28, మార్చి 2015, శనివారం

సీతారామ వైభవం-2 - రాముని జననం


జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం
జనన మరణ ఖేద క్లేశ విచ్ఛేద మంత్రం
సకల నిగమ మంత్రం సర్వ శాస్త్రైక మంత్రం
రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం

అగ్ని బీజమై సమస్త పాపఖండన చేసేది రామనామము. తరించేది కాబట్టి తారకమంత్రమైనది. హనుమ మొదలు ఎందరిని తరింపజేసింది? జన్మకు సాఫల్యాన్ని కలిగించే మంత్రం...జననమరణాల దుఃఖాన్ని, కష్టాలను నాశనం చేసే మంత్రం, వేద సారమైన మంత్రం, అన్ని శాస్త్రములు ఏకమై ఘోషించే మంత్రం, రాముని నిజ మంత్రం రామ రామ అనే మంత్రం...అని శ్రీరామ కర్ణామృతమ్ మనకు బోధిస్తుంది. మరి ఆ రాముని అవతారం ఎలా జరిగింది?

శ్రీరాముని జననానికి రావణ సంహారం కారణమైతే దానికి వేదికి అయోధ్యానగరం. రఘువంశ కులజుడైన దశరథునికి సంతానం లేకపొవడంతో అశ్వమేథ యాగం తలపెడతాడు. ఆ యాగానికి ఋష్యశృంగ మహర్షిని దశరథుని మంత్రియైన సుమంతుడు పిలిపిస్తాడు. ఋష్యశృంగుడు అయోధ్యకు వచ్చి దశరథునిచే అశ్వమేథం చేయిస్తాడు. అటు తరువాత దశరథుడు పుత్రప్రాప్తికై క్రతువును చేయించమని ఆయనను అభ్యర్థిస్తాడు. అప్పుడా ఋష్యశృంగుడు అథర్వ శీర్షంలో ఉన్న పుత్రకామేష్టి క్రతువు చేస్తానని చెబుతాడు. ష్యశ్రంగుని వంటి తపోసంపన్నుడు క్రతువు ఏర్పాట్లు మొదలుబెడతాడు. ఆయన పవిత్రతకు బ్రహ్మాది దేవతలు తమ హవిర్భాగం గ్రహించటానికి యాగశాలలో ప్రత్యక్షమవుతారు. దేవతలందరూ అక్కడ బ్రహ్మదేవుని రావణుని హింసలనుండి విముక్తి కలిగించవలసిందిగా వేడుకుంటారు. బ్రహ్మ ఆతను మానవులచేత మాత్రమే సంహరించబడతాడు అని అంటాడు. అంతలో శ్రీమహావిష్ణువు యాగశాలలో ప్రత్యక్షమవుతాడు. దేవతలందరూ ఆయనను ప్రార్థిర్స్తారు. అప్పుడు ఆ పరమాత్మ పూర్ణాంశతో రామునిగా, అర్థాంశతో భరత లక్ష్మణ శతృఘ్నులుగా జన్మిస్తానని చెబుతాడు. ఋష్యశృంగుడు పుత్రకామేష్టి విజయవంతంగా పూర్తి చేస్తాడు. శ్రీమహావిష్ణువు దశరథుని కుమారులుగ జన్మించాలని సంకల్పిస్తాడు. యజ్ఞపురుషుడు పాయస పాత్రను దశరథునికిచ్చి ఆ పాయసాన్ని భార్యలకు పంచమని చెబుతాడు. దశరథుడు ఆ పాయసంలో సగభాగాన్ని పెద్ద భార్య కౌసల్యకు, 1/4 భాగం సుమిత్రకు, 1/8 భాగము చిన్న భార్య కైకేయికి, మిగిలిన 1/8 భాగము సుమిత్రకు ఇస్తాడు. కొంతకాలానికే ఆ రాణులు గర్భవతులవుతారు. దాదాపు పన్నెండు నెలల తరువాత కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శతృఘ్నులు జన్మిస్తారు. 

రాముని జననం గురించి వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం బాలకాండలోని 18వ సర్గలో ఇలా తెలిపారు...
తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్ సమత్యయుః
తతశ్చ ద్వాదశే మాససే చైత్రే నావమికే తిథౌ

నక్షత్రేదితి దైవత్యే స్వోచ్చసంస్థేషు పంచసు
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిందునా సహ

ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం
కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సమ్యుతం

విష్ణోరర్థం మహాభాగం పుత్త్రం ఐక్ష్వాకు వర్ధనం
కౌసల్యా శుశుభే తేన పుత్త్రేణామితతేజసా
యథా వరేణ దేవానాం అదితిర్వజ్రపాణినా

పుత్రకామేష్టి యాగం ముగిసిన సంవత్సర కాలం తరువాత చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగవ పాదమున కర్కాటక లగ్నమున కౌసల్యాదేవియందు శ్రీరామచంద్రుడు జన్మించాడు . ఆ సమయములో సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని అను ఐదు గ్రహములు తమ ఉచ్చ స్థానములందు అనగా క్రమముగా మేష, మకర, కర్కాటక, మీన తులారాశులయందు ఉండిరి. కర్కాటక రాశియందు గురు చంద్రులు కలిసి ఉండిరి. బుధుడు, రవి మేషమునందుండిరి. జగన్నాథుడు, అన్ని లోకములవారిచే నమస్కరింపబడువాడు, సకల శుభ లక్షణ సంపన్నుడు, గొప్ప భాగ్యశాలి, ,విష్ణువు అంశతో పుట్టినవాడు,  ఇక్ష్వాకు వంశ తిలకుడు  అయిన శ్రీరాముని కన్నఆ  కౌసల్య ఎంత ధన్యురాలు? కౌసల్యా దేవి తన తపఃఫలముగా అర చేతిలో  వజ్రరేఖలు కలవాడు, అమితమైన తేజస్సు కలిగినవాడు  అయిన శ్రీరాముని పుత్రునిగా పొందింది. దేవతలలో ఉత్తముడు, వజ్రాయుధాన్ని ధరించే ఇంద్రుని పుత్రునిగా పొందిన అదితిలా  ఆ కౌసల్య మాట అలరారింది . రాముని జనన సమయంలో ఐదు గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉండటం  వలన,జ్యోతిష్య శాస్త్ర ప్రమాణం ప్రకారం "పంచోచ్చే లోకనాయకః" . అందుకే రాముడు లోకానికి ప్రభువైనాడు.

ఆ తరువాత విష్ణువు అర్థాంశగా భరతుడు చైత్ర శుద్ధ దశమి పుష్యమీ నక్షత్ర సమయంలో కైకేయికి, లక్ష్మణ శతృఘ్నులు చైత్ర శుద్ధ దశమి ఆశ్లేష నక్షత్ర సమయములో సుమిత్రకు జన్మించారు. ఈ నలుగురు అన్నమ్దన్న్ములు జన్మించ సమయంలో గంధర్వులు మధుర గానం చేశారు, అప్సరసలు హృద్యంగా నాట్యం చేశారు. దేవదున్ధుబులు మ్రోగగా దేవతలు పూల వానలు కురిపించారు.

దశరథ మహారాజు తన ఉత్తములకు, తన వందిమాగదులకు బహుమానాలిచ్చాడు.బ్రాహ్మణులకు గోవులు ధన కనక వస్తు వాహనాలను దానం చేశాడు. ప్రజలు ఆనందోత్సాహాలతో ఆడిపాడారు. రాజవీదులన్నీ గాయకుల పాటలతో, నృత్యాలతో, ఉత్సవాలతో నిండిపోయాయి.  దశరథ మహారాజు అయోధ్యాపుర వాసులకు మృష్టాన్న భోజనాలు పెట్టి సంతృప్తి  పరచాడు . 
ఈ రామ జననాన్ని మన తెలుగు గడ్డపై పుట్టిన ప్రయాగ రంగదాసు గారు అద్భుతంగా వర్ణించారు. ఆ కీర్తన వివరాలు:


కళ్యాణ రామునికి కౌసల్య లాలి
రాముడుద్భవించినాడు రఘు కులంబున    

తామసులను దునిమి దివిజ స్థోమంబున
క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీరాముడుద్భవించినాడు

తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబున
సరస కర్కాటక లగ్నమరయగ సురవరులెలమిని కురియింప విరుల వాన 

దశరధుండు భూసురులకు ధనమొసంగగా  
విసరె మలయ మారుతము దిశలెల్లను విశదములై వసుమతి దుర్భరము బాప

ధరను గుడిమెళ్ళంక పురమునరసి బ్రోవగా
కరుణతో శ్రీ రంగదాసు మొరలిడగను కరుణించియు వరమివ్వను స్థిరుడై శ్రీ 


దీని సారాంశము:

దశరథుడు బ్రాహ్మణులకు దానాలు చేయగా, అన్ని దిశలా మలయ మారుతాలు వీచగా, భూదేవి బాధను తగ్గించటానికి, చైత్రమాసమున, శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్రమున, కర్కాటక లగ్నమందు మెరుపులు మెరుస్తుండగా, దేవతలు పూలవానలు కురిపిస్తుండగా, దేవతల క్షేమము కొరకు, రాక్షసులను చంపటానికి శ్రీరాముడు కౌసల్యా గర్భమున జన్మించాడు.  


మనకు శ్రీకృష్ణుని జననం గురించి ఎన్నో వర్ణనలు వచ్చాయి. ఇక్కడ ప్రయాగ రంగదాసు గారు రాముని జన్మమును ఎన్నుకోవటం విశేషం. .ప్రయాగ రంగదాసు గారు మన ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టిన ఒక వాగ్గేయ కారుడు.  మన మంగళంపల్లి బాలమురళీ కృష్ణగారి మాతామహులు వీరు. ఈయన ఎన్నో మంచి కీర్తనలు శ్రీ రాముని మీద రచించారు.  రంగదాసు గారు శ్రీమద్వాల్మీకి రామాయణంలోని బాలకాండం ప్రేరణతో ఈ కీర్తన రాశారు. రంగదాసు గారు తన ముద్రగా తన స్వగ్రామాన్ని వాడటం ఆయన వ్యక్తిత్వాన్ని చూపుతుంది. ప్రయాగ రంగదాసు గారు మరెన్నో అద్భుతమైన కీర్తనలను రచించారు. వాటిలో రామ రామ యనరాదా రఘుపతి రక్షకుడని వినలేదా, ఏమే చిట్టీ, కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మ, రామా నిను వినా వంటివి చాలా ప్రాచుర్యం పొందారు. ఆయన 1859వ సంవత్సరంలో మెళ్లంక గ్రామంలో జన్మించారు.  మంచి హరికథకులు. ఆధ్యాత్మ రామాయణ సంకీర్తనలు ఆయన నోటనే ప్రాచుర్యం పొందాయి. అలాగే, అష్టపదులు, నారాయణ తీర్థ తరంగాలను రంగదాసు గారు ప్రచారంలోకి తెచ్చారు. వారి రచన అయిన రాముడుద్భవించినాడు అనే కీర్తనకు అరవైయ్యవ దశకంలోని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి శ్రవణం.  



1 కామెంట్‌:

  1. అకిరాజు గారు,రంగాదాసు గారి కీర్తనలు ఆకాశవాణి లో వినేవాలము.ధనయవాదములు.

    రిప్లయితొలగించండి