22, సెప్టెంబర్ 2026, మంగళవారం

ఓడను జరిపే ముచ్చట కనరే - త్యాగరాజస్వామి (నౌకా చరిత్రము)


ఓడను జరిపే ముచ్చట కనరే వనితలార నేడు

ఆడవారు యమునా కాడ కృష్ణుని కూడి ఆడుచు పాడుచునందురు జూడగ

కొందరు హరి కీర్తనములు పాడ కొందరానందమున ముద్దులాడ
కొందరు యమునా దేవిని వేడ కొందరి ముత్యపు సరులసియాడ

కొందరు తడబడ పాలిండ్లు కదల కొందరి బంగరు వల్వలు సడల
కొందరి కుటిలాలకములు మెదల కొందరు పల్కుచు కృష్ణుని కథల 

కొందరు త్యాగరాజ సఖుడేయనగ కొందరి కస్తూరి బొట్టు కరగగ
కొందరి కొప్పుల విరులు జారగ కొందరి కంకణములు ఘల్లనగ 

భావం:

ఓ వనితలారా, ఈ రోజు యమునా నదిలో గోపికలు కృష్ణునితో కలిసి ఆనందంగా ఆటలాడుతూ, పాటలు పాడుతూ నౌకను నడిపిస్తున్న ఆ మనోహర దృశ్యాన్ని చూడండి. వారిలో కొందరు హరి కీర్తనలను గానం చేస్తున్నారు, కొందరు పరమానందంతో కృష్ణునితో ముద్దులాడుతున్నారు, కొందరు తమ నౌకాయానం క్షేమంగా సాగాలని యమునాదేవిని ప్రార్థిస్తున్నారు, మరి కొందరి ముత్యాల హారాలు ఊగుతూ మెరుస్తున్నాయి. ఆ ఉల్లాసక్రీడలో కొందరి అడుగులు తడబడగా, వారి పాలిండ్లు కదులుతున్నాయి, కొందరి బంగారు కట్టువస్త్రాలు సడలుతున్నాయి.  కొందరి వంకరైన ముందటి కురులు అల్లలాడుతున్నాయి,  ఇంకొందరు కృష్ణుని లీలలను పరస్పరం ముచ్చటించుకుంటున్నారు. కొందరు “ఇతడు శివునికి సఖుడు” అని పలుకుతున్నారు,  కొందరి నుదుటి కస్తూరిబొట్టు చెమటతో కరిగిపోతోంది, కొందరి కొప్పులలో అలంకరించిన పూలు జారిపడుతున్నాయి, కొందరి కంకణాలు ఘల్లుఘల్లున మ్రోగుతున్నాయి. 

త్యాగరాజస్వామి రచించిన నౌకా చరిత్రములోని మరొక అద్భుతమైన కృతి ఇది. శ్రీకృష్ణుని సహవాస భాగ్యం వల్ల బ్రహ్మానందం పొందుతూ అనేకానేక భావనలతో ఉత్సాహంగా గోపికలు ఓడను నడుపుతున్న మనోహర దృశ్యాన్ని దివ్య శృంగార కీర్తనగా ఆవిష్కరించారు త్యాగరాజస్వామి. సారంగ రాగంలో స్వరపరచబడిన ఈ త్యాగరాజస్వామిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఈ కృతిని ఆలపించారు.  


గంధము పుయ్యరుగా - త్యాగరాజస్వామి కృతి (నౌకా చరిత్రము)


గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా

అందమయిన యదునందనుపై
కుందరదనలిరువొందగ పరిమళ

తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
కలకలమను ముఖకళగని సొక్కుచు
పలుకులనమృతము లొలికెడు స్వామికి

చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా
మాలిమితో గోపాలబాలులతో
నాల మేపిన విశాలనయనునికి

హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా
నారీమణులకు వారము యౌవనమ
వారిగనొసగెడు వారిజాక్షునికి

పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజనుతునికి 

భావం:

భక్తులారా, అందమైన యదువంశపుత్రుడైన శ్రీకృష్ణునికి పన్నీరుతో కలిసిన సుగంధ గంధమును పూయండి. అడవి మల్లెలవలె తెల్లగా మెరుస్తున్న పలువరుస కలిగిన స్త్రీల కోరికలు తీరునట్లుగా స్వామికి పరిమళగంధమును అర్పించండి. కలకలలాడే ఆయన ముఖకాంతిని చూసి మురిసిపోతూ, అమృతమువలె మధురమైన పలుకులు పలికే ఆ స్వామికి కస్తూరి తిలకమును దిద్దండి. గోపాలబాలులతో ప్రేమగా కలిసి పశువులను మేపిన విశాలమైన కన్నులు కల స్వామికి బంగారు వస్త్రమును కట్టండి. నారీమణులకు నిత్యము యౌవనసౌభాగ్యమును ప్రసాదించే కలువల వంటి కన్నులు కలిగిన స్వామికి ముత్యాల హారతులను ఎత్తండి. జాజిపూలు, విరజాజిపూలు, దవనమును సమర్పించి, త్యాగరాజునిచే స్తుతింపబడి ప్రకాశించే ఆ శ్రీకృష్ణునికి మనసారా పూజలు చేయండి. 

శ్రీ త్యాగరాజస్వామి రచించిన నౌకా చరిత్రము గోపికలతో శ్రీకృష్ణుడు యమునా నదిలో చేసిన నౌకావిహారాన్ని ఆధారంగా చేసుకున్న అందమైన గేయ రూపకం (యక్షగానం). గోపికలు శృంగారమైన అలంకారాలతో ముస్తాబై, కృష్ణుడితో కలిసి యమునలో నౌకావిహారానికి బయలుదేరుతారు. ప్రయాణం మధ్యలో అకస్మాత్తుగా తుఫాను వచ్చి నావ మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. భయపడిన గోపికలు తమ రవికలు, ఉత్తరీయాలతో నావలోకి వస్తున్న నీటిని ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ నావ మునిగిపోకుండా ఉండాలంటే కృష్ణుడికి తమ వస్త్రాలను సమర్పించాలని కృష్ణుడే చమత్కారంగా చెప్పడంతో, వారు భగవంతునిపై సంపూర్ణ విశ్వాసంతో ఆయన మాటను పాటిస్తారు.

ఈ గేయ నాటకం ద్వారా త్యాగరాజస్వామి గోపికల కృష్ణభక్తిని, వారి శరణాగతిని ఎంతో అందంగా చిత్రించారు. ఒకవైపు అనురాగం, ఆర్తి, ప్రణయభక్తి, లజ్జ, కినుక వంటి అనేక భావాలు కనిపిస్తే, మరోవైపు భగవంతుడిని చేరాలంటే అహంకారాన్ని, దేహాభిమానాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా ఆయనకు శరణాగతి చెందాలనే ఆధ్యాత్మిక సందేశం అంతర్లీనంగా కనిపిస్తుంది. చివరకు కృష్ణుడు తన మహిమతో గోపికలను కాపాడి, వారిని సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తాడు. ఇలా నౌకా చరిత్రము సాధారణ నౌకావిహార కథగా కనిపించినా, జీవుడు తన అహంకారాన్ని విడిచి పరమాత్మకు పూర్తిగా శరణాగతి చెందడమే పరమలక్ష్యమనే భావాన్ని సంగీతం, సాహిత్యం, భక్తి, శృంగారాల సమన్వయంతో తెలియజేసే విశిష్టమైన రచన.

నౌకా చరిత్రములో మొత్తం 21 కృతులు (దరువులు), 51 గద్యాలు, 47 పద్యాలు ఉన్నాయి. ఆ కృతులలో ఒకటి గంధము పుయ్యరుగా. 

ఈ కృతిని పున్నాగవరాళి రాగంలో స్వరపరచారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఈ కృతిని ఆలపించారు.  

21, సెప్టెంబర్ 2026, సోమవారం

దేహి తవ పద భక్తిం - త్యాగరాజస్వామి కృతి


దేహి తవ పద భక్తిం! వైదేహి! పతిత పావని మే సదా!

ఐహికాముష్మిక ఫల దే! కమలాసనాన్యజ వర జనని!

కలశవారాశిజనితే! కనక భూషణ లసితే!
కలశజ గీత ముదితే! కాకుత్థ్స రాజ సహితే!

అఖిలాండ రూపిణీ! అలికులనిభవేణి!
మఖసంరక్షక రాణి! మమ భాగ్య కారిణి!

శరణాగత పాలనే! శతముఖ మద దమనే!
తరుణారుణాబ్జ నయనే! త్యాగరాజ హృత్సదనే!

పతితులను పావనం చేసే సీతమ్మా! నీ పదముల యందు భక్తి అనే వరాన్ని నాకు ఎల్లప్పుడూ ప్రసాదించుము. ఇహము నందు, పరము నందు ఫలములనొసగే దానవు, బ్రహ్మదేవునికి, మన్మథునికి కన్నతల్లివైన సీతమ్మా! నీ పదముల యందు భక్తి అనే వరాన్ని నాకు ఎల్లప్పుడూ ప్రసాదించుము. క్షీరసాగరమథనంలో జన్మించిన లక్ష్మీదేవివి నీవు, బంగారు ఆభరణములతో ప్రకాశించే తల్లివి, కుంభసంభవుడైన అగస్త్యుని నుతులతో సంతోషించిన తల్లివి, కాకుత్థ్స వంశములో జన్మించిన శ్రీరామునితో కూడి యున్నావు, నీ పదముల యందు భక్తి అనే వరాన్ని నాకు ఎల్లప్పుడూ ప్రసాదించుము. విశ్వరూపిణివి, తుమ్మెదల సమూహం వంటి కురులు కలదానవు, విశ్వామిత్రుని యాగసంరక్షణ చేసిన శ్రీరాముని పత్నివి, నాకు భాగ్యాన్ని ప్రసాదించే తల్లివి, నీ పదముల యందు భక్తి అనే వరాన్ని నాకు ఎల్లప్పుడూ ప్రసాదించుము.  శరణు కోరిన వారిని పాలించే దానవు, రావణుని మదమణచిన తల్లివి, ఎర్రని తామర రేకుల వంటి కన్నులు కల దానవు, పరమశివుని హృదయములో నివసించిన అమ్మవు, నీ పదముల యందు భక్తి అనే వరాన్ని నాకు ఎల్లప్పుడూ ప్రసాదించుము. 

వాగ్గేయకారులు ఈ కృతిని సంస్కృత భాషలో రచించి లోకపావనిని, జగన్మాతను అద్భుతంగా స్తుతించారు. శహానా రాగంలో ఈ కృతి స్వరపరచబడింది. ఈ రాగం భక్తిలో శరణాగతికి చాలా సముచితమైనది. ఈ కృతిని బొంబాయి సోదరీమణులు సరోజ-లలిత ఆలపించారు.

భవనుత నా హృదయమున రమింపుము - త్యాగరాజస్వామి కృతి


భవనుత నా హృదయమున రమింపుము బడలిక దీర

భవతారక నాతో బహుపల్కిన బడలిక దీర కమల సం"భవనుత"

పవనసుతప్రియ తనకై తిరిగిన బడడలిక దీర
భవనము చేరి నన్ను వెరపించిన బడలిక దీర కమల సం"భవనుత"

వరమగు నైవేద్యములను సేయని బడలిక దీర
పరవ లేక సరిపోయినట్టాడిన బడలిక దీర కమల సం"భవనుత"

ప్రబల జేసి నను బ్రోచేవనుకొన్న బడలిక దీర
ప్రభువు నీవు త్యాగరాజునికి బడలిక దీర కమల సం"భవనుత"

శివునిచేత నుతించబడిన శ్రీరామా! నా హృదయములో అలసట తీరేలా వసించి నా హృదయమును అలరింపుము. బ్రహ్మ చేత నుతించినబడే వాడవు, సంసారసాగరమును తరింపజేయు శ్రీరమా! అనేక సార్లు నాతో మాట్లాడి నా మొరలను విని అలసిపోయితివి కనకు నా హృదయములో వసించి సేద తీర్చుకొనుము. ఆంజనేయునికి ఆప్తుడవైన శ్రీరామా!  నా గృహమునకు వేంచేసి యుండి నాకు ఆశ్చర్యము కలిగించి శ్రమించితివి, నా హృదయములో వసించి సేద తీర్చుకొనుము. ఓ రామా! శ్రేష్ఠమైన నైవేద్యములు చేసి పెట్టలేదు, పైపెచ్చు పరవాలేదని సరిపెట్టుకున్న నా హృదయములో వసించి సేద తీర్చుకొనుము. నాకు బలమునిచ్చి అలసిపోయావేమో, ఈ త్యాగరాజుకు నీవే ప్రభువు,నా హృదయములో వసించి సేద తీర్చుకొనుము.  

మోహన రాగంలో స్వరపరచబడిన ఈ త్యాగరాజస్వామి కృతిని గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు ఆలపించారు

వాసుదేవయని వెడలిన - త్యాగరాజస్వామి కృతి


వాసుదేవయని వెడలిన యీ దౌవారికుని గనరే

వాసవాది సురపూజితుఁడై వారిజనయనుని మదినిదలఁచుచును

నీరుకావి దోవతులను గట్టి నిటలమునను శ్రీచూర్ణముఁ బెట్టి
నారి వెడలి యీ సభలోఁ జుట్టి సారెకు బంగరు కోలను బట్టి

మాటిమాటికిని మీసము దువ్వి మన్మథరూపుఁడు తానని క్రొవ్వి
దాటి దాటి పడుచును తానివ్విధంబునఁ బలుకుచు పకపక నవ్వి

బాగుమీర నటనము చేయుచును పతితపావనుని తా వేఁడుచును
రాగతాళగతులను బాడుచును త్యాగరాజసన్నుతుని బొగడుచును

వాసుదేవా అని పిలుస్తూ వస్తున్న ఈ ద్వారపాలకుణ్ణి చూడండి! ఇంద్రుడు మొదలైన దేవతలచే పూజింపబడే శ్రీమహావిష్ణువును, కమలాల వంటి కన్నులు గల ఆ వాసుదేవుణ్ణి మనసులో తలచుకుంటూ, ఎర్రతి మడిగ ధోవతులను చక్కగా కట్టుకొని, నుదుటిపై శ్రీచూర్ణాన్ని నామములుగా ధరించి, మళ్లీ మళీ రంగస్థలములో గుండ్రముగా మధ్య తిరుగుతూ, చేతిలో బంగారు కోలును పట్టుకొని ద్వారపాలకుడు రంగస్థలమును ప్రవేశించు ముచ్చటి చూడండి. మాటిమాటికీ తన మీసాలను దువ్వుకుంటూ, తానే మన్మథుడంత అందగాడిననే గర్వంతో ఉప్పొంగుతూ, పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అటూ ఇటూ తిరుగుతూ, తనదైన రీతిలో మాటలు పలుకుతూ పకపకా నవ్వుతూ ద్వారపాలకుడు సభలో ప్రవేశించే విధమును చూడండి. ఎంతో చక్కగా, ఆకట్టుకునేలా నటన చేస్తూనే పతితులను కూడా పవిత్రులను చేసే ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాడు; రాగం, తాళం, గతి అన్నీ సమన్వయంగా పాటిస్తూ గానం చేస్తున్నాడు, త్యాగరాజస్వామి స్తుతించిన శ్రీరాముణ్ణి భక్తితో పొగుడుతున్నాడు. ఆ విధముగా ద్వారపాలకుడు రంగస్థలమును ప్రవేశించు ముచ్చటను చూడండి.  

ప్రహ్లాద భక్త విజయము త్యాగరాజస్వామి రచించిన ప్రసిద్ధ యక్షగానాలలో ఒకటి. ప్రహ్లాదుని అచంచలమైన శ్రీహరి భక్తి ఈ నాటకానికి ప్రధాన ఇతివృత్తం. కథను ముందుకు నడిపించడానికి త్యాగరాజస్వామి కీర్తనలు, దరువులు, పద్యాలు, సంభాషణలను ఎంతో అందంగా ఉపయోగించారు. అందులో వాసుదేవయని వెడలిన యీ దౌవారికుని గనరే అనే రచన ద్వారపాలకుని రంగప్రవేశానికి సంబంధించిన దరువు. నాటక ప్రదర్శనలో ఒక పాత్ర రంగస్థలంలోకి ప్రవేశించే సందర్భాన్ని సంగీతం, నృత్యం, అభినయంతో పరిచయం చేసే రచనను సాధారణంగా ప్రవేశ దరువుగా భావిస్తారు. ఈ ద్వారపాలకుని ప్రవేశం ద్వారా కథలో భక్తితో పాటు హాస్యం, నాటకీయత కూడా చోటుచేసుకుంటాయి. ప్రహ్లాద భక్త విజయములో త్యాగరాజస్వామికి సంగీతం, సాహిత్యం, నాటకం మీద ఉన్న సమగ్ర పట్టును చూపించే ఆసక్తికరమైన సందర్భాలలో ఇది ఒకటి. 

ఈ కృతిని కల్యాణి రాగంలో స్వరపరచబడింది. ఎం ఎల్ వసంతకుమారి గారు ఈ కృతిని ఆలపించారు.  

20, సెప్టెంబర్ 2026, ఆదివారం

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి


వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి

పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి

శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ
కరమున శరచాపములును ఘనముగ మెరయ 
సురుచిర వాద్యములు మ్రోయ సురలెల్ల వినుతి చేయ
వరత్యాగరాజ నుతుడు వసుధ భారమును బాప

భావము:

సోదరుడైన లక్ష్మణుడు తోడు రాగా కోదండము ధరించిన శ్రీరాముడు యాగరక్షణకై వెళుతున్నాడు. భూమిపై ప్రజలందరూ పొగడుచుండగా వందనీయుడైన విశ్వామిత్రునితో కలసి శ్రీరాముడు వెళుతున్నాడు. తలపైనున్న పొడవైన జుట్టు జారగా, వక్షస్థలములో ఉన్న హారములు, చేతిలో ధనుర్బాణములు గొప్పగా మెరుస్తుండగా, మధురమైన వాద్యములు మ్రోగగా, దేవతలందరూ ప్రస్తుతించుచుండగా పరమశివునిచే నుతించబడిన శ్రీరాముడు భూభారాన్ని తొలగించుటకు యాగరక్షణకై లక్ష్మణునితో కూడి వెళుతున్నాడు.  

తోడి రాగంలో స్వరపరచబడిన ఈ త్యాగరాజస్వామి కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.

శ్రీగణనాథం భజామ్యహం - త్యాగరాజస్వామి కృతి



శ్రీగణనాథం భజామ్యహం
శ్రీకరం చింతితార్థ ఫలదం

శ్రీగురుగుహాగ్రజం అగ్రపూజ్యం
శ్రీకంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం 

రంజిత నాటకరంగతోషణం
శింజిత వర మణిమయ భూషణం
ఆంజనేయావతారం సుభాషణం
కుంజరముఖం త్యాగరాజ పోషణం  

శుభములను ప్రసాదించే వాడవు, మనసులో కోరుకున్న కోరికలకు తగిన ఫలములను అనుగ్రహించే వాడవు అయిన గణనాథా! నిన్ను నేను భజిస్తున్నాను. సుబ్రహ్మణ్యునికి అన్నవైన నీవు, అన్ని పూజలలోనూ ముందుగా పూజింపదగిన అగ్రపూజ్యుడవు.  పరమశివుని కుమారుడవు, నిన్ను ఆశ్రయించిన వారికి సామ్రాజ్య వైభవాన్ని ప్రసాదించేవాడవు,నిన్ను నేను భజిస్తున్నాను.  నాటకరంగానికి సంతోషమును ప్రసాదించేవాడవు, కదులుతున్నప్పుడు మధురంగా మ్రోగే శ్రేష్ఠమైన రత్నమయ ఆభరణాలను ధరించినవాడవుం ఆంజనేయుని అవతారంగా వెలసినవాడవు, మంగళకరమైన, మంచి మాటలు పలికేవాడవు, ఏనుగు ముఖాన్ని కలిగిన వాడవు, త్యాగరాజును ఆదరించి, రక్షించి, పోషించేవాడవు. అటువంటి గణనాథుడవైన నిన్ను నేను భక్తితో భజిస్తున్నాను.

ఈ కృతిలోని ఆంజనేయావతారం అనే ప్రయోగం ప్రత్యేకంగా గమనించదగినది. ఇక్కడ త్యాగరాజస్వామి గణపతినే హనుమంతుని అవతారంగా పేర్కొంటున్నట్లు సాహిత్యం నేరుగా కనిపిస్తుంది. దీనికి ఒక సంప్రదాయ వివరణ ఏమిటంటే, గణపతి మరియు హనుమంతుడు ఇద్దరూ విఘ్నాలను తొలగించే శక్తి, అపారమైన బలం, బుద్ధి, కార్యసిద్ధి, భక్తుల రక్షణ వంటి లక్షణాలకు ప్రతీకలు. అందువల్ల ఆంజనేయుని తత్త్వమే గణపతిలో కూడా వ్యక్తమైందనే భావంతో ఈ ప్రయోగాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే గణపతి నిజంగా ఆంజనేయునిగా అవతరించాడనే కథ వాల్మీకి రామాయణం లేదా ప్రసిద్ధ పురాణాలలో ప్రత్యేకంగా చెప్పబడలేదు.  

కనకాంగి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని రంజని గాయత్రి సోదరీమణులు ఆలపించారు

అంతా రామమయం - భద్రాచల రామదాసు కృతి

అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడనంత రూపముల వింతలు సలుపగ సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అండాండంబులు పిండ...