5, నవంబర్ 2026, గురువారం

జానకీ నాయక నీకు జయ మంగళం - త్యాగరాజస్వామి కృతి



జానకీ నాయక నీకు జయ మంగళం నృప
సూను సుందరమునకు శుభ మంగళం హరే

ఫాలమునకు నీదు కపోలమునకు మంగళం
నీల వర్ణ నీ పలు వజ్రాలమునకు మంగళం

యౌవనమునకు చిరు నవ్వునకు మంగళం
దువ్వినయలకల మీది పువ్వులకు మంగళం

మాటలకు రత్నాల కిరీటమునకు మంగళం
నాటక సూత్ర ధార నీ తేట కండ్లకు మంగళం

బాణమునకు కుసుమ బాణ జనక మంగళం
జాణ తనమునకు లోక త్రాణమునకు మంగళం 

ఉంగరమునకు నీ దృష్టాంగమునకు మంగళం
పొంగుచు పదములనుండు గంగకును మంగళం

నీ గుణ జాలమునకు నిత్య శుభ మంగళం
నాగ శయన పాలిత త్యాగరాజ మంగళం

సీతాదేవికి పతియైన శ్రీరామా! నీకు జయమంగళం! రాజకుమారుడవైన సుందరరామా! నీకు శుభమంగళం! హరియైన నీకు మంగళం! నీ నుదుటికి, నీ చెక్కిళ్లకు మంగళం! నల్లని మేఘముల వంటి వర్ణము కలము నీకు, నీ పలువరుసలోని వజ్రాలవంటి దంతాలకు మంగళం! నీ యౌవన సౌందర్యానికి, నీ చిరునవ్వుకు మంగళం! చక్కగా దువ్విన నీ ముంగురులలో అలంకరించిన పువ్వులకు మంగళం! నీ మధురమైన మాటలకు, నీ రత్నఖచిత కిరీటానికి మంగళం! జగన్నాటక సూత్రధారుడవైన నీ తేటయైన కన్నులకు మంగళం! నీ బాణానికి మంగళం! మన్మథుని జనకుడవైన నీకు మంగళం! నీ చతురతకు, లోకరక్షణకు మంగళం! నీ వేలికి అలంకరించిన ఉంగరానికి, నీ దివ్యమైన శరీరాంగములకు మంగళం! నీ పాదముల నుండి ఉద్భవించి ప్రవహించే గంగానదికి మంగళం! నీ అనంతమైన సద్గుణ సమూహానికి నిత్య శుభమంగళం! ఆదిశేషునిపై శయనించేవాడవైన నీకు, త్యాగరాజుని పాలించేవాడవైన నీకు మంగళం!    

ధన్యాసి రాగంలో స్వరపరచబడిన ఈ త్యాగరాజస్వామి కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి పర్యవేక్షణలో బృందగానంగా గాయనీగాయకులు ఆలపించారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పతికి మంగళ హారతిరే - త్యాగరాజస్వామి కృతి

పతికి మంగళ హారతిరే భామలార నేడు సాకేత మతికి సొంపు కలుగ జేయు సద్గుణ తతికి మానవతి సీతా కామాది రిపు విదారికి హరికి సామాది నిగమచారికి సూర్య సోమాక...