1, మే 2015, శుక్రవారం

శివపాదములుంచ నేను శిలనైనను కారాదా




శివపాదములుంచ నేను శిలనైనను కారాదా
కైలాసపు స్వామి మరల కలనైనను రారాదా

పూవునైన కాబోనా పూజకైన నేలేనా
కలత కనులు కరిగి ప్రభువుకభిషేకము కారాదా

కంటి పాప గంట విలును వింటి దారి నందిదేమో
ఎద నీ చిరు గజ్జె మ్రోత చెవులేమో ఢమరుకలౌ

వెలుగు దారిని వినువీధిని కనులేగును నీ కొరకై
మబ్బు వెంట మలుపు వెంట మనసులోని పిలుపు వెంట
నీవె నీవె మృత్యుంజయా నిలిచిపోగ రారాదా

పరమాత్మ కోసం తపిస్తున్న భక్తుని వేదన ఈ లలిత భక్తి గీతంలో అద్భుతంగా వ్యక్త పరచారు దేవులపల్లి వారు. అంతే అద్భుతంగా పాడారు వేదవతీ ప్రభాకర్ గారు. ఇంతటి సున్నితమైన భావం కలిగిన లలిత గీతాలను మరచిపోయాము, లలిత సంగీతాన్ని అణగదొక్కి రాళ్లవానలా ఉండే సినీసంగీతానికి పట్టం కట్టాము. మనలను మనం రాతిబండలను చేసుకున్నాము. సున్నితమైన భావమంటే ఒక బలహీనత అన్న అధః పాతాళపు ఆలోచనా సరళికి చేరుకున్నాము.

ఇలాంటి గీతాలు విన్నప్పుడల్లా ఈ రాతి హృదయాలు కొంత స్పందించి కరగుతాయేమో అన్న ఆశ. మనిషి మనిషిగా అవుతాడేమో అన్న ఆశ.

4, ఏప్రిల్ 2015, శనివారం

ఏకవీర - తోటలో నా రాజు తొంగి చూసెను నాడు



కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు ఏకవీర నవలను 1929-30 మధ్యలో రచించారు. 1935వ సంవత్సరంలో భారతి పత్రిక ద్వారా ప్రచురితమైంది. 1969వ సంవత్సరంలో చిత్రంగా విడుదలైంది. విషాదాంతమైన కథను తెరకు ఎక్కించటమంటే ఎంతో ఆలోచించి చేయాలి. అందులో నాలుగు పాత్రలూ ముఖ్యమైనవే. ఆ కథలోని ప్రేమను, త్యాగాన్ని, స్నేహాన్ని ప్రతిబింబించేలా ఎన్టీఆర్, కాంతారావు గారు, జమున గారు, కేఆర్ విజయ గారు పాత్రలను పోషించారు. తాను ప్రేమించిన స్త్రీని అనుకోని పరిస్థితులలో ప్రాణ స్నేహితుడు వివాహం చేసుకోవటంతో కథ విషాదాంతానికి దారి తీస్తుంది. మనసు, కర్తవ్యం, స్నేహం, ధర్మం మధ్య నలిగే ఈ కథకు సంభాషణలు ప్రాణం. 

క్లుప్తంగా కథ:

16వ శతాబ్దంలో మదురై రాజకుటుంబానికి చెందిన సేతుపతి మీనాక్షి అనే పేద పిల్లను ప్రేమిస్తాడు. సేతుపతి ప్రాణ స్నేహితుడు వీరభూపతి. అతడు అంబ సముద్రం రాజ కుటుంబానికి చెందిన ఏకవీర అనే రాజకన్యతో ప్రేమలో పడతాడు. పరిస్థితుల ప్రభావంతో సేతుపతి వివాహం ఏకవీరతో నిశ్చయమవుతుంది. వీరభూపతి వివాహం మీనాక్షితో జరుగుతుంది. ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు లేకపోవటంతో ఆ రెండు వైవాహిక జీవితాలు మొక్కుబడిగా దాంపత్య సిద్ధి లేకుండా ఉంటాయి. సేతుపతి తన స్నేహితుడు వీరభూపతి ఇంట తాను గతంలో ప్రేమించిన మీనాక్షిని చూసి, ధర్మానికి కట్టుబడి, ఆమెపై తనకు గల ప్రేమను త్యాగం చేస్తాడు. వీరభూపతికి తన గతాన్ని తెలుపుతాడు. వీరభూపతి నిజాన్ని అంగీకరించి స్నేహితుని నిజాయితీని మెచ్చుకొంటాడు. సేతుపతి ఏకవీరను తన ధర్మపత్నిగా స్వీకరించి ఆమెతో దాంపత్య జీవనం గడపటానికి వస్తున్నానని సందేశం పంపుతాడు. ఇంతలో రాజుగారి కోటపై దాడి జరిగే అవకాశాలు ఉండటంతో అక్కడునుండి కదలలేకపోతాడు. అతని సందేశం తీసుకువెళుతున్న వార్తాహరుడు చంపబడతాడు. ఆతని మారిన మనసు విషయం ఏకవీరకు చేరదు. ఇంతలో వీరభూపతి ఏకవీర తన స్నేహితుని భార్య అని తెలియక, ఆమెను చూసి తనదానిని చేసుకోవాలనుకొని ముందడుగు వేస్తాడు. తాను ఇంకొకరి దాననని, క్షణికావేశంలో ఆలోచనలు తప్పటడుగులు వేసాయన్న భావనతో ఏకవీర మూర్ఛపోతుంది. సత్యాన్ని భార్య మీనాక్షి ద్వారా తెలుసుకున్న వీరభూపతి కుంగిపోతాడు. సేనాపతి అంతా చూస్తాడు. మీనాక్షి విషం మింగి ప్రాణం విడుస్తుంది. వీరభూపతి తాను స్నేహితుని భార్య పట్ల చూపిన అనుచిత ప్రవర్తనకు పరితపిస్తూ ప్రాణత్యాగం చేస్తాడు.ఏకవీరను అప్పటికైన స్వీకరించటానికి సిద్ధంగా ఉన్న సేతుపతి ఆమెను చూస్తాడు. అప్పటికే వైరాగ్యంతో ఉన్న ఏకవీర ప్రాణత్యాగం చేస్తుంది. 

దుఃఖాంతమైనా, చిత్రంలోని పాత్రల ఔన్నత్యం, వారి మనసులోని భావాలు, సంభాషణలలోని లోతైన భావనలు, నలిగిపోయే వ్యక్తిత్వాలు, ప్రాణస్నేహితుల మధ్య అనురాగం, యవ్వనంలో ఉండే కోరికల తరంగాలు, ప్రేయసీ ప్రియుల ఆరాధనా భావనలు, విధి పెట్టే పరీక్షలు, తెచ్చే మలుపులు...ఇలా చిత్రం మొత్తం హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. ఏకవీరగా కేఆర్ విజయ పాత్రకు జీవం పోశారు. ప్రేయసిగా, భార్యగా జమున తన నటనాకౌశలాన్ని ప్రదర్శించారు. రాచరికపు కథకు అనుగుణంగా చిత్రీకరణ అద్భుతంగా చేశారు దర్శకులు. ఇక సంగీతం, పాటల గురించి చెప్పేదేముంది? ఇప్పటికీ ప్రజలనోట వినబడే పాటలు తోటలో నా రాజు, ప్రతిరాత్రి వసంతరాత్రి, కృష్ణా నీ పేరు తలచినా చాలు. భావగర్భితమైన సాహిత్యాన్ని, మృదుమధురమైన పదజాలాన్ని అందించారు డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఘంటసాల మాష్టారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కలసి పాడిన బహుకొద్ది పాటలలో ప్రతి రాత్రి వసంత రాత్రి ఒకటి. దేవులపల్లి వారి సినీగీతాలలో ఇది చిరస్మరణీయం. అలాగే నారాయణ రెడ్డి గారి గీతాలలో తెలుగుదనానికి తోటలో నారాజు గీతం తలమానికం. కేవీ మహదేవన్ గారి సంగీతం అద్భుతం. ఈ చిత్రంలో నాకిష్టమైన పాట తోటలో నారాజు. సాహిత్యాన్ని పరిశీలిద్దాం.  

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు

నవ్వులా అవి? కావు, నవ పారిజాతాలు
రవ్వంత సడి లేని రస రమ్య గీతాలు
ఆరాజు ఈరోజు అరుదెంచునా
అపరంజి కలలన్ని చిగురించునా

చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను
పాటలా ధర రాగ భావనను కన్నాను
ఎలనాగ నయనాల కమలాలలో దాగి
ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను
ఆపాట నాలో తీయగ మ్రోగనీ
అనురాగ మధుధారయై సాగనీ

అలనాటి చలనచిత్రాలలో కూడా శృంగార గీతాలు ఉండేవి...కానీ, వాటిలో మోహం లేకుండా ఆరాధనా భావం ఉండేది. ప్రేయసీ ప్రియుల మధ్య భావనలను ఆ పరిధిలో ఎంతో పవిత్రంగా ఆవిష్కరించేవారు కవులు. ఆనాటి విలువలకు ఉదాహరణ ఈ గీతం.డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలుగులో మందార మకరందం వంటి పద మాధుర్యాన్ని మనకు వారసత్వ సంపదగా అందించారు. ఆయన సాహిత్యంలోని ఈ తీయదనాన్ని ఎంత ఆస్వాదించినా అందులోని మాధుర్యం తరగదు. ఈ కథలో మొదటి సన్నివేశాలలో ఎన్టీఆర్ మరియు జమునపై ఈ తోటలో నారాజు పాటను చిత్రీకరించారు. 

పదప్రయోగానికి సినారె గారు పెట్టిన పేరు. చాంగురే, మజ్జారే,దొరసాని వంటి ఎన్నో పదాలకు సృష్టికర్తయైన నారాయణ రెడ్డి గారు ఈ గీతంలో ప్రేమను లలితమైన భావనలతో అందమైన పదమాలికగా ఆవిష్కరించారు. భౌతికమైన స్పర్శ లేకుండా, దూరంగా ఉండి, తమ భావనలను సభ్యతతో, పవిత్రతతో వ్యక్తపరచే ప్రేయసీ ప్రియులు నాటి కవుల మేధో సంపత్తి. పారిజాత పుష్పం వంటి నవ్వుట ఆ ప్రియునిది...ఎటువంటి శబ్దమూ లేని రస రమ్యమైన గీతాలట ఆతని నవ్వులు..గీతం మొత్తం ఇటువంటి భావనలతోనే సాగుతుంది. భావనలను పాట ద్వారా వినటం, పాట ద్వారానే తెలియజేయటం ఆ కవికే, ఆ పాత్రలకే చెందింది. 

ఎప్పుడో తోటలో ఆ రాజు తొంగి చూశాడట, నీటిలో ఆ రాజు నీడ నేడు నవ్విందట. పూలల్లుతూ నాయిక నాయకుని గురించి తలచే అద్భుతమైన సన్నివేశం ఈ గీతానిది. ఆ రాజు మళ్లీ ఈ రోజు వస్తాడా? అందమైన ఈ కన్య కలలన్నీ మళ్లీ చిగురిస్తాయా అని కలలు కంటుంది నాయిక. నాయకుడు వెంటనే స్పందించి, చాటు మాటుగా విన్నాను, పాటలో ఆ స్త్రీ (ధర అంటే స్త్రీ అని అర్థం) అనురాగంతో కూడిన భావనలు తెలుసుకున్నాను అంటాడు. ఎలనాగ నయనాల కమలాలలో దాగి అన్న వాక్యం పరిశీలించండి. ఎలనాగ అన్న పదం యవ్వనంలో ఉన్న స్త్రీని వర్ణించేది. ఇంతకుమునుపు ఎక్కడా వినని పదాన్ని సందర్భోచితంగా ఉపయోగించి సినారె గారు గీతానికి జీవం పోసారు. నాయిక కలువల వంటి కన్నులలో, ఎదలో కదలే తుమ్మెద ఝుంకారం వంటి పాటను విన్నాడట నాయకుడు. తుమ్మెదకు, కలువకు, ప్రేయసీ ప్రియుల మధ్య భావావేశానికి ఎంత సారూప్యతో! మరోమారు దీనిని మనకు అందమైన పదాలలో రచయిత తెలిపారు. సినారె గారి గీతానికి కేవీ మహదేవన్ గారు సంగీతం కూర్చగా ఘంటసాల, సుశీల గారు యుగళ గీతాన్ని ఒక రసరమ్యమైన భావనగా మనకు అందించారు. 

ఏకవీర చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించలేకపోయినా, రసికుల మదిలో ఒక స్థానాన్ని నిలుపుకుంది. బహుశా ఈ విధమైన వైవిధ్యభరితమైన దుఃఖాతము గల కథను ప్రజలు అప్పటికి ఎక్కువ చూడాలేదేమో. స్త్రీ పురుషుల మధ్య కలిగే భావనలను విశ్వనాథవారి కలంలో వెలువడినంత అందంగా చిత్రం కూడా ఆవిష్కరించింది. కానీ, సమాజం అంత తేలికగా దానిని ఆహ్వానించలేక, అర్థం చేసుకోలేకపోవటంతో చిత్రం పరాజయం పొందింది. 

పూవులేరి తేవే చెలీ పోవలె కోవెలకు




పూవులేరి తేవే చెలీ పోవలె కోవెలకు
తుమ్మెద కాలూననివి, దుమ్ము ధూళి అంటనివి
కమ్మగ వలచేవి, రకరకమ్ముల వన్నెలవి
ఆలసించినా, పూజావేళ మించిపోయెనా,
ఆలయమ్ము మూసి పిలుపాలింపడు నా విభుడు
మాలలల్లుటెపుడే? నవమంజరులల్లేదెపుడే?
ఇక పూలే పోయాలి తలంబ్రాలల్లే స్వామి పైన

భక్తి భావం నిండిన లలిత గీతాలకు తలమానికం దేవులపల్లి వారి రచనలు. ఆయన రచనకు సంగీతాన్ని కూర్చిన మరో మహానుభావులు పాలగుమ్మి విశ్వనాథం గారు. ఈ పాటను ప్రఖ్యాత లలిత సంగీత గాయని శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు ఎంతో రమ్యంగా పాడారు.
తెలుగు భాషలోని మాధుర్యాన్ని మనకందించిన వారిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ముందు నిలుస్తారు. తుమ్మెద ఆఘ్రాణించనివి, దుమ్ము ధూళి లేనివి, కమ్మగా ప్రేమించేవి, ఎన్నెన్నో అందాలున్నవి...ఇలాంటి పూలు ఏరి తెమ్మని చెలిని కోరుతోంది ఓ భక్తురాలు. ఆలస్యమవుతుందేమో అన్న ఆతృత, స్వామిని సేవించాలన్న తహ తహ, స్వామిని పూలతో తలంబ్రాలుగా ముంచెత్తాలన్న మధుర భక్తి ఈ గీతంలో లలితమైన తెలుగు పదాలతో జీవం పోశారు కవి. అంతే శ్రావ్యంగా సంగీతం కూర్చారు పాలగుమ్మి వారు. వేదవతి గారి గొంతులో ఆ అమాయకపు మధుర భక్తి మూర్తీభవించింది. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.

30, మార్చి 2015, సోమవారం

మానవత్వమొకటే నీ మతమవ్వాలి

ఎన్నాళ్లు రంగులు పులుముకున్న హృదయంతో సంభాషిస్తావు?
అసలు అంతరంగాన్ని శుద్ధి చేసి ఎప్పుడు ఆవిష్కరిస్తావు?

రంగు రంగుల మాయా ప్రలోభాలతో గారడీలెన్నాళ్లు చేస్తావు?
నిష్క్రమణమున రంగులు వివర్ణమవుతాయని ఎందుకు మరుస్తావు?

నీ నైజం నుంచి దూరంగా ఎన్నాళ్లు పారిపోతావు? 
నీవెవరో తెలుసుకునేందుకు ఎందుకు సందేహిస్తావు?

దుర్లభమైన మానవునిగా జన్మించి అజ్ఞానముతో రాక్షసునిగా ప్రవర్తించి
కర్మ ఫలమున నిస్సహాయునిగా అనుభవించి మరణించి నీవు సాధించేదేమిటి

జన్మ జన్మలు పాపపుణ్యముల నడుమ కొట్టుమిట్టాడితే నీకు ఒరిగేదేమిటి
లెక్కలకతీతమైతే ఎల్లలులేని ఆనందం లెక్కలలో మునిగితే పుట్టెడు దుఖమే మిగులు

ఎప్పటికీ నిలిచేది నీ అంతరంగ సౌందర్యం యొక్క గుబాళింపులు
ఎన్నటికీ వాడనిది నీ హృదయ కమలం యొక్క పరిమళాలు

మానవత్వమొకటే నీ మతమవ్వాలి నలుగురి శ్రేయస్సే నీ కులమవ్వాలి

28, మార్చి 2015, శనివారం

సీతారామ వైభవం-2 - రాముని జననం


జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం
జనన మరణ ఖేద క్లేశ విచ్ఛేద మంత్రం
సకల నిగమ మంత్రం సర్వ శాస్త్రైక మంత్రం
రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం

అగ్ని బీజమై సమస్త పాపఖండన చేసేది రామనామము. తరించేది కాబట్టి తారకమంత్రమైనది. హనుమ మొదలు ఎందరిని తరింపజేసింది? జన్మకు సాఫల్యాన్ని కలిగించే మంత్రం...జననమరణాల దుఃఖాన్ని, కష్టాలను నాశనం చేసే మంత్రం, వేద సారమైన మంత్రం, అన్ని శాస్త్రములు ఏకమై ఘోషించే మంత్రం, రాముని నిజ మంత్రం రామ రామ అనే మంత్రం...అని శ్రీరామ కర్ణామృతమ్ మనకు బోధిస్తుంది. మరి ఆ రాముని అవతారం ఎలా జరిగింది?

శ్రీరాముని జననానికి రావణ సంహారం కారణమైతే దానికి వేదికి అయోధ్యానగరం. రఘువంశ కులజుడైన దశరథునికి సంతానం లేకపొవడంతో అశ్వమేథ యాగం తలపెడతాడు. ఆ యాగానికి ఋష్యశృంగ మహర్షిని దశరథుని మంత్రియైన సుమంతుడు పిలిపిస్తాడు. ఋష్యశృంగుడు అయోధ్యకు వచ్చి దశరథునిచే అశ్వమేథం చేయిస్తాడు. అటు తరువాత దశరథుడు పుత్రప్రాప్తికై క్రతువును చేయించమని ఆయనను అభ్యర్థిస్తాడు. అప్పుడా ఋష్యశృంగుడు అథర్వ శీర్షంలో ఉన్న పుత్రకామేష్టి క్రతువు చేస్తానని చెబుతాడు. ష్యశ్రంగుని వంటి తపోసంపన్నుడు క్రతువు ఏర్పాట్లు మొదలుబెడతాడు. ఆయన పవిత్రతకు బ్రహ్మాది దేవతలు తమ హవిర్భాగం గ్రహించటానికి యాగశాలలో ప్రత్యక్షమవుతారు. దేవతలందరూ అక్కడ బ్రహ్మదేవుని రావణుని హింసలనుండి విముక్తి కలిగించవలసిందిగా వేడుకుంటారు. బ్రహ్మ ఆతను మానవులచేత మాత్రమే సంహరించబడతాడు అని అంటాడు. అంతలో శ్రీమహావిష్ణువు యాగశాలలో ప్రత్యక్షమవుతాడు. దేవతలందరూ ఆయనను ప్రార్థిర్స్తారు. అప్పుడు ఆ పరమాత్మ పూర్ణాంశతో రామునిగా, అర్థాంశతో భరత లక్ష్మణ శతృఘ్నులుగా జన్మిస్తానని చెబుతాడు. ఋష్యశృంగుడు పుత్రకామేష్టి విజయవంతంగా పూర్తి చేస్తాడు. శ్రీమహావిష్ణువు దశరథుని కుమారులుగ జన్మించాలని సంకల్పిస్తాడు. యజ్ఞపురుషుడు పాయస పాత్రను దశరథునికిచ్చి ఆ పాయసాన్ని భార్యలకు పంచమని చెబుతాడు. దశరథుడు ఆ పాయసంలో సగభాగాన్ని పెద్ద భార్య కౌసల్యకు, 1/4 భాగం సుమిత్రకు, 1/8 భాగము చిన్న భార్య కైకేయికి, మిగిలిన 1/8 భాగము సుమిత్రకు ఇస్తాడు. కొంతకాలానికే ఆ రాణులు గర్భవతులవుతారు. దాదాపు పన్నెండు నెలల తరువాత కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శతృఘ్నులు జన్మిస్తారు. 

రాముని జననం గురించి వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం బాలకాండలోని 18వ సర్గలో ఇలా తెలిపారు...
తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్ సమత్యయుః
తతశ్చ ద్వాదశే మాససే చైత్రే నావమికే తిథౌ

నక్షత్రేదితి దైవత్యే స్వోచ్చసంస్థేషు పంచసు
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిందునా సహ

ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం
కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సమ్యుతం

విష్ణోరర్థం మహాభాగం పుత్త్రం ఐక్ష్వాకు వర్ధనం
కౌసల్యా శుశుభే తేన పుత్త్రేణామితతేజసా
యథా వరేణ దేవానాం అదితిర్వజ్రపాణినా

పుత్రకామేష్టి యాగం ముగిసిన సంవత్సర కాలం తరువాత చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగవ పాదమున కర్కాటక లగ్నమున కౌసల్యాదేవియందు శ్రీరామచంద్రుడు జన్మించాడు . ఆ సమయములో సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని అను ఐదు గ్రహములు తమ ఉచ్చ స్థానములందు అనగా క్రమముగా మేష, మకర, కర్కాటక, మీన తులారాశులయందు ఉండిరి. కర్కాటక రాశియందు గురు చంద్రులు కలిసి ఉండిరి. బుధుడు, రవి మేషమునందుండిరి. జగన్నాథుడు, అన్ని లోకములవారిచే నమస్కరింపబడువాడు, సకల శుభ లక్షణ సంపన్నుడు, గొప్ప భాగ్యశాలి, ,విష్ణువు అంశతో పుట్టినవాడు,  ఇక్ష్వాకు వంశ తిలకుడు  అయిన శ్రీరాముని కన్నఆ  కౌసల్య ఎంత ధన్యురాలు? కౌసల్యా దేవి తన తపఃఫలముగా అర చేతిలో  వజ్రరేఖలు కలవాడు, అమితమైన తేజస్సు కలిగినవాడు  అయిన శ్రీరాముని పుత్రునిగా పొందింది. దేవతలలో ఉత్తముడు, వజ్రాయుధాన్ని ధరించే ఇంద్రుని పుత్రునిగా పొందిన అదితిలా  ఆ కౌసల్య మాట అలరారింది . రాముని జనన సమయంలో ఐదు గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉండటం  వలన,జ్యోతిష్య శాస్త్ర ప్రమాణం ప్రకారం "పంచోచ్చే లోకనాయకః" . అందుకే రాముడు లోకానికి ప్రభువైనాడు.

ఆ తరువాత విష్ణువు అర్థాంశగా భరతుడు చైత్ర శుద్ధ దశమి పుష్యమీ నక్షత్ర సమయంలో కైకేయికి, లక్ష్మణ శతృఘ్నులు చైత్ర శుద్ధ దశమి ఆశ్లేష నక్షత్ర సమయములో సుమిత్రకు జన్మించారు. ఈ నలుగురు అన్నమ్దన్న్ములు జన్మించ సమయంలో గంధర్వులు మధుర గానం చేశారు, అప్సరసలు హృద్యంగా నాట్యం చేశారు. దేవదున్ధుబులు మ్రోగగా దేవతలు పూల వానలు కురిపించారు.

దశరథ మహారాజు తన ఉత్తములకు, తన వందిమాగదులకు బహుమానాలిచ్చాడు.బ్రాహ్మణులకు గోవులు ధన కనక వస్తు వాహనాలను దానం చేశాడు. ప్రజలు ఆనందోత్సాహాలతో ఆడిపాడారు. రాజవీదులన్నీ గాయకుల పాటలతో, నృత్యాలతో, ఉత్సవాలతో నిండిపోయాయి.  దశరథ మహారాజు అయోధ్యాపుర వాసులకు మృష్టాన్న భోజనాలు పెట్టి సంతృప్తి  పరచాడు . 
ఈ రామ జననాన్ని మన తెలుగు గడ్డపై పుట్టిన ప్రయాగ రంగదాసు గారు అద్భుతంగా వర్ణించారు. ఆ కీర్తన వివరాలు:


కళ్యాణ రామునికి కౌసల్య లాలి
రాముడుద్భవించినాడు రఘు కులంబున    

తామసులను దునిమి దివిజ స్థోమంబున
క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీరాముడుద్భవించినాడు

తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబున
సరస కర్కాటక లగ్నమరయగ సురవరులెలమిని కురియింప విరుల వాన 

దశరధుండు భూసురులకు ధనమొసంగగా  
విసరె మలయ మారుతము దిశలెల్లను విశదములై వసుమతి దుర్భరము బాప

ధరను గుడిమెళ్ళంక పురమునరసి బ్రోవగా
కరుణతో శ్రీ రంగదాసు మొరలిడగను కరుణించియు వరమివ్వను స్థిరుడై శ్రీ 


దీని సారాంశము:

దశరథుడు బ్రాహ్మణులకు దానాలు చేయగా, అన్ని దిశలా మలయ మారుతాలు వీచగా, భూదేవి బాధను తగ్గించటానికి, చైత్రమాసమున, శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్రమున, కర్కాటక లగ్నమందు మెరుపులు మెరుస్తుండగా, దేవతలు పూలవానలు కురిపిస్తుండగా, దేవతల క్షేమము కొరకు, రాక్షసులను చంపటానికి శ్రీరాముడు కౌసల్యా గర్భమున జన్మించాడు.  


మనకు శ్రీకృష్ణుని జననం గురించి ఎన్నో వర్ణనలు వచ్చాయి. ఇక్కడ ప్రయాగ రంగదాసు గారు రాముని జన్మమును ఎన్నుకోవటం విశేషం. .ప్రయాగ రంగదాసు గారు మన ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టిన ఒక వాగ్గేయ కారుడు.  మన మంగళంపల్లి బాలమురళీ కృష్ణగారి మాతామహులు వీరు. ఈయన ఎన్నో మంచి కీర్తనలు శ్రీ రాముని మీద రచించారు.  రంగదాసు గారు శ్రీమద్వాల్మీకి రామాయణంలోని బాలకాండం ప్రేరణతో ఈ కీర్తన రాశారు. రంగదాసు గారు తన ముద్రగా తన స్వగ్రామాన్ని వాడటం ఆయన వ్యక్తిత్వాన్ని చూపుతుంది. ప్రయాగ రంగదాసు గారు మరెన్నో అద్భుతమైన కీర్తనలను రచించారు. వాటిలో రామ రామ యనరాదా రఘుపతి రక్షకుడని వినలేదా, ఏమే చిట్టీ, కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మ, రామా నిను వినా వంటివి చాలా ప్రాచుర్యం పొందారు. ఆయన 1859వ సంవత్సరంలో మెళ్లంక గ్రామంలో జన్మించారు.  మంచి హరికథకులు. ఆధ్యాత్మ రామాయణ సంకీర్తనలు ఆయన నోటనే ప్రాచుర్యం పొందాయి. అలాగే, అష్టపదులు, నారాయణ తీర్థ తరంగాలను రంగదాసు గారు ప్రచారంలోకి తెచ్చారు. వారి రచన అయిన రాముడుద్భవించినాడు అనే కీర్తనకు అరవైయ్యవ దశకంలోని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి శ్రవణం.  



23, మార్చి 2015, సోమవారం

జపవిధానము



జకారో జన్మవిచ్ఛేదః పకారః పాపనాశనః
జన్మచ్ఛేదకరో యస్మాత్ జపమిత్యభిదీయతే

జ అంతే జన్మరాహిత్యము, ప అతే పాపనాశనము. జపము అనగా పాపమును నశింపజేసి జన్మరాహిత్యమును అనుగ్రహించునది. కావున జపమును చేయునప్పుడు మంత్రమునందు మనస్సు నిల్పి, తద్భావమును మధ్య మధ్యలో ధ్యానించుట వలన భావపుష్టితో జపపుష్టి కలిగి తద్ద్వారా మంత్రసిద్ధి కలిగి సంపూర్ణ ఫలితము లభించును. 

మననాత్ త్రాయతే ఇతి మంత్రః. మననము చేస్తే తరింపజేసేది మంత్రము. అటువంటి శక్తిపూరితమైన మంత్రాన్ని జప ప్రక్రియలో సాధన చేయటానికి కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి:

1. జపము మూడు విధాలుగా ఉండును - 1. వాచికము 2. ఉపాంశువు 3. మానసికము. బయటకు వినిపించునట్లుగా చెప్పుచూ చేయునది వాచికము. ఇతరులకు వినిపించకుండా పెదవులు కదులుతూ నాలుకతో జపించుటను ఉపాంశువు అంటారు. నాలుక, పెదవులు కదలకుండా లోలోపల చేసే జపమును మానసికము అందురు. వాచికము కంటే ఉపాంశువు శ్రేష్ఠము, దానికన్నా మానసికము మరింత శ్రేష్ఠము.

2. ప్రాతఃకాలములో చేతులు పైకెత్తి, మధ్యాహ్న కాలమో చక్కగా ఉంచి, సాయంకాలం క్రిందకు ఉంచి జపము చేయవలెను.

3. చందనముతో, అక్షతలతో, పుష్పములతో, ధాన్యముతో, చేతివ్రేళ్ల గణుపులతో లేదా మట్టితో జపాన్ని లెక్కించకూడదు. జపమాలతో, మిరియాలతో లెక్కించవచ్చు. శ్రేష్టమైనది లక్క, దర్భ, సింధూరము, ఎండిన ఆవుపేడ మిశ్రమంతో గోళీలు తయారు చేసి లెక్కించుట.

4. జపము చేయునప్పుడు జపమాలను బయటకు కనిపించకుండా అరచేతి చాటున లేదా ఒక వస్త్రముతోనైనా తప్పనిసరిగా కప్పి ఉంచవలెను. ఆ వస్త్రము తడిగా ఉండరాదు.

5. జపమాలను అనామిక (ఉంగరపు) వ్రేలిపైన ఉంచి బొటన వ్రేలితో స్పర్శించుచు మధ్య వ్రేలితో పూసలను తిప్పవలెను. చూపుడు వ్రేలును ఉపయోగించకూడదు.

6. జపము చేయునప్పుడు కదలుట, మెదలుట, మాట్లాడుట నిషిద్ధము. తప్పనిసరిగా మాట్లాడవలసినచో భగవంతుని క్షమాపణ భావంతో స్మరించి తిరిగి జపించవలెను.

7. అజాగ్రత్తవలన జపమాల కింద పడినచో నూట ఎనిమిది మార్లు ప్రత్యేకముగా జపించవలెను. కాలికి తగిలిన యెడల జలముతో కడిగి రెట్టింపు సంఖ్యతో (రెండు మాలలు) అదనముగా జపము చేయవలెను.

8. ఒకవేళ చేతి వ్రేళ్లతో జపము చేయవలసి వస్తే ఉంగరపు వ్రేలు మధ్య గణుపు మీద మొదలు పెట్టి, క్రింది గణుపు, తరువాత చిటికెన వ్రేలు మీద గణుపు, చిటికెన వ్రేలు, ఉంగరపు వ్రేలు, మధ్య వ్రేలు, చూపుడు వ్రేలు యొక్క మేరువులను తాకుతూ చూపుడు వ్రేలు గణుపులతో ముగించవలెను. ఈ మర్గాన్ని విలోమములో చేసి (చూపుడు వ్రేలు చివరి గణుపుతో మొదలు పెట్టి అప్రదక్షిణముగా ఉంగరపు వ్రేలి మధ్య గణుపులో) ముగించవలెను. చివరి ఎనిమిదికి ఉంగరపు వ్రేలు చివరి గణుపుతో మొదలుపెట్టి చూపుడు వ్రేలు మధ్య గణుపుతో ముగించవలెను. దీనిని కరమాల అందురు.(రెండవ చిత్రాన్ని చూడండి)

9. సంధ్యోపాసనలో చేసే గాయత్రీ మంత్ర జపానికి కరమాల శ్రేష్ఠం. ఇతర మంత్ర జపానికి రుద్రాక్షమాల శ్రేష్ఠం.

10. జపమును ముగించిన పిమ్మట కూర్చున్న ప్రదేశమునందు మట్టిని తీసికొని నుదుటిపై తిలకమును ధరించవలెను. లేనిచో జపఫలితమును మహేంద్రుడు గ్రహించును.

- "నిత్యకర్మ - పూజా ప్రకాశిక" (మదునూరి వెంకటరామశర్మ, గీతాప్రెస్)

పూర్వజన్మకు ఈజన్మకు ఉన్న సంబంధము



శరీరం యదవాప్నోతి యచ్చప్యుత్క్రామతీస్వరః
గృహీత్వైతాని సమ్యాతి వాయుర్గంధానివాశయాత్

వాయువు వాసనలను ఒకచోటి నుండి మరొక చోటికి తీసుకొని పోయినట్లుగా జీవాత్మ ఒక శరీరమును త్యజించునప్పుడు మనస్సును ఇంద్రియములను గ్రహించి వాటితో కూడ మరొక శరీరాన్ని పొందును. 

భగవద్గీత 15వ అధ్యాయము, 8వ శ్లోకము.

ఇదీ పూర్వజన్మకు ఈజన్మకు ఉన్న సంబంధము. ఈ అనంతమైన వలయాన్ని ఛేదించుటే మోక్షము. దానికి శరీరము సాధనము. జీవితం లక్ష్య సాధనకు సోపానము.

దేహి తవ పద భక్తిం - త్యాగరాజస్వామి కృతి

దేహి తవ పద భక్తిం! వైదేహి! పతిత పావని మే సదా! ఐహికాముష్మిక ఫల దే! కమలాసనాన్యజ వర జనని! కలశవారాశిజనితే! కనక భూషణ లసితే! కలశజ గీత ముదితే! కాకు...