ఓ శ్రీమహాలక్ష్మీ! ఎంతటి అపురూపమైన సౌందర్యరాశివి తల్లీ! సకల శుభలక్షణాలతో, దివ్యమైన తేజస్సుతో ప్రకాశించే నీ అందాన్ని వర్ణించడం మా తరమా! మేము భక్తిశ్రద్ధలతో సమర్పించే ఈ మంగళహారతిని ప్రేమతో స్వీకరించుమమ్మా! ఎల్లప్పుడూ శ్రీమహావిష్ణువు వక్షస్థలంలో నివసించే ఓ హరిప్రియే! ఒక్కసారైనా మా ఇంటికి విచ్చేసి నీ దివ్యసాన్నిధ్యంతో మా గృహాన్ని పావనం చేయుమమ్మా! ముత్తయిదువులకు సమర్పించే పసుపు, కుంకుమ, పూలు, గాజులు మొదలైన మంగళద్రవ్యాలతో కూడిన వాయనాన్ని నీకు సమర్పించి, నిన్ను సాక్షాత్తూ మా ఇంటి ఆడపడుచుగా భావించి ప్రేమతో పూజించుకుంటామమ్మా! నీ అపారమైన కరుణతో మాపై కనకవర్షం కురిపించి, సిరిసంపదలను ప్రసాదించుము తల్లీ! అయితే నీవు ప్రసాదించిన సంపదను కేవలం స్వార్థప్రయోజనాల కోసం కాకుండా, ధర్మబద్ధంగా, సద్వినియోగం చేస్తూ, సత్కార్యాలకు, దానధర్మాలకు వినియోగిస్తామని నీకు మాట ఇస్తున్నామమ్మా! మా కుటుంబాలలోని స్త్రీలకు నిత్యసౌమాంగల్యాన్ని, ఆయురారోగ్యాలను, సుఖశాంతులను ప్రసాదించి, మా గృహాలలో సిరిసంపదలతోపాటు ప్రేమానురాగాలు, శుభమంగళాలు శాశ్వతంగా నిలిచేలా అనుగ్రహించుము తల్లీ! నీ కరుణాకటాక్షాలే మా జీవితాలకు ఆధారమని నమ్మి, నిత్యమూ నిన్ను సేవిస్తూ, నీ దివ్యనామాన్ని స్మరిస్తూ జీవిస్తామమ్మా!
శోభారాజు గారు రచించి శ్రీ రాగంలో స్వరపరచిన ఈ లక్ష్మీదేవి మంగళహారతి గీతాన్ని గీతాంజలి బృందం ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి