ఈ శ్రీనివాసుడే శివుడు, ఈతడే బ్రహ్మదేవుడు, సకల దేవతా స్వరూపుడైన ఈ శ్రీకృష్ణునికి నీవు చేసే పనులు ఎంతటి గొప్పవని భావిస్తున్నావు? అసంఖ్యాకమైన బ్రహ్మాండ సమూహాలను తన ఉదరంలో ఇముడ్చుకున్న మహిమాన్వితుడు ఈతడు. అటువంటి పరమాత్మ పూతన చనుబాలలోని విషాన్ని తాగినంత మాత్రాన ఆయనకు ఏమి అవుతుంది? అదంతా ఆయనకు ఒక చిన్న ఆట మాత్రమే కదా! ప్రళయకాలంలో సమస్త సముద్రాలు ఏకమై ఉప్పొంగినప్పుడు కూడా వాటిపై ఆనందంగా శయనించేవాడు ఈతడు. అటువంటి మహాబలశాలి బాలకృష్ణునిగా రెండు మద్ది చెట్లను పెకలించి పడవేసినంత గొప్ప బలవంతుడని భావించి కొనియాడుతున్నారు కదా! ఈతడే దేవతలందరికీ దేవుడైన శ్రీవేంకటేశ్వరుడు. సకల విధాలా పరిపూర్ణుడు, తన స్వరూపం నుండి ఎన్నటికీ చ్యుతి చెందని అచ్యుతుడు, జన్మరహితుడు. తనను శరణు వేడిన వారందరినీ రక్షించేవాడు అనే పరమసత్యాన్ని మనసులో నిలుపుకొని, ఆయనను భక్తితో కొనియాడవలెను.
బిలహరి రాగంలో స్వరపరచబడిన ఈ అన్నమాచార్యుల వారి కృతిని గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి