21, మార్చి 2015, శనివారం

తాళ్లపాక అన్నమాచార్యుల వారి 512వ వర్ధంతి












తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలు పరిపూర్ణమైన తత్త్వ సంపదలు. మధుర భక్తితో రచించిన శృంగార సంకీర్తనలు ఒక ఎత్తైతే , అపూర్వమైన సామాజిక సందేశము, ఆధ్యాత్మికత కూడిన సంకీర్తనలు మరింత ఎత్తు. మానవ జన్మ లక్ష్యము, సమకాలీన సమస్యలకు పరిష్కారము, భగవద్గీతా సారాంశము - సామాన్యుని భాషలో, మంత్ర సమానమైన పదములుగా రచించారు సద్గురువులు. మనలను సరైన మార్గంలో అత్యంత ప్రభావవంతంగా నడిపించే వారే సద్గురువులు. అనేకరకములైన మానసిక పరిస్థితులకు సముచితమైన సందేశముతో సాంత్వననిచ్చి మానవ జన్మకు సార్థకతను కూర్చే శక్తి అయన రచనలలో ఉంది. కాబట్టే దాదాపు ఆరువందల సంవత్సరాలైనా ఆయన సాహితీ సంపద మనకు మార్గదర్శకంగానే నిలుస్తోంది.
ఎప్పుడు మనం ఆయనిచ్చిన ఈ అపూర్వమైన సంపదను సద్వినియోగం చేసుకున్నట్లు?
1. అందరిలోనూ ఉన్నది ఒకటే అన్న సందేశాన్ని సరిగా అర్థం చేసుకొని ఆచరించినపుడు. సాటి మనిషిని మనిషిగా గుర్తించి, గౌరవించి సోదర భావంతో మెలగినపుడు.
2. మనం ఏవిధంగా తలస్తే ఆ రూపంలో దర్శనమిచ్చే మహత్తరమైన దివ్యశక్తి పరమాత్మ. ఎన్ని భగవద్స్వరూపాలైనా, అన్నీ ఆయన దార్శనికాలే. కాబట్టి దేవతా స్వరూపాలను తారతమ్యం లేకుండా చూడగలిగినపుడు, వివిధ తత్త్వాలను, మార్గాలను గౌరవించినపుడు.
3. మనలోని తెరలను, పొరలను, మాలిన్యాలను తొలగించుకొని, ఈ దేహమనే అద్భుతమైన సాధనాన్ని ఉపయోగించుకుని జనన మరణాలను దాటిన మోక్ష స్థితిని చేరుకోగలిగినపుడు.
4. సర్వస్యశరణాగతితో పరమాత్మకు మనలను మనం సమర్పించుకుని ఈ దుర్లభమైన మానవ దేహంతో అద్భుతమైన ఫలితాలను సాధించుకోగలిగినపుడు.
5. అనంతమైన కష్టాలను ఈ సంకీర్తనల సాయంతో అవలీలగా దాటగలిగినపుడు, సంయమనం, స్థితప్రజ్ఞత చూపగలిగినపుడు.
అన్నమాచార్యులను మించిన సంఘసంస్కర్త లేడు. ఆయన సంకీర్తనలు మించిన ఒలిచిన అరటిపండులా సులువైన సాధనం లేదు. మానవతకు నిఘంటువు, మానవ జన్మ లక్ష్యానికి నిర్వచనం ఆయన సాహిత్యం. తెలిసితే మోక్షమే.
ఆ సద్గురువుల 512వ వర్ధంతి సందర్భంగా వారి పాదాలకు శతసహస్ర వందనాలు.


మన్మథ నామ సంవత్సర శుభాకాంక్షలు


సోదర సోదరీమణులకు, పిల్లలకు, పెద్దలకు, అందరికీ మన్మథ నామ సంవత్సర శుభాకాంక్షలు. షడ్రుచుల పచ్చడి జీవితంలో అన్నీ సమపాళ్లలో ఉంటాయి అని చాటటానికి సూచిక. వసంత ఋతువు ఆగమనం అంటు రోగాలకు కూడా దారి తీస్తుంది కాబట్టి రోగ నిరోధక శక్తి కలిగిన ఆరు ప్రకృతి సిద్ధమైన ధాతువులను మనకు పచ్చడి రూపంలో ఇచ్చారు పెద్దలు. శరీర ఆయురారోగ్యాల కోసం ఈ పండుగ...సృష్టి ఆరంభానికి ప్రతీక ఉగాది. అన్ని ఋతువుల గమనం ఒక వృత్తం పూర్తి కావటానికి ప్రతీక ఉగాది.
ఉగాది, గుడి పడ్వ, చెట్టీ చాంద్...ఏ పేరైతేనేమి? భారత దేశంలో ఎందరికో కొత్త సంవత్సరం ఇది. కాలధర్మం, ఋతువుల మార్పుతో కూడినది కాబట్టి ఇదే నిజమైన కొత్త సంవత్సరం. దీనిలో అర్థం తెలుసుకుంటే సంబరానికి సార్థకత.
తెలుగుజాతిలో జన్మించినందుకు కొంతైనా తెలుగుదనానికి గౌరవం చూపించి తెలుగువారి సహజ సిద్ధమైన సాంప్రదాయాలతో, గడపలకు మావిడాకులు, పూలమాలలు కట్టి, తలంటుకొని, పరమేశ్వరుని ప్రార్థించి, పచ్చడిని నైవేద్యంగా అర్పించి,సేవించి, నూతన వస్త్రాలు ధరించి, పంచాంగ శ్రవణం చేసి, నలుగురిని ఆత్మీయంగా పలకరించి తెలుగుదనంతో జరుపుకుందాం.
కాలే వర్షతు పరజన్యః పృథివీ సస్యశాలినీ
దేశోయం క్షోభ రహితః బ్రాహ్మాణాస్సంతు నిర్భయాః
సమయానికి వర్షాలు కురియు గాక. భూమి సస్యశ్యామలమగుగాక. దేశము కరవు కాటకాలు, క్షోభ రహితమగు గాక. బ్రహ్మజ్ఞానులు నిర్భయులగు గాక!
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు
నాలుగు సాగరాల మేర గోవులకు, బ్రహ్మ జ్ఞానులకు శుభం కలుగు గాక!

19, నవంబర్ 2014, బుధవారం

అర్చక వృత్తి - అర్హతలు




దేవస్థానాలలో అర్చక వృత్తిలో ఉన్నవారికి కావలసిన అర్హతలు:

1. ప్రతిష్ఠించ బడిన దేవతా మూర్తిపై అచంచలమైన భక్తి, విశ్వాసము మరియు శరణాగతి
2. ఆ దేవతామూర్తి యొక్క నిత్య పూజా విధానము, తత్సంబంధమైన ఆగమ శాస్త్రముపై పట్టు మరియు స్పష్టత
3. దృష్టి పళ్లెంలో వేసే డబ్బులపై, దక్షిణపై, వచ్చే భక్తుల ఆర్థిక స్థోమతపై కాకుండా భగవంతునికి భక్తునికి మధ్య నిరంతర అనుసంధానంగా ఎలా ఉండాలి అన్న దానిపై కలగాలి.
4. బాహ్య శుద్ధి, అంతశ్శుద్ధితో కూడిన నిరాడంబరమైన జీవితము. 
5. భక్తుల సమస్యలను, బలహీనతలను దుర్వినియోగం చేయని ఉన్నతమైన వ్యక్తిత్వము. 

ఈ ఐదూ నేటి అర్చక సమాజంలో చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టే, వారంటే ప్రజలకు, ప్రభుత్వాలకు గౌరవం పోయింది, వారి సేవకు తగినంత ఉపాధి లభించటం లేదు. ఎప్పుడైతే ఈ లక్షణాలతో అర్చకుడు తన పవిత్రమైన వృత్తిని చేపడతాడో అప్పుడు అతని భుక్తికి, కుటుంబం గౌరవ ప్రదంగా జీవించటానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. జ్ఞానము, సద్బుద్ధి, శుచి ఉన్న అర్చకుడు ఏ యుగంలోనూ ప్రజలచే, పాలకులచే నిరాదరించబడలేదు.

ఈ లక్షణాలకు సాత్వికాహారం, వేదవాఙ్మయ జ్ఞానం, పురాణేతిహాసముల ఆకళింపు, నేటి సామాజిక పరిస్థితులపై అవగాహన తప్పనిసరి. జన్మతో వచ్చిన బ్రాహ్మణత్వమొక్కటే అర్చకత్వానికి అర్హత కాదు. ఎక్కడ జన్మించినా వికసించిన హృదయకమలం, తెరుచుకున్న జ్ఞాన చక్షువులు, సత్సాంగత్యమునందు ఆసక్తి కలిగి ఉంటే అర్చకత్వానికి అర్హుడే. 

ఇటువంటి పవిత్రమైన వృత్తికి పవిత్రమైన మనుషులను మనమే జన్మతో వచ్చే కులాలకు అతీతంగా తయారు చేయలి, వెదకాలి, ప్రోత్సహించాలి. అప్పుడే దేవాలయ వ్యవస్థ యొక్క పవిత్రత పునరుత్థానమవుతుంది, కలకాలం నిలబడుతుంది.

2, నవంబర్ 2014, ఆదివారం

ఆట బొమ్మనా నేను?

అప్పుడే పుట్టిన నల్లని పసి పావురము కిటికీపై వాలింది
లోకం తెలీక ఎగరటానికి జంకుతూ దిక్కులు చూస్తోంది
బిడ్డ ఎలా ఉందో అని తల్లి పావురము గమనిస్తూనే ఉంది
ఎగరలేని పిల్ల పక్షిని చూసి ఒక హృదయం జాలి పడింది
ధైర్యం ఇద్దామని దాని వీపుపై చేతుల ప్రేమగ నిమిరింది
మొదట భయము పిదప ధైర్యమున దిక్కులు చూసింది
మనిషి ప్రేమ కాస్తా ఆటగా మారింది చేతుల స్పర్శ మారింది
తల్లి వైపు చూసిన పిల్లకు తల్లి హెచ్చరిక చేసింది
రెప రెపలాడుతూ పిల్ల మనిషికి దూరంగా ఎగిరిపోయింది
తన ఆటవస్తువు దక్కలేదని మనిషి మనసు ఉగ్రమయ్యింది
ప్రేమ మరచి కోపము పెంచి కరుణ చంపి రాయి విసిరింది
మనిషి స్వార్థం గ్రహించి పిల్ల పక్షి తల్లి గూటికి చేరింది

ఇంతేరా మనుషులని తల్లి కళ్లతో పిల్లకు చెప్పింది
ఔరా ఈ మనిషి చేష్టలు అని పిల్ల నివ్వెర పోయింది
మనిషి ప్రేమలో నిజం లేదని గ్రహించి తల్లిలో ఒదిగింది
నువ్వు ఎగరగలవు నేను నీకు రక్ష అని తల్లి పలికింది

మనిషి మనసులో తనకు దక్కని పక్షులపై కక్ష కలిగింది
తన మనసున మాటను పంచి పక్షులపై యుద్ధం ప్రకటించింది
రాళ్ల వానను దాటుతూ తల్లి పక్షి బిడ్డతో కలిసి ఎగిరింది
రాళ్లనుండి బిడ్డను కాపాడుతూ ముందుకు సాగుతున్నది
ఇంతలో ఒక పెద్ద ఆపద పిల్ల పావురం వైపు వచ్చింది
తల్లి తన పిల్లను రక్షింప తన ప్రాణాలను అర్పించింది
ఎగిరి ఎగిరి ధైర్యం నిండిన పిల్ల తల్లికి కన్నీరు విడిచింది

నమ్మరాదు నమ్మరాదు ఈ రాక్షసులను అని నిశ్చయం చేసుకుంది
మనిషికి దూరంగా పచ్చని దూర తీరాలకు అతి వేగంగా ఎగిరిపోయింది

28, అక్టోబర్ 2014, మంగళవారం

మరల మానవ జన్మనిమ్ము

మరల జన్మ రాకున్న ఎటుల తనివితీర అనుభూతి చెందు నేనీ అద్భుత ప్రపంచమును?
మరల జన్మ లేకున్న ఎటుల మనసారా సేవింతు నే నీ అనంతకోటి మోహనరూపములను?
మరల జన్మ చెందకున్న ఎటుల ప్రీతుడనై అనుభవింతు నేను మాతృప్రేమానురాగమును?
మరల జన్మ పొందకున్న ఎటుల స్పృశింతు నే నీ సుందర మందార పాదారవిందములను?
మరల భువికి రాకున్న ఎవ్విధమున నే దర్శింతు హిమశైల శిఖరములను గంగాతరంగములను?
మరల మరల రాకున్న ఎటుల కైమోడ్పులర్పింతు దయారసపూరిత సద్గురు కృపావీక్షణములకు?

నీ అద్భుతలీలావేష్టితములను చవిచూడ మరి మరి మానవ జన్మనిమ్ము
నీ దివ్యమంగళ చరణములవద్ద పుష్పములుంచ శతకోటి అవకాశములిమ్ము
నాలోని నిన్ను అనుక్షణము నుతించి దర్శించి తరించే భాగ్యమునిమ్ము
అమ్మగా, అయ్యగా, గురువుగా, సఖునిగా నీ ప్రేమను పొందే వరములిమ్ము

ప్రభూ! మరల మానవ జన్మనిమ్ము! మరల నిజమైన మానవునిగా జీవించనిమ్ము!





విశ్వనాటకము

రంగులు పులిమిన అందమైన ముఖాల వెనుక ఎంతటి మనో మాలిన్యమో?
బాహ్యము పట్టని మురికి భిక్షుకుని లోన ఎంతటి ఆత్మ సౌందర్యమో?
వయ్యారంగా నడిచే అప్సరసల లోన ఎంతటి రాక్షసత్వమో?
కఠోర సత్యం పలికే బైరాగి లోన ఎంతటి దివ్యత్వమో?
తీయని పలుకులు పలికే నాయకుడి లోన ఎంతటి కాఠిన్యమో? 
మౌనముగా నిలిచిన ముదిమి అవ్వ లోన ఎంతటి కరుణయో?
చూచిన వానికి చూచినంత, అనుభూతి చెందిన వానికి చెందినంత.
అనంతకోటి జీవరాశులలోన, స్థావర జంగమములలోన వైవిధ్య భరితమైన ఈ మాయ ఏమిటో?
తానే సృష్టించి తానే నటించి, తానే మరపించి, తానే కనులు తెరపించే ఈ విశ్వనాటకమున నేనొక పాత్రధారినా? లేక సాక్షీభూతుడనా? పరమాత్మకే ఎరుక.

26, నవంబర్ 2011, శనివారం

శ్రీమదాంధ్ర మహాభాగవతము ప్రథమ స్కంధము - సూతుని శౌనకాదులు వేడుకొనుట

అమ్మకు అంకితం

సూతమహామునిని శౌనకాది ఋషులు పరమ భాగవతతోత్తముని గాథను తెలుపుమని వేడుట:

ఎవ్వని యవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొరిదిజేయు
నెవ్వని శుభనామ మేప్రొద్దు నుడుపంగ సంసారబంధంబు సమసిపోవు
నెవ్వని చరితంబు హృదయంబు జేర్చిన భయమొంది మృత్యువు పరువువెట్టు
నెవ్వని పదనది నేపారుజలముల సేవింప నైర్మల్యసిద్ధి గలుగున్

తపసు లెవ్వని పాదంబు దగిలి శాంతి
తెఱవుగాంచిరి వసుదేవదేవకులకు
నెవ్వడుదయించె దత్కథలెల్ల
నిచ్చవుట్టెడు నెఱిగింపు మిద్ధచరిత

తాత్పర్యము: ఓ విమలచరితుడైన సూతమహామునీ! ఎవరి అవతారము వలన సకల ప్రాణులకు సుఖము, వృద్ధి, క్షేమము కలుగునో, ఎవని శుభనామము స్మరించినంత సంసార బంధాలు తొలగిపోవునో, ఎవని చరిత్ర హృదయములో నిలిపినంత మృత్యువు కూడా భయపడి పారిపోవునో, ఎవ్వని పాదములనుండి జన్మించిన పవిత్ర గంగానదీ జలము సేవిస్తే పునీతలవుతారో, తపస్సు చేసే మహాత్ములు ఎవని పాద స్పర్శ వలన పరమశాంతి పొందుతారో దేవకీ వసుదేవులకెవ్వడు పుత్రునిగా ఉదయించెనో ఆతని కథలనన్నిటినీ వినుటకు మాకు మిక్కిలి కోరికగా నున్నది గాన ఆ గాథలను వినిపించుడు.

భావము: సీసము-తేటగీతి యుగళమైన ఈ పద్యరత్నములలో పోతనామాత్యులు తన శ్రీహరి భక్తిని తేటతెల్లము చేశారు. హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు అని అన్నమాచార్యులవారు అన్నరీతి పోతనవారు ఈ పద్యములలో హరిని శౌనకాది మునులు నుతించిన రీతి కడు శ్రావ్యము. భాగవత లక్ష్యమైన మోక్షమును పొందుటకు ఏమి చేయాలి అని మునులనోట సూతునికి విన్నపముగా పోతనగారు అలరించారు. హరి నామస్మరణ, హరిగాథను హృదయములో నిలుపుకొనుట, హరిపాదాన పుట్టిన పవిత్ర గంగానది స్నానము చేయుట - ఇవన్నీ మోక్షకారకలే అని శౌనకాది మునుల నోట పలికించారు.



హరినామ కథన దావానలజ్వాలచే గాలవే ఘోరాఘకాననములు
వైకుంఠదర్శన వాయుసంఘంబుచే దొలగవే భవదుఃఖతోయదములు
కమలనాభ ధ్యానకంఠీరవంబుచే గూలవే సంతాపకుంజరములు
నారాయణ స్మరణ ప్రభాకరదీప్తిచే దీరవే షడ్వర్గతిమిరరతులు

నళిననయన భక్తినావచేగాక సంసారజలధి దాటి చనగరాదు
వేయినేల మాకు విష్ణుప్రభావంబు దెలుపువయ్య సూత! ధీసమేత

తాత్పర్యము: ఓ సూతమునీంద్రా! శ్రీహరిగాథా శ్రవణమనే దావాగ్నిచే ఘోరపాపపుటరణ్యములు దహించుకుపోవా? వైకుంఠదర్శనమనే పెనుగాలిశక్తికి సంసారదుఃఖమనే కారుమేఘములు తొలగిపోవా? పద్మనాభుని ధ్యానమనే సింహపుదెబ్బకు శోకములనే ఏనుగులమంద నేలకూలదా? నారాయణ స్మరణమనే ప్రచండ సూర్యతేజముచే కామక్రోధాది అరిషడ్వర్గమనే చీకటి మాయమవదా? కమలాక్షుని యందు భక్తియనే నావచే తప్ప సంసారాన్ని దాటుట సాధ్యమవుతుందా? ఇన్ని మాటలెందుకు? ఓ ధీమంతుడా! శ్రీహరియొక్క దివ్యలీలా ప్రభావాల గుఱించి మాకు వివరించి తెలుపుమయ్యా!

భావము: పైన చెప్పిన పద్యాలలో మొదలైన హరివైభవ వర్ణన ఈ సీసము-ఆటవెలది పద్యయుగళములో కూడా పోతనగారు శౌనకాది మునులు-సూత సంవాదంగా కొనసాగించారు. అద్భుతమైన కవితా సంపదను భక్తితో కూర్చి శ్రీహరి భాగవత గాథాలహరిని ఆరంభించారు. అనన్యమైన ఉపమానములు అలంకారములు ఈ పద్యములో పోతనగారి కలంలో వెలువడ్డాయి. అంతా ఆ శ్రీహరి మహిమే! ఈ పద్యయుగళములోని ఐదు  ఉపమానములు:

  1. శ్రీహరి గాథల వినుటను దావాగ్ని అంత శక్తివంతముగా, మానవ పాపములు ఘోరారణ్యములుగా ఉపమానము చేసి, కేవలం ఆ దావాగ్ని మాత్రమే ఈ కానలను కాల్చగలదని వివరించారు. 
  2.  వైకుంఠ దర్శనము పెనుగాలి వంటి శక్తిగా, సంసారంలో ఉండే దుఃఖాలను కారుమేఘాలుగా పోలిచి, ఆ పెనుగాలి మాత్రమే ఈ కారుమేఘాలను తొలగించ గలదని వక్కాణించారు.
  3. హరిధ్యానమును సింహపు హుంకారముగా, శోకమును ఏనుగుల సమూహముగా, ఆ సింగపు ఘాతమే ఈ ఏనుగులను నేలకూల్చగలదిగా నుతించారు
  4. నారాయణుని నామస్మరణను ప్రంచండ భానుని తేజముగా, కామక్రోధలోభమోహమదమాత్సర్యములను చీకటిగా, ఈ చీకటిని ఆ తేజమే మాయము చేయనదిగా పలికారు.
  5. హరిభక్తిని నావగా, సంసారమును సాగరముగా, ఈ సాగరాన్ని ఆ నావతో మాత్రమే దాటగలమని ఉదహరించారు.

అందుకే పోతన భక్త శిరోమణి, మహాకవి అయినాడు.

అంతా రామమయం - భద్రాచల రామదాసు కృతి

అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడనంత రూపముల వింతలు సలుపగ సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అండాండంబులు పిండ...