3, నవంబర్ 2026, మంగళవారం

మరలి మరలి జయమంగళము - అన్నమాచార్యుల వారి కృతి



మరలి మరలి జయమంగళము
సొరిది నిచ్చలును శుభమంగళము

కమలారమణికి కమలాక్షునకును
మమతల జయజయమంగళము
అమరజననికిని అమరవంద్యునకు
సుముహూర్తముతో శుభమంగళము

జలధికన్యకును జలధిశాయికిని
మలయుచును శుభమంగళము
కలిమికాంత కాకలికి విభునికిని
సుళువుల యారతి శుభమంగళము

చిత్తజుతల్లికి శ్రీవేంకటపతికి
మత్తిల్లిన జయ మంగళము
యిత్తల నత్తల యిరువురకాఁగిటి
జొత్తుల రతులకు శుభమంగళము 

శ్రీమహాలక్ష్మీ సమేతుడైన శ్రీమహావిష్ణువునకు మరల మరల జయమంగళములు! ఆ దివ్యదంపతులకు ఎల్లప్పుడూ సమృద్ధిగా శుభమంగళములు కలుగుగాక! కమలమునందు నివసించు శ్రీమహాలక్ష్మికి, కమలములవంటి కన్నులు కలిగిన శ్రీమహావిష్ణువునకు ఎంతో ప్రేమతో జయజయ మంగళములు! దేవతలకు తల్లియైన మహాలక్ష్మికి, దేవతలందరిచేత పూజింపబడే శ్రీమహావిష్ణువునకు అత్యంత శుభప్రదమైన ముహూర్తమున మంగళహారతులు సమర్పించుచున్నాము!

క్షీరసాగరమునుండి ఆవిర్భవించిన సముద్రకన్యయైన మహాలక్ష్మికి, పాలసముద్రమున ఆదిశేషునిపై శయనించు శ్రీమహావిష్ణువునకు ప్రేమానురాగములతో శుభమంగళములు! సమస్త సంపదలకు అధిదేవతయైన లక్ష్మీదేవికి, ఆమె ప్రియుడైన సర్వలోకాధిపతి శ్రీమహావిష్ణువునకు సుందరముగా హారతులు ఇస్తూ శుభమంగళములు పలుకుచున్నాము!

మన్మథుని తల్లియైన మహాలక్ష్మికి, తిరుమలలో వెలసిన శ్రీ వేంకటేశ్వరునకు భక్తిపారవశ్యముతో జయమంగళములు! ఇరువైపులా నిలిచి ఆ దివ్యదంపతులకు హారతులు సమర్పించుచూ, ఒకరిపై ఒకరు అపారమైన ప్రేమానురాగములు కలిగిన లక్ష్మీనారాయణుల అన్యోన్యమైన దాంపత్యమును దర్శించి ఆనందించుచూ, వారి సన్నిధిలో చేరిన భక్తులందరము శుభమంగళములు పలుకుచున్నాము! 

రాగమాలికలో స్వరపర్చబడిన ఈ అన్నమాచార్యుల వారి కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఆలపించారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మరలి మరలి జయమంగళము - అన్నమాచార్యుల వారి కృతి

మరలి మరలి జయమంగళము సొరిది నిచ్చలును శుభమంగళము కమలారమణికి కమలాక్షునకును మమతల జయజయమంగళము అమరజననికిని అమరవంద్యునకు సుముహూర్తముతో శుభమంగళము జలధి...