నాగలింగం భజేऽహం అనాది లింగం భజేऽహం
ఆదియంతములు లేని శ్రీనాగలింగేశ్వరుని నేను భజించుచున్నాను. నాగవల్లీదేవితో కూడినవాడును, పర్వతరాజపుత్రికయైన పార్వతీదేవిని తన శరీరములో అర్ధభాగముగా ధరించినవాడును, నందీశ్వరుని వాహనముగా కలిగినవాడును, ఆగమములు, శాస్త్రములు, పురాణములలో కొనియాడబడినవాడును, అజ్ఞానమును నశింపజేసేవాడును, అత్యంత ధవళవర్ణమైన దేహము కలవాడును అయిన పరమేశ్వరుని నేను భజించుచున్నాను. స్థూల, సూక్ష్మ, కారణ శరీరములకు ఆత్మస్వరూపమైన లింగముగా విరాజిల్లేవాడును, సుఖములను ప్రసాదించే సుందర లింగస్వరూపుడును, సమస్త సృష్టికి మూలభూతుడును, ప్రాకృతమైన పదార్థములకు అతీతమైన లింగస్వరూపుడును, మునిగణములచే, అష్టనాగులచే ఆరాధింపబడేవాడును, నీలవర్ణమైన కంఠము కలవాడును, గురుగుహుడైన సుబ్రహ్మణ్యునికి అత్యంత ప్రియమైనవాడును, నిత్యశుద్ధ స్వరూపుడును, చేతిలో లేడిని ధరించినవాడును, కాలుని సంహరించినవాడును, శిరస్సున గంగాదేవిని ధరించినవాడును, కరుణాపూరితమైన కడగంటి చూపులు కలవాడును, మన్మథుని జయించినవాడును అయిన శ్రీ నాగలింగేశ్వరుని నేను భక్తితో ఆరాధించుచున్నాను.
శంకరాభరణం రాగంలో స్వరపరచబడిన ఈ ముత్తుస్వామి దీక్షితుల వారి కృతిని ఓఎస్ త్యాగరాజన్ ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి