గుళ్లో రామాయణాలు - 2
==================
భార్య - "ఏవండీ! తిరుమల వెళదాము ఏదాది పైన అయిపోయింది. పైగా మొక్కుంది. మొన్న పిల్లవాడు పదో తరగతి పాసైతే వస్తానని మొక్కుకున్నాను."
భర్త - "తిరుమల అంటే ఏమన్నా పక్క వీధిలోని గుడి అనుకున్నావా? దర్శనం, ఉండటానికి ఏర్పాట్లు, రైలు టికెట్లు..."
భార్య - "మన పక్కింటి అన్నయ్యగారి స్నేహితుడు తిరుమలలో ఎక్జిక్యూటివ్ ఆఫీసరు కింద పని చేస్తారుట. అడుగుదామా?"
భర్త - "అలాగే! వివరాలన్నీ కనుక్కో, నేను రైలు టికెట్ల సంగతి చూస్తాను"
పక్కింటాయన ద్వారా సిఫారసు లెటరు తీసుకొని తిరుమల చేరుకున్నారు. ఎలా దర్శనం టికెట్లు సంపాదించాలన్నదే ధ్యాస. పరుగు పరుగున పద్మావతీ గెస్ట్ హౌజ్ వద్ద ఉన్న కార్యాలయానికి వెళ్లాడు.
"ఈ సిఫారసులు నడవవండీ. ఈ మధ్యనే యాజమాన్యం ఈ కోటాను రద్దు చేసింది..."...
ఎంత సేపు ప్రయత్నించినా ఆ ఉద్యోగి ఒప్పుకోలేదు. వెంటనే భర్త మదిలో లంచం అనే అస్త్రం మెరిసింది.
"అయ్యా! మేము హైదరాబాదునుండి వచ్చాము. పిల్లాడి పరీక్ష పాసైన మొక్కు ఉంది. మళ్లీ రావటం కష్టం. ఈ వెయ్యి రూపాయలు..."
"ఇదిగో! నేనెల కనబడుతున్నాను? ఆ వేంకటేశ్వరుడు కోపగిస్తే ఇంకేమైనా ఉందా?"
నిరాశతో వెనుదిరిగి కార్యాలయం గుమ్మం దాటబోతున్నాడు. వెనుకనుండి తితిదే ఉద్యోగి పిలుపు..
పక్కకు పిలిచి "ఇంకో వెయ్యి ఇస్తే నీ పనవుతుంది..."...ఎగిరి గంతేశాడు ఆ వ్యక్తి. జేబులోంచి రెండు వేలు తీసి ఆ ఉద్యోగి చేతులో పెట్టాడు. బ్రేక్ దర్శనం టికెట్లు, పద్మావతీ గెస్ట్ హౌజ్‌లో బస సంపాదించాడు.
బ్రేక్ దర్శనం క్యూలో భార్యా భర్తలు పిల్లలు...తమతో వచ్చిన వాళ్ల కన్నా ముందు దర్శనం, ప్రత్యేక దర్శనం అవుతుందన్న ఆనందం..ఆ ధ్యాసలో భగవంతుడి ఊసే లేదు.
భార్య - "ఏవండీ! మన అదృష్టం కదా! పోతే పోనీ రెండు వేలు. ఎంచక్కా గంటన్నరలో బయట పడతాము. లడ్లు కూడా ఎక్కువ వస్తాయి. తోపుడుండదు"
"అవునే! అందుకే ఒక్క నిమిషం అని కూడా ఆలోచించకుండా రెండు వేలకు ఒప్పుకున్నా. ఆ 300 రూపాయల టికెట్టు క్యూ అయితే 4-5 గంటల పని. ఆకళ్లు, కాళ్లనొప్పులు, తోపులాట..."...గర్వంగా పలికాడు భర్త.
వాళ్ల అమ్మాయి 8వ క్లాసు..
"నాన్నా! లంచం ఇవ్వటం నేరం కదా! మరి మనం చేసింది ఆ భగవంతుడు ఎలా ఒప్పుకుంటాడు?"...ప్రశ్నార్థకంగా, సందేహంతో, అపరాధం చేశామన్న భావనతో అడిగింది.
"నువ్వు నోరు ముయ్యవే! పక్కన వాళ్లు వింటారు. ఏదో మీ నాన్న తెలివితో టికెట్లు తీసుకుంటే పాపం, పుణ్యం అనే నీ గోల ఏంటి?"
కొడుకు 10వ క్లాసు...
"నాన్నా! మీరు జుట్టు ఇస్తామని మొక్కుకున్నారు కదా! అలాగే అమ్మ మెట్లు ఎక్కి వెళదాం అని చెప్పింది. మర్చిపోయారా?"....
"అన్నీ గుర్తున్నాయి రా. టికెట్లు తీసుకుందామన్న ధ్యాసలో ఈ మొక్కులు మర్చిపోయాను. తలనీలాలు దర్శనం అయిన తరువాత ఇద్దాములే. మెట్లు ఈ మారు వచ్చినప్పుడు ఎక్కుతాననని మొక్కుకున్నానులే...." - తల్లిదండ్రుల సవరణ.
క్యూ అంతా భార్యాభర్తలకు తాము చేసిన ఘనకార్యం గురించి ఆలోచనలే తప్ప శ్రీనివాసుడి గురించి లేదు. పక్కవాళ్లతో సంభాషణలు కూడా ఇవే. గర్భగుడిలో స్వామి ముందున్న 5 సెకండ్ల సమయం కళ్లుమూసుకొని ఏవేవో కోర్కెలు కోరేశారు...బయటకు వచ్చి ప్రసాదం తీసుకునే క్యూలో ఉన్నారు.
భార్య - "ఏవండీ! ఆ పక్కనే పొంగలి, దద్ధ్యోజనం ప్రసాదం ఉంది. ఆ పూజారి చేతిలో ఒక వంద పెట్టి చెరో పొట్లం తీసుకోండి..."
పిల్ల - "అమ్మా అది ఇప్పుడిస్తున్న లడ్డూ ప్రసాదం అయిపోతే ఇచ్చేందుకు పెట్టారు. ప్రసాదంలో కూడా కక్కుర్తి ఏమిటి?"....
తల్లి - "నీకు తెలియదు ఊరుకోవే. మన పక్కింటావిడ మొన్న వచ్చినప్పుడు వాళ్లకు బ్రేక్ దర్శనంలో బోలెడంత ప్రసాదాలు ఇలాగే ఇచ్చారుట. వాటి రుచి గురించి కథలు కథలుగా చెప్పింది. నేను కూడ చెప్పద్దూ? "...
పిల్ల నిర్ఘాంతపోయింది. తల్లికి కోపం వస్తుందని తన భావనలను లోపలే దాచుకుంది.
వందరూపాయలు పూజారి చేతిలో పెట్టబోగా అతను అసహ్యం నటిస్తూ తిరిగి ఇచ్చి "నేను నిన్ను అడిగానా? దేనికి ఈ డబ్బులు?"...
"అయ్యా! పొంగలి, దద్ధ్యోజనం ప్రసాదం..."
"ఆ పక్కన నిలబడు. కాసేపు ఆగి ఇస్తాను"... అని వంద రూపాయలో పంచెలో దోపుకున్నాడు. సీసీటీవీ కెమేరాలున్నాయి. అయినా ఇద్దరికీ భయం లేదు.
దర్శనం తరువాత తలనీలాలు, భోజనాలు, విహార యాత్ర, షాపింగ్...క్రిందకు బస్సులో దిగుతున్నారు. వేగంగా బస్సు ఘాటు అంచులను గుద్దుకుంది. భార్యా భర్తలకు బాగా గాయాలు. పిల్లలకు ఏమీ కాలేదు. చావు తప్పి కన్నులొట్ట పోయి క్రిందకు దిగారు. ప్రాణాలు పోకుండా రక్షించినందుకు మళ్లీ కాలినడకన వస్తామని మొక్కు....
అన్నీ చూస్తునే ఉన్నాడు శ్రీనివాసుడు. ఆయన లెక్కలు ఆయన వేస్తూనే ఉన్నాడు. వీళ్ల మొక్కులు వీళ్లు మొక్కుతునే ఉన్నారు...
గురువుగారూ ...చక్కగా వర్ణించారు తిరుమలొక్కటే కాదండి. శ్రీసైలమూ, ఆ మాటకొస్తే మా బెజవాడ దుర్గ గుడి దగ్గరా దాదాపు ఇంతే. స్థాయీ భేదాలు మాత్రమే.. . దీనికి తోడు ఇంకో గగుర్పొడిచే దృస్యం. క్యూ కాంప్లక్స్ లలోనే శౌచాలయాలు. శౌచం మాత్రం అడక్కండి మరి....
రిప్లయితొలగించండిఅవునండీ. ఆధ్యాత్మికత భ్రష్టుపట్టింది.
రిప్లయితొలగించండి