RightClickBlocker

28, జులై 2011, గురువారం

తత్త్వము - ఏమిసేతురా లింగా ఏమి సేతురాతత్త్వమనగా మానసిక స్థితి యొక్క బాహ్య ప్రతిబింబం. మరి భగవంతుని నుతించటానికి రాగ లక్షణ యుత స్వర కీర్తనలతో పాటు పామరుడి నోట వినిపించే ఆలాపనలు, పదాలు, వాక్యాలు కూడా సమార్హమైనవే. విద్య నేర్చినవాడు సర్వ లక్షణ సంపన్నమైన కృతి అనే శిలను మలిస్తే, తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ అందులో కలిగిన భావనను అందమైన సరళమైన పదాలలో కూనిరాగాలు తీస్తాడు. రెండింటిలోనూ సర్వాంతర్యామి సర్వవ్యాపకతను, ఈ శుద్ధంకాని ఆత్మకు, పరిశుద్ధాత్మకు గల సంబంధం, దాని వైవిధ్యము, సారూప్యములను ప్రతిబింబుస్తుంది. చాలా సార్లు ఇలా కూనిరాగాలలో వచ్చే భావం కళ్ల ముందు జరిగే దురాచారాలను, మనుషుల దురాలోచనలు, దుశ్చర్యలను సున్నితంగా విమర్శించటం, ఇంకొంత పై స్థాయికి ఎదిగి చూడండి అని సలహా ఇవ్వటం వీటి లక్ష్యం.

ఇటువంటి సామాన్యుని భావనలో లోతైన ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంటుంది. జీవకోటి పరిశీలన, పరిధిలో గిరిగీచుకుని ఉన్న మానవుడు భగవంతుని అనుభూతి పొందటానికి ఎంత దూరంలో ఉంటాడో, బాహ్య శుద్ధి కొరకు ఏర్పాటు చేసుకున్న కట్టుబాట్లు, ఆచారాలు మనలను మూఢత్వానికి దగ్గరచేసి, దైవత్వానికి మరింత దూరం చేస్తుందనే భావనను ఈ పామర మనోభావాలు వ్యక్త పరుస్తాయి. అలాగే, మట్టిలో మాణిక్యాలలా, విద్యలేని ఎంతో మంది మానవులు జీవన సత్యాన్ని తెలుసుకొని పాడుకునే భావన కూడా ఈ కోవకు చెందినదే.

జనన మరణాల మధ్య సాగే నాట్లకమే జగత్తు (జాయతే త్రాయతే ఇతి జగత్) . మరి అంతా నాటకమైతే, నిజమేమిటి? అదే శాశ్వతమైన నిర్మలమైన పరమానందకరమైన 'సచ్చిదానంద పరబ్రహ్మము'. మరి జన్మ ఎందుకు? మన మన పూర్వ జన్మల కర్మలవలన, శేష ఋణాల వలన, గొప్ప గొప్ప ఆత్మలకు ఒక మహోన్నత లక్ష్య సాధన కొరకు. కాబట్టి నట్ట నడిమీ కలి నాటకము అని అన్నమాచార్యులు అన్నట్లు, ఈ నాటక జగత్తులో మన ప్రధాన లక్ష్యం మనలను మనం తెలుసుకోవటం. ఇందులో కర్తవ్యపాలన, సత్ప్రవర్తన, బంధ విముక్తి, ఉపాసన ద్వారా అంతరాత్మను తెలుసుకోవటం. దీనికి ఒక జన్మ సరిపోకవచ్చు. కానీ, ఫలము మూటగట్టుకుంటూనే ఉంటుంది. సద్గురువు కృపతో, సత్సాంగత్యముతో, సర్వస్య శరణాగతితో ఈ మోక్షమార్గ పయనాన్ని సుగమం చేసుకోవచ్చు.

బైరాగులు, యోగులు, దార్శనికులు, పిచ్చివారిలా కనిపించే మహా జ్ఞానుల నోట ధారాళంగా వెలువడిన మాటల మూటలే తత్త్వాలు. లోకంలో అజ్ఞానమనే అంధకారంలో కొట్టుమిట్టాడుతు ఉండే మానవ కోటికి వారి బుద్ధి స్థాయికి అర్థం అయ్యేలా జీవన సారాన్ని అరటి పండు వలిచినట్లు తేటతెల్లం చేసే భావ వ్యక్తీకరణలే తత్త్వాలు. ఎన్నో లక్షలమంది ఈ భారతదేశంలో ఈ తత్త్వాలు వెలువరించారు. అందులోని భావం, సారం ఒక్కటే. శాశ్వతమైన దాని కనుగొను. అశాశ్వతమైన దాని మీద మమకారం వీడుము. నీ మార్గంలో ముళ్లు నీ మనసులోని సంకెళ్లే. ఈ సందేశంతో సాగే కొన్ని తత్త్వాలను మహనీయులు గురువులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ఆకాశవాణి ద్వారా బహుళ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. లలిత సాహిత్యానికి తన గానం ద్వారా జీవాన్ని పోసి, భావాన్ని అణువణువునా కురిపించిన గురువుగారికి శతసహస్ర పాదాభివందనాలు. శిలయైన పదానికి గాన రూపంలో ఆత్మయై చైతన్యరూపాన్ని ఇచ్చిన మహానుభావులు బాలమురళిగారు. ఆయన నిరంతర గానామృతంలో తెనుగుజాతికి తడిసి మురిసి తరించినట్లే. ఆయన పాడిన తత్త్వాలలో ఒక గొప్ప గీతాన్ని పరిశీలిద్దాం.

ఏమిసేతురా లింగా ఏమి సేతురా

గంగ ఉదకము తెచ్చి నీకు లింగపూజలు సేతమంటే
గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నావి లింగా మాహానుభావ మాదేవ శంభో మాలింగమూర్తీ |ఏమి సేతురా|

అక్షయావులు పాడి తెచ్చి అరిపితము చేదమంటే
అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాది లింగా మాహానుభావ మాదేవ శంభో మాలింగమూర్తీ |ఏమి సేతురా|

తుమ్మి పూవులు తెచ్చి తుష్టుగా పూజేదమంటే
కొమ్మకొమ్మకు కోటి తుమ్మెదలెంగిలంటున్నాయి లింగా మాహానుభావ మాదేవ శంభో మాలింగమూర్తీ |ఏమి సేతురా|


బాలమురళి వారు పాడిన తత్త్వాలలో మకుటం వంటిది ఏమి సేతురా లింగా. సంగీత జ్ఞానం లేనివానికి, ఆస్తికునికి, నాస్తికునికి, తత్త్వవేత్తలకు, పౌరాణికులకు, పండిత పామరులకు అందరినీ అలరించిన గీతం ఇది. ఇందులో రెండు అంచెల భావాలు దాగి ఉన్నట్లు అనిపిస్తుంది. మొదటిది శివునికి విన్నపంలా స్ఫురిస్తుంది. ఈ లోకంలో నీకు ఇష్టమైన పూజాద్రవ్యాలైన గంగనీరు, ఆవుపాలు, తుమ్మి పూలు తెచ్చి పూజచేద్దామనుకుంటే ఆ పావన గంగలోని జీవరాశి, అమ్మపాలు త్రాగే లేగదూడలు, తుమ్మిచెట్టున ఉండే తుమ్మెదలు ఎంగిలంటున్నాయి. ఏమి చేయను నేను' అనే ఒక అమాయకమైన, పరిపూర్ణంగా శుద్ధమైన భక్తి నివేదనా భావం, రెండవది - ఇవన్నీ చాలా పవిత్రమైనవి, ఇవి సమర్పించుకుంటేనే శివుడు కరుణిస్తాడు అన్న భావనతో ఉన్న వారికి కనువిప్పు. నిజంగా కావలసినది శుద్ధ అంతఃకరణము, శరణాగతి. ఇవి ఉంటే, గంగనీరైనా, బావి నీరైనా, ఆవుపాలు ఉన్నా లేకున్నా, తుమ్మి పూవులైనా, ఇంకొక పూవైనా, ఏమీ లేకపోతే ధవలాక్షతలైనా సరే ఆ శివుడు ప్రీతి చెందుతాడు. ఎందుకంటే ఆయన బోళా శంకరుడు. సాద్గుణ్యత ముఖ్యము. నమ్మకము,  నిర్మోహము, నిరంహకారము ముఖ్యము. అంతేకానీ, ఇవిలేకుండా, మేలి పాడియావు పాలు, ఆమల భాగిరధి జలాలతో అభిషేకం చేసినా ఉపయోగం ఉండదు. అన్నీ నీ వలననే, అన్నీ నీకే, అన్నీ నీవే అని ఆత్మ నివేదన చేసుకోవటం ప్రధానం. వస్తుసంపద కన్నా గుణ సంపద మిన్న అన్నది ఈ గీతం యొక్క అంతరార్థం. ఎందుకంటే, మనం మేలిమి అనుకునే ప్రతి వస్తువుకూ ఏదో ఒక మాలిన్యం అంటుకునే ఉంటుంది.

ప్రపంచంలో లయకారకుడైన శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదే? మరి ఈ విశ్వంలో జరిగే లీలలు, మాయలు, మంచి, చెడూ అన్నిటా ఆ సర్వేశ్వరుడే. జటాఝూటములు ధరించే శివుని వ్యుప్తకేశాయచ (అంటే గుండు కలిగిన వాడు) అని చమకంలో స్తుతించారు. కాబట్టి, చాలా మటుకు మనం అనుకునే మంచి, చెడు, శుద్ధం, అశుద్ధం మానవ కల్పితములే. కావలసినది మన ఆలోచనలో, ఆచరణలో సచ్ఛీలత. శంకరులు శివమానసపూజా స్తోత్రంలో (నేను ఇదివరలో రాసిన వ్యాసం)  పూజా విధానంలో జరిగే వివిధ ఉపచారములు, నివేదనలన్నీ మానసికంగానే చేస్తున్నాను, నా సంకల్పములనే నిజమైన ఉపచారములుగా భావించి నన్ను రక్షించు, కరుణించు అని అద్భుతమైన ఐదు శ్లోకాలలో నుతిస్తాడు. మరి అపర శంకరులైన ఆ శంకరభగవత్పాదుల నిజాంతరంగమును తెలుసుకొని నడచుకుందాం.

ఇంతమంచి తత్త్వాన్ని మనకు వాడుక తెలుగులో అందించిన ఆ సహృదయులకు (కవి ఎవరో తెలియదు) శిరసు వంచి పాదాభివందనము చేస్తున్నాను. అలాగే, ఆ గీతాన్ని అజరామరం చేసిన బాలమురళీకృష్ణగారికి హృదయాంజలి. బాలమురళి గారు గానంలో ఈ తత్త్వం.

2 వ్యాఖ్యలు:

  1. SASIKALA VOLETY, Visakhapatnam.29 నవంబర్, 2015 9:55 AMకి

    ఏమీ సేతురా లింగా! బాల మురళి గారి ప్రతి కచ్చేరీ లో పాడతారు. అక్షయావులు-అభిషేకము, తమ్మి పూవులు - తృప్తిగా పూజేద మంటే. అని పాడే వాళ్ళం. మంచి తత్వం. ధన్యవాదాలు


    ప్రత్యుత్తరంతొలగించు