ఓ కృష్ణా! నీవే నాకు తల్లివి, తండ్రివి, తోడువి, నీడవు, ఆత్మీయ సఖుడవు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించే గురువువు, నేను ఆరాధించే దైవానివి. నీవే నా జీవితానికి ఆధారము, నీవే నా అంతిమ గమ్యము. ఓ రాధాపతీ! నీకు సర్వమంగళములు కలుగుగాక! ధైర్యగాంభీర్యములతోను, దివ్యమైన శృంగార సౌందర్యముతోను అలరారే కృష్ణా! మా మంగళహారతిని స్వీకరించుము. వేదముల ద్వారా మాత్రమే తెలుసుకోదగిన పరమాత్మవు నీవే కదా! అటువంటి నీవు మాపై ప్రేమతో, ఆనందంతో దయ చూపి మమ్ములను రక్షించలేవా? నీ కరుణ మాపై కలుగదా? ఒక్కసారి ఇటువైపు తిరిగి మమ్ములను అనుగ్రహించలేవా? ఓ రాధాపతీ! నీకు సర్వమంగళములు కలుగుగాక!మందర పర్వతాన్ని ధరించిన ఓ స్వామీ! నీ దివ్య సౌందర్యాన్ని సంపూర్ణంగా వర్ణించడం నా వంటి సామాన్య భక్తునికి సాధ్యమయ్యే పనేనా? నందుని కుమారుడవై అందరికీ ఆనందాన్ని పంచే గోవిందా! జననమరణ బంధాల నుండి జీవులను విముక్తులను చేసే ముకుందా! ఓ రాధాపతీ! నీకు సర్వమంగళములు కలుగుగాక!ఈ భూమిపై నిన్నే నమ్ముకొని, నిత్యమూ నిన్ను సేవిస్తూ, నీ నామస్మరణతో జీవించే భక్తులను నీ చెంతకు చేర్చుకొని ఆదరించుము. ఓ నల్లనయ్యా! బాలగోపాలా! నందబాలా! భక్తులను ప్రేమతో పరిపాలించే పరమాత్మా! ఓ రాధాపతీ! నీకు సర్వమంగళములు కలుగుగాక!
సింధుభైరవి రాగంలో స్వరపరచబడిన ఈ సాంప్రదాయ మంగళహారతి గీతాన్ని గీతాంజలి బృందం ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి