సమస్త జగత్తుకూ తల్లివైన ఓ జగదంబా! శంఖమువంటి సుందరమైన కంఠము గల పరమేశ్వరుని పట్టపురాణివైన కళ్యాణీ! నీకు మా శతకోటి వందనములు. వేదములకే జన్మనిచ్చిన ఆదిపరాశక్తివి, సకల ఐశ్వర్యములకు మూలమైన ఆదిలక్ష్మివి, తపస్సుకై ఆకులను సైతం ఆహారంగా స్వీకరించని అపర్ణవు నీవే. మమ్ములను సదా రక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాము. పారిజాత పుష్పముల సౌందర్యమును, సౌకుమార్యమును మించిన నీ పాదపద్మములకు నమస్కరించుచున్నాము. ఫాలభాగమున మూడవ కన్ను కలిగిన పరమశివుని అర్ధాంగివైన పార్వతీ! కుండలములతో ప్రకాశించు నీ కర్ణములకు, దుష్టశక్తులను సంహరించు చాముండేశ్వరీ స్వరూపమునకు వందనములు. కంకణములతో శోభిల్లుచున్న నీ కరములు భక్తులకు అభయమును, వరములను ప్రసాదించు కరుణామృత హస్తములు. గరళమును కంఠమున నిలిపిన నీలకంఠుని ప్రియపత్నివైన కామాక్షీ! నీకు ప్రణామములు. అమూల్యమైన మణులతో ప్రకాశించు నీ కిరీటము నీ సర్వలోకాధిపత్యమునకు ప్రతీక. మలయాచలమున నివసించు మహేశ్వరీ! పరమేశ్వరుని పట్టమహిషివైన భర్గరాణీ! నిన్ను భక్తిపూర్వకముగా స్తుతించుచున్నాము. భక్తులకు వర్గములనగా ధర్మార్థకామాది ఐహిక పురుషార్థములను, అపవర్గమనగా జననమరణ బంధముల నుండి విముక్తినిచ్చు మోక్షమును ప్రసాదించు పరమకరుణామయివి నీవే. దుర్గతులను తొలగించి సద్గతులను ప్రసాదించు దుర్గవు, విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గవు నీవే. జగన్మాతవైన నీ దివ్యరూపమునకు శిరసా వందనము చేయుచున్నాము.
శంకరాభరణం రాగం ఆధారంగా స్వరపరచబడిన ఈ గీతాన్ని గీతాంజలి బృందం ఆలపించారు.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి