చమత్కారపురమున (తిరువారూరులో) నివసించేవాడును, పార్వతీదేవికి ప్రియమైనవాడును, తనను నిత్యము ఆశ్రయించువారికి కల్పవృక్ష సమూహమువలె కోరిన వరములను ప్రసాదించేవాడును, శరణు వేడిన దేవతా సమూహముచే సేవింపబడేవాడును, నెయ్యితో అభిషేకించబడుటవలన ప్రత్యేక నామధేయమును పొందినవాడును, చిదానందామృత ప్రవాహ స్వరూపుడును అయిన అచలేశ్వరుని నేను నిరంతరము ధ్యానించుచున్నాను. చమత్కారపుర పాలకులైన రాజులు మొదలైనవారికి అనుగ్రహములను ప్రసాదించుటలో అత్యంత సమర్థుడైన మహాలింగ స్వరూపుడును, నీడలేని దీపకాంతితో ప్రకాశించే గర్భగృహ మధ్యమున విరాజిల్లేవాడును, సమస్త దుఃఖములకు కారణమైన సంసారసాగర భయమును తొలగించేవాడును, శమము, దమము, ఉపరతి మొదలైన ఆధ్యాత్మిక సాధనాసంపత్తులతో కూడిన సాధుజనుల హృదయకమలములలో తుమ్మెదవలె విహరించేవాడును, కమలమున జన్మించిన బ్రహ్మదేవుని జయించినవాడును, గుర్రమును ధరించినవాడును, కరుణారసమనే అమృతసముద్రములో ఉప్పొంగే తరంగ స్వరూపుడును, కమలమున నివసించే లక్ష్మీదేవికి పతియైన శ్రీమహావిష్ణువుచే స్తుతింపబడేవాడును, వృషభమును వాహనముగా కలిగినవాడును, కమలమువంటి ముఖము కలిగిన గురుగుహునికి అత్యంత ఆత్మీయుడును అయిన ఆ అచలేశ్వర మహాదేవుని నేను భక్తితో ధ్యానించుచున్నాను.
భూపాల రాగంలో స్వరపరచబడిన ఈ ముత్తుస్వామి దీక్షితుల వారి తిరువారూర్ పంచలింగ కృతిని హైదరాబాద్ సోదరులు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి