శేషాచల పర్వత శిఖరాగ్రాన వెలసి, పాపమనే చీకటిని సూర్యునివలె తొలగించే పరమాత్ముడైన శ్రీ వేంకటేశ్వరస్వామికీ, ఆయనను ఎన్నడూ విడువకుండా నిత్యమూ తోడుండి భక్తులను ఆదరించే జగన్మాత అలమేలుమంగమ్మకూ జయమంగళాలు, నిత్యశుభమంగళాలు కలుగుగాక! శరణు వేడిన భక్తులకు తప్పక వరాలిస్తానని బిరుదు ధరించిన పరదైవం శ్రీనివాసుడు. ఆ బిరుదును ఎప్పటికీ మరువకుండా, తనను ఆశ్రయించిన భక్తులను నిరంతరం కాపాడాలని స్వామిని ప్రేమతో గుర్తుచేస్తూ, ఆయన భక్తరక్షణ ధర్మాన్ని మరువనీయని కరుణామయి అలమేలుమంగమ్మ. తిరుమలలోని ఆనందనిలయంలో నిత్యమూ నివసిస్తూ దీనులను, ఆర్తులను రక్షించే స్వామికీ, భక్తులు సమర్పించిన కానుకలతో తన ప్రియపతిని ఘనంగా సత్కరించే అమ్మవారికీ మంగళములు కలుగుగాక! తనను ఆశ్రయించిన మానవులకు వరాలనిచ్చి, వైకుంఠాన్ని అరచేతిలో చూపించినంత సులభంగా మోక్షమార్గాన్ని ప్రసాదించే జగదాత్ముడైన శ్రీహరికీ, భక్తులకు సిరిసంపదలను అనుగ్రహించడం తన బాధ్యతగా స్వీకరించి, స్వామి వక్షస్థలంపై నిత్యమూ కొలువై ఉన్న క్షీరసాగరతనయ అయిన మహాలక్ష్మికీ శుభమంగళములు కలుగుగాక! భక్తులను ముడుపులు సమర్పించమని చనువుతో అడిగి స్వీకరించే అచ్యుతునికీ, తన బిడ్డలందరికీ ప్రేమతో మధురమైన పాకాలను సిద్ధం చేయించి, ఏ భేదభావమూ లేకుండా అందరికీ ప్రసాదంగా అందించే మహామాతకూ మంగళములు కలుగుగాక! తిరుమల క్షేత్రంలోని చిత్రవిచిత్రమైన శిల్పకళతో అలరారే మంటపాలకు, పవిత్రమైన తిరువీధులకు, దివ్యతీర్థాలకు, బంగారు గోపురాలకు, ప్రాకారాలకు, స్వర్ణశిఖరాలకు, యాత్రికులకు అన్నదానాదులతో సేవలందించే ధర్మసత్రాలకు, పండ్లు పూలతో శోభిల్లే ఉద్యానవనాలకు, ధాన్యాదులను భద్రపరిచే ఉగ్రాణాలకు, ధనసంపదలను నిల్వచేసే బొక్కసాలకు, నైవేద్యాలను సిద్ధం చేసే పాకశాలలకు నిత్యశుభమంగళములు కలుగుగాక! గరుడాది వాహనాలకు, ఉత్సవాలలో ఉపయోగించే గొడుగులకు, మకరతోరణాలకు, వివిధ ధ్వజాలకు, మంగళవాద్యాలకు, స్వామివారి దివ్యకల్యాణాలు జరిగే వేదికలకు మంగళములు కలుగుగాక! స్వామివారి శంఖచక్రాది దివ్యాయుధాలకు, మణిమయమైన ఆభరణాలకు, పట్టుపీతాంబరాలకు, దివ్యమైన హస్తపాదాది అవయవాలతో సర్వశుభాలను ప్రసాదించే శ్రీ వేంకటేశ్వరుని మంగళవిగ్రహానికి జయమంగళములు కలుగుగాక! స్వామివారి అపారమైన జ్ఞానానికి, అనంతమైన కల్యాణగుణాలకు, అచింత్యమైన మహిమలకు, ఆయనను పరివేష్టించి సేవించే పరివారదేవతలకు, నిత్యమూ స్వామిసేవలో నిమగ్నమై ఉండే సేవకులందరికీ శుభమంగళములు కలుగుగాక! బ్రహ్మోత్సవాది మహోత్సవాలకు, నిత్యకల్యాణోత్సవాలకు, సమస్త విశ్వాన్ని పరిపాలించే ఆ పరమాత్ముని దివ్యవైభవానికి, తిరుమలలోని పవిత్రమైన విమానాలకు మంగళములు కలుగుగాక! తరిగొండలో నరసింహస్వామిగా వెలసి భక్తులందరికీ వరాలను ప్రసాదించే శ్రీహరికీ, విశ్వమంతటా వ్యాపించి ఉన్న ఆ పరమాత్ముని తనపై ధరించి, ఆయన సాన్నిధ్యంతో సకల సంపదలకు నిలయమై ప్రకాశించే శేషాచల పర్వతానికీ నిత్యశుభమంగళములు కలుగుగాక!
తరిగొండ వేంగమాంబ రచించిన ఈ మంగళహారతిని ఎం ఎం కీరవాణి మధ్యమావతి రాగంలో స్వరపరచగా ఆవిడ పేరుతో విడుదలైన చిత్రంలో పొందుపరచారు. ఈ హారతిని సాహితి, గీతామాధురి, రమ్య బెహరా, శ్రీసౌమ్య ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి