21, నవంబర్ 2011, సోమవారం

శ్రీమదాంధ్ర మహాభాగవతము ప్రథమ స్కంధము - శ్రీ కైవల్య పదంబు

అమ్మకు అంకితం

తెలుగు సాహితీ జగత్తులో అత్యుత్తమమైన రచన బమ్మెర పోతనామాత్యులవారి శ్రీమదాంధ్ర మహాభాగవతము. వేదవ్యాసులవారి భాగవతాన్ని రామ కార్యంగా, రాముని సంకల్పము చేత, ఈ తేనెల తేటల మూట అయిన శాశ్వత సాహితీ సంపదను పోతనగారు కృతి చేసి ఆ రామునికే అంకితము చేశారు. ఇటువంటి రచన న భూతో న భవిష్యతి. ప్రతి పద్యములోనూ భగవంతుని దర్శనాన్ని కలిగించి మనలను తర తరాలపాటు మోక్షమార్గోన్ముఖులను చేశారు. ఆ మహాకవికి తెలుగు సాహితీ జగత్తు మరియు భక్త జన కోటి తరఫున శత సహస్ర కృతజ్ఞతాభివందనములు.

మాతృదేవోభవ - అపారమైన ప్రేమ, కరుణ, వాత్సల్యము, జ్ఞానము కలిగిన నా మాతృమూర్తి సరస్వతమ్మ గారికి ఈ ధారావాహికాన్ని సమర్పిస్తూ ఆమెకు ఉత్తమలోకాలు ప్రాప్తించాలని ఆ విశ్వాత్ముడైన శ్రీహరికి నా ప్రార్థన.



పోతనగారు భాగవతాన్ని ప్రథమ స్కంధములో ప్రార్థనా శ్లోకము ద్వారా ఆరంభించారు.

శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళీలోలవిలసదృగ్జాల సంభూత నా
నా కంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్

తాత్పర్యము: మానవ జన్మకు అత్యుత్తమమైన పురుషార్థము మోక్షము. ఆ మోక్షప్రాప్తిని పోతనగారు శ్రీకైవల్యపదంబు గా పేర్కొన్నారు. ఈ భాగవత ప్రయోజనము, లక్ష్యము కూడా అదే కదా! లోకరక్షణాపరాయణుడు, భక్తపాలనమే ఒక కళగా ఆచరించేవాడు, దానవుల ఉద్ధృతాన్ని అరికట్టే వాడు, లీలావలోకనముతో (కంటిచూపుతో) అనేక బ్రహ్మాండములను సృష్టించే వాడు, నందుని ఇల్లాలయిన యశోద ముద్దు బిడ్డడు అయిన బాలకృష్ణుని శ్రీ కైవల్యపదమును పొందుట కొరకు నేను ధ్యానిస్తున్నాను.

భాగవతంలో సృష్టి, శ్రీహరి అవతారములు, వాటి విలక్షణ లక్షణములను అద్భుతంగా వివరించినా, శ్రీకృష్ణుని అవతార వర్ణనా ఘట్టమైన దశమ స్కంధము అత్యంత రమ్యమైనది, రసమయమైనది, జనాదరణ పొందినది. అందుకు కారణం ఆ లీలామానుషుని మాయాప్రేరిత చేష్టలు, వాటిలో అంతర్లీనమైన ఆధ్యాత్మిక సందేశము. మనలో ఒకనిగా ఉంటూ, చిలిపి చేష్టలు ప్రదర్శిస్తూ విశ్వవిలాసానికి సాక్షీభూతునిగా నిలచి పిదప దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన యోగావతారుడు శ్రీకృష్ణుడు. తల్లి ప్రేమ, కన్నెలతో రాసక్రీడలు, చెలికాళ్లతో సావాసము, మహాకాళిందీ కేళీ విలాసము, కంసాది దానవ సంహారము, తన్మయ బృందావన వేణు గాన నాట్య విలాసము, రాజనీతి, రణనీతి, ధర్మ స్థాపన, పంచమవేదంగా ప్రసిద్ధిగాంచిన శ్రీమద్భగవద్గీత బోధన ద్వారా కర్తవ్య ప్రబోధము, విశ్వరూపసందర్శనము, అతి సామాన్య అవతార సమాప్తి - ఇంతటి విలక్షణ లీలానాటక ప్రదర్శనము చేసిన ఆ శ్రీకృష్ణుని ప్రార్థనా శ్లోకములో నుతించుట సముచితం. అందుకే శ్రీమదాంధ్ర మహా భాగవత సౌరభము మొదటి మెట్టులోనే సంపూర్ణంగా పరిమళించి తెనుగునాట చిరకాలం నిలిచింది.

మొదటి పద్యములోనే పోతనగారు తన లక్ష్యాన్ని, మార్గాన్ని చాలా సుస్పష్టంగా మన ముందుంచారు. భగవంతుని గాథలను వర్ణిస్తూ ఆయనను ధ్యానించి కైవల్యము పొందే మార్గాన్ని ఈ ప్రార్థనలో చిత్రీకరించారు. పాండిత్యానికి భక్తి పారవశ్యానికి గల తేడా మనకు శ్రీనాథుడు మరియు పోతనల రచనలను పోల్చి చూస్తే విశదపడుతుంది. లాలిత్యము, మాధుర్యము, సంపూర్ణ వర్ణనము, రోమాంచము గావించే పద కిసలయ విన్యాసము పోతన రచనకు మూలస్థంభమైతే భక్తి, తాదాత్మ్యత దానికి శ్వాస. అందుకే అది ఆత్మ సాక్షాత్కారానికి సోపానముగా నిలిచింది. వచ్చే సంచికలో మరొక ప్రార్థనా పద్యము అమ్మలగన్నయమ్మ...


1 కామెంట్‌: