RightClickBlocker

26, నవంబర్ 2011, శనివారం

శ్రీమదాంధ్ర మహాభాగవతము ప్రథమ స్కంధము - సూతుని శౌనకాదులు వేడుకొనుట

అమ్మకు అంకితం

సూతమహామునిని శౌనకాది ఋషులు పరమ భాగవతతోత్తముని గాథను తెలుపుమని వేడుట:

ఎవ్వని యవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొరిదిజేయు
నెవ్వని శుభనామ మేప్రొద్దు నుడుపంగ సంసారబంధంబు సమసిపోవు
నెవ్వని చరితంబు హృదయంబు జేర్చిన భయమొంది మృత్యువు పరువువెట్టు
నెవ్వని పదనది నేపారుజలముల సేవింప నైర్మల్యసిద్ధి గలుగున్

తపసు లెవ్వని పాదంబు దగిలి శాంతి
తెఱవుగాంచిరి వసుదేవదేవకులకు
నెవ్వడుదయించె దత్కథలెల్ల
నిచ్చవుట్టెడు నెఱిగింపు మిద్ధచరిత

తాత్పర్యము: ఓ విమలచరితుడైన సూతమహామునీ! ఎవరి అవతారము వలన సకల ప్రాణులకు సుఖము, వృద్ధి, క్షేమము కలుగునో, ఎవని శుభనామము స్మరించినంత సంసార బంధాలు తొలగిపోవునో, ఎవని చరిత్ర హృదయములో నిలిపినంత మృత్యువు కూడా భయపడి పారిపోవునో, ఎవ్వని పాదములనుండి జన్మించిన పవిత్ర గంగానదీ జలము సేవిస్తే పునీతలవుతారో, తపస్సు చేసే మహాత్ములు ఎవని పాద స్పర్శ వలన పరమశాంతి పొందుతారో దేవకీ వసుదేవులకెవ్వడు పుత్రునిగా ఉదయించెనో ఆతని కథలనన్నిటినీ వినుటకు మాకు మిక్కిలి కోరికగా నున్నది గాన ఆ గాథలను వినిపించుడు.

భావము: సీసము-తేటగీతి యుగళమైన ఈ పద్యరత్నములలో పోతనామాత్యులు తన శ్రీహరి భక్తిని తేటతెల్లము చేశారు. హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు అని అన్నమాచార్యులవారు అన్నరీతి పోతనవారు ఈ పద్యములలో హరిని శౌనకాది మునులు నుతించిన రీతి కడు శ్రావ్యము. భాగవత లక్ష్యమైన మోక్షమును పొందుటకు ఏమి చేయాలి అని మునులనోట సూతునికి విన్నపముగా పోతనగారు అలరించారు. హరి నామస్మరణ, హరిగాథను హృదయములో నిలుపుకొనుట, హరిపాదాన పుట్టిన పవిత్ర గంగానది స్నానము చేయుట - ఇవన్నీ మోక్షకారకలే అని శౌనకాది మునుల నోట పలికించారు.హరినామ కథన దావానలజ్వాలచే గాలవే ఘోరాఘకాననములు
వైకుంఠదర్శన వాయుసంఘంబుచే దొలగవే భవదుఃఖతోయదములు
కమలనాభ ధ్యానకంఠీరవంబుచే గూలవే సంతాపకుంజరములు
నారాయణ స్మరణ ప్రభాకరదీప్తిచే దీరవే షడ్వర్గతిమిరరతులు

నళిననయన భక్తినావచేగాక సంసారజలధి దాటి చనగరాదు
వేయినేల మాకు విష్ణుప్రభావంబు దెలుపువయ్య సూత! ధీసమేత

తాత్పర్యము: ఓ సూతమునీంద్రా! శ్రీహరిగాథా శ్రవణమనే దావాగ్నిచే ఘోరపాపపుటరణ్యములు దహించుకుపోవా? వైకుంఠదర్శనమనే పెనుగాలిశక్తికి సంసారదుఃఖమనే కారుమేఘములు తొలగిపోవా? పద్మనాభుని ధ్యానమనే సింహపుదెబ్బకు శోకములనే ఏనుగులమంద నేలకూలదా? నారాయణ స్మరణమనే ప్రచండ సూర్యతేజముచే కామక్రోధాది అరిషడ్వర్గమనే చీకటి మాయమవదా? కమలాక్షుని యందు భక్తియనే నావచే తప్ప సంసారాన్ని దాటుట సాధ్యమవుతుందా? ఇన్ని మాటలెందుకు? ఓ ధీమంతుడా! శ్రీహరియొక్క దివ్యలీలా ప్రభావాల గుఱించి మాకు వివరించి తెలుపుమయ్యా!

భావము: పైన చెప్పిన పద్యాలలో మొదలైన హరివైభవ వర్ణన ఈ సీసము-ఆటవెలది పద్యయుగళములో కూడా పోతనగారు శౌనకాది మునులు-సూత సంవాదంగా కొనసాగించారు. అద్భుతమైన కవితా సంపదను భక్తితో కూర్చి శ్రీహరి భాగవత గాథాలహరిని ఆరంభించారు. అనన్యమైన ఉపమానములు అలంకారములు ఈ పద్యములో పోతనగారి కలంలో వెలువడ్డాయి. అంతా ఆ శ్రీహరి మహిమే! ఈ పద్యయుగళములోని ఐదు  ఉపమానములు:

  1. శ్రీహరి గాథల వినుటను దావాగ్ని అంత శక్తివంతముగా, మానవ పాపములు ఘోరారణ్యములుగా ఉపమానము చేసి, కేవలం ఆ దావాగ్ని మాత్రమే ఈ కానలను కాల్చగలదని వివరించారు. 
  2.  వైకుంఠ దర్శనము పెనుగాలి వంటి శక్తిగా, సంసారంలో ఉండే దుఃఖాలను కారుమేఘాలుగా పోలిచి, ఆ పెనుగాలి మాత్రమే ఈ కారుమేఘాలను తొలగించ గలదని వక్కాణించారు.
  3. హరిధ్యానమును సింహపు హుంకారముగా, శోకమును ఏనుగుల సమూహముగా, ఆ సింగపు ఘాతమే ఈ ఏనుగులను నేలకూల్చగలదిగా నుతించారు
  4. నారాయణుని నామస్మరణను ప్రంచండ భానుని తేజముగా, కామక్రోధలోభమోహమదమాత్సర్యములను చీకటిగా, ఈ చీకటిని ఆ తేజమే మాయము చేయనదిగా పలికారు.
  5. హరిభక్తిని నావగా, సంసారమును సాగరముగా, ఈ సాగరాన్ని ఆ నావతో మాత్రమే దాటగలమని ఉదహరించారు.

అందుకే పోతన భక్త శిరోమణి, మహాకవి అయినాడు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి