23, నవంబర్ 2011, బుధవారం

సత్య సాయి భజన - ఉయ్యాలలూగుమా శ్రీసత్యసాయి


ఉయ్యాలలూగుమా శ్రీసత్యసాయి ఆత్మడోలికలోనూ ఆనందదాయి

నా మానస సరోవరము పాల్కడలి కాగా 

శేషరూపక నాడీకల్పమున నిలచే
శ్వాసలే మధురగానము చేయు వేళలో 

నా తనువెల్ల హాయిగా విహరింపుమయ్య తనువెల్ల హాయిగా విహరింపుమయ్య |ఉయ్యాలలూగుమా|

బ్రహ్మాండమంతయు వ్యాపించియున్న 

నీవేమో నాలో నిలచి యున్నావు
ఈ విశ్వమంతయు
ఈ విశ్వమంతయు నీలోపలది గాన 
వాసుదేవా నేను సాయిదేవా నేను నీలోననున్నానుగా |ఉయ్యాలలూగుమా|

లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి

బొంబాయి జయశ్రీ శ్రవణం

సత్య సాయి భజన - సాయీశ్వర నీ పదముల సన్నిధి నే చేరినాను


సాయీశ్వర నీ పదముల సన్నిధి నే చేరినాను
సదానంద వార్నిధిలో సదా డోలలూగినాను


హరేరామ హరేకృష్ణ హరే సాయి హరే హరే
భజే సాయి శాంతిదాయి సత్య సాయి హరే హరే  |సాయీశ్వర|

మనసులోన భక్తి సుధా మధురిమలే నింపినాను
కనులలోన కాంతి ప్రభా కవిత జ్యోతి నిలిపినాను
ఆరాధన పూర్వకముగ అనవరతము కొలిచినాను
తనివారగ దర్శించి తరియించెద స్వామి నేడు |సాయీశ్వర|

హృదయపథములో నిరతము పదయుగమును నిలిపినాను
భావవీధిలో సతతము సేవచేయ తలచినాను
ఆవేదన పొంగగ నను ఆదుకొనగ వేడినాను
పరమాద్భుత మహిమాన్విత కరుణ కోరినాను నేడు |సాయీశ్వర|

ఆశ్రిత జనకోటికెల్ల అభయమొసగు దాతనీవు
నామకీర్తనన మురియు నారాయణమూర్తి నీవు
లీలామానుష దేహుడు బోళాశంకరుడు నీవు
త్రిమూర్తి స్వరూపుడవు దీనబాంధవుడవు నీవు |సాయీశ్వర|

త్రేతాయుగమందు వెలయు సీతాపతి నీవుగదా
ద్వాపరమ్ములోన వెలుగు గోపాలుడు నీవుగదా
ఈ కలికాలమున అవతరించిన సాయీవి కదా
పర్తివాస పరమపురుష పరమాత్ముడ నీవే కదా |సాయీశ్వర|

ప్రియ సిస్టర్స్ శ్రవణం 

22, నవంబర్ 2011, మంగళవారం

శ్రీమదాంధ్ర మహాభాగవతము ప్రథమ స్కంధము - అమ్మలగన్నయమ్మ

అమ్మకు అంకితం

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చినయమ్మ తన్ను లో
నమ్మినవేల్పుటమ్మలమనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ది యిచ్చుత మహత్వకవిత్వపటుత్వ సంపదల్

పోతనామాత్యులు

తాత్పర్యము: అమ్మలందరికీ అమ్మ, లక్ష్మి, సరస్వతి, పార్వతులకు మూలమైన అమ్మ, అందరమ్మలకన్నా అధికురాలైన అమ్మ, రాక్షసుల తల్లుల కడుపులకు చిచ్చుపెట్టి (రాక్షస సంహారం ద్వారా), తనను మనసులో నమ్ముకున్న దేవతల తల్లుల మనములలో నిలిచియుండే అమ్మ, దయాసాగరి అయిన మా దుర్గాదేవి నాకు మహత్తు కలిగిన కవిత్వ, పటుత్వ సంపదలనిచ్చు గాక!


జగజ్జనని ఆది పరాశక్తి

ప్రథమ స్కంధములోని ప్రార్థన పద్యాలలో అత్యంత ప్రజాదరణ పొందినది ఈ అమ్మలగన్నయమ్మ. ఆ ఆదిపరాశక్తిని నుతిస్తూ పోతనగారు ఆమె అపార కరుణారస వృష్టి ద్వారా తనకు ఎంతో మహత్తు కలిగిన దృఢమైన కవితా సంపద కలగాలని వేడుకున్నారు. పోతన భాగవతంలో పదశోభ మువ్వల గజ్జెలా గంగా ప్రవాహంలా అత్యంత రమణీయంగా ఉంటుంది. పద్యము మొత్తం అమ్మ శబ్దంతో నింపిన పోతనగారు జగజ్జనని మహాత్మ్యాన్ని ఉత్పలమాలలో మనకు అందించారు.

పురాణేతిహాసములలో ముగ్గురుమ్మలకు మూలంగా కొలువబడిన ఆ దుర్గాదేవి సర్వశక్తిస్వరూపిణి కనుకు పోతనగారు ఆమెను తన కావ్యరసప్రవాహం సుగమంగా సాగటానికి రమ్యంగా ప్రార్థించారు.  ఈ పద్యాన్ని శ్రీకృష్ణపాండవీయం చలన చిత్రంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్మిణి ఆ జగన్మాతను ప్రార్థించే సన్నివేశంలో గానకోకిల సుశీలమ్మ గారు అద్భుతంగా గానం చేశారు. అమ్మను నుతించే ఏ పద్యమైన అమ్మ అంత హృద్యమే. కృపాబ్ది అన్నది అమ్మ దయారాశిని సూచించటానికి ఎంత సముచితమైనదో తల్లి ప్రేమను చూరగొన్న ప్రతి బిడ్డకు తెలుసు. నా తల్లి సరస్వతమ్మ గారితో పాటు ఈ లోకంలో ఉన్న ప్రతి మాతృమూర్తికి ఈ పద్యం అంకితం.

21, నవంబర్ 2011, సోమవారం

శ్రీమదాంధ్ర మహాభాగవతము ప్రథమ స్కంధము - శ్రీ కైవల్య పదంబు

అమ్మకు అంకితం

తెలుగు సాహితీ జగత్తులో అత్యుత్తమమైన రచన బమ్మెర పోతనామాత్యులవారి శ్రీమదాంధ్ర మహాభాగవతము. వేదవ్యాసులవారి భాగవతాన్ని రామ కార్యంగా, రాముని సంకల్పము చేత, ఈ తేనెల తేటల మూట అయిన శాశ్వత సాహితీ సంపదను పోతనగారు కృతి చేసి ఆ రామునికే అంకితము చేశారు. ఇటువంటి రచన న భూతో న భవిష్యతి. ప్రతి పద్యములోనూ భగవంతుని దర్శనాన్ని కలిగించి మనలను తర తరాలపాటు మోక్షమార్గోన్ముఖులను చేశారు. ఆ మహాకవికి తెలుగు సాహితీ జగత్తు మరియు భక్త జన కోటి తరఫున శత సహస్ర కృతజ్ఞతాభివందనములు.

మాతృదేవోభవ - అపారమైన ప్రేమ, కరుణ, వాత్సల్యము, జ్ఞానము కలిగిన నా మాతృమూర్తి సరస్వతమ్మ గారికి ఈ ధారావాహికాన్ని సమర్పిస్తూ ఆమెకు ఉత్తమలోకాలు ప్రాప్తించాలని ఆ విశ్వాత్ముడైన శ్రీహరికి నా ప్రార్థన.



పోతనగారు భాగవతాన్ని ప్రథమ స్కంధములో ప్రార్థనా శ్లోకము ద్వారా ఆరంభించారు.

శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళీలోలవిలసదృగ్జాల సంభూత నా
నా కంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్

తాత్పర్యము: మానవ జన్మకు అత్యుత్తమమైన పురుషార్థము మోక్షము. ఆ మోక్షప్రాప్తిని పోతనగారు శ్రీకైవల్యపదంబు గా పేర్కొన్నారు. ఈ భాగవత ప్రయోజనము, లక్ష్యము కూడా అదే కదా! లోకరక్షణాపరాయణుడు, భక్తపాలనమే ఒక కళగా ఆచరించేవాడు, దానవుల ఉద్ధృతాన్ని అరికట్టే వాడు, లీలావలోకనముతో (కంటిచూపుతో) అనేక బ్రహ్మాండములను సృష్టించే వాడు, నందుని ఇల్లాలయిన యశోద ముద్దు బిడ్డడు అయిన బాలకృష్ణుని శ్రీ కైవల్యపదమును పొందుట కొరకు నేను ధ్యానిస్తున్నాను.

భాగవతంలో సృష్టి, శ్రీహరి అవతారములు, వాటి విలక్షణ లక్షణములను అద్భుతంగా వివరించినా, శ్రీకృష్ణుని అవతార వర్ణనా ఘట్టమైన దశమ స్కంధము అత్యంత రమ్యమైనది, రసమయమైనది, జనాదరణ పొందినది. అందుకు కారణం ఆ లీలామానుషుని మాయాప్రేరిత చేష్టలు, వాటిలో అంతర్లీనమైన ఆధ్యాత్మిక సందేశము. మనలో ఒకనిగా ఉంటూ, చిలిపి చేష్టలు ప్రదర్శిస్తూ విశ్వవిలాసానికి సాక్షీభూతునిగా నిలచి పిదప దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన యోగావతారుడు శ్రీకృష్ణుడు. తల్లి ప్రేమ, కన్నెలతో రాసక్రీడలు, చెలికాళ్లతో సావాసము, మహాకాళిందీ కేళీ విలాసము, కంసాది దానవ సంహారము, తన్మయ బృందావన వేణు గాన నాట్య విలాసము, రాజనీతి, రణనీతి, ధర్మ స్థాపన, పంచమవేదంగా ప్రసిద్ధిగాంచిన శ్రీమద్భగవద్గీత బోధన ద్వారా కర్తవ్య ప్రబోధము, విశ్వరూపసందర్శనము, అతి సామాన్య అవతార సమాప్తి - ఇంతటి విలక్షణ లీలానాటక ప్రదర్శనము చేసిన ఆ శ్రీకృష్ణుని ప్రార్థనా శ్లోకములో నుతించుట సముచితం. అందుకే శ్రీమదాంధ్ర మహా భాగవత సౌరభము మొదటి మెట్టులోనే సంపూర్ణంగా పరిమళించి తెనుగునాట చిరకాలం నిలిచింది.

మొదటి పద్యములోనే పోతనగారు తన లక్ష్యాన్ని, మార్గాన్ని చాలా సుస్పష్టంగా మన ముందుంచారు. భగవంతుని గాథలను వర్ణిస్తూ ఆయనను ధ్యానించి కైవల్యము పొందే మార్గాన్ని ఈ ప్రార్థనలో చిత్రీకరించారు. పాండిత్యానికి భక్తి పారవశ్యానికి గల తేడా మనకు శ్రీనాథుడు మరియు పోతనల రచనలను పోల్చి చూస్తే విశదపడుతుంది. లాలిత్యము, మాధుర్యము, సంపూర్ణ వర్ణనము, రోమాంచము గావించే పద కిసలయ విన్యాసము పోతన రచనకు మూలస్థంభమైతే భక్తి, తాదాత్మ్యత దానికి శ్వాస. అందుకే అది ఆత్మ సాక్షాత్కారానికి సోపానముగా నిలిచింది. వచ్చే సంచికలో మరొక ప్రార్థనా పద్యము అమ్మలగన్నయమ్మ...


18, నవంబర్ 2011, శుక్రవారం

శ్రీ పోతన భాగవత మధురిమలు - అమ్మ కోసం

అమ్మకు పోతన భాగవతం పద్యాలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు బాలశిక్షతో పాటు నేర్చుకున్న ఈ పద్యాలు అమ్మ ముఖంలో ఆనందాన్ని, తృప్తిని నింపేది. నిద్రలో లేపి అడిగినా కూడా అమ్మ ఈ పద్యాలు సరైన ఉచ్చారణతో ఉత్సాహంగా చెప్పేది. అమ్మ ఆత్మ శాంతికోసం పోతన భాగవతంలోని కొన్ని పద్యాలు ధారావాహికంగా. మూలం గీతా ప్రెస్సు వారి శ్రీ పోతన భాగవత మధురిమలు.

14, ఆగస్టు 2011, ఆదివారం

జయ జయ జయ ప్రియ భారత


జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. కన్నతల్లి కన్నా మిన్నయైన మాతృభూమి మనకు వారసత్వాన్ని, ఉనికిని వెలలేని సంపదగా ప్రసాదిస్తున్నది. దాస్యమంటే మన వివేకము, వివేచనము ఉపయోగించకుండా, పరధర్మానికి మోకరిల్లటం. స్వధర్మమనగా మనకు పూర్వీకులనుండి వచ్చిన జీవనశైలి, వృత్తి. ఈ అసమాన వైశిష్ట్యం కలిగిన స్వధర్మాన్ని వదలి కడుపు నింపుకోటానికి చెప్పలేని పరధర్మాలను ఆశ్రయిస్తూ, అందులో భాగంగా స్వధర్మాన్ని అపహాస్యం, అవహేళన చేస్తూ, కించ పరుస్తూ నా అంత తెలివికలవాడు లేడని కాలరు ఎగరేసుకుంటున్నాము. కానీ, ఈ పరధర్మ మార్గంలో వెళ్లటం ద్వారా ఏమి కోల్పోతున్నామో తెలుసా? - కాలానికి నిలిచిన ఒక బలీయమైన సంస్కృతి అనే హారంలో ఒక ముత్యంలా ఉండే అవకాశం, తద్వారా వచ్చే అనన్యమైన దైవసంపదను పొందే అవకాశం. పరధర్మమంటే విదేశాలకు వెళ్లటమని నా ఉద్దేశం కాదు. మన తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, బామ్మలు పాటించిన ధర్మాలు, నిర్వర్తించిన బాధ్యతలు విస్మరించి కేవలం నేను, నా కుటుంబం అనుకునే అవకాశవాదం పరధర్మం యొక్క ముఖ్య లక్షణం. పది వస్తే ఒకటిని ఇతరులతో పంచుకోవటం, లేనివానికి చేయి అందించి పైకి లేవదీయటం, తల్లిదండ్రులను అనాథ ఆశ్రమాలకు నెట్టకుండా వారిని ఆదరించి గౌరవించటం, మానవుని శక్తిని మించినది పారలౌకికమైనది, అపారమైన కరుణ కలది ఒక దైవిక శక్తి ఉన్నది అని నమ్మి దానికి శరణనటం, ఐదు వేళ్లు కలిస్తేనే చేయి, అలాగే, అందరూ కలిస్తేనే పటిష్టమైన సమాజం - ఇవి స్వధర్మం లక్షణాలు. వీటిని పాటించటం కష్టమేమీ కాదు. మీ అత్యాశలను తగ్గించుకొని చూడండి, మీ అవసరాలకు పరిమితిని పెట్టి చూడండి. అప్పుడు తప్పకుండా పక్కవారి గురించి ఆలోచించే వివేచనము, అవకాశము కలుగుతాయి.

స్వతంత్రమనగా స్వేచ్ఛగా జీవించటమొకటే కాదు, ఆ స్వేచ్ఛను గౌరవించటం, సమానత్వానికి పాటుపడటం. 15 లక్షలు సంవత్సరానికి సంపాదించే వ్యక్తి సంవత్సరానికి ఒక పేద విద్యార్థి చదువుకు సహాయపడలేడా? సంవత్సరానికి పది జతలు కొనుక్కునే సంపన్నులు ఒక జతను ఒక పేదరాలికి ఇవ్వలేరా? లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీలు జరుపుకునే వారు తల్లిదండ్రులకు కనీస సదుపాయాలు కలిగించలేరా? కారులో వెళ్లే ఉద్యోగి ఒక క్షతగాత్రుడికి సాయపడలేడా? 25 ఏళ్ల కుర్రాడు క్యూలో నిలుచుని నిదానంగా తనవంతు కొరకు వేచి ఉండలేడా? ఇదే స్వధర్మమంటే. ఒక్కదాన్ని పాటించి చూడండి. మీకే ఆత్మ సంతృప్తి కలుగుతుంది. నిజమైన స్వాతంత్య్రము ఏమిటో అర్థమవుతుంది.

స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా, భరతమాత బిడ్డగా జన్మించినందుకు గర్వంతో తల ఎత్తుకుని జై హింద్ అంటున్నాను. ఈ సందర్భంగా కొన్ని దేశభక్తి గీతాలు.


1 . జయ జయ జయ ప్రియ భారత 

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి


జయ జయ సశ్యామల సుశ్యామచలచేలాంచల
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల
జయమదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ |జయ జయ|


జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పథ విహరణ
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణ |జయ జయ|



2 . జయ జయ జయ జన్మభూమి

జయ జయ జయ జన్మభూమి 
జయ జయోస్తు మాతృభూమి


గంగా గౌతమి కృష్ణల కన్నతల్లి భారతి
కనకవర్షమొలికించే స్వర్గసీమ భారతి
తల్లికి నీరాజనమిడ తరలిరండి రండీ రండీ రండీ రండీ |జయ జయ|


ఆది ఋషుల జన్మభూమి ఈ పవిత్రభూమి
ఈ పవిత్రభూమిని రక్షించుట మన ధర్మం
ఇది భారత జనావళికి అశిధారా వ్రతము
ఇది భారత ప్రజావళికి పరీక్షా సమయము |జయ జయ|

3 . స్వతంత్ర భారత జనని

స్వతంత్ర భారత జనని నీకిదె నితాంత నవ నీరాజనము
అశేష పూజా శిరీషములతో అగణిత నరనారీ జనము

వదలెను చిరదాస్య శృంఖలమ్ములు చెదరెను దైన్యతమహ్పటలమ్ములు

ఆ సేతు హిమనగమ్మొక పొంగై అలముకొన్నదానంద తరంగం |స్వతంత్ర|

త్యాగమూర్తియౌ మహాత్ముడొసగిన శాంత్యహింసలే సదాశయమ్ముగ

సకల వసుంధరనేకము సేయగ అకళంకులమై ప్రతినలు సేతుము  |స్వతంత్ర|

 4 .  తేనెల తేటల మాటలతో

తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా


సాగర మేఖల చుట్టుకొని సుర గంగ చీరగా మలచుకొని 
గీతా గానం పాడుకొని, మన దేవికి ఇవ్వాలి హారతులు |తేనెల తేటల|

గాంగ జటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా

గల గల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే |తేనెల తేటల|

ఎందరు వీరుల త్యాగఫలం మన నేటి స్వే
చ్ఛకే మూలబలం
వారందరినీ తలచుకొని మన మానస వీధిన నిలుపుకొని |తేనెల తేటల|

31, జులై 2011, ఆదివారం

షోడశ సంస్కారములు - రెండవ భాగము

జాతకర్మ:

ఇది శిశువు భూమి మీదకు వచ్చినంతనే కావింపబడునది. ఇందు తొలుత తండ్రి యవపు పిండి, బియ్యపు పిండి తరువాత బంగారముతో రుద్దబడిన తేనెను, నెయ్యిను అప్పుడే పుట్టిన బిడ్డ యొక్క నాలుకకు తాకించవలెను. ఈ సమయమున తండ్రి - " ఈ యన్నమే ప్రజ్ఞ, ఇదియే ఆయువు, ఇదియే అమృతము. ఇవన్నియు నీకు ప్రాప్తించును గాక. మిత్రావరుణులు, అశ్వినీదేవతలు, బృహస్పతి నీకు మేధనొసగు గాక" అన్న అర్థము గల మంత్రము పఠించును. భూమిపైకి వచ్చెడి తరుణమునందు మిక్కిలి కష్టము గలుగుట వలనను, మహామాయామోహము ఆవరించుటవలనను శిశువు స్మృతి కోల్పోవును. అట్టి స్మృతిని తిరిగి కలిగించుటకే ఈ మేధాశక్తిని కలిగించే ప్రక్రియ చేయబడును. మొత్తం మీద ఈ జాతకర్మ వలన ఉపపాతకములు (తల్లిదండ్రుల శరీరములనుండి ఆపాదించిన దోషములు) నశించి తీరును.

ఈ ప్రక్రియలో వాడబడిన వస్తు గుణములు:

అన్నము శరీరరక్షణకు మూలము. సువర్ణము వలన వాతదోషమును శాంతింపజేయును. మూత్రమును సరాసరి వెడలించును. రక్తపోటును సరిజేయును. నెయ్యి శరీరమందు ఉష్ణమును కలిగించును, పుష్టిని కలిగించును, హాయిగా విరేచనము కలుగజేయును. తేనె ముఖమునకు కాంతిని కలుగజేయును, పిత్తకోశ క్రియను వృద్ధి పరచును, కఫ దోషమును తొలగించును.ఇవన్నీ నూతన శిశువు ప్రాణరక్షణకు అత్యంత అవశ్యకమే.


నామకరణము:

బిడ్ద జన్మించి పదిరాత్రులైన తరువాత ఈ సంస్కారము జరుపబడుతుంది. (పది దినములు ఎందుకంటే చాలా మటుకు పుట్టిన బిడ్డల మరణాలు పదిరోజులలోపే జరుగుతాయి, కాబట్టి వాటిని అధిగమించిన బిడ్డలకు చేయవలసిన సంస్కారము). ఈ నామకరణ సంస్కారమందు శిశువు జననకాల గ్రహ నక్షత్రములను, దేవతాదులనుద్దేశించి పూజా జప హోమ దానములు చేసి శిశువునకు పేరు పెట్టుట తండ్రి విధి. ఈ సంస్కార సమయములో మంత్రము ద్వారా శిశువు ఆత్మకు అమృతత్వము ప్రతిపాదించి బిడ్డకు దీర్ఘాయువు కలుగునట్లు ప్రార్థన జరుపబడును. నామముతో భావమునకు కల సంబంధము వలన, తన జాతి, వర్ణమునకు చెందిన ఉన్నతాశయ లాభమును పొందుచున్నాడు. నామము ద్వారా అమృతంబగు బ్రహ్మముతో సంబంధము ఏర్పరుచుకొనుట, శతాయువు కొరకు ప్రార్థించుట, అంతఃకరణమునకు బలవృద్ధి, మరియు ఆయుర్వృద్ధి కలిగించుకొనుట ఈ సంస్కారం యొక్క ఉద్దేశం.

అన్నప్రాశనము:

పుత్రికయైన ఐదవ నెలలో లేక ఏడవ నెలలో, పుత్రుడైతే ఆరవ నెలలో లేదా ఎనిమిదవ నెలలో ఈ సంస్కారమును చేయవలెను. దీనివలన తిన దగిన ఆహారములు నిర్దిష్టమగుట చేత అన్నమందలి సంకరదోషము నిరాకరించబడుతున్నది. సుముహూర్తములో తండ్రి బిడ్డను తన ఒడిలో యుంచుకొని, భార్య ఎడమ పక్క కూర్చొని యుండగా మంత్రము పఠించుచు, హోమము తరువాత అన్నము నోటిలో యుంచవలెను. అన్నమే సమస్త జీవరక్షణము. అన్నమునకు పతి సూర్యదేవుడు. ఆ సూర్యుడు అన్నమును, శుభమును బిడ్డకు ఇచ్చు గాక అనే అర్థము కలిగిన మంత్రము పఠించబడును. ఈ సంస్కారము వలన బిడ్డకు మాతృగర్భమున మాలిన్యము తినుటవలన కలిగిన దోషము తొలగి శరీరము నిర్మలమగును. పరబ్రహ్మ స్వరూపమని చెప్పబడిన అన్నము ప్రాశనము చేయించుట వలన శిశువుకు బలము, ఆయువు, అంతఃకరణ శుద్ధి స్థాపన కలిగి, బ్రహ్మ భావోద్బోధన జనించును.

కాబట్టి, అసలైన కార్యక్రమం మంత్రోక్తంగా బిడ్డకు అన్నము పెట్టటం. మనం ఆర్భాటంగా జరుపుకునే - బిడ్డను పడుకోబెట్టి పారాడి వస్తువును అందుకునే కార్యక్రమం ఒక వేడుక మాత్రమే.

చౌలము:

సప్తమ సంస్కారమును చౌలము లేక చూడాకరణమని యందురు. ఇది బిడ్డకు మూడవయేడు వచ్చిన పిదప చేయుదురు. ఇందులో బిడ్డ యొక్క తలవెంట్రుకలు తీసివేయుట ప్రధాన క్రియ. శిశువునకు గర్భమునందు కలిగిన కేశములను తొలగించి చూడాకరణమొనర్చి దీనిద్వారా శిక్షయు, సంస్కారయోగ్యతయు కలిగింపబడును. కావున, బిడ్డకు అపాత్రతా దోషము నిరాకరించబడును. వృద్ధి శ్రాద్ధము, హోమము జరిగిన పిమ్మట సూర్యుని ప్రార్థించుచు, "సూర్యుడు దేనితో బృహస్పతికి కేశఖండనమొనర్చెనో, దేనితో వాయుదేవుడు ఇంద్రునకు కేశఖండనము చేసెనో, అట్టి బ్రహ్మరూపి యగు కత్తి ద్వారా నేను నీకు కేశఖండనము చేయుచున్నాను. నీకు ఆయుస్తేజోబలాభివృద్ధులు కలుగుగాక!" అన్న అర్థము గల మంత్రములు పఠించబడును. ఈ చూడాకరణమందు శిఖ మాత్రముంచి మిగిలిన కేశములు తొలగించాలి. కేశములు బలమునకు మూలం. అవి పూర్తిగా తొలగించుట వలన మనిషి బలహీనుడగును. శిఖతో పురుషునకు బలము, వీర్యము, స్థైర్యము, ఆధ్యాత్మికోన్నతికి చెప్పనలవి కాని సంబంధము ఉన్నందు వలన ఈ శిఖధారణము హిందువుల జాతీయ చిహ్నముగా పరిగణించబడినది. చూడాకరణము ఈ జాతీయ చిహ్నమునకు మొదటి సన్నివేశమగును.

వచ్చే భాగంలో ఉపనయనం గురించి చెప్పుకుందాం. 

భవనుత నా హృదయమున రమింపుము - త్యాగరాజస్వామి కృతి

భవనుత నా హృదయమున రమింపుము బడలిక దీర భవతారక నాతో బహుపల్కిన బడలిక దీర కమల సం"భవనుత" పవనసుతప్రియ తనకై తిరిగిన బడడలిక దీర భవనము చేరి న...