7, నవంబర్ 2026, శనివారం

హారతి గైకొనవే జననీ - సాంప్రదాయ మంగళహారతి గీతం


హారతి గైకొనవే జననీ నీరజనాభుని ప్రియరమణీ 

కలకలమను కళగలిగిన శ్రీసతి మోమున దీపపు కాంతులవే
చందనకుందసుగంధసుమమ్ములు ముత్తెపుసరములివే జననీ 

హారతి గైకొనవే జననీ నీరజనాభుని ప్రియరమణీ  

కలవరముల కలహంసల వికసితపంకజమధ్యవిహారిణివే
వీణాగానసరస్వతి భారతి చతురాననురాణీ జననీ  

హారతి గైకొనవే జననీ కమలసంభవుని అలివేణీ

గజవదనుని శివతేజుని హరునితో కొలువై విలసిలు హైమవతీ
అజనీరజనాభుడు అమరేంద్రుడు కొలువగ వచ్చినదే జననీ

హారతి గైకొనవే జననీ జయజగదీశ మనోహారిణీ 

ముగురమ్మల మూలపుటమ్మవు నీవే జయమగు మంగళహారతులు
మోహనగానసుధారసధారలు సుస్వర సుమములివే జననీ

హారతి గైకొనవే జననీ త్రిభువనకారిణి భవతారిణీ   

పద్మనాభుడైన శ్రీమహావిష్ణువు ప్రియపత్నివైన శ్రీమహాలక్ష్మీదేవీ! ఈ మంగళహారతిని స్వీకరించవే తల్లీ! కళకళలాడే సౌందర్యంతో ప్రకాశించే నీ మంగళముఖానికి ఈ దీపకాంతులను సమర్పిస్తున్నాము. చందనపు పరిమళాలతో, మల్లెపూల సుగంధాలతో నిండిన పుష్పాలను, ముత్యాల హారాలను నీకు సమర్పిస్తున్నాము జననీ! కలకలలాడే రాజహంసల మధ్య, వికసించిన పద్మాలలో విహరించే సరస్వతీదేవీ! వీణాగానంతో అలరించే వాగ్దేవివి, చతుర్ముఖ బ్రహ్మదేవుని పట్టపురాణివి అయిన నీకు మంగళహారతిని సమర్పిస్తున్నాము తల్లీ! కమలంలో జన్మించిన బ్రహ్మదేవుని ప్రియసఖివైన అలివేణీ! ఈ హారతిని స్వీకరించవే! గజాననుడైన గణపతికి, శివతేజస్సుతో ఉద్భవించిన కుమారస్వామికి తల్లివై, పరమశివునితో కలిసి కొలువుదీరి ప్రకాశించే హైమవతీ! నీ దివ్యసన్నిధిలో బ్రహ్మదేవుడు, పద్మనాభుడైన విష్ణుమూర్తి, దేవేంద్రుడు నిన్ను సేవించడానికి విచ్చేశారు తల్లీ! జగదీశ్వరుడైన పరమశివుని మనోహారిణివైన పార్వతీదేవీ! ఈ మంగళహారతిని స్వీకరించవే! లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ అనే ముగ్గురమ్మలకూ మూలమైన ఆదిపరాశక్తివి నీవే తల్లీ! నీకు జయప్రదమైన మంగళహారతులను సమర్పిస్తున్నాము. మనోహరమైన గానామృత ధారలను, మధురమైన స్వరాలనే పుష్పాలను నీ పాదాల చెంత అర్పిస్తున్నాము జననీ! మూడు లోకాలకు సృష్టికారిణివై, సంసారసాగరం నుండి భక్తులను తరింపజేసే భవతారిణివైన జగన్మాతా! మా భక్తితో సమర్పించే ఈ మంగళహారతిని స్వీకరించవే తల్లీ!

కాపీ రాగంలో స్వరపచబడిన ఈ సాంప్రదాయ మంగళహారతి గీతాన్ని కోటంరాజు శిరీష గారు నేర్పించి ఆలపించారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శ్రీ శంభు తనయునకు జయమంగళమనరే - వినాయకునికి మంగళ హారతి

శ్రీ శంభు తనయునకు జయమంగళమనరే సిద్ధి వినాయకునకు శుభమంగళమనరే శ్రీ శంభు తనయుని సిద్ధి గణనాథుని విఘ్నాలకధిపతి ఆ దేవదేవుని సురుచిరముగ భాద్రపద శుద...