28, జులై 2011, గురువారం

తత్త్వము - ఏమిసేతురా లింగా ఏమి సేతురా



తత్త్వమనగా మానసిక స్థితి యొక్క బాహ్య ప్రతిబింబం. మరి భగవంతుని నుతించటానికి రాగ లక్షణ యుత స్వర కీర్తనలతో పాటు పామరుడి నోట వినిపించే ఆలాపనలు, పదాలు, వాక్యాలు కూడా సమార్హమైనవే. విద్య నేర్చినవాడు సర్వ లక్షణ సంపన్నమైన కృతి అనే శిలను మలిస్తే, తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ అందులో కలిగిన భావనను అందమైన సరళమైన పదాలలో కూనిరాగాలు తీస్తాడు. రెండింటిలోనూ సర్వాంతర్యామి సర్వవ్యాపకతను, ఈ శుద్ధంకాని ఆత్మకు, పరిశుద్ధాత్మకు గల సంబంధం, దాని వైవిధ్యము, సారూప్యములను ప్రతిబింబుస్తుంది. చాలా సార్లు ఇలా కూనిరాగాలలో వచ్చే భావం కళ్ల ముందు జరిగే దురాచారాలను, మనుషుల దురాలోచనలు, దుశ్చర్యలను సున్నితంగా విమర్శించటం, ఇంకొంత పై స్థాయికి ఎదిగి చూడండి అని సలహా ఇవ్వటం వీటి లక్ష్యం.

ఇటువంటి సామాన్యుని భావనలో లోతైన ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంటుంది. జీవకోటి పరిశీలన, పరిధిలో గిరిగీచుకుని ఉన్న మానవుడు భగవంతుని అనుభూతి పొందటానికి ఎంత దూరంలో ఉంటాడో, బాహ్య శుద్ధి కొరకు ఏర్పాటు చేసుకున్న కట్టుబాట్లు, ఆచారాలు మనలను మూఢత్వానికి దగ్గరచేసి, దైవత్వానికి మరింత దూరం చేస్తుందనే భావనను ఈ పామర మనోభావాలు వ్యక్త పరుస్తాయి. అలాగే, మట్టిలో మాణిక్యాలలా, విద్యలేని ఎంతో మంది మానవులు జీవన సత్యాన్ని తెలుసుకొని పాడుకునే భావన కూడా ఈ కోవకు చెందినదే.

జనన మరణాల మధ్య సాగే నాట్లకమే జగత్తు (జాయతే త్రాయతే ఇతి జగత్) . మరి అంతా నాటకమైతే, నిజమేమిటి? అదే శాశ్వతమైన నిర్మలమైన పరమానందకరమైన 'సచ్చిదానంద పరబ్రహ్మము'. మరి జన్మ ఎందుకు? మన మన పూర్వ జన్మల కర్మలవలన, శేష ఋణాల వలన, గొప్ప గొప్ప ఆత్మలకు ఒక మహోన్నత లక్ష్య సాధన కొరకు. కాబట్టి నట్ట నడిమీ కలి నాటకము అని అన్నమాచార్యులు అన్నట్లు, ఈ నాటక జగత్తులో మన ప్రధాన లక్ష్యం మనలను మనం తెలుసుకోవటం. ఇందులో కర్తవ్యపాలన, సత్ప్రవర్తన, బంధ విముక్తి, ఉపాసన ద్వారా అంతరాత్మను తెలుసుకోవటం. దీనికి ఒక జన్మ సరిపోకవచ్చు. కానీ, ఫలము మూటగట్టుకుంటూనే ఉంటుంది. సద్గురువు కృపతో, సత్సాంగత్యముతో, సర్వస్య శరణాగతితో ఈ మోక్షమార్గ పయనాన్ని సుగమం చేసుకోవచ్చు.

బైరాగులు, యోగులు, దార్శనికులు, పిచ్చివారిలా కనిపించే మహా జ్ఞానుల నోట ధారాళంగా వెలువడిన మాటల మూటలే తత్త్వాలు. లోకంలో అజ్ఞానమనే అంధకారంలో కొట్టుమిట్టాడుతు ఉండే మానవ కోటికి వారి బుద్ధి స్థాయికి అర్థం అయ్యేలా జీవన సారాన్ని అరటి పండు వలిచినట్లు తేటతెల్లం చేసే భావ వ్యక్తీకరణలే తత్త్వాలు. ఎన్నో లక్షలమంది ఈ భారతదేశంలో ఈ తత్త్వాలు వెలువరించారు. అందులోని భావం, సారం ఒక్కటే. శాశ్వతమైన దాని కనుగొను. అశాశ్వతమైన దాని మీద మమకారం వీడుము. నీ మార్గంలో ముళ్లు నీ మనసులోని సంకెళ్లే. ఈ సందేశంతో సాగే కొన్ని తత్త్వాలను మహనీయులు గురువులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ఆకాశవాణి ద్వారా బహుళ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. లలిత సాహిత్యానికి తన గానం ద్వారా జీవాన్ని పోసి, భావాన్ని అణువణువునా కురిపించిన గురువుగారికి శతసహస్ర పాదాభివందనాలు. శిలయైన పదానికి గాన రూపంలో ఆత్మయై చైతన్యరూపాన్ని ఇచ్చిన మహానుభావులు బాలమురళిగారు. ఆయన నిరంతర గానామృతంలో తెనుగుజాతికి తడిసి మురిసి తరించినట్లే. ఆయన పాడిన తత్త్వాలలో ఒక గొప్ప గీతాన్ని పరిశీలిద్దాం.

ఏమిసేతురా లింగా ఏమి సేతురా

గంగ ఉదకము తెచ్చి నీకు లింగపూజలు సేతమంటే
గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నావి లింగా మాహానుభావ మాదేవ శంభో మాలింగమూర్తీ |ఏమి సేతురా|

అక్షయావులు పాడి తెచ్చి అరిపితము చేదమంటే
అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాది లింగా మాహానుభావ మాదేవ శంభో మాలింగమూర్తీ |ఏమి సేతురా|

తుమ్మి పూవులు తెచ్చి తుష్టుగా పూజేదమంటే
కొమ్మకొమ్మకు కోటి తుమ్మెదలెంగిలంటున్నాయి లింగా మాహానుభావ మాదేవ శంభో మాలింగమూర్తీ |ఏమి సేతురా|


బాలమురళి వారు పాడిన తత్త్వాలలో మకుటం వంటిది ఏమి సేతురా లింగా. సంగీత జ్ఞానం లేనివానికి, ఆస్తికునికి, నాస్తికునికి, తత్త్వవేత్తలకు, పౌరాణికులకు, పండిత పామరులకు అందరినీ అలరించిన గీతం ఇది. ఇందులో రెండు అంచెల భావాలు దాగి ఉన్నట్లు అనిపిస్తుంది. మొదటిది శివునికి విన్నపంలా స్ఫురిస్తుంది. ఈ లోకంలో నీకు ఇష్టమైన పూజాద్రవ్యాలైన గంగనీరు, ఆవుపాలు, తుమ్మి పూలు తెచ్చి పూజచేద్దామనుకుంటే ఆ పావన గంగలోని జీవరాశి, అమ్మపాలు త్రాగే లేగదూడలు, తుమ్మిచెట్టున ఉండే తుమ్మెదలు ఎంగిలంటున్నాయి. ఏమి చేయను నేను' అనే ఒక అమాయకమైన, పరిపూర్ణంగా శుద్ధమైన భక్తి నివేదనా భావం, రెండవది - ఇవన్నీ చాలా పవిత్రమైనవి, ఇవి సమర్పించుకుంటేనే శివుడు కరుణిస్తాడు అన్న భావనతో ఉన్న వారికి కనువిప్పు. నిజంగా కావలసినది శుద్ధ అంతఃకరణము, శరణాగతి. ఇవి ఉంటే, గంగనీరైనా, బావి నీరైనా, ఆవుపాలు ఉన్నా లేకున్నా, తుమ్మి పూవులైనా, ఇంకొక పూవైనా, ఏమీ లేకపోతే ధవలాక్షతలైనా సరే ఆ శివుడు ప్రీతి చెందుతాడు. ఎందుకంటే ఆయన బోళా శంకరుడు. సాద్గుణ్యత ముఖ్యము. నమ్మకము,  నిర్మోహము, నిరంహకారము ముఖ్యము. అంతేకానీ, ఇవిలేకుండా, మేలి పాడియావు పాలు, ఆమల భాగిరధి జలాలతో అభిషేకం చేసినా ఉపయోగం ఉండదు. అన్నీ నీ వలననే, అన్నీ నీకే, అన్నీ నీవే అని ఆత్మ నివేదన చేసుకోవటం ప్రధానం. వస్తుసంపద కన్నా గుణ సంపద మిన్న అన్నది ఈ గీతం యొక్క అంతరార్థం. ఎందుకంటే, మనం మేలిమి అనుకునే ప్రతి వస్తువుకూ ఏదో ఒక మాలిన్యం అంటుకునే ఉంటుంది.

ప్రపంచంలో లయకారకుడైన శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదే? మరి ఈ విశ్వంలో జరిగే లీలలు, మాయలు, మంచి, చెడూ అన్నిటా ఆ సర్వేశ్వరుడే. జటాఝూటములు ధరించే శివుని వ్యుప్తకేశాయచ (అంటే గుండు కలిగిన వాడు) అని చమకంలో స్తుతించారు. కాబట్టి, చాలా మటుకు మనం అనుకునే మంచి, చెడు, శుద్ధం, అశుద్ధం మానవ కల్పితములే. కావలసినది మన ఆలోచనలో, ఆచరణలో సచ్ఛీలత. శంకరులు శివమానసపూజా స్తోత్రంలో (నేను ఇదివరలో రాసిన వ్యాసం)  పూజా విధానంలో జరిగే వివిధ ఉపచారములు, నివేదనలన్నీ మానసికంగానే చేస్తున్నాను, నా సంకల్పములనే నిజమైన ఉపచారములుగా భావించి నన్ను రక్షించు, కరుణించు అని అద్భుతమైన ఐదు శ్లోకాలలో నుతిస్తాడు. మరి అపర శంకరులైన ఆ శంకరభగవత్పాదుల నిజాంతరంగమును తెలుసుకొని నడచుకుందాం.

ఇంతమంచి తత్త్వాన్ని మనకు వాడుక తెలుగులో అందించిన ఆ సహృదయులకు (కవి ఎవరో తెలియదు) శిరసు వంచి పాదాభివందనము చేస్తున్నాను. అలాగే, ఆ గీతాన్ని అజరామరం చేసిన బాలమురళీకృష్ణగారికి హృదయాంజలి. బాలమురళి గారు గానంలో ఈ తత్త్వం.

25, జులై 2011, సోమవారం

అవధూత సదాశివ బ్రహ్మేంద్రులు - జీవిత విశేషాలు

అవధూత సదాశివ బ్రహ్మేంద్రులు
చిన్ముద్రిత కరకమలం చింతిత భక్తేష్టదం విమలం
గురువరమాద్యం కంచన నిరవధికానందనిర్భరం వందే
వటతరునికట నివాసం పటుతరువిజ్ఞానముద్రితకరాబ్జం
కంచన దేశికమాద్యం కైవల్యానందకందలం వందే

చిన్ముద్రలో ఉన్న కమలము వంటి చేతలు కలిగిన , భక్తుల కోరికలను తీర్చే, విమలమైన, మొదటి గురువైన, ఎల్లప్పుడూ సచ్చిదానందంలో ప్రకాశిస్తూ ఉండే దక్షిణామూర్తికి వందనములు. ఎల్లప్పుడూ వటవృక్షం క్రింద నివసించే, మహిమ గల జ్ఞానముద్రలో ఉన్న కమలముల వంటి చేతులు కలిగిన, మొదటి గురువైన, మోక్షానందముతో, నిరంతర వృద్ధి కలిగిన ప్రకాశముతో ఉన్న దక్షిణామూర్తికి వందనములు (ఆత్మ విద్యా విలాసములోని మొదటి శ్లోకము)

కొందరు మహానుభావులు జీవితంలోని ప్రతి కోణంలోనూ దైవాన్ని నిరంతరం దర్శిస్తూ సచ్చిదానందంలో మునిగి బాహ్య ఐహిక విషయాలకు అతీతంగా, నిత్యానంద తన్మయులై ఉంటారు. అది భక్తి మార్గము ద్వారానే అత్యంత సులభము. అత్మానందానుభూతిలో మునిగి తేలే యోగులు, సత్పురుషులు భారత దేశంలో ఎంతోమంది. దక్షిణాదిన అటువంటి మహానుభావుల్లో 18వ శతాబ్దానికి చెందిన సదాశివ బ్రహ్మేంద్రులు. ఆ యోగి జీవిత విశేషాలు.

చరిత్ర: 

బ్రహ్మేంద్రులు సస్యశ్యామలమైన, భారతీయ మేధో సంపత్తికి, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదకు నిలయమైన కావేరీ తీర ప్రాంతంలోని కరూరు దగ్గరలోని  నెరూరులో తెలుగు నియోగి బ్రాహ్మణ దంపతులైన మోక్ష సోమసుందర అవధాని, పార్వతి దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు శివరామకృష్ణగా నామకరణం చేశారు. తొలివిద్యలు తిరువిసైనల్లూరుకు చెందిన గురువులు రామభద్ర దీక్షితార్ వద్ద నేర్చుకునే సమయంలో భజన సాంప్రదాయ త్రయమైన శ్రీధర వేంకటేశ ఐయ్యర్, బోధేంద్ర సరస్వతి మరియు భాష్యం గోపాలకృష్ణ శాస్త్రులచే ప్రభావితులైనారు.

విద్యాభ్యాసంతో పాటు ఆత్మ విద్య, యోగసాధనలో శివరామకృష్ణులు మునిగితేలారు. చిన్న వయసులోనే వైరాగ్య భావనలు, లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించసాగాయి. యుక్తవయస్సు వస్తున్న కుమారునికి వివాహం చేస్తే ఈ ధోరణి మారుతుందేమో అని తల్లి పార్వతి శివరామకృష్ణునికి వివాహం 16వ ఏట చేసింది. శివరామకృష్ణులు గృహస్థాశ్రమము తన ఆత్మసాధనకు ఆటంకమని గ్రహించి తల్లి వద్ద అనుమతి తీసుకుని ఇల్లు వీడుతారు.

పరమశివేంద్ర సరస్వతి

కాంచీపురం చేరుకుని అక్కడి కంచి కామకోటి పీఠాధిపతులైన పరమశివేంద్ర సరస్వతీ స్వాముల వద్ద సన్యాసం స్వీకరిస్తారు. అలా శివరామకృష్ణులు సదాశివబ్రహ్మేంద్ర సరస్వతిగా మారి తన ఆధ్యాత్మిక సోపానంలో ముఖ్యమైన ఘట్టానికి చేరుకుంటారు. తన విద్వత్తుతో, యోగసాధనతో మహా మహా పండితులను ఓడిస్తుండగా, గురువులైన పరమశివేంద్ర సరస్వతి ఆగ్రహంతో 'సదాశివా! మౌనంగా ఉండలేవా!' అని అంటారు. గురువుల మాటను ఉపదేశంగా భావించి, అంత్యం వరకు మౌనదీక్షలో ఉంటారు. కాంచీపురం వదలి మోక్ష సోపానంలో ఎన్నో మైలురాళ్లను దాటి ముందుకు వెళ్తారు. చాలాకాలం కావేరీ తీర ప్రాంతాల్లో తిరుగుతూ సమాధి స్థితిలో ఆత్మానందాన్ని పొందుతారు. తల్లికి ఇచ్చిన మాట నిలుపుకోటానికి ఆమె అవసాన దశలో తిరువిసనల్లూరు వస్తారు. తల్లి అంత్యక్రియల తరువాత నెరూరు ప్రాంతానికి చేరుకుంటారు సదాశివబ్రహ్మేంద్రులు. దక్షిణవాహిని యైన కావేరీ తీరప్రాంతమైన ఈ ప్రదేశం తన సాధనకు అనువైనదిగా గ్రహించి అక్కడ స్థిరపడతారు. ప్రాపంచిక విషయాలను వీడి, కమండలము, కాషాయము, దండము త్యజించి అవధూతగా తిరుగుతూ ఉంటారు. అప్పటి పుదుక్కోటై రాజావారు సదాశివ బ్రహ్మేంద్రుల అనుగ్రహానికి పాత్రులవుతారు.

ఒకసారి తిరువిసనల్లూరుకు వచ్చినప్పుడు చిన్ననాటి గురువులు సదాశివుల క్షేమసమాచారాన్ని అడుగుతారు. సమాధానం రాకపోవటంతో, దానికి కారణం మౌనవ్రతమని గ్రహించి గురువులు సదాశివులను తన అనుభూతులను భక్తి జ్ఞాన వైరాగ్య కీర్తనలుగా, రచనలుగా వెలువరించమని, అది తన మౌన వ్రతానికి (మౌనం ప్రాపంచిక విషయాలకే గానీ భగవత్ స్తుతికి వర్తించదు) భంగం కాదని సలహా ఇస్తారు. దానికి సదాశివులు అంగీకరించి తన అద్భుత రచనా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అప్పుడు వెలువడినవే వారు రచించిన ఎన్నో కీర్తనలు, ఆధ్యాత్మిక రచనలు. .

నెరూరులో సదాశివ సమాధి 

అవధూతగా కావేరీ తీర ప్రాంతంలో ఆధ్యాత్మిక సంపదను, సౌందర్యాన్ని వెదజల్లిన సదాశివబ్రహ్మేంద్రులు 1755వ సంవత్సరంలో శత సంవత్సరములపైగా పరబ్రహ్మమయమైన జీవనము గడిపి నెరూరులో జీవన్ముక్తులైనారు. వారి సమాధి (బిల్వ వృక్షం క్రింద) ఇక్కడ గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. ప్రతి సంవత్సరం ఇక్కడ వైశాఖ శుద్ధ దశమి (జీవన్ముక్తులైన రోజు) నాడు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.

అద్భుతాలు:

కొంతమంది చరిత్రకారుల ప్రకారం సదాశివబ్రహ్మేంద్రులు 1560 నుండి 1762 వరకు భౌతికంగా జీవించారు. ఇంత సుదీర్ఘ జీవనంలో కొన్ని మహిమలు వినికిడిలో ఉన్నాయి.

1. ఒకసారి నీరులేని ఎండాకాలంలో కొడుముది నది మధ్య ఇసుకతిన్నెపై సమాధి స్థితిలోకి వెళ్తారు. ఆరు మాసాల తరువాత వర్షాలు పడి, నదిలో వరదలు వచ్చి ఆయన కొట్టుకుపోగా, ఆయన కోసం అక్కడి జనం వెదుకుతారు. ఎక్కడా కనిపించక, చివరకు వరదలు తగ్గిన తరువాత దగ్గరలోని ఇసుకతిన్నెలను తవ్వగా రక్తం వస్తుంది. మరింత జాగ్రత్తగా తవ్వగా, సదాశివ బ్రహ్మేంద్రులు సమాధిస్థితినుండి లేచి నిలబడి వడివడిగా పరిగిడుతారు.
2. ఒకసారి బ్రహ్మేంద్రులు గడ్డి మోపులపై ధ్యానంలో ఉండగా రైతులు గమనించక, ఆ మోపులపై మోపులు వేస్తూ ఏడాది పాటు అలానే మోపుల పర్వతంలో ఉంచేస్తారు. ఏడాది తరువాత రైతులు గడ్డిమోపులను తీస్తుండగా బ్రహ్మేంద్రులు సజీవంగా సమాధి స్థితిలో కనిపిస్తారు.
3. ఒకసారి ముస్లిం రాజు ఒకడు దిగంబరునిగా ఉన్న వీరిని చూసి పిచ్చివాడనుకొని భటులచేత ఆయన చేతిని నరికిస్తాడు. దీనికి ఎటువంటి బాధ, నొప్పి లేకుండా సదాశివులు తన చేతిని పునరుద్ధరించుకొని ముందుకు సాగుతారు.
4. ఒకసారి ఈయన ఒక ధాన్యపు కుప్ప వద్ద ధ్యానం చేసుకుంటుండగా రైతు ఈయనను చూసి దొంగ అనుకుని కర్రతో కొట్టబోగా చలనం లేకుండా శిలలా అయిపోతాడు. మరునాడు బ్రహ్మేంద్రులు సమాధినుండి బయటకు వచ్చిన తరువాత ఆ రైతుపై అనుగ్రహం చూపగా, రైతు తిరిగి చలనాన్ని పొందుతాడు.
5. ఇంకొకసారి ఒక నవవధువు పాముకాటుకు గురి కాగా, ఆమెకు తిరిగి ప్రాణం పోస్తాడు
6. ఒకమారు నెరూరులో ఉన్న పిల్లలు మన్మదురైలో ఉన్న సంతకు తీసుకువెళ్లమని అడుగగా వారిని కనుసన్నలతో కళ్లు మూసుకొమ్మని చెబుతారు బ్రహ్మేంద్రులు. క్షణకాలంలో పిల్లలంతా తాము మన్మదురైలో ఉన్నట్లు గ్రహిస్తారు. వారంతా సంభ్రమాశ్చర్యాలకు లోనై ఆయన కాళ్లమీద పడతారు.

సమాధి:

ఆయన తన సమాధి సమయంలో, నెరూరులో జీవసమాధికై యోగముద్రలో కూర్చుని సమాధి సందేశాన్ని యోగం ద్వారా తంజావూరు, పుదుక్కోటై, మైసూరు మహారాజులకు పంపిస్తారు. ఈ సందేశంలో వారణాసి నుండి బాణలింగము తీసుకువచ్చి, తన సమాధి స్థలం పక్కన ఒక బిల్వ వృక్షం నాటమని చెబుతారు. బిల్వ వృక్షం ఆయన సమాధి అయిన 9 రోజుల తరువాత అక్కడ మొలుస్తుంది. బాణలింగము 12వ రోజున తరలి వస్తుంది. మన్మదురై మరియు కరాచీలలో ఉన్న ఒక బ్రాహ్మణ మరియి ముస్లిం శిష్యులు ఆయన సమాధిని దివ్య దర్శనం ద్వారా చూస్తారు.

రచనలు:

వాటిలో ముఖ్యమైనవి ఆత్మ విద్యా విలాసము, నవమణిమాల, గురురత్నమాలిక, దక్షిణామూర్తి ధ్యానము, బ్రహ్మసూత్ర వృత్తి, యోగ సుధాకరము, కైవల్యామృత బిందు, సిద్ధాంతకల్పవల్లి, అద్వైత రసమంజరి, బ్రహ్మతత్త్వ ప్రకాశిక, మనో నియమం వంటి ఉత్తమోత్తమమైన అద్వైతసిద్ధాంత జ్ఞానసారాన్ని పంచారు.

వీటన్నిటిలో, ఆత్మ విద్యా విలాసము అత్యుత్తమైన రచనగా ప్రాచుర్యం పొందింది. 62 శ్లోకాల అందమైన సంస్కృతంలో రచన ఇది. దీనిలో పూర్తిగా బంధములనుండి ముక్తుడైన అవధూతను వర్ణిస్తుంది. సామాజిక కట్టుబాట్లకు, ధర్మానికి, అధర్మానికి, మంచికి, చెడుకు అతీతమై, స్మృతి, శాస్త్ర పురాణేతిహాసములకు దూరంగా, సన్యాసి ధర్మానికి అతీతంగా, దేహచింతలన్నీ అధిగమించి, పరిపూర్ణ ఆత్మానంద తృప్తుడై నిరంతర సచ్చిదానంద మగ్నుడై ఉండే, తానే పరబ్రహ్మమని గ్రహించి నిరంతర అనుభూతిలో ఉండే అవధూతను వర్ణిస్తుంది. అట్టి అవధూత లక్షణాలను, మనో స్థితిని, అలవాట్లను, వ్యవహారాలను చెబుతుంది. భారతదేశంలో యోగులకు, సన్యాసులకు, పీఠాధిపతులకు, కఠోర సాధకులకు ఈ గ్రంథం ప్రామాణికం. నడిచే దైవంగా పిలువబడిన కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వాములవారు ఈ గ్రంథాన్ని ప్రతి దినము ఎక్కడో ఒక చోట ప్రస్తావించేవారు. అంతటి మహత్తర రచన ఈ ఆత్మ విద్యా విలాసము. తన గురువులైన పరమశివేంద్రులకు ఈ రచనను అంకితం చేశారు. తంజావూరు మహారాజా వారైన శరభోజీ ఆ ఆత్మ విద్యా విలాసాన్ని ఆస్వాదించినట్లు చరిత్ర చెబుతోంది.

ఇవే కాకుండా, సదాశివ బ్రహ్మేంద్రులు సంస్కృతంలో కొన్ని గొప్ప కీర్తనలను రచించారు. వాటిలో పిబరే రామరసం, ఖేలతి మమహృదయే, భజరే రఘువీరం, చేతహ శ్రీరామం, చింతా నాస్తికిలా, స్థిరతా నహి నహిరే, స్మరవారం వారం, గాయతి వనమాలి, బ్రూహిముకుందేతి, సర్వం బ్రహ్మమయం, మానస సంచరరే, ఖేలతి బ్రహ్మాండే వంటి ఆణిముత్యాలైన రచనలను చేశారు. ప్రతి ఒక్క కృతి ఒక్కొక్క ఆధ్యాత్మిక సంపద. ప్రతి రచన పరబ్రహ్మ తత్త్వాన్ని మహోన్నతమైన పదశైలిలో వర్ణిస్తుంది. ఆయన రచించిన కీర్తనలలో ఇరవైరెండు కీర్తనలకు సాహిత్యం అందుబాటులో ఉంది
తన గురువుల ద్వారా వచ్చిన భజన సాంప్రదాయాన్ని తన రచనలలో కొనసాగించారు. దక్షిణాదిన సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు దేవాలయాలలో, సంకీర్తనోత్సవాలలో నిరంతరం ప్రతధ్వనిస్తునే ఉంటాయి. పరమహంస ముద్రతో ఆయన రచన చేసిన ఈ కృతులు సులభమైన సాహిత్యంతో, లోతైన అధ్యాత్మిక భావనతో ఉంటాయి. కొన్ని సాకార రూపాల వర్ణనగా, కొన్ని పరబ్రహ్మ తత్త్వ వర్ణనగా అద్వైతామృత సారాన్ని మనకు అందిస్తాయి. నాకు నచ్చిన ఐదు కీర్తనలు క్రింద. ఆంద్ర భారతి వెబ్ సైట్ లో అన్ని కీర్తనల సాహిత్యం ఉంది.

1. మానస సంచరరే

మానస సంచరరే బ్రహ్మణి |మానస|

మదశిఖి పింఛాలంకృత చికురే
మహనీయ కపోల విజిత ముకురే |మానస|

శ్రీ రమణీ కుచ దుర్గ విహారే
సేవక జన మందిర మందారే |మానస|

పరమహంస ముఖ చంద్ర చకోరే
పరిపూరిత మురళీ రవ ధారే |మానస|

భావము:

ఓ పరబ్రహ్మా! నా మనసులో సంచరించుము. ఓ కృష్ణా! గోపికల స్తన్యముల మధ్య గల దుర్గమునందు విహరించే వాడవు, సేవించే వారి హృదయ మందిరాలకు మందరము (కల్పవృక్షము) వంటి వాడవు. మదించిన నెమలి పింఛమును శిరస్సున అలంకారముగా కలవాడవు. గొప్ప ప్రకాశము కల బుగ్గలతో శోభిల్లే ముఖము కలవాడవు. చంద్రుని కాంతితో ప్రకాశించే చకోరపక్షి వంటి ముఖము కలవాడవు. నీవు పరమహంసవు. సంపూర్ణమైన మురళీ రవమును కలిగిన వాడవు. నా మనసులో సంచరించుము. బాలమురళీకృష్ణ గారి గానం  మహారాజపురం సంతానం గారి గానం


2 .  పిబరే రామరసం

పిబరే రామరసం రసనే పిబరే రామరసం |పిబరే|

జనన మరణ భయ శోక విదూరం
సకల శాస్త్ర నిగమాగమ సారం |పిబరే|

శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
శుక శౌనక కౌశిక ముఖ పీతం |పిబరే|

భావము:

ఓ జిహ్వా! రామ రసాన్ని త్రాగుము. జనన మరణముల యందు గల భయమును, శోకమును తొలగించే, అన్ని శాస్త్రముల, వేదముల సారమైన రామ రసాన్ని త్రాగుము. శుద్ధ అంతఃకరణము కలిగిన యోగుల ఆశ్రమములలో ఆలపించ బడిన గీతం ఇది. శుకుడు, శౌనకుడు, కౌశికుడు ఆస్వాదించిన రామ రసాన్ని త్రాగుము. బాలమురళీకృష్ణ గారి గానం.(లంకె లోడ్ అయిన తరువాత ప్లే బటన్ నొక్కాలి)


3 . గాయతి వనమాలి  

గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి |గాయతి|

పుష్ప సుగంధ సుమలయ సమీరే
పావన మునిజన యమునా తీరే |గాయతి|

పరమహంస హృదయోత్సవకారీ
పరిపూరిత మురళీరవధారీ  |గాయతి|

భావము:

శ్రీకృష్ణుడు వనమాల ధరించి మధురంగా ఆలపిస్తున్నాడు. పుష్పములనుండి సుగంధ పవనములు సమ్మోహన పరచుచున్నవి. మునిజనులు యమునా తీరమున ఈ దృశ్యమును చూచుచు పావనులవుతున్నారు. ఉత్తములైన యోగుల హృదయాలకు ఉత్సవ వాతావరణమును పరిపూర్ణమైన తన మురళీరవముతో కలిగించుచున్నాడు. బాలమురళీకృష్ణ గారి గళంలో వినండి.(లంకె లోడ్ అయిన తరువాత ప్లే బటన్ నొక్కాలి)
4 . స్మర వారం వారం 

స్మర వారం వారం స్మర నందకుమారం |స్మర వారం వారం|

గోపకుటీర పయోఘృత చోరం
గోకుల బృందావన సంచారం |స్మర వారం వారం|

వేణురవామృత పాన కిశోరం
సృష్టిస్థితిలయ హేతు విహారం |స్మర వారం వారం|

పరమహంస హృద్పంజర కీరం
పటుతర ధేనుక బక సంహారం |స్మర వారం వారం|

భావము:

చైతన్యవంతమైన ఓ మనసా! శ్రీకృష్ణుని నిరంతరం స్మరించుము. గోపికల ఇళ్లలోని వెన్నను దొంగిలించే వాని, గోకులంలో, బృందావనంలో సంచరించే శ్రీకృష్ణుని నిరంతరం స్మరించుము. వేణురవమనే అమృతాన్ని త్రాగిన బాలుడు, సృష్టి యొక్క స్థితిలయకారకుడై తిరిగే వాడు అయిన శ్రీకృష్ణుని నిరంతరం స్మరించుము. యోగ్యులైన యోగుల హృదయాలలో బందీ అయిన, ధేనుక మరియు బక అనే అసురులను తన బలముతో సంహరించిన శ్రీకృష్ణుని నిరంతరం స్మరించుము.

బాలమురళీకృష్ణగారి గళంలో వినండి.  (లంకె లోడ్ అయిన తరువాత ప్లే బటన్ నొక్కాలి)

5 . బ్రూహి ముకుందేతి 

బ్రూహి ముకుందేతి రసనే పాహి ముకుందేతి |బ్రూహి ముకుందేతి|

కేశవ మాధవ గోవిందేతి
కృష్ణానంత సదానందేతి  |బ్రూహి ముకుందేతి|

రాధా రమణ హరే రామేతి
రాజీవాక్ష ఘన శ్యామేతి |బ్రూహి ముకుందేతి|

అక్రూరార్చిత చక్ర ధరేతి
హంస నిరంజన కంస హరేతి  |బ్రూహి ముకుందేతి| 

భావము:

ఓ జిహ్వా! శ్రీకృష్ణుని నుతించుము, పాహి అని పాడుము.  కేశవా, మాధవా, గోవిందా, కృష్ణా, అనంతా అని శాశ్వతమైన ఆనందాన్ని కలిగించే నామాలను నుతించుము. రాధాకృష్ణుని, హరి, రామా అని ఆ అందమైన కలువల వంటి కనులు గల నల్లని వాని నుతించుము. అక్రూరునిచే పూజించబడిన చక్రధారిని, శుద్ధమైన హంస స్వరూపుడైన, మచ్చలేనివాడు, చలించని యోగియైన వాడని నుతించుము. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గానం

18, జులై 2011, సోమవారం

మహాలక్ష్మీ వైభవం - కొల్హాపూర్ మహాలక్ష్మి



లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం


ఓ శ్రీమహాలక్ష్మీ! భాగ్యానికి నిలయమైన, పాలకడలి నుండి ఉద్భవించిన, శ్రీరంగములో వెలసిన దేవీ, దేవ లోక స్త్రీల నందరిని దాసీజనంగా చేసుకొన్న, లోకాని దీపంగా భాసిస్తున్న, ఎవరి మృదుల కటాక్షంతో ఇంద్రుడు, శివుడు వైభవము పొందుతున్నారో, మూడు లోకాలను తన కుటుంబముగా చేసుకున్న, తామర కొలనులో ఉద్భవించిన, మహావిష్ణువుకు ప్రియమైన నీకు నమస్కరిస్తున్నాను. 

భౌతిక, ఆధ్యాత్మిక సంపదలకు, సమృద్ధి, తేజస్సు, జ్ఞానము, అదృష్టము, సంతానము, ధైర్యము మొదలైన లక్షణాలకు నిలయమైన విష్ణుపత్ని శ్రీమహాలక్ష్మి. ఆ విశ్వాత్ముని శక్తికి సంకేతంగా మాయా స్వరూపిణి అయిన జగన్మాత సకల సంపదలకు, సౌభాగ్యానికి నిలయమై, భక్తులపాలిటి కల్పతరువై లోకాన్ని పాలిస్తున్నది. స్థితికారకుడైన శ్రీహరికి ఉపయుక్తంగా ఐహికాముష్మిక ఐశ్వర్యాభివృద్ధిని ఇచ్చే వరాల తల్లిగా మానవాళి దురితక్షయకారకమైనది.  ధర్మ సంస్థాపనకు ఆ శ్రీమహావిష్ణువుతో పాటు పూర్ణావతరములతో పాటు ఇతర రూపాలలో ఈ జగన్మాత మరల మరల వెలస్తూనే ఉంది.

శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి వైభవాన్ని వేనోళ్ల పొగడబడినది.

శ్రీ సూక్త సారం:

ఓ అగ్నిదేవా! బంగారు మేని ఛాయ గల, పాపాలను  నాశనము చేసే, బంగారు మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడిన, చంద్రుని వలె చల్లగా ఆహ్లాదకరంగా, సువర్ణమయమైన యున్న మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. ఎవరి కరుణ,  కటాక్షములతో నాకు బంగారము, ఆవులు, గుర్రాలు, బంధువులు సంప్రాప్తమైనవో ఆ మహాలక్ష్మిని నా వద్దకు ఆవాహనము చేయుము. ఆమె నా వద్ద నుండి వీడిపోకుండా చూడుము.గుర్రాలతో ఉన్న రథం మధ్యలో ఆసీనమైనది, తన రాకను ఏనుగు ఘీంకార నాదంతో సూచిస్తున్న ఆ శ్రీదేవిని ఆహ్వానిస్తున్నాను. తల్లీ! నీవు నా వద్ద సంతోషముగా నెలకొని ఉండుము. చక్కని చిరునవ్వుతో, బంగారు కోటలో నివసించే, కరుణ, తేజస్సు, ఆనంద రూపిణియై, ఆనందము ప్రసాదించునది, పద్మములో ఆసీనురాలై, పద్మము వంటి ఛాయకలది అయిన ఆ శ్రీదేవిని ఇక్కడ సాక్షాత్కరించమని ప్రార్థిస్తున్నాను.
చంద్రుని పోలినది, తేజోవంతమైనది, తన కీర్తి చంద్రికలతో ప్రకాశించుచున్నది, దేవతలచే పూజిన్చబడుచున్నది, కరుణా స్వరూపిణి, పద్మమును ధరించినది, 'ఈం' అనే బీజమంత్రానికి భావంగా ఉన్నది అయిన మహాలక్ష్మిని నేను శరణు వేడుతున్నాను. ఓ దేవీ! నిన్ను ప్రార్థిస్తున్నాను, నా దారిద్ర్యం పోయేలా కరుణించు.

సూర్యుని తేజస్సు కలిగిన ఓ తల్లీ! వనానికి అధిపతియైన బిల్వవృక్షం (మారేడు చెట్టు) నీ తపోమహిమచే ఉద్భవించినది. నీ తపస్సు వలన కలిగిన దాని ఫలాలు అజ్ఞానము మనే లోని ఆటంకాన్ని, అమంగళకరమైన బయటి ఆటంకాన్ని తొలగిస్తాయి గాక!  కుబేరుడు, కీర్తి ఐశ్వర్యాలతో నన్ను వెన్నంటి రావాలి. నీ అనుగ్రహం పూర్తిగా నిండిన ఈ దేశంలో నేను జన్మించాను. సకల సంపదలను నాకు ప్రసాదించు! ఆకలి దప్పికలతో కృశించినది, శ్రీదేవి కంటే ముందుగా జన్మించిన జ్యేష్టాదేవిని  (అలక్ష్మి) నేను నాశనం చేస్తాను. నా గృహము నుండి అభాగ్యము, కొరతలను పూర్తిగా నిర్మూలించి నన్ను అనుగ్రహించు. సుగంధానికి నిలయమైనది, జయింప అలవికానిది, ఎల్లప్పుడూ పుష్టినిచ్చేది, సకల సంపదలు కలిగిన, సమస్త జీవులకు అధినాయిక యైన మహాలక్ష్మిని ఇక్కడ ఆవాహన చేస్తున్నాను.
ఓ శ్రీదేవి! మనస్సులో జనించే ఉత్తమమైన కోరికలూ, సంతోషము, వాక్కులో సత్యము, గోసంపద చే, ఆహార సమృద్ధిచే కలిగే ఆనందాన్ని నేను చవి చూడాలి. నాకు కీర్తి కలుగచేయుము. కర్దమ మహర్షి! నీకు పుత్రికగా జన్మించిన మహాలక్ష్మి నాకు సాక్షాత్కారించాలి. తామరపువ్వుల మాల ధరించిన, సిరిసంపదలకు అధిదేవత, తల్లి అయిన ఆమెను నా కులములో ఎల్లప్పుడూ నివసింప చేయాలి.  మహాలక్ష్మి పుత్రుడవైన ఓ చిక్లీత! నీరు, చక్కని ఆహారపదార్థాలను ఉత్పత్తి చేయుగాక! నా ఇంట నీవు నివసించాలి.  దేవీ, నీ మాత అయిన ఆ మహాలక్ష్మి నా కులములో నిరంతరమూ నివసించేలా అనుగ్రహించు. ఓ అగ్నిదేవా! కరుణ కలిగిన మనసు కలది, పద్మవాసిని, లోకానికి ఆహారము ఇచ్చి పోషించేది, కుంకుమ రంగు కలది, తామరపువ్వుల మాల ధరించినది, చంద్రునివలె ఆహ్లాదకరమైనది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. అగ్నిదేవా! దయకలిగినది, గంభీరముగా యుండెడిది, దండము చేత బూనినది, అందమైన శరీరచాయ కలిగినది, సూర్యునివలె ప్రకాశించునది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. 

అగ్నిదేవా! ఎవరి వలన నేను అంతులేని బంగారుము, గోవులు, సేవకులు, గుర్రాలు ప్రాప్తించుకుంటానో , అట్టి మహాలక్ష్మిని నన్ను వదలి వెళ్లిపోకుండా కృప చూపుము. ఎవరు లక్ష్మీదేవి కృప కొరకు ప్రార్తిస్తున్నారో, వారు ఇంద్రియాలు నిగ్రహించి, ప్రతిరోజూ ఆజ్యముతో హోమము చేయాలి. పైన తెలిపిన పదిహేను మంత్రాలను సదా జపిస్తూ ఉండాలి. సుప్రసిద్ధులు, ఋషులు అయిన ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు ముగ్గురు ఈ సూక్తంలోని ఋషులు, మహాలక్ష్మియే దేవత. పద్మము వంటి ముఖము, ఊరువులు, కన్నులు కలదానా! పద్మము నుండి ఉద్భవించిన తల్లి!, నేను దేని వలన సుఖాన్ని పొందుతానో దాన్ని ప్రసాదించు. గుర్రాలను, గోవులను, సంపదలను ఇచ్చే, ధనానికి అధిదేవతయైన మహాలక్ష్మి! కోరికలన్నీ నెరవేరేటప్పుడు కలిగే సుఖాన్ని ఇచ్చే సంపదను నాకు ప్రసాదించు. పుత్రులు, గోవులు, ధనధాన్యాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు మొదలైన సకల సంపదలు ప్రసాదించు. జనులకు నువ్వు తల్లిగా భాసిస్తున్నావు. నన్ను ఆయుష్మంతునిగా చేయుము. 

అగ్ని, వాయువు, సూర్యుడు, అష్టవసువులు, దేవేంద్రుడు, బృహస్పతి, వరుణుడు - తమ తమ సంపదలను నీ కృపతో అనుభవిస్తున్నారు. చంద్రునివలె చల్లగా, దేవతల శక్తిగా, సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తున్నది, శ్రీదేవి, ఈశ్వరి, చంద్రుడు, సూర్యుడు, అగ్ని - మువ్వురినీ తన మహత్తుగా కలదీ అయిన శ్రీమహాలక్ష్మిని కొలుస్తున్నాను. 
ఓ గరుత్మంతుడా! సోమరసం కోసం వచ్చిన వృత్రాసురుని సంహరించిన ఇంద్రుడు సోమరసం గ్రోలనీ. సోమయాగం నిర్వర్తించాలని సంకల్పించిన నాకు పుష్కలముగా ధనాన్ని ప్రసాదించనీ! పుణ్యము చేసిన భక్తులకు కోపము రాదు, మాత్సర్యము ఉండదు, లోభము నశిస్తుంది, దుర్బుద్ధి పుట్టదు. భక్తిని పొంద కోరేవారు శ్రీ సూక్తాన్ని సదా జపము చెయ్యాలి. నీ కృపతో మేఘాలు ఎల్లప్పుడూ వర్షించనీ! విత్తనాలు చక్కగా మొలకెత్తి బాగా పెరగనీ! భగవంతుని నిందించేవారు నిష్క్రమించు గాక! 
పద్మము అంటే ఇష్టపడేదానా! పద్మములు చేతిలో ధరించిన జగన్మాతా! పద్మములో జన్మించి, నివసించే తల్లీ! తామర రేకులవంటి విశాలమైన కన్నులు కలిగి, విష్ణువు మనస్సుకు అనుకూలమైన మాతా! నీ పాదపద్మములతో నన్ను అనుగ్రహించు.  పద్మము మీద ఆసీనురాలై ఉన్నదేవరో, విస్తారమైన పిరుదులు కలిగిన, తామర రేకులవంటి నేత్రములు కలవారెవరో, లోతైన నాభి కలిగి, స్తన భారముతో వంగి ఉన్న వారెవరో, స్వచ్చమైన వస్త్రాలు, ఉత్తరీయము ధరించిన దెవరో, రత్నాలు పొదిగిన కలశాల జలంతో దేవలోకములోని అత్యుత్తమైన గజములతో అభిషేకించ బడుతున్న దెవరో, పద్మాన్ని చేత ధరించిన దెవరో,  సర్వ మంగళ స్వరూపిణియైన దెవరో అట్టి మహాలక్ష్మి నా గృహములో సదా సర్వవేళలా నివసించుగాక!


సిద్ధులను ఇచ్చే, ముక్తిని అనుగ్రహించే, విజయాన్ని సిద్ధింప చేసే లక్ష్మీ రూపాలలో, సరస్వతిగాను, సంపదలిచ్చే శ్రీదేవిగాను, వరాలిచ్చే వరలక్ష్మిగా నువ్వు సదా నాకు ప్రసన్నురాలవుగా ఉండుగాక!  వర, అభయ ముద్రలు చేత దాల్చిన, పాశము, అంకుశములు చేత ధరించిన, పద్మములో నివసిస్తున్న, కోటి బాల సూర్యుల ప్రకాశము కలదీ, మూడు నేత్రములు కలదీ, ఆదిశక్తి, జగదీశ్వరి అయిన ఆమెను నేను స్తుతిస్తాను.  శుభములలో శుభానివి, సకల శుభాలను సాధించి, ప్రసాదించే దానవు, శరణు పొందటానికి యుక్తమైన దానవు, మూడు కన్నులు కాలిగిన ఓ దేవీ, నారాయణీ! నా నమస్కారము.  పద్మ వాసిని, పద్మమును చేత ధరించినది, పవిత్రమైన తెల్లని వస్త్రములు, సుగంధభరితమైన మాలను ధరించి శోభిస్తున్న, భగవతి, హరిపత్ని, కామ్యదాయిని, ముల్లోకాలను పోషించి కాపాడే నువ్వు నన్ను అనుగ్రహించు. విష్ణుపతిని, భూదేవి, తులసి గా అలరారుతున్నది, మాధవుని ప్రియురాలు, ప్రియసఖి, విష్ణువుతో కూడిన దేవీ! నేను నమస్కరిస్తున్నాను. 

మహాలక్ష్మిని తెలుసుకుందాము. విష్ణుపత్నియైన  ఆమెను అందుకై ధ్యానిద్దాం. ఆ లక్ష్మీదేవి మనకు ప్రేరణనిచ్చు గాక! మహాలక్ష్మీ! వర్చస్సు, లోటు లేని జీవితం, మంచి ఆరోగ్యం - నాకు ప్రసాదించే పవనాలు సదా వీచనీ. ధన ధాన్యాలు, పశు సంపద, పుత్రులు, నూరేళ్ళ దీర్ఘాయుష్షు నాకు చేకూరనీ. ఋణము, రోగము, దారిద్ర్యము, ఆకలి, అకాల మరణము, భయము, శోకము, మానసిక వ్యథలు నశించు గాక!.శ్రీదేవి చేరే వారిని ఐశ్వర్యం వరిస్తుంది; సంపద, దీర్ఘాయుష్షు చేకూరుతుంది. వారు ఐశ్వర్యాలతో తులతూగుతూ మరణం లేని స్థితికి చేరుకుంటారు. సత్వరమే వారు కీర్తిని, విజయాన్ని పొందుతారు. మంచివి అన్నీ లక్ష్మే దేవియే - ఇలా తెలుసుకున్న వాడు లక్ష్మీ దేవిని చేరుకుంటాడు. మంత్రయుక్తముగా ఎల్లప్పుడూ యాగము చేయాలి. అలా చేసే వాడికి పుత్ర సంపద, పశు సంపద లభిస్తుందని గ్రహించాలి. మహాలక్ష్మిని తెలుసుకుందాము. విష్ణుపత్నియైన  ఆమెను అందుకై ధ్యానిద్దాం. ఆ లక్ష్మీదేవి మనకు ప్రేరణనిచ్చు గాక!

కొల్హాపూర్ మహాలక్ష్మి:


ఈ విధంగా నుతించబడిన లోకపావని శ్రీ మహాలక్ష్మి భువిన మహారాష్ట్రలోని సహ్యాద్రి కనుమలలో పంచగంగా నదీ తీరంలో వెలసింది. దేవీ భాగవతంలో ఈ కొల్హాపూర్ ప్రస్తావన ఉంది. కోల్హాపూర్ పట్టణం చోళులు, పాండ్యుల మధ్య అంతర్యుద్ధానికి సాక్షిగా నిలబడింది. అష్టాదశ శక్తిపీఠాలలో కామ్యమోక్ష కారక పీఠంగా ఈ క్షేత్రం పేరుగాంచింది. ప్రళయకాలంలో కూడా లక్ష్మీ నారాయణులు ఈ క్షేత్రాన్ని విడువకుండా ఇక్కడే ఉంటారని విశ్వాసం. అందుకే క్షేత్రానికి అవిముక్త క్షేత్రమని పేరు కూడా వచ్చింది.కరవీరనివాసినిగా ఇక్కడి తల్లి పేరు పొందింది. ఈ ప్రాంతం జగన్మాత కుడిచేత ఉన్నది కాబట్టి ప్రళయాతీతమైనదిగా భావించబడుతోంది. సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి ఇక్కడ నివసించటం వలన ఆ దేవదేవుడైన శ్రీహరి నిరంతరం ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడని ప్రగాఢ విశ్వాసం. అందుకనే ఈ ప్రాంతం అనేకమంది ఋషులను, యోగులను, మహాపురుషులను ఆకర్షించి వారికి మోక్షకారకమైనది. త్రిమూర్తిరూపుడైన దత్తాత్రేయుడు ప్రతి మధ్యాహ్నము ఇక్కడ భిక్షకు వస్తాడని అనేక స్తుతులలో చెప్పబడినది. షిర్డీ సాయి ఆరతులలో కాశీలో స్నానము, జపము, కొల్హాపూరులో భిక్ష అనే దత్త స్తుతి - 'కాశీ స్నాన జప ప్రతిదివసీ కొల్హాపుర భిక్సేసి నిర్మలనది తుంగా జల ప్రాశీ, నిద్రా మాహుర దేశీ'...ఈ విశ్వాసాన్ని మరింత చాటుతుంది.

ఇక్కడి మందిరం విశాలమైన ప్రాంగణంలో చోళుల సాంప్రదాయ శిల్పకళా నైపుణ్యంతో కట్టబడినది. నాలుగు దిక్కులా ముఖ ద్వారాలు, గర్భగుడిలో అంబాబాయిగా పిలువబడే మహాలక్ష్మీ మూర్తి, దీనికి చెరొకపక్కన మహాకాళీ మహా సరస్వతీ రూపాలు, గర్భగుడి వెనుక భాగమున శ్రీ వేంకటేశ్వరుడు, ఎదురుగా గణపతి, బయట బాల దత్తాత్రేయుడు, దత్త పాదుకలు మరియు ఔదుంబరం, సీతారామలక్ష్మణులు, హనుమంతుడు వెలసి ఉన్నారు. పురాతనమైన కట్టడంగా కనిపించే ఈ దేవాలయ ప్రాంగణంలో అమ్మకు అర్పించటానికి పసుపు, ఆకుపచ్చని గాజులు, చీరలు, పుష్పాలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాంగణంలో మేడి చెట్టు, దాని వెనుక భగవాన్ శ్రీధరులు స్థాపించిన దశావతార మూర్తులు, అమ్మవారు ఉంటారు. ఇంకొకపక్క ఖండోబా మందిరము, శివుని మందిరము ఉంటాయి.



గర్భగుడిలోని అమ్మవారి విగ్రహం 5000-6000 ఏళ్ల నాటిది. ఇది నలభై కిలోల బరువు, రాతిపీఠంపై ప్రతిష్ఠించబడింది. అమ్మవారి ఆభరణాలు వెలకట్టలేని మణులతో శోభిల్లుతూ ఉంటుంది. ఈ మహాలక్ష్మి చతుర్భుజయై క్రింది కుడి చేత మాతులింగ ఫలమును (బత్తాయి), పైన కుడిచేత నేలను తాకుతున్న గద, పైన ఎడమచేత ఖేతకమనే రక్షణకవచం (డాలు), క్రింద ఎడమచేత పానపాత్ర కలిగి ఉంటుంది. కిరీటముపై నాగ పడుగ క్రింద శివలింగము, యోని ఆకారము ఉంటాయి. అందుకే ఈ మూర్తిని మూలప్రకృతిగా, విష్ణుమాయా స్వరూపిణిగా భావిస్తారు. విగ్రహము వెనుక సింహవాహనము కనిపిస్తుంది. భారతదేశంలోని మిగిలిన క్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ మూలవిరాట్టు పడమర ముఖంగా ఉంటుంది. సంవత్సరానికి రెండుమార్లు మూడురోజులపాటు  సూర్యాస్తమయ కాలమున కిరణాలు పడమటి చిన్న కిటికీ గుండా అమ్మవారి ముఖమును తాకుతాయి. ఈ ప్రత్యేక దర్శనానికి భక్తులు తరలి వస్తారు.


మహారాష్ట్రలో ఉన్న నాలుగు శక్తి పీఠాలు కొల్హాపూర్ మహాలక్ష్మి, తుల్జాపూర్ భవాని, మాహుర్ రేణుక, వణి సప్తశృంగిమాత. ఇవి నాలుగూ మహిమాన్వితమైనవే. అయినా, కొల్హాపూర్ మహాలక్ష్మికి అత్యంత పురాతనమైన,అత్యంత మహిమా క్షేత్రముగా పేరు వచ్చింది. ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ తపస్సు చేసుకున్నట్లు గాథలు. ఇక్కడ దక్షిణామ్నాయ పీఠమైన శృంగేరివారి శంకరమఠం కూడ ఉంది. మొదట ఒక్క మూలవిరాట్టే ఉండగా కాలక్రమేణా మహాకాళి, మహా సరస్వతీ మూర్తులను కూడా ప్రతిష్ఠించి పూర్తి ఆది శక్తి పీఠంగా దీన్ని చోళ, మరాఠా రాజులు, పాలకులు తీర్చిదిద్దారు. ఆదిశంకరుల కాలంలోనే ఇక్కడి దీపపు స్థంభం కట్టబడినది. 11వ శతాబ్దంలో గండరాదిత్య హయాంలో గుడి మరమ్మత్తులు, గుడి చుట్టూ ప్రదక్షిణానికి బాట, మహాకాళీ, మహా సరస్వతుల విగ్రహ ప్రతిష్ఠ జరిగాయి. మూల విరాట్టుకు, మహా కాళికి మధ్య ఒక మహాలక్ష్మి యంత్రము స్థాపించబడింది. దీనిని మనం దర్శించేలా గాజు పలక కింద ప్రతిష్ఠించారు. అభిషేకాలతో కాలదోషం పట్టిన మూలవిరాట్టును 195లో వజ్రలేపనం ద్వారా గట్టి పరచారు. మొత్తం ప్రాంగణం, సమీపంలో 5 ముఖ్య గుడులు, ఏడు దీపమాలలు ఉన్నాయి. గుడికి దగ్గరలో 35 చిన్న పెద్ద గుళ్లు ఉన్నాయి.


గర్భగుడికి మొదటి తోరణం శివ శక్తులకు సంకేతంగా నల్లని రాతితో నిర్మించారు. ఈ తోరణపు లలాటబిందులో గణేషుడు ఉంటాడు. దీనిని గణేష పట్టిక అంటారు. దీని తరువాత  రంగమంటపం, కూర్మ మంటపం ఉన్నాయి. అటు తరువాత మంటపంలో (అమ్మవారికి ముందు వైపు) జయ విజయులు ఉంటారు. అమ్మవారికి ఎదురుగా ఉన్న గణపతికి ఇరువైపులా లోపాముద్ర, అగస్త్యులు ఉంటారు. వేంకటేశ్వరుని మందిరానికి దగ్గరగా కాత్యాయని కూడా ఉంది. మొత్తం దేవాలయం ఐదు గోపురాల క్రింద ఉంటుంది. మధ్యలో ఒక గోపురం, నాలుగు దిక్కులా నాలుగు. తూర్పు వైపు ఉన్న గోపురం క్రింద మహాలక్ష్మి మూల విగ్రహం. మధ్య ఉన్న గోపురం క్రింద కుమార మండపం, పడమర గోపురం కింద గణపతి, ఉత్తర దక్షిణ గోపురాల క్రింద మహాకాళి మహా సరస్వతులు ఉంటారు. నాలుగు వైపులా ఉన్న ద్వారాలను మహాద్వారము (పడమర వైపు), ఘటీ దర్వాజా (ఉత్తరం వైపు),విద్యాపీఠ్ దర్వాజా( దక్షిణంవైపు),  పూర్వ దర్వాజా అంటారు. ఉత్తర ద్వారంవైపు నవగ్రహ దేవాలయం, దక్షిణద్వారం వైపు రాధాకృష్ణ, కాలభైరవ, సిద్ధి వినాయక, సింహవాహిని, తుల్జాభవాని, లక్ష్మీనారాయణ, అన్నపూర్ణ, ఇంద్ర సభ, రామేశ్వర, నారాయణ స్వామి మహారాజ్ మందిరాలు ఉన్నాయి. తూరుపు ద్వారము వైపు శేషశాయి మందిరం అష్ట భుజాకారంలో అద్భుతంగా ఉంటుంది. మొత్తం ముఖ్య దేవాలయ ప్రాంగణంలోని అన్ని బయట గోడలపై సురసుందరిలు, నాట్యం చేసే అప్సరసలు, చతుష్షష్టి యోగినులు నల్లని రాతిపై అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. గోపురాలన్నీ నవీన మహారాష్ట్ర సంస్కృతికి ప్రతిబింబంగా ఉంటాయి. వీటికి పసుపు ఎరుపు రంగులు వేసి కళకళలాడుతూ ఉంటాయి.

మహాలక్ష్మి క్షేత్రం విశ్రాంతిగా ఒక రోజు మొత్తం గడపగలిగిన దివ్యధామం. పట్టణం మధ్యలో ఉంది కాబట్టి వెళ్ళటానికి ఇబ్బంది ఉండదు. కొల్హాపుర్ పట్టణం పచ్చని సహ్యాద్రి కనుమలకు దగ్గరగా మంచి సారవంతమైన భూమిలో పచ్చని పొలాలతో, మంచినీటి వసతి ఉన్న ప్రాంతం. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక సంపద, ప్రకృతి అందాలు పుష్కలం. దత్తాత్రేయుని కలియుగంలో రెండవ అవతారమైన నృసింహ సరస్వతి ఇక్కడికి అరవై కిలో మీటర్ల దూరంలో కృష్ణా, పంచగంగ నదుల సంగమ స్థానమైన నృసింహవాడి (నర్సోబావాడి) వద్ద కొన్ని ఏళ్లు గడిపారు. అక్కడ పచ్చని ప్రకృతి మధ్య గొప్ప దత్తాత్రేయ క్షేత్రం ఉంది. అలాగే, కొల్హాపూర్ పట్టణానికి సమీపంలో పన్హాలా కొండలు ప్రకృతి సౌందర్యానికి నెలవు. ఇక్కడ కొండపై శివాజీ మహారాజు కట్టించిన జ్యోతిబా పుణ్యక్షేత్రంలో శివుడు ప్రధాన దైవంగా ఎందరో దేవతల మందిరాలు కొండపై రమణీయమైన వాతావరణంలో మనకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఇవే కాక, రెండు, మూడు రోజులు గడిపే పర్యాటక స్థలాలు కొల్హాపూర్ కి దగ్గరలో ఉన్నాయి. కొల్హాపూర్ కు హైదరాబాద్ దాదాపు 540 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి కొల్హాపూర్ కి రైలు వసతి ఉంది కానీ దాదాపు ఒక రోజు ప్రయాణం. బస్సు అయితే రాత్రి ప్రయాణం. కాబట్టి బస్సు ప్రయాణం సౌకర్యం. ఎస్.బీ.ఆర్ నకోడా మరియు సంగీతా ట్రావెల్స్ వారి బస్సులు హైదరాబాద్ నుండి ఉన్నాయి. తప్పకుండా వెళ్లి ఈ శక్తిపీఠాన్ని దర్శించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందండి.

ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారు  సుమధురంగా ఆలాపించిన మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి స్తోత్రం వినండి.
 మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్నీచ ధీమహి తన్నో లక్ష్మిః ప్రచోదయత్

16, జులై 2011, శనివారం

తిరువనంతపురం అనంత పద్మనాభుని వైభవం - భోగీంద్ర శాయినం

కాంచనమయ పద్మనాభుడు

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యాన గమ్యం
వందే విష్ణుం భవ భయ హరం సర్వ లోకైక నాథం

తిరువనంతపురంలోని అనంతపద్మనాభస్వామి దేవాలయం ఆ మధ్య వార్తల్లో కెక్కింది. ప్రతి ఛానెల్లో ఈ దేవాలయ నేలమాళిగలలో గల అపారమైన సంపద, దాని విలువ, అది ఎవరికి చెందుతుంది, ఎవరికి చెందాలి ఇలా నాటకీయ ఫక్కీలో ఒకే ఛాయాచిత్రాన్ని తిప్పి తిప్పి కథలు అల్లి చెప్పారు. ఏదైతేనేమి? ఆనాటి ట్రావన్కోర్ సంస్థానం వారు అత్యంత నిజాయితీతో ఈ స్వామి సంపదను కాపాడుతూ వచ్చారు అనేది నిర్వివాదాశం. ఈ మహదైశ్వర్యానికి సంబంధించిన వివాదాన్ని పక్కకు పెట్టి ఆలయము, అక్కడి ప్రధాన దైవము గురించి కొన్ని విశేషాలు. ఆ పద్మనాభుని అనుగ్రహంతో, ఆయన సంకల్పంతో 2005లో, మళ్లీ 2015లో  ఆ దివ్యమంగళమూర్తిని దర్శించుకునే భాగ్యం కలిగింది.

చరిత్ర:

ఈ భవ్య దేవాలయం ఎప్పుడు నిర్మించారో సరైన వివరాలు అంతర్జాలంలో తెలియలేదు. కానీ, క్రీస్తు శకం 8వ శతాబ్దంలోనే అనంతపద్మనాభ దేవాలయంపై శాసనాలు, రచనలు జరిగాయి. వైష్ణవ సాంప్రదాయాలలో గురువులైన ఆళ్వార్లలో ఒకరైన మహాత్ములు నమ్మాళ్వార్. ఈయన అనంత పద్మనాభునిపై  ఫలశ్రుతితో కూడిన స్తుతిని రచించాడు. ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధంలో పద్మనాభక్షేత్రం 11 దివ్య దేశాల్లో ఒకటిగా పేర్కొనబడినది. అంతేకాకుండా, బ్రహ్మ, వాయు, పద్మ, వరాహ పురాణాల్లో కూడా ఈ క్షేత్రం గురించి ప్రస్తావన ఉంది. పద్మనాభస్వామి దేవాలయం దేశంలో ఉన్న ఏడు పరశురామ క్షేత్రాలలో ఒకటైన ప్రదేశంలో ఉంది. స్కాంద, పద్మ పురాణాల్లో ఈ విషయం చెప్పబడింది.

తొలుత ఎట్టువీటిల్ పిల్లమార్ అని పిలవబడిన ఎనిమిది మంది (ఏడుగురు బ్రాహ్మణులు, ఒక నాయర్)  ఎట్టర్ర్ యోగం అనే సంస్థగా ఏర్పడి, ఏడుగురికి ఒక్కొక్క వోటు చొప్పున, వేనాడు రాజుగారికి అరవోటు అధికారంతో పద్మనాభస్వామి దేవాలయాన్ని నడిపించారు. కొంతకాలానికి వీరు ట్రావెన్కోర్ మహారాజులపైనే ఎదురుతిరిగి స్వతంత్ర్యముగా దేవాలయాన్ని, అక్కడి రాజ్యాన్ని పాలించాలన్న దుర్బుద్ధితో అప్పటి రాజా వారైన ఆదిత్యవర్మను హత్యచేయించి, వారి మహలును తగులబెట్టించారు. వీరి ఆగడాలను మహారాజా మార్తాండవర్మ విజయవంతంగా అరికట్టి తిరిగి దేవాలయ పరిపాలనాధికారాన్ని ట్రావెన్కోర్ రాజరికం క్రిందకు తీసుకువచ్చాడు. మార్తాండవర్మ పరిపాలనలోనే అనంతపద్మనాభస్వామి దేవాలయలో నిర్మాణాలు, పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరిగాయి. 1750వ సంవత్సరంలో రాజా అనిళం తిరునాళ్ ట్రావెన్కోర్ రాజ్యాన్ని పద్మనాభుని కైంకర్యానికి అంకితం చేసి, రాజవంశమంతా పద్మనాభుని దాసులుగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటినుండి, ఈ వంశంలోని పురుషులకు పేరుముందు పద్మనాభదాస, స్త్రీలకు పద్మనాభ సేవిని అన్న బిరుదులు వచ్చాయి. ఈవిధంగా సంస్థానాన్ని పద్మనాభునికి సమర్పించటాన్ని త్రిపదిదానంగా పేరు యిచ్చారు. అప్పటి ప్రభువులను శ్రీపద్మనాభ దాస వంచిపాల వర్మ కులశేఖర కిరీటపతిగా పిలిచారు.
 
ఇప్పుడు ఉన్న గోపురానికి 1566వ సంవత్సరములో శంకుస్థాపన చేయబడింది. ఈ గోపురం 100 అడుగుల ఎత్తు, ఏడు అంచెలలో పాండ్యరాజుల కట్టడాల శైలిని కలిగి ఉంటుంది. ఒక పక్క పద్మతీర్థమనే పుష్కరిణి ఉంది.   విశాలమైన ప్రాకారంలో365-1/4 స్థంభాలతో గ్రానైట్-రాతి కట్టడాలపై అధ్భుతమైన శిల్పకళా నైపుణ్యం మన కళ్లకు ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. ఈ ప్రాకారం తూర్పు వైపు నుండి గర్భగుడి వరకు విస్తరించి ఉంటుంది. ప్రధాన ద్వారమునకు ఎదురుగా ఎనభై అడుగుల ధ్వజస్తంభము అలరారుతుంది. తూరుపు వైపున ఉన్న గోపురము క్రింది భాగాన్ని నాటకశాల అంటారు. ఇక్కడ ఏటా రెండు మార్లు మలయాళీయుల మీన మరియి తులా మాసాలలో జరిగే ఉత్సవాల సమయములో కథాకళి నృత్య ప్రదర్శనలు జరుగుతాయి.

మూలవిరాట్టు:

మూడు ద్వారాల నుండి దర్శనమిచ్చే అనంత పద్మనాభుడు

గర్భాలయంలో శ్రీమహావిష్ణువు ఆదిశేషుడైన అనంతునిపై యోగనిద్రలో శయనుడై ఉంటాడు. శయనుడైన పద్మనాభుని కుడిచేయి శివునిపై, శ్రీదేవీ భూదేవి ఒక పక్కగా, నాభినుండి వెలువడిన వికసించిన కమలములో బ్రహ్మలతో శోభిల్లుతు ఉంటాడు. ఈ నల్లని మూర్తి నేపాల్ లోని గండకీ తీరం నుండి తెప్పించిన 12008 సాలగ్రామాలతో తయారు చేశారట. ఈ మూర్తిని ఒక ప్రత్యేకమైన ఆయుర్వేదిక మూలికలతో తయారుచేసిన మిశ్రమంతో లేపనం చేసి ఉంచారుట. ఈ లేపనాన్ని కటుసర్కర యోగం అంటారు, దీనివలన విగ్రహంపై క్రిమికీటకాదులు వాలకుండా ఉంటుంది. నిత్యం జరిగే అర్చన, అభిషేకాల్లో ఉపయోగించబడే పత్ర పుష్పాలను చేతులతో కాకుండా నెమలి పింఛాలతో తొలగిస్తారట. గర్భాలయం మొత్తం ఏకశిలనుండి చెక్కినదే. ఆందుకనే దీనిని ఒట్టక్కళ్ మండపం అంటారు. ఈ మండపానికి సాష్టాంగం చేసేవారు తమ సర్వస్వాన్ని స్వామికి అర్పించినట్లే లెక్క. అందుకనే, కేవలం మార్తాండవర్మ వంశీకులు మాత్రమే ఇక్కడ సాష్టాంగం చేయటానికి అనుమతిస్తారు.మూలవిరాట్టు మొత్తాన్ని చూడాలంటే మూడు ద్వారాల ద్వారా చూడాల్సిందే. మొదటి ద్వారం ద్వారా పద్మనాభుని ముఖము, శివునిపై గల హస్తము, రెండవ ద్వారము గుండా శ్రీహరినాభినుండి వెలసిన కమలములో ఉన్న బ్రహ్మ, స్వామి శ్రీదేవి, భూదేవిల ఉత్సవమూర్తులు, మూడవ ద్వారము నుండి స్వామి పాదములను దర్శించగలము. ఆదిశేషుని పడగల స్వామి ముఖమువైపు క్రిందకు చూస్తుంటాయి. కటుసర్కర యోగం క్రింద మూలవిరాట్టు ముఖము వక్షస్థలము తప్ప మిగిలిన భాగమంతా బంగారు పోతతో ఉంటుంది. ముస్లిం తస్కరుల కళ్లు కప్పటానికి నల్లని కటుసర్కరము వాడినట్లు చెప్పబడుతుంది.

దేవాలయ ప్రాంగణంలో నరసింహస్వామి, శ్రీకృష్ణుడు, అయ్యప్ప, గణపతి, హనుమంతుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు కూడా ఉంటారు.

గాథలు:

ఈ క్షేత్ర ప్రాధాన్యతను, మూలాన్ని చాటే అనేక గాథలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనది దివాకరముని గాథ. ఈ ముని శ్రీకృష్ణుని దర్శనానికై ప్రార్థించగా, ఆ గోపాలుడు ఒక కొంటెబాలుని రూపంలో వచ్చి ముని అర్చనలో ఉన్నా సాలగ్రామాన్ని మింగి వేస్తాడు. దీనికి ఆగ్రహించిన ముని ఆ బాలుని వెంటాడగా, ఆ బాలుడు ఒక చెట్టు వెనుక దాగి ఉంటాడు. ఆ చెట్టు కూలిపోయి, శ్రీహరి అనంతశయనుడై ఉన్న రీతి అక్కడ వెలిసాడు. ముని ఆ చెట్టే శ్రీహరిగా గుర్తిస్తాడు.  కానీ, ఆ విగ్రహం చాలా పెద్ద ఆకారంలో ఉండటం వలన తాను మనసారా చూడలేనని, కొలువలేనని, కాబట్టి తన పరిమాణాన్ని తన శిష్యునికి మూడు మార్ల పొడవుకు తగ్గించుకొనమని హరిని ముని ప్రార్థిస్తాడు. శ్రీహరి వెంటనే ఆతని కోరిక మన్నించగా, విగ్రహం చిన్నదిగా మారుతుంది. అప్పుడు శ్రీహరి మునితో తనను మూడు ద్వారాల ద్వారా కొలువమని ఆదేశిస్తాడు.

నైవేద్యం:

స్వామికి నిత్యము అన్ననైవేద్యముతో పాటు, రత్నములతో పొదిగిన పాత్రలో బెల్లముతో చేసిన పాయసము, పాల పాయసము మొదలైనవి అర్పిస్తారు. గురువారంనాడు ఇక్కడి నరసింహునికి పానకము నివేదిస్తారు. పద్మనాభ స్వామికి అత్యంత ముఖ్యమైన నైవేద్యం ఉప్పు మంగ (పచ్చి మామిడి కాయను ఉప్పు నీటిలో నానబెట్టి), బంగారు పూత కలిగిన కొబ్బరి చిప్పలో నివేదన చేస్తారు. ఈ కొబ్బరి చిప్ప 1200 సంవత్సరాలనాటిది. దివాకరముని కూడా స్వామికి ఇదే చిప్పలో నివేదన చేశాడట.

ఉత్సవాలు:

స్వామికి ఏడాది పొడుగునా అనేక ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో ముఖ్యమైనవి అక్టోబర్/నవంబర్ లో జరిగే ఆల్పశీ, మార్చి/ఏప్రిల్ లో జరిగే పైంకుని ఉత్సవాలు. ఈ రెండూ పదిరోజులపాటు జరుగుతాయి. ఈ ఉత్సవాలు ఉత్సవమూర్తులకు శంఖుముఖం బీచ్ వద్ద పవిత్ర స్నానాలతో ముగుస్తాయి. ట్రావెన్కోర్ మహారాజావారు పాదరక్షలు లేకుండా ఈ ఊరేగింపు, ఉత్సవంలో పాల్గొంటారు. పద్మనాభ, నరసింహ, శ్రీ కృష్ణ ఉత్సవ విగ్రహాలకు పూజాదుల తరువాత సముద్రంలో స్నానం చేయిస్తారు. తరువాత ఊరేగింపుగా కాగడాలతో మూర్తులను దేవాలయానికి తిరిగి తీసుకువస్తారు. ఇది ఈ ఉత్సవాలకు ముగింపు. ఇవే కాకుండా, నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగుతాయి.


ఈ క్షేత్రంలో జరిగే అత్యంత వైభవమైన ఉత్సవం లక్షదీపోత్సవం. ప్రతి ఆరేళ్లకొకసారి లక్షదీపాలను వెలిగించి ఆలయాన్ని అలంకరిస్తారు. దీనికి ముందు 51 రోజులపాటు వివిధరకాల పూజలు నిర్వహిస్తారు. తదుపరి లక్ష దీపోత్సవం 2020లో.

దేవాలయములోకి కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశము. స్త్రీ పురుషులు సాంప్రదాయ దుస్తులు ధరించటం తప్పని సరి.

మహారాజా స్వాతి తిరునాళ్:

మహారాజా స్వాతి తిరునాళ్ ట్రావెన్కోర్ సంస్థానానికి 1829-1846 మధ్య మహారాజుగా పరిపాలించారు. సమర్థుడైన పాలకుడిగానే కాకుండా, సంగీతపోషకుడిగా, కృతికర్తగా కూడా స్వాతి తిరునాళ్ పేరు పొందారు. హిందుస్తానీ, కర్ణాటక సంగీత శైలిలో 400కు పైగా కీర్తనలను స్వాతి తిరునాళ్ రచించారు. రాజావారు మళయాళం, సంస్కృతం, తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, ఒరియా, బెంగాలీ మరియు ఇంగ్లీష్ భాషలలో ప్రావీణ్యం కలవారు. కులశేఖర వంశంలో రాణి గౌరి లక్ష్మీ బాయి, రాజా రాజవర్మ దంపతులకు 1813లో జన్మించారు. చిన్నప్పటినుంచే సంగీతంపై మక్కువ కలిగిన రాజావారు కరమన సుబ్రహ్మణ్య భాగవతార్, కరమన పద్మనాభ భాగవతార్ల వద్ద సంగీతం ఓనమాలు దిద్దటం మొదలు పెట్టారు. అటు తర్వాత ప్రముఖుల గాత్రం విని సంగీత సాధన చేశారు. సంగీత త్రయమైన త్యాగయ్య, శ్యామయ్య, దీక్షితులకు సమకాలీకుడైన రాజావారు తన సంస్థానంలో ఎందరో విద్వాంసులను పోషించి శాస్త్రీయ సంగీత ప్రవాహానికి తనవంతు కృషి చేశారు.

పరిపాలనా పరంగా రాజావారు ఎన్నో గొప్ప సంస్కరణలు చేయటం వలన అవినీతికి అడ్డు కట్ట వేయగలిగారు. అలాగే, వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలను, విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు.

ఈయన రచనలలో బాగా ప్రాచుర్యం పొందినవి భావయామి రఘురామం, భోగీంద్ర శాయినం. భావయామి రఘురామం అనే కీర్తనను రాజావారు సావేరి రాగంలో కట్టగా, దానిని తరువాత రాగమాలికగా సెమ్మంగూడి శ్రీనివాస ఐయ్యరు గారు కూర్చి చాల పేరు తెచ్చారు. దీనిని భారతరత్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగారు అద్భుతంగా గానంచేసి అజరామరం చేశారు. రెండవది భోగీంద్ర శాయినం. కుంతలవరాళి రాగంలో రాజావారు అనంతపద్మనాభస్వామి వారిపై సంస్కృతములో క్లిష్టమైన పద ప్రయోగంతో భావుకమైన కీర్తనను రచించారు. ఆ కీర్తన మీ కోసం క్రింద.

భోగీంద్ర శాయినం పురుకుశలదాయినం
పురుషం శాశ్వతం కలయే

వాగీశ గౌరీశ వాసవాద్యమరపరివారాభివందితపదం పద్మనాభం (భోగీంద్ర)

కలితనుత సన్యాసి భజనాను గుణవిహిత సులలితాకారమహితం
కలుషహర పరిసరోజ్జ్వల పద్మ తీర్థాది ఖండితాశేషదురితం
కలశోద్భవాన్విత మహేంద్ర త్రికూటవర మలయాచలేంద్ర వినుతం
కలదమన వంచి మార్తాండవర్మాకలితకాంచన విమాన లసితం పద్మనాభం (భోగీంద్ర) 

భావం:

అనంతశేషునిపై శయనించిన, ప్రజల, రాజులకు క్షేమాన్ని కలిగించే, పురుషుడు, శాశ్వతమైన వాడు అయిన పద్మనాభుని చూడండి. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలైన దేవతలచే పూజించబడిన పాదములు కల పద్మనాభుడవు. దివాకర మునిచే నుతించబడిన నీవు ఆయన భక్తికి వశుడవై ఇక్కడ సుందరాకారంలో వెలసినావు. పద్మతీర్థం చుట్టూ కలిగి నీవు సమస్త కలుషములను హరించి, అశేషమైన పాపములను నాశనము చేస్తున్నావు. కలశమునుండి జనించిన అగస్త్యుడు, మహేంద్రుడు, మలయాచలేంద్రుల (మలయాచలముపై ఇంద్రద్యుమ్నుడనే రాజు నారాయణ మంత్రము జపిస్తూ తపస్సులో ఉంటాడు. గొప్ప హరిభక్తుడు ఆయన. ఒక మారు అగస్త్య మహర్షి అక్కడికి రాగా, ఇంద్రద్యుమ్నుడు ఆ మహర్షిని గమనించక తామసముతో వ్యవహరిస్తాడు. అందుకు అగస్త్యుడు కోపగించి ఆయనను తామసముతో కూడిన గజేంద్రునిగా జన్మించి,త్రికూటాచల ప్రాంతంలో విహరిస్తూ, మకరిచే బాధించబడి, అంత్యమున శ్రీహరి అనుగ్రహముతో మోక్షమును పొందాలని శపిస్తాడు. అదే భాగవతములోని గజేంద్ర మోక్షము. ఆ గజేంద్రుడు, అంతకు ముందు జన్మలో ఇంద్రద్యుమ్నుడి చే నుతించబడిన శ్రీహరి అని అర్థం) మొదలైన వారిచే నుతించబడిన వాడవు. చెడును నాశనము చేసేవాడవు, వంచి మార్తాండవర్మ నిర్మించిన బంగారు విమానమునందు శోభిల్లుతున్న పద్మనాభుడవు.

వివరాలు:

ఈ కీర్తనలో ఇంకా మూడు చరణాలు ఉన్నాయి. కానీ అంతర్జాలంలో ఉన్న వాటి సాహిత్యంలో లోపాలు ఉన్నట్లు అనిపించింది. అంతే కాకుండా, వాటిని ఏ విద్వాంసులు కూడా గానం చేయలేదు. ఆందుకనే, ఒక్క చరణాన్ని మాత్రమే పైన పొందు పరచాను. మిగిలిన చరణాల సాహిత్యం క్రింద. వీటి సరైన సాహిత్యం దొరికిన తరువాత అర్థంతో పాటు పొందు పరుస్తాను.

మొదటి చరణంలో శ్రీ మహావిష్ణువు పరివార గణంలో ఉన్న నారదాది అఖిల మునులు, ఆ శ్రీహరి పాలకడలిలో శేషశయనుడై వారిచే నుతించబడటం, సుర భూసురులు కొలుస్తుండగా సుదర్శన చక్రధారియై, నందకము మరొక చేత ధరించి, ఇంకొక చేత కమలము ధరించి శోభిల్లుతున్న పద్మనాభుడు ఆయన భక్త జన బృందాన్ని మహరాజావారు ప్రాకృతములో విశేషంగా కన్నులకు కట్టినట్లుగా నుతించారు.

రెండవ చరణంలో గాథలో చెప్పిన దివాకరముని మరియు పద్మనాభుడు వెలసిన సందర్భాన్ని మనోహరంగా వివరించారు స్వాతి తిరునాళ్ వారు.

మూడవ చరణంలో ఆ శ్రీహరి మెరుస్తున్న మణులు కలిగిన బంగారు కిరీటము, మకర కుండలములు, మెడలో కౌస్తుభ హారము, బంగారు పీతాంబరము, వనమాలలను వర్ణించి అటు తర్వాత ఇక్కడ జరిగే ఉత్సవాల్లో ప్రముఖమైన లక్ష దీపోత్సవాన్ని, నాభియందు కమలములో బ్రహ్మను కలిగిన ఆ పరిపూర్ణ కరుణామూర్తియైన పద్మనాభుని మనోజ్ఞంగా ప్రస్తుతించారు.

తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి వారి నుతి ఐన భోగీంద్ర శాయినం కృతిని ఎమ్మెస్ సుబ్బులక్షి గళంలో వినండి.

1. క్షీరవారానిధి శ్వేతాంతరీప భవ చిత్రమణి సౌధాస్థితం
నారదాద్యఖిల ముని దివ్య పార్శద విహగ నాయక సదారాధితం
సుర భాసుర సుదర్శన నందక ప్రముఖ శోభనాయుధ సేవితం
శ్రీ రసాకర సరోజామ్రుదిత పాద వందారుజన భరణోద్యతం పద్మనాభం (భోగీంద్ర)

2. పరమ భక్తోత్తమ దివాకర యతీంద్ర కృతగురు పుణ్య వసుధాగతం
సురుచిరాద్భుత బాలవేష సాక్షాత్కార పరితోష శిర లాలితం
పరిపూజనార్థ సాలగ్రామ హరణాట్టత్తరు యోగి కరవారితం
పాదపాద్యస్థితం పద్మనాభం (భోగీంద్ర)

3. అరుణాభమణి మకుట మకర కుండల ధార హార కౌస్తుభ భూషితం
పరివీత పీతాంబరాకలిత కాంచికావరవన్య మాలాంచితం
నిరవద్య వంచీశ సకృత లక్షదీపాది నిత్యోత్సవానందితం
సరసీరుహోదర పలాశాయతాక్షి పుట పరిపూర్ణ కరుణామృతం పద్మనాభం (భోగీంద్ర) 

15, జులై 2011, శుక్రవారం

గురుపౌర్ణమి విశిష్టత

గురుపౌర్ణమి విశిష్టత
శ్రీ సమర్థ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై
 
త్వం పితా త్వం చ మే మాతా త్వం బంధుస్త్వం చ దేవతా
సంసారభీతిభంగాయ తస్మై శ్రీ గురవే  నమః


 తాత్పర్యము: నీవే నా తండ్రివి, తల్లివి, హితుడవు, దేవుడవు. సంసార భయాన్ని పోగొట్టే గురువైన నీకు నా నమస్కారములు.

(సద్గురు స్వామి శివానంద వారి గురుతత్త్వముపై అనుగ్రహ భాషణలో నేటి గురుపౌర్ణమి వైశిష్ట్యాన్ని వివరించారు. దానికి తెనుగు అనువాదం మీకోసం).

ఆషాఢ శుద్ధ పౌర్ణమి అత్యంత శుభప్రదమైన పర్వదినం. ఈ రోజును గురుపౌర్ణమిగా భావిస్తారు. వేదవ్యాసునికి గౌరవ సూచకంగా ఈ పవిత్ర దినం నాడు యోగులు, సన్యాసులు ఒకచోట చేరి వేదాంత విచారములో భాగంగా ఆ కృష్ణద్వైపాయనుని బ్రహ్మసూత్రాలపై ప్రసంగిస్తారు. వేదవ్యాసమహాముని నాలుగు వేదాల అధ్యయనంతో బ్రహ్మసూత్రాలు, పద్ధెనిమిది పురాణాలను, మహాభారతమును, భాగవతమును రచించి మానవాళికి వెలకట్టలేని ఆధ్యాత్మిక సంపదను వారసత్వంగా ప్రసాదించారు. దీనికి, ఆ మహానుభావునికి గల మన ఋణాన్ని ఆ రచనల అధ్యయనం ద్వారా, ఆయన బోధనలను ఆచరణలో పెట్టడం ద్వారా మాత్రమే తీర్చుకోగలము. ఆయన బోధనలు, రచనలు ఏ యుగానికైన ప్రామాణికమే. ఆ మహామునికి గౌరవంగా సాధకులు, యోగులు ఈ గురుపౌర్ణమినాడు వ్యాస పూజ నిర్వహిస్తారు. సాధకులు తమ తమ గురువులను పూజిస్తారు. గురువులను, మహాత్ములను సత్కరించి వారిని రంజిల్లజేస్తారు. గృహస్థులు భక్తి శ్రద్ధలతో దానధర్మములవంటి సత్కార్యములు చేస్తారు. సన్యాసులకు చాతుర్మాస్యం నేడు ప్రారంభమవుతుంది. అనగా, సన్యాసులు వర్షాకాలపు ఈ నాలుగు నెలలు ఒకే చోట నివసించి బ్రహ్మసూత్రాలను అధ్యయనం చేస్తూ ధ్యానంలో నిమగ్నులై ఉంటారు.

ఈ గురుపౌర్ణమి విశిష్టతను నిశితంగా గమనించండి. చాతుర్మాస్యం, అనగా మండే వేసవి తరువాత ఎంతో ఎదురు చూసే నాలుగు నెలల వర్షాకాలం ఆరంభం నేడు. ఎండవేడిమికి ఆవిరై మేఘాల రూపంలో ఉన్న నీరు పుష్కలంగా వర్షించి కొత్త జీవనానికి బీజం వేస్తుంది. అలాగే మనందరం కూడా ఓపికతో అధ్యయనం చేసిన విద్యను నిజజీవితంలో అమలు చేయటం ప్రారంభిద్దాం. నిజ సాధన ఈ రోజు ప్రారంభించి సరికొత్త ఆధ్యాత్మిక అలలను సృష్టిద్దాము. మనము చదివినది, వినినది, చూచినది, నేర్చుకున్నది, సాధన ద్వారా అనంతమైన విశ్వ సౌభ్రాతృత్వము, ప్రేమ, నిరంతర సేవా భావముతో, భక్తి తత్పరతలతో విశ్వవ్యాప్తుడైన భగవంతుని కొలుచుదాం.

(సన్యాసులకు) ఈ చాతుర్మ్యాస్యంలో పాలు, పండ్లు మాత్రమే ఆహారముగా తీసుకుని, కఠోర జప, ధ్యానములు చేద్దాము. బ్రహ్మసూత్రాలను అధ్యయనం చేద్దాము. మీ గురు మంత్రమును లేదా ఇష్ట దేవతా మంత్రమును లక్షల జపము (అనుష్ఠానము లేదా పునశ్చరణ అయినా పరవాలేదు) చేద్దాము. ఇది మనకు అత్యంత శుభ, లాభకరం.

ఈ గురు పూజా దినము సాధకులకు అత్యంత ఆనందకరమైనది. తన ప్రియ గురువుపై తనకు గల భక్తి, గౌరవాలను వ్యక్తపరచటం కోసం ఉత్సాహంగా ఉన్న శిష్యునికి ఇది ఎంతో ఆతురతతో ఎదురుచూసే సుదినం. కేవలం ఒక్క గురువు మాత్రమే మానవుని బంధపాశములను తొలగించి భవసాగరమునుండి విముక్తుడిని చేయగలడు. శ్రుతులు ఈ విధంగా చెబుతున్నాయి - "భగవంతునిపై అచంచలమైన భక్తి విశ్వాసములు కలిగి, అట్టి భక్తి విశ్వాసములు గురువు మీద కూడా కలిగియున్న ఉన్నతాత్ములకు ఈ రహస్యము అవగతమై ఆత్మజ్ఞానమును పొంది అఖండ తేజోవంతులగుదురు". గురువే బ్రహ్మ. గురువే ఈశ్వరుడు. జీవాత్మ యొక్క అంతరాళమునుండి మనలను ఉత్తేజపరచి ముందుకు నడిపించే వాడు గురువు. ఆ గురువు అంతటా ఉన్నాడు.

అనేకజన్మ సంప్రాప్త కర్మబంధవిదాహినే
జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే  నమః

 తాత్పర్యము: జ్ఞానమనే అగ్ని ద్వారా అనేక జన్మల నుంచి సంప్రాప్తించిన కర్మ అనే బంధములను దహించే ఆ గురువునకు నా నమస్కారములు

14, జులై 2011, గురువారం

గురుపౌర్ణమి - గురువు యొక్క ప్రాముఖ్యత, పాత్ర

 (హృషీకేశ్ లోని దివ్య జీవన సంఘం స్థాపకులు, మహనీయులు, ఇరవైయ్యవ శతాబ్దపు భారతీయ గురువులలో అగ్రగణ్యులు సద్గురువు స్వామి శివానంద. వారు గురుతత్త్వముపై వ్రాసిన అద్భుతమైన ఆంగ్ల వ్యాసములో మొదటి అంకములోని రెండు అంశాలకు తెలుగులో అనువాదం. గురుపౌర్ణమి సందర్భముగా నా గురువులు నిడుగొంది వేంకట రమణరావుగారు పాదపద్మములకు సమర్పిస్తూ)

ఆది శంకరులు


గురువు యొక్క ప్రాముఖ్యత, పాత్ర

సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం

పరమశివుని మొదలు, శంకరాచార్యులు మధ్యలో, నా గురువులైన శ్రీ రమణరావు గారి వరకు గల గురు పరంపరకు నా నమస్కారములు (గురువందనము).

శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం
సూత్ర భాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః

పరమ శివునికి, శ్రీ మహావిష్ణువునకు, బ్రహ్మసూత్రములు రచించిన వ్యాసమహామునికి, వాటికి భాష్యములు చెప్పిన ఆది శంకరులకు, మరల మరల నమస్కరింతును (గురువందనము).

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

గురువే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. గురువు సాక్షాత్తు పరబ్రహ్మము. అట్టి గురుదేవునకు నమస్కరింతును (శ్రీ గురుగీత).

శిష్యుని సన్మార్గంలో నడిపించుటకు ప్రత్యక్షరూపములో వచ్చిన గురువే దైవము అని దీని భావము. దైవకృప మరియు కరుణ గురువు రూపాన్ని పొందుతుంది. గురువును దర్శించుట దైవాన్ని దర్శించుటయే. తన ఉనికితో భక్తిని నాటి, చాటి, అందరినీ పరిశుద్ధులను చేశే దివ్యమూర్తి సద్గురువు. గురువు సంపూర్ణముగా మానవునికి దైవానికి మధ్య గల లంకెయే. తాను ఏమిటో అవగాహన పొంది ఉండుటచే గురువు ఈ రెండిటికీ అందుబాటులో ఉంటాడు. శాశ్వతమైన దైవత్వపుటంచులలో నిలబడి భవసాగరములో కొట్టుమిట్టాడుతున్న మానవుని ఒకచేతితో అందుకుని మరొకచేతితో సచ్చిదానందమువైపు ఉద్ధరిస్తాడు.

సద్గురువు:

కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వాములు


కేవలం పుస్తక జ్ఞానము గురువగుటకు అర్హత కాదు. వేదములను చదివి ఆత్మానుభవము పొందిన వాడే గురువగును. జీవన్ముక్తుడే నిజమైన గురువు. అతనే సద్గురువు. బ్రహ్మజ్ఞానము కలిగి, బ్రహ్మమే తానైన వాడు సద్గురువు. సిద్ధులను, విద్యలను ప్రకటించి ప్రదర్శించుట గురువు మహత్తునకు తార్కాణంకాదు. సద్గురువు వీటిని కేవలం సాధకులకు పారలౌకిక శక్తులు కలవని నిరూపించుటకు, వారిని ప్రోత్సహించుటకు, వారిలో విశ్వాసము కలిగించుటకు చాలా అరుదుగా ప్రదర్శించవచ్చు తప్ప ఎల్లప్పుడూ వాటితోనే జీవనం సాగించడు.సద్గురువు అగణిత సిద్ధ సాధకుడు, సర్వైశ్వర్య యోగము కలవాడు.

సద్గురువు పరబ్రహ్మము, మరియు అనంత జ్ఞానకరుణా సంపన్నుడు. మానవుని  ఆత్మ అనే నావకు నావికుడు. ఆయన పరిపూర్ణానంద స్వరూపుడు. మానవుని సమస్త కష్టములను, దుఃఖములను, అవరోధములను పటాపంచలు చేసే దివ్యశక్తి గురువు. మనిషియొక్క అజ్ఞానమనే చీకటి తెరను తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు సద్గురువు. మానవుని శాశ్వతమైన దైవత్వమువైపు నడిపేవాడు సద్గురువు. జ్ఞానమనే రజ్జును (తాడును) ఇచ్చి సంసారమనే సాగరములో మునుగకుండా కాపాడేవాడు సద్గురువు. గురువే దైవము. గురుముఖమున వెలువడిన మాట ఆ దేవుని వాక్కే. గురువు ఏమీ మాటాడనక్కరలేదు. వారి సాంగత్యము ఉత్తేజపూరకము, ఆనందకారకము. మానవుడు కేవలం ఇంకొక మానవ రూపము ద్వారానే జ్ఞానసముపార్జన చేయగలడు. ఆందుకనే భగవంతుడు మానవరూపంలో గురువుగా ప్రకటితమవుతున్నాడు. గురువు పూర్ణత్వమునకు సారూప్యము. ఆ మహనీయుని లక్షణములు మన జీవనాన్ని మలచుకునే సదవకాశములు. అట్టి ఉన్నతాత్మ పూజించుటకు, గౌరవించుటకు పూర్తిగా అర్హుడు.

గురువు మోక్షద్వారము. ఆయనే సచ్చిదానందమునకు సోపానము. కానీ, వాటిని పొందుటకు సాధకుని యత్నము తప్పనిసరి. ఈ యత్నములో గురువు సహాయకుడు, నిర్దేశకుడు మాత్రమే.

గురువు యొక్క ఆవశ్యకత:

దక్షిణామూర్తి

క్రొవ్వొత్తిని వెలిగించుటకు ఇంకొక వెలుగుతున్న సాధనము ఎలాగ అవసరమో, సాధనామార్గములో మొదటి మెట్టునున్న సాధకునికి గురువు అలాగే ఆవశ్యకము. ఉద్దీపమైన ఆత్మ మాత్రమే ఇంకొక ఆత్మను మోక్షమువైపు నడుపగలదు.  స్వతంత్రముగా గురువులేకుండా సాధన చేసేవారు ఎక్కడో ఒక చోట అవరోధములకు గురి అయ్యి, వాటిని ఎలా ఎదుర్కొని అధిగమించాలో తెలియక సతమతమవుతూ గురువును ఆశ్రయిస్తారు. కేవలం బద్రీనాథ్ ఇదివరకు వెళ్లిన వాడు మాత్రమే అక్కడికి వెళ్లుటకు మార్గము చెప్పగలడు. ఆధ్యాత్మిక మార్గములో కోతిలాంటి మనసుకు ఎన్నో అవరోధములు, ఎన్నో దారితప్పే పరిస్థితులు. గురువు వీటిని తొలగించి సరైన మార్గములో నడుపుతాడు. ఇది మోక్షమార్గము, ఇది బంధనముల మార్గము అని వివరించి చెప్పే సాధనము గురువు. ఈ దిశానిర్దేశములేకుంటే బదరీనాథ్ చేరవలసిన ప్రయాణికుడు కొత్తఢిల్లీ చేరవచ్చు.

వేదవేదాంగములు, పురాణేతిహాసములు ఒక భయంకర కీకారణ్యము వంటివి. వీటిలో విరుద్ధంగా అగుపించే మార్గములు, అగమ్య గోచరములు, రహస్య సందేశములు ఎన్నో. సందేహ నివృత్తి కలిగించి, అర్థమును విపులీకరించి, సారాన్ని అరటి పండు ఒలిచి యిచ్చినట్లు పంచే సాధనము గురువు.

ఆధ్యాత్మిక మార్గములో ఉన్న ప్రతి సాధకునికి గురువు తప్పనిసరి. కేవలము గురువు మాత్రమే సాధకుని లోపాలను గుర్తించి సరిదిద్దగలడు. మన వీవుపై గల మలినాన్ని అద్దములేకుండా ఎలా చూడలేమో, అలాగే అహంకారము వలన మనలోని లోపాలను గ్రహించలేని బలహీనతను గురువు సరిదిద్దగలడు. గురు సాంగత్యము ద్వారానే మనలోని దుర్గుణములను, లోపాలను పోగొట్టుకొనగలము. గురు సాంగత్యము వలన ప్రాపంచిక లోభములను, దుర్మార్గపు ఆకర్షణలను విస్మరించి, అధిగమించి ముందుకు వెళ్లగలము. గురు సాంగత్యము, గురుబోధ లేకుండా మహనీయులైన వారు కారణ జన్ములు. వారిని ఉదహరించి గురువు యొక్క ఆవశ్యకతను తక్కువచేసి మాట్లాడటం సరి కాదు. అటువంటి కారణజన్ములు అసామాన్యము, అరుదే కానీ సామాన్యము, అగురు ఆధ్యాత్మిక సోపానమునకు ఉదహరణము కాదు. వారికి ఆ కారణ జన్మము పూర్వజన్మలయందు చేసిన విశేష సేవా జ్ఞాన ధ్యాన తత్పరత వలన. వారిదివరకే గురువు చెంత అభ్యాసము చేసి తరించి, ఈ జన్మలో ఆ మార్గాన్ని కొనసాగిస్తున్నారు. అంతమాత్రమును గురువు యొక్క ప్రాముఖ్యత తగ్గినట్లు కాదు. కొంతమంది 'స్వయముగా ఆలోచించండి. ఏ గురువుకూ దాసోహం కావద్దు. ఎవరినీ అనుకరించవద్దు' అని బోధిస్తుంటారు. వారు తమ మాటలను వినే వారికి తమను తాము గురువుగా ప్రకటించుకునే తహతహ వలన ఆవిధంగా బోధిస్తారు. అటువంటి బూటకపు గురువులను అనుగమించవద్దు.

చరిత్రలో ప్రతి గొప్పవ్యక్తికీ ఒక గురువు ఉన్నాడు. ఋషులు, మునులు, యోగులు, బైరాగులు, తత్త్వవేత్తలు, అధ్యాపకులు, అవతారపురుషులు - ఇలా స్వయంగా ఎంత గొప్పవారైనా, అందరికీ గురువులు ఉన్నారు.  శ్వేతకేతుకు ఉద్దాలకుడు, మైత్రేయునకు యాజ్ఞవల్కుడు, భృగువునకు వరుణుడు, నారదునకు సనత్కుమారుడు, నచికేతునకు యముడు, ఇంద్రునకు ప్రజాపతి - ఇలా ఎందరో గురువుల వద్ద కఠిన దీక్షతో బ్రహ్మవిద్యను అభ్యసించారు. అలాగే, కృష్ణుడు సాందీపుని వద్ద, రాముడు వశిష్ఠుల వద్ద అభ్యసించారు. దేవతలకు కూడా గురువుగా బృహస్పతి కలడు. మహాజ్ఞాన సంపన్నులైన దైవ స్వరూపులు కూడా దక్షిణామూర్తి పాదాలవద్ద జ్ఞానాన్ని పొందారు.

సాధనలో తడబడు అడుగులు వేస్తున్న సాధకునికి మానవరూపంలో గురువు అత్యంత ఆవశ్యకము. ఆతనికి భగవంతుడు గురువు కాజాలడు. కేవలం శుద్ధమైన అంతఃకరణము, అత్యున్నత విలువలు, సర్వ సద్గుణములు కలిగిన వానికి మాత్రమే భగవంతుడు గురువు కాగలడు.

గురువును ఎంచుకొనుట ఎలా?

సద్గురువు స్వామి శివానంద

ఏ మహాత్ముని వద్ద శాంతి లభిస్తుందో,  వారి సంభాషణలు, ఉపన్యాసములవలన ప్రేరణ కలుగుతుందో, ఎవరి వద్ద నీ సందేహాలు నివృత్తి అవుతాయో, స్వార్థము, లోభము, కోపము, మోహము లేకుండా, ప్రేమ, కరుణలతో 'నేను, నాది' అన్న భావనలను లేని అట్టి మహాత్ముని నీ గురువుగా భావించవచ్చు.  నీ సాధనలో ఓరిమితో పర్యవేక్షిస్తూ, విశ్వాసాలకు భంగం కలుగకుండా, నీవున్న స్థాయినుండి ముందుకు నడిపే, ఎవరి వద్ద నీవు ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతున్నావన్న భావన కలుగుతుందో, అట్టి వ్యక్తిని నీ గురువుగా భావించవచ్చు.  గురువుగా భావించిన తరువాత సంపూర్ణమైన విశ్వాసముతో, నమ్మకముతో ముందుకు సాగుము. భగవంతుడు నీ వెంటనే ఉంటాడు.

గురువును ఎంచుకొనుటలో నీ వివేచన, పరిశీలన, పరిశోధనా శక్తిని అతిగా ఉపయోగించవద్దు. దాని వలన నిరాశే మిగులును. ఉత్తమమైన గురువు లభించనపుడు, జ్ఞానము కలిగి, సామాన్యమైన జీవనము గడుపుతూ, ఆ మార్గములో ఉన్న సాధువును గురువుగా భావించుము. ఏ విధముగా అయితే సరైన అధ్యాపకుడు లేని పక్షములో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ఐదవ తరగతి విద్యార్థికి సందేహనివృత్తి చేసి నిర్దేశించగలడో, ఏ విధముగా అయితే సివిల్ సర్జన్ లేనప్పుడు అసిస్టెంట్ సర్జన్ రోగికి చికిత్స చేయగలడో, అలాగే ఉత్తమోత్తమమైన గురువు అందుబాటులో లేనప్పుడు సాధు తత్త్వము కల ఉత్తమ వ్యక్తులు గురువుగా నీకు సహాయపడగలరు. ఇటువంటి అవకాశము కూడా లేనప్పుడు, ఆది శంకరులు వంటి మహనీయలు రచించిన అధ్యాత్మిక గ్రంథాలను చదువుతూ, వారి చిత్ర పటములను భక్తి విశ్వాసములతో ఆరాధిస్తూ  ఉండండి. క్రమముగా ప్రేరణ కలిగి, గురువు స్వప్న సాక్షాత్కారము ఇచ్చి నీకు దిశానిర్దేశము చేయగలడు. శ్రద్ధ కలిగిన సాధకునికి గురు అనుగ్రహము అనూహ్య పరిస్థితులలో కలుగుతుంది. ఏకనాథునికి ఈ విధముగా ఆకాశవాణి 'దేవగిరిలో జనార్దన పంతును దర్శించుము. వారు నీకు సరైన మార్గమున వెళ్లుటకు సాయపడుదురు' అని చెప్పెను. అలాగే, తుకారాంనకు స్వప్నములో 'రామకృష్ణహరి' అన్న మంత్రము కలిగెను. ఆయన దానిని సాధన చేసి శ్రీ కృష్ణుని సాక్షాత్కారమును పొందెను. నామదేవునకు శ్రీ కృష్ణుడు మల్లికార్జునములో యున్న ఒక సాధువు వద్ద శిష్యరికము చేయుమని నిర్దేశము కలిగెను. ఇదే విధముగా బిల్వమంగళునికి వేశ్య యైన చింతామణి గురువు కాగా, తులసీదాసుకు అజ్ఞాత వ్యక్తి ద్వారా హనుమంతుని కృప, ఆ వాయుసుతుని ద్వారా రామ సాక్షాత్కారము కలిగెను.

సామర్థ్యము కలిగిన శిష్యుడు ఎప్పుడూ సమర్థుడైన గురువు యొక్క శోధనలో ఉండడు. ఆత్మ సాక్షాత్కారము పొందిన మహానుభావులు మన సమాజంలో పుష్కలం. వారిని అజ్ఞానము వలన సామాన్యులు గుర్తించకపోయినా, శుద్ధ అంతఃకరణము కలిగి, సాధు స్వభావులైన వారు గుర్తించి తమ ఆధ్యాత్మికోన్నతికి వినియోగించుకుంటారు.  ఈ ప్రపంచమున్నంత వరకు గురువులు, వేదములు సతమతమవుతున్న మానవునికి ఆధ్యాత్మిక మార్గములో సహాయపడటానికి సాధనాలుగా ఉంటాయి. సత్పురుషులు, సద్గురువులు ఎల్లప్పుడూ ఉన్నారు, ఉంటారు. కలియుగములో సత్యయుగం కన్నా తక్కువ ఉండవచ్చు.  కానీ, ఉన్న కొద్దిమంది కూడా సాధకునికి సహాయపడటానికి నిరంతరం అందుబాటులో ఉంటారు. వారి వారి సామర్థ్యాన్ని, అవకాశాలను బట్టి సాధకులు మార్గాన్ని ఎంచుకుని ముందుకు నడుస్తుంటే, సద్గురువులు తప్పక తారస పడతారు.

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః

అజ్ఞానమనెడి చీకట్లలో కొట్టుమిట్టాడుచు సన్మార్గమును (పురుషార్థసాధకమైన కర్తవ్యమార్గమును) గుర్తింపలేనివానికి గురువు జ్ఞానాంజనమనెడి శలాకతో (చక్కని జ్ఞానోపదేశముతో) కనువిప్పుగావించును. అట్టి గురుదేవునకు నమస్కరింతును - శ్రీ గురుగీత.

గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం
నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః

అన్ని విద్యలకు నిధియైన వాడు, భవము (జనన మరణముల మధ్య ఉన్న అనుభవము) అనే రోగమునకు వైద్యుడైన వాడు, సమస్తలోకములకు గురువైన వాడు అయిన దక్షిణామూర్తికి నమస్కరింతును -  శ్రీ గురుగీత.

5, జులై 2011, మంగళవారం

స్వామి దయానంద సరస్వతి రచన - భో శంభో శివశంభో స్వయంభో

దయానంద సరస్వతి స్వామి

ఎందరో మహానుభావులు శీర్షికన ఇదివరకే కొన్ని సాహిత్య, సంగీత ప్రధానమైన వ్యాసాలు నా బ్లాగ్ లో రాశాను. గత రెండు దశాబ్దాలలో నా స్మృతిపథంలో ప్రత్యేక స్థానాన్ని ఒక సత్పురుషులు కోయంబత్తూర్ ఆర్షవిద్యాగురుకులాన్ని స్థాపించిన స్వామి దయానంద సరస్వతి (ఆర్య సమాజ్ స్థాపకులు కాదు). ఆయన వేదవేదాంగాలు, ఉపనిషత్తులలో విజ్ఞానాన్నే కాకుండా సంగీత సాహిత్యాభిలాషను, పాండిత్యాన్ని మనకు అందించారు . వారి జీవిత విశేషాలు:

తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని మంజకూడిలో ఒక సాంప్రదాయ కుటుంబంలో, గోపాల్ ఐయ్యరు, బాలాంబాళ్ దంపతులకు 1930 సంవత్సరంలో జన్మించారు. నటరాజన్ గా నామకరణం చేయబడ్డారు. చిద్యాభ్యాసం తరువాత, భారతదేశం గర్వించగిన ఆధ్యాత్మిక సంస్థ చిన్మయ మిషను వ్యవస్థాపకులు స్వామి చిన్మయానంద వారి ప్రసంగాలచే ప్రభావితులైనారు. వారి వద్ద ఆరేళ్ల శిష్యరికం తరువాత 1962 లో సన్యాసం స్వీకరించి దయానంద సరస్వతిగా పేరు పొందారు. తరువాత గురువుల నిర్దేశంతో గుడివాడలో స్వామి ప్రణవానంద వద్ద వేదాంతంలో నిగూఢాలను అభ్యసించారు. చిన్మయ మిషన్ వారి సాందీపనీ సాధనాలయ ద్వారా ఎంతో సేవ చేశారు. అటు తరువాత స్వామి తారానంద గిరి వద్ద బ్రహ్మసూత్రాలను నేర్చారు. విద్యార్థులు వేదాంతము, సంస్కృతము అభ్యసించటానికి ప్రపంచవ్యాప్తంగా మూడు ఆర్షవిద్యా గురుకులాలను అమెరికాలోని పెన్సిల్వేనియా, హృషీకేశ్, కోయంబత్తూర్లలో ఏర్పాటు చేశారు. మూడున్నర ఏళ్ల పాటు ఉండే ఈ శిక్షణా కాలంలో సంస్కృతి మీద దృష్టితో అభ్యాసన జరుగుతుంది. 1990 మొదలు ఇప్పటివరకు ఆరు శిక్షణా కాలాలను పూర్తి చేసి దాదాపు 670కి పైగా సుశిక్షిత వేదాంతాధ్యాపకులను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ సారాన్ని పంచారు . నవీన అభ్యాసపద్ధతికి, ప్రాచీన సిద్ధాంతాలకు మధ్య వారధిలా ఈ తరగతులను ఏర్పరచి కొత్త ఒరవడిని సృష్టించారు దయానంద సరస్వతి. తన ప్రవచనాలు, తరగతుల ద్వారా ఎన్నో లక్షలమంది జీవితాలను ప్రభావితం చేశారు. ఈ తరగతులను ఎన్నో కార్పొరేట్ సంస్థలలో యిచ్చి అక్కడ అనూహ్యమైన మార్పులను తీసుకువచ్చారు. ఇప్పటి భక్తి మరియు శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెళ్లలో అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రవచనాలు మనకు అందజేస్తున్న స్వామి పరిపూర్ణానంద సరస్వతి వీరి శిష్యులే. కాకినాడలో పరిపూర్ణానంద సరస్వతివారు శ్రీ పీఠం పేరిట సమాజసేవలో ఉన్నారు. ఆర్షవిద్యా గురుకలంలా అందించబడే దీర్ఘకాలిక శిక్షణలో భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాంత ప్రకరణాలైన తత్త్వబోధ, ఆత్మబోధ, పంచదశీ, బ్రహ్మసూత్రాలు, పాణినీ వ్యాకరణమనే అంశాలపై 3-1/2ఏళ్ల పాటు శిక్షణ ఉంటుంది.  ఇవేకాక, 1 నుండి 24 వారాల స్వల్పకాలిక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు.

యునెస్కోవారి సమావేశాల్లో, యూఎన్వో వారి ప్రపంచ శాంతి సమ్మేళనంలోను స్వామి దయానంద సరస్వతి ప్రసంగించారు. స్వామి వారు అఖిల భారత సేవా ఉద్యమం పేరిట గ్రామాల్లో విద్య, వైద్యము, పోషకాహారము, మౌలిక వసతులుపై ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామి వారి సుయత్నాలతో భారతీయ ఆధ్యాత్మిక గురువులు, సంస్థలన్నీ కలసి ఆచార్య సభగా ఏర్పడి ఈ ఉద్యమాన్ని నడిపారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో స్వామి వారు పాల్గొని తన ఆధ్యాత్మిక సందేశాన్ని మరియు మార్గాన్ని ప్రపంచం ముందుంచి నడిపిస్తున్నారు. ఆర్షవిద్యాగురుకులం ఎన్నో హిందూ మత అంశాలపై స్వామి వారి భాషణలను పుస్తకాల రూపంలో ప్రచురిస్తోంది.

సుదీర్ఘమైన సనాతన ధర్మ సేవ తరువాత స్వామి వారు 2015 సెప్టెంబరు 23న హృషీకేశ్ దగ్గరి ఆశ్రమమంలో పరమపదించారు. మరణశయ్యపై కూడా పరమాత్మ నామాన్ని నిరంతరం స్మరించిన మహనీయులు దయానంద సరస్వతి.

సంగీతం మోక్షానికి సోపానంగా భావించే స్వామి వారు శాస్త్రీయ సంగీత వికాసానికై ఆర్ష కళారంగం అనే వేదిక ద్వారా ఏటా రెండు మార్లు శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులైన వారికి ఆర్ష కళా భూషణం అనే అవార్డును ప్రదానం చేశారు. సంగీతం ద్వారా శ్రోతలు, కళాకారులు ఈ ప్రాపంచిక విషయాలను దాటి ముక్తి వైపు చూసే అపురూపమైన అవకాశాన్ని పొందుతారని స్వామి వారి ప్రగాఢ విశ్వాసం. సంగీతం ద్వారా భారతీయులు సనాతన ధర్మంతో నిరంతర సాంగత్యం ఏర్పరచుకోగలరని స్వామి వారి నమ్మకం.  స్వామి వారు ఏడు అపూర్వమైన కీర్తనలను రచించారు. వాటిని మహారాజపురం సంతానం గారు మొట్టమొదట గానంచేసి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. వాటిలో ఒకటి మీ కోసం.

ఇటీవలి కాలంలో దక్షిణభారత నృత్య సాంప్రదాయమైన భరతనాట్యంలో చాలా ప్రాచుర్యం పొందిన ఆంశం - భో శంభో శివ శంభో. నృత్యానికి తల్లి వంటిది అయిన శివతాండవములో ఉండే లయ, స్తుతి, శివతత్త్వము ఈ రచనలో ఉన్నాయి. చిదంబరలయుడై ఆ పరమశివుడు నర్తించే విధానాన్ని ఈ కృతి మనకు క్షణం క్షణం గుర్తు చేస్తుంది. రేవతి రాగం, ఆది తాళంలో స్వరపరచబడి, సంస్కృత భాషలో ఈ గీతం వ్రాయబడింది. ఈ కృతిని సంగీత కళానిధి మహారాజపురం సంతానం గారు అద్భుతంగా ఆలాపించారు.వారి గళంలో ఈ కీర్తన వినండి.

సాహిత్యం:

భో శంభో శివశంభో స్వయంభో

గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక |భో శంభో శివశంభో స్వయంభో|

నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ అగమ భూత ప్రపంచ రహిత
నిజగుహనిహిత నితాంత అనంత ఆనంద అతిశయ అక్షయలింగ |భో శంభో శివశంభో స్వయంభో|

ధిమిత ధిమిత ధిమి ధిమికిట కిటతోం
తోం తోం తరికిట తరికిట కిటతో
మతంగ మునివర వందిత ఈశా
సర్వ దిగంబర వేష్టిత వేషా
నిత్య నిరంజన నిత్య నటేశా ఈశా సభేశా సర్వేశా |భో శంభో శివశంభో స్వయంభో|
ఈశా సభేశా సర్వేశా

భావం:

ఓ శివా! స్వయంభూ అయిన శంభో! గంగను ధరించిన శంకరా! కరుణాకరా! మా సంసార సాగరాన్ని దాటించే ప్రభో! గుణములు లేని, పరబ్రహ్మ స్వరూపా! పోవుట, వచ్చుట (జనన మరణములు) మొదలైన ప్రాపంచిక విషయాలకు అతీతమైన శంభో! లక్షణాలకు అతీతమైన, ఆంత్యము కలిగిన వాటికి అతీతమైన ఆనంద స్వరూపా! అతిశయా! క్షయము లేని లింగ స్వరూపా! ధిమి ధిమి లయ ధ్వానములతో నర్తించే, మతంగ మునిచే పూజించబడిన ఈశా! దిక్కులు, ఆకాశమే వస్త్రములుగా కల, సత్య రూపములో అగుపించని, ఎల్లప్పుడూ మచ్చలేకుండా శుద్ధ స్ఫటికంలా ఉండే, ఎల్లప్పుడూ నటిస్తూ ఉండే శంకరా! సభకు ఈశ్వరా! అందరికీ ఈశ్వరా!

పరిశీలన:

శివతత్త్వంలో ముఖ్యలక్షణాలు - కాలాతీతమైన శివుడు, లయకారకుడు, భక్త వశంకరుడు, శుద్ధచైతన్య స్వరూపమైన వాడు. వీటిని ఆధారం చేసుకొని ఎన్నో స్తోత్రాలు వేల సంవత్సరాలుగా ఆది శంకరుల నుండి నేటి సమకాలిక భక్తి గీతాలు, కృతుల వరకు వస్తూనే ఉన్నాయి. కానీ, ప్రతి ఒక్క రచన అనుపమానంగా నిలిచాయి. దయానంద సరస్వతుల వారు ఈ కృతిలో శుభంకర తత్త్వ లక్షణాలతో మొదలుకొని, సచ్చిదానంద తత్త్వ వర్ణనలైన గుణరాహిత్యము, పరబ్రహ్మము, శాశ్వతము, అనంతము, ఆనందాతిశయము అనే ఆధ్యాత్మిక నిజ లక్షణాలను మొదటి చరణంలో అక్షరమాలగా అందించారు. రెండవ చరణంలో లయకారుని మొదటి లక్షణమైన తాండవహేల, సర్వవ్యాపినమీశ్వరం అనే తత్త్వాన్ని చాటే దిగంబర లక్షణం, వెండికొండవలె మచ్చలేని శుద్ధ స్పటిక సంకాశ తత్త్వము, సర్వేశ్వర తత్త్వములను మాలికలా అందించారు.

సంతానంవారు ఈ కీర్తనను గానం చేస్తుంటే శివుడు నాట్యం చేస్తూ దర్శనమిచ్చాడని నానుడి. ఎంత హృద్యంగా గానం చేశారో విని తరించండి. తమిళనాడులోని చిదంబర నటరాజ మందిరంలో ఈ గానం చేసినప్పుడు శ్రోతలు ఆనందబాష్పాలు రాల్చారని సంగీతప్రియులు చెప్పుకుంటారు. నృత్య ప్రదర్శనలలో లోతైన అంశంగా వీక్షకులను ఆకర్షించే లక్షణాలన్నీ అత్యున్నత స్థాయిలో ఉన్న కీర్తన ఇది. అందుకే గాయకుల నోట అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇంత మంచి రచన మనకు అందించినందుకు దయానంద సరస్వతి స్వామి వారికి శత సహస్ర వందనాలు.

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం

దేహి తవ పద భక్తిం - త్యాగరాజస్వామి కృతి

దేహి తవ పద భక్తిం! వైదేహి! పతిత పావని మే సదా! ఐహికాముష్మిక ఫల దే! కమలాసనాన్యజ వర జనని! కలశవారాశిజనితే! కనక భూషణ లసితే! కలశజ గీత ముదితే! కాకు...