5, నవంబర్ 2026, గురువారం

మా రామచంద్రునికి జయ మంగళం - త్యాగరాజస్వామి కృతి



మా రామచంద్రునికి జయ మంగళం
ఘోరభవనీరనిధితారకునికి మంగళం 

మారుని కన్న రాజకుమారునికి మంగళం
మారు లేని హరికి ముమ్మారు జయ మంగళం

బాహులేయాప్తునికి సుబాహు వైరికి మంగళం
బాహుజశూరుడాజానుబాహునికి మంగళం

బృందావన స్థిత మౌని బృందావనునికి మంగళం
బృందాలోలునికి పాలిత బృందారకునికి మంగళం

రాజవేషునికి రాజరాజార్చితునికి మంగళం
రాజధరుడగు త్యాగరాజనుతునికి మంగళం 

మా రామచంద్రునికి జయమంగళం! భయంకరమైన సంసారమనే మహాసముద్రాన్ని దాటించి తరింపజేసేవానికి మంగళం! మన్మథుని తండ్రి శ్రీహరి అవతారమైన వానికి, రాజకుమారుడైన శ్రీరామునికి మంగళం! సాటి లేని శ్రీహరికి మూడుమార్లు జయమంగళం! కుమారస్వామికి ప్రియమైనవాడైన నారాయణునికి, సుబాహు అనే రాక్షసుని శత్రువైనవానికి మంగళం! క్షత్రియవీరుడైన, మోకాళ్ల వరకు పొడవైన బాహువులు కలిగిన వానికి మంగళం! బృందావనంలో నివసించే మునుల సమూహానికి ఆనందాన్ని కలిగించే కృష్ణునికి మంగళం! లక్ష్మీదేవి రూపమైన తులసీదేవి పట్ల ప్రీతి కలిగినవానికి, దేవతాసమూహాన్ని రక్షించేవానికి మంగళం! రాజవేషధారియైనవానికి, మహారాజులచే పూజింపబడేవానికి మంగళం! చంద్రుని ధరించిన పరమశివునిచే ఆరాధింపబడేవానికి, త్యాగరాజస్వామిచే స్తుతింపబడేవానికి మంగళం!  

కేదారగౌళ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి పర్యవేక్షణలో గాయనీగాయకులు బృందగానంగా ఆలపించారు.    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పతికి మంగళ హారతిరే - త్యాగరాజస్వామి కృతి

పతికి మంగళ హారతిరే భామలార నేడు సాకేత మతికి సొంపు కలుగ జేయు సద్గుణ తతికి మానవతి సీతా కామాది రిపు విదారికి హరికి సామాది నిగమచారికి సూర్య సోమాక...