం చిమ్ముతున్న కాళీయుని పడగలపై నాట్యం చేస్తూ చేతులు తిప్పే కృష్ణుని లీలను తారంగమంటారు. దీనిని చిన్నపిల్లలకు తల్లులు చేసి వారిని ఆడించే సాప్రదాయం దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా తెలుగుజాతిలో ఉంది. కృష్ణుడు వేసే పద విన్యాసానికి తెలుగు భాష ఇచ్చిన అందమైన జంట పదం ఘల్లు ఘల్లు. అలాగే ఆనందంలో ఒళ్లు పులకరించటానికి ఝల్లు-ఝల్లున అనే జంట పదం. భాషకు ఆయువు పట్టు భావంతో పాటు, శబ్దము. కృష్ణుని తారంగం ఘల్లు-ఘల్లున చేస్తున్నాడు అనగానే ఆ బాలకృష్ణుని రూపము, ఆయన వేసే వ్యత్యస్త పాదములు, కాళ్లకు గజ్జలు కళ్ల ముందు నిలుస్తాయి. ఆత్రేయగారు వీటిని ఉపయోగించి గీతాన్ని శాశ్వతం చేశారు. కృష్ణ భక్తిలో నేనుకు తావిలేదు. అందుకే కృష్ణప్రాప్తి కలిగిన వారికి వేరేమీ అక్కరలేదు. ఎన్ని ఉన్నా అన్నిటికీ దూరమే. ప్రభువొక్కడే కావలసింది.
ఈ గీతానికి ఇంకో విశేషమేమిటంటే ముగ్గురు మేటి గాయనీమణులు కలిసిన పాడిన గీతం ఇది. సావిత్రి గారికి సుశీలమ్మ, వాసంతి గారికి జానకమ్మ, గిరిజ గారికి జిక్కి కృష్ణవేణి గారు మాధుర్య భరితమైన, విలక్షణమైన గానాన్ని అందించారు. మాష్టరు వేణు గారు మధుర్య ప్రధానమైన సంగీతానికి మరోపేరు. ఆయన ఇచ్చిన సంగీతం, ముగ్గురమ్మల గాత్రం, ముగ్గురు నటీమణుల నటనా చాతుర్యం ఈ గీతానికి ప్రత్యేకతనిచ్చాయి. ఇన్నేళ్లైన, ఎన్నిమార్లు విన్నా ఈ పాట వింటే అబ్బ ఎంత బాగుంది అనిపిస్తుంది.
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి