7, నవంబర్ 2026, శనివారం

శ్రీ శంభు తనయునకు జయమంగళమనరే - వినాయకునికి మంగళ హారతి


శ్రీ శంభు తనయునకు జయమంగళమనరే
సిద్ధి వినాయకునకు శుభమంగళమనరే
శ్రీ శంభు తనయుని సిద్ధి గణనాథుని
విఘ్నాలకధిపతి ఆ దేవదేవుని

సురుచిరముగ భాద్రపద శుద్ధ చవితి యందు
పాసగ సజ్జనులచే పూజలనంది
శశి చూడరాదన్న చేకొంటిమొక ప్రతము
భక్తుల పూజలనంది దీవించు పార్వతి తనయ

ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య
ఉండ్రాళ్ళ మీదకు నీ దండు పంపు స్వామి
దేవాదిదేవునకు దేవతారాధ్యునకు
దేవేంద్రవంద్యునకు దేవగణపతికినిపుడు

మారేడు మామిడి మాదీ ఫలము
ఖర్జూర పనస కదళీ ఫలము
నేరేడు నెలవంక టెంకాయ తేనెయు తెచ్చి
చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు
పలు పువ్వులు పండ్లతో పూజింతు బహుబుద్ధి గణపతిని

వేయి వేల ముత్యాలు కొండలుగ
నీలములతో కలబోసి మెండుగా
వరహాలు మెడ నిండ వేసుకొని
దండిగ నీకిత్తు ధవళ హారతి

ఆయురారోగ్య ఐశ్వర్యములను
సుఖశాంతులను నీ దయను
ముక్కంటి తనయుడ మాపై
నిండుగ మెండుగ కురిపించు

మంగళం మంగళం మార్తాండతేజునకు
మంగళం సర్వజ్ఞ వందితునకు
మంగళం ముల్లోక మహిత సంచారునకు
మంగళం దేవగణపతికినిపుడు 

పరమశివుని ప్రియతనయుడవైన ఓ గణనాథా! సకల విఘ్నములను తొలగించి, భక్తులకు సిద్ధిని, బుద్ధిని, శుభములను ప్రసాదించు సిద్ధివినాయకా! నీకు జయమంగళములు, శుభమంగళములు. భాద్రపద శుద్ధ చవితినాడు భక్తులందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో నిన్ను పూజించి, ఆ రోజున చంద్రుని చూడరాదనే నియమాన్ని పాటిస్తూ, నీ అనుగ్రహాన్ని పొందుటకు వ్రతమాచరించెదరు. అట్టి భక్తుల పూజలను స్వీకరించి వారిని దీవించుము తండ్రీ! బొజ్జగణపయ్యా! నేను నీ సేవకుడను. నీకు అత్యంత ప్రీతికరమైన ఉండ్రాళ్లను సమర్పించుచున్నాను. వాటిని ఆరగించుటకు నీ గణములతో సహా విచ్చేయుము స్వామీ! దేవతలందరిచే ఆరాధింపబడే దేవాదిదేవుడవు, దేవేంద్రునిచే వందింపబడే గణాధిపతివి నీవే. నీ పూజకై మారేడు, మామిడి, మాదీఫలము, ఖర్జూరము, పనస, అరటిపండ్లు, నేరేడు, కొబ్బరికాయలు, తేనె మొదలైన ఫలములను, చెంగల్వ, చేమంతి, గన్నేరు, తామర, తంగేడు వంటి అనేక పుష్పములను సేకరించి సమర్పించుచున్నాము. అపారమైన బుద్ధిసంపదను ప్రసాదించు గణపతీ! వేలకొలది ముత్యములను రాశులుగా పోసి, వాటిలో నీలమణులను కలిపి, బంగారు వరహాలతో అలంకరించి, నీకు అత్యంత వైభవముగా తెల్లని మంగళహారతిని సమర్పించుచున్నాము. త్రినేత్రుడైన పరమేశ్వరుని కుమారా! నీ కరుణాకటాక్షములతో మాపై ఆయుష్షు, ఆరోగ్యము, ఐశ్వర్యము, సుఖశాంతులను సమృద్ధిగా కురిపించుము. సూర్యునివలె ప్రకాశించు దివ్యతేజస్సు కలవాడా! సర్వజ్ఞులచే స్తుతింపబడువాడా! ముల్లోకములలో పూజనీయుడవైన దేవగణపతీ! నీకు సదా మంగళము కలుగుగాక! 

వినాయకవ్రతకల్పంలోని మంగళం ఆధారంగా ఈ గీతాన్ని రచించారు. దీనిని గీతాంజలి బృందం ఆలపించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శ్రీ శంభు తనయునకు జయమంగళమనరే - వినాయకునికి మంగళ హారతి

శ్రీ శంభు తనయునకు జయమంగళమనరే సిద్ధి వినాయకునకు శుభమంగళమనరే శ్రీ శంభు తనయుని సిద్ధి గణనాథుని విఘ్నాలకధిపతి ఆ దేవదేవుని సురుచిరముగ భాద్రపద శుద...