RightClickBlocker

31, జులై 2011, ఆదివారం

షోడశ సంస్కారములు - రెండవ భాగము

జాతకర్మ:

ఇది శిశువు భూమి మీదకు వచ్చినంతనే కావింపబడునది. ఇందు తొలుత తండ్రి యవపు పిండి, బియ్యపు పిండి తరువాత బంగారముతో రుద్దబడిన తేనెను, నెయ్యిను అప్పుడే పుట్టిన బిడ్డ యొక్క నాలుకకు తాకించవలెను. ఈ సమయమున తండ్రి - " ఈ యన్నమే ప్రజ్ఞ, ఇదియే ఆయువు, ఇదియే అమృతము. ఇవన్నియు నీకు ప్రాప్తించును గాక. మిత్రావరుణులు, అశ్వినీదేవతలు, బృహస్పతి నీకు మేధనొసగు గాక" అన్న అర్థము గల మంత్రము పఠించును. భూమిపైకి వచ్చెడి తరుణమునందు మిక్కిలి కష్టము గలుగుట వలనను, మహామాయామోహము ఆవరించుటవలనను శిశువు స్మృతి కోల్పోవును. అట్టి స్మృతిని తిరిగి కలిగించుటకే ఈ మేధాశక్తిని కలిగించే ప్రక్రియ చేయబడును. మొత్తం మీద ఈ జాతకర్మ వలన ఉపపాతకములు (తల్లిదండ్రుల శరీరములనుండి ఆపాదించిన దోషములు) నశించి తీరును.

ఈ ప్రక్రియలో వాడబడిన వస్తు గుణములు:

అన్నము శరీరరక్షణకు మూలము. సువర్ణము వలన వాతదోషమును శాంతింపజేయును. మూత్రమును సరాసరి వెడలించును. రక్తపోటును సరిజేయును. నెయ్యి శరీరమందు ఉష్ణమును కలిగించును, పుష్టిని కలిగించును, హాయిగా విరేచనము కలుగజేయును. తేనె ముఖమునకు కాంతిని కలుగజేయును, పిత్తకోశ క్రియను వృద్ధి పరచును, కఫ దోషమును తొలగించును.ఇవన్నీ నూతన శిశువు ప్రాణరక్షణకు అత్యంత అవశ్యకమే.


నామకరణము:

బిడ్ద జన్మించి పదిరాత్రులైన తరువాత ఈ సంస్కారము జరుపబడుతుంది. (పది దినములు ఎందుకంటే చాలా మటుకు పుట్టిన బిడ్డల మరణాలు పదిరోజులలోపే జరుగుతాయి, కాబట్టి వాటిని అధిగమించిన బిడ్డలకు చేయవలసిన సంస్కారము). ఈ నామకరణ సంస్కారమందు శిశువు జననకాల గ్రహ నక్షత్రములను, దేవతాదులనుద్దేశించి పూజా జప హోమ దానములు చేసి శిశువునకు పేరు పెట్టుట తండ్రి విధి. ఈ సంస్కార సమయములో మంత్రము ద్వారా శిశువు ఆత్మకు అమృతత్వము ప్రతిపాదించి బిడ్డకు దీర్ఘాయువు కలుగునట్లు ప్రార్థన జరుపబడును. నామముతో భావమునకు కల సంబంధము వలన, తన జాతి, వర్ణమునకు చెందిన ఉన్నతాశయ లాభమును పొందుచున్నాడు. నామము ద్వారా అమృతంబగు బ్రహ్మముతో సంబంధము ఏర్పరుచుకొనుట, శతాయువు కొరకు ప్రార్థించుట, అంతఃకరణమునకు బలవృద్ధి, మరియు ఆయుర్వృద్ధి కలిగించుకొనుట ఈ సంస్కారం యొక్క ఉద్దేశం.

అన్నప్రాశనము:

పుత్రికయైన ఐదవ నెలలో లేక ఏడవ నెలలో, పుత్రుడైతే ఆరవ నెలలో లేదా ఎనిమిదవ నెలలో ఈ సంస్కారమును చేయవలెను. దీనివలన తిన దగిన ఆహారములు నిర్దిష్టమగుట చేత అన్నమందలి సంకరదోషము నిరాకరించబడుతున్నది. సుముహూర్తములో తండ్రి బిడ్డను తన ఒడిలో యుంచుకొని, భార్య ఎడమ పక్క కూర్చొని యుండగా మంత్రము పఠించుచు, హోమము తరువాత అన్నము నోటిలో యుంచవలెను. అన్నమే సమస్త జీవరక్షణము. అన్నమునకు పతి సూర్యదేవుడు. ఆ సూర్యుడు అన్నమును, శుభమును బిడ్డకు ఇచ్చు గాక అనే అర్థము కలిగిన మంత్రము పఠించబడును. ఈ సంస్కారము వలన బిడ్డకు మాతృగర్భమున మాలిన్యము తినుటవలన కలిగిన దోషము తొలగి శరీరము నిర్మలమగును. పరబ్రహ్మ స్వరూపమని చెప్పబడిన అన్నము ప్రాశనము చేయించుట వలన శిశువుకు బలము, ఆయువు, అంతఃకరణ శుద్ధి స్థాపన కలిగి, బ్రహ్మ భావోద్బోధన జనించును.

కాబట్టి, అసలైన కార్యక్రమం మంత్రోక్తంగా బిడ్డకు అన్నము పెట్టటం. మనం ఆర్భాటంగా జరుపుకునే - బిడ్డను పడుకోబెట్టి పారాడి వస్తువును అందుకునే కార్యక్రమం ఒక వేడుక మాత్రమే.

చౌలము:

సప్తమ సంస్కారమును చౌలము లేక చూడాకరణమని యందురు. ఇది బిడ్డకు మూడవయేడు వచ్చిన పిదప చేయుదురు. ఇందులో బిడ్డ యొక్క తలవెంట్రుకలు తీసివేయుట ప్రధాన క్రియ. శిశువునకు గర్భమునందు కలిగిన కేశములను తొలగించి చూడాకరణమొనర్చి దీనిద్వారా శిక్షయు, సంస్కారయోగ్యతయు కలిగింపబడును. కావున, బిడ్డకు అపాత్రతా దోషము నిరాకరించబడును. వృద్ధి శ్రాద్ధము, హోమము జరిగిన పిమ్మట సూర్యుని ప్రార్థించుచు, "సూర్యుడు దేనితో బృహస్పతికి కేశఖండనమొనర్చెనో, దేనితో వాయుదేవుడు ఇంద్రునకు కేశఖండనము చేసెనో, అట్టి బ్రహ్మరూపి యగు కత్తి ద్వారా నేను నీకు కేశఖండనము చేయుచున్నాను. నీకు ఆయుస్తేజోబలాభివృద్ధులు కలుగుగాక!" అన్న అర్థము గల మంత్రములు పఠించబడును. ఈ చూడాకరణమందు శిఖ మాత్రముంచి మిగిలిన కేశములు తొలగించాలి. కేశములు బలమునకు మూలం. అవి పూర్తిగా తొలగించుట వలన మనిషి బలహీనుడగును. శిఖతో పురుషునకు బలము, వీర్యము, స్థైర్యము, ఆధ్యాత్మికోన్నతికి చెప్పనలవి కాని సంబంధము ఉన్నందు వలన ఈ శిఖధారణము హిందువుల జాతీయ చిహ్నముగా పరిగణించబడినది. చూడాకరణము ఈ జాతీయ చిహ్నమునకు మొదటి సన్నివేశమగును.

వచ్చే భాగంలో ఉపనయనం గురించి చెప్పుకుందాం. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి