అమ్మకు అంకితం |
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చినయమ్మ తన్ను లో
నమ్మినవేల్పుటమ్మలమనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ది యిచ్చుత మహత్వకవిత్వపటుత్వ సంపదల్
పోతనామాత్యులు |
తాత్పర్యము: అమ్మలందరికీ అమ్మ, లక్ష్మి, సరస్వతి, పార్వతులకు మూలమైన అమ్మ, అందరమ్మలకన్నా అధికురాలైన అమ్మ, రాక్షసుల తల్లుల కడుపులకు చిచ్చుపెట్టి (రాక్షస సంహారం ద్వారా), తనను మనసులో నమ్ముకున్న దేవతల తల్లుల మనములలో నిలిచియుండే అమ్మ, దయాసాగరి అయిన మా దుర్గాదేవి నాకు మహత్తు కలిగిన కవిత్వ, పటుత్వ సంపదలనిచ్చు గాక!
జగజ్జనని ఆది పరాశక్తి |
ప్రథమ స్కంధములోని ప్రార్థన పద్యాలలో అత్యంత ప్రజాదరణ పొందినది ఈ అమ్మలగన్నయమ్మ. ఆ ఆదిపరాశక్తిని నుతిస్తూ పోతనగారు ఆమె అపార కరుణారస వృష్టి ద్వారా తనకు ఎంతో మహత్తు కలిగిన దృఢమైన కవితా సంపద కలగాలని వేడుకున్నారు. పోతన భాగవతంలో పదశోభ మువ్వల గజ్జెలా గంగా ప్రవాహంలా అత్యంత రమణీయంగా ఉంటుంది. పద్యము మొత్తం అమ్మ శబ్దంతో నింపిన పోతనగారు జగజ్జనని మహాత్మ్యాన్ని ఉత్పలమాలలో మనకు అందించారు.
పురాణేతిహాసములలో ముగ్గురుమ్మలకు మూలంగా కొలువబడిన ఆ దుర్గాదేవి సర్వశక్తిస్వరూపిణి కనుకు పోతనగారు ఆమెను తన కావ్యరసప్రవాహం సుగమంగా సాగటానికి రమ్యంగా ప్రార్థించారు. ఈ పద్యాన్ని శ్రీకృష్ణపాండవీయం చలన చిత్రంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్మిణి ఆ జగన్మాతను ప్రార్థించే సన్నివేశంలో గానకోకిల సుశీలమ్మ గారు అద్భుతంగా గానం చేశారు. అమ్మను నుతించే ఏ పద్యమైన అమ్మ అంత హృద్యమే. కృపాబ్ది అన్నది అమ్మ దయారాశిని సూచించటానికి ఎంత సముచితమైనదో తల్లి ప్రేమను చూరగొన్న ప్రతి బిడ్డకు తెలుసు. నా తల్లి సరస్వతమ్మ గారితో పాటు ఈ లోకంలో ఉన్న ప్రతి మాతృమూర్తికి ఈ పద్యం అంకితం.
Namesthy.
రిప్లయితొలగించండిhttp://en.wikipedia.org/wiki/Pothana