పూవులేరి తేవే చెలీ పోవలె కోవెలకు
తుమ్మెద కాలూననివి, దుమ్ము ధూళి అంటనివి
కమ్మగ వలచేవి, రకరకమ్ముల వన్నెలవి
ఆలసించినా, పూజావేళ మించిపోయెనా,
ఆలయమ్ము మూసి పిలుపాలింపడు నా విభుడు
మాలలల్లుటెపుడే? నవమంజరులల్లేదెపుడే?
ఇక పూలే పోయాలి తలంబ్రాలల్లే స్వామి పైన
భక్తి భావం నిండిన లలిత గీతాలకు తలమానికం దేవులపల్లి వారి రచనలు. ఆయన రచనకు సంగీతాన్ని కూర్చిన మరో మహానుభావులు పాలగుమ్మి విశ్వనాథం గారు. ఈ పాటను ప్రఖ్యాత లలిత సంగీత గాయని శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు ఎంతో రమ్యంగా పాడారు.
తెలుగు భాషలోని మాధుర్యాన్ని మనకందించిన వారిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ముందు నిలుస్తారు. తుమ్మెద ఆఘ్రాణించనివి, దుమ్ము ధూళి లేనివి, కమ్మగా ప్రేమించేవి, ఎన్నెన్నో అందాలున్నవి...ఇలాంటి పూలు ఏరి తెమ్మని చెలిని కోరుతోంది ఓ భక్తురాలు. ఆలస్యమవుతుందేమో అన్న ఆతృత, స్వామిని సేవించాలన్న తహ తహ, స్వామిని పూలతో తలంబ్రాలుగా ముంచెత్తాలన్న మధుర భక్తి ఈ గీతంలో లలితమైన తెలుగు పదాలతో జీవం పోశారు కవి. అంతే శ్రావ్యంగా సంగీతం కూర్చారు పాలగుమ్మి వారు. వేదవతి గారి గొంతులో ఆ అమాయకపు మధుర భక్తి మూర్తీభవించింది. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి