స్వర రాగ సుధారస యుత భక్తి స్వర్గాపవర్గమురా! ఓ మనసా!
పరమానందమనే కమలముపై
బకభేకములు చెలగేమి మనసా!
మూలాధారజ నాద మెరుగుటే ముదమగు మోక్షము రా!
కోలాహల సప్త స్వర గృహముల గురుతే మోక్షము రా! ఓ మనసా!
మద్దెల తాళ గతులు తెలియకనే మర్దించుట సుఖమా
శుద్ధ మనసు లేక భజన చేయుట సూకర వృత్తి రా! ఓ మనసా!
బహు జన్మములకు పైని జ్ఞానియై బరగుట మోక్షము రా
సహజ భక్తితో రాగ జ్ఞాన సహితుడు ముక్తుడు రా! ఓ మనసా!
రజత గిరీశుడు నగజకు దెల్పు స్వరార్ణవ మర్మములు
విజయము గల త్యాగరాజునికెరుకే! విశ్వసించి తెలుసుకో మనసా!
ఓ మనసా! స్వర రాగములమునే అమృత రసములతో కూడిన భక్తి స్వర్గఫల ప్రదము మరియు మోక్ష ప్రదాయకము. స్వర రాగ యుక్తము కాని శబ్దములు చేసే కొంగలు మరియు కప్పలు ఈ పరమానందమనే కమలములో చెలగి ఆస్వాదించలేవు. ఓ మనసా! శరీరమునందలి మూలాధార చక్రము నుండి జన్మించిన నాదమును ఎఱుగుటే ఆనందప్రాయమగు మోక్షము. కోలాహలమైన సప్తస్వరముల నివాసమును ఎఱుగుటే మోక్షము. ఓ మనసా! తాళము, లయము ఎఱుగకనే మద్దెలను మర్దించుట సుఖము కాదు. శుద్ధమైన మనసు లేక భజన చేయుట అనేది పంది చేసే కర్మ వంటిది. ఓ మనసా! అనేక జన్మల సంస్కారముల ద్వారా జ్ఞానియైన పిమ్మట లభించేది మోక్షము. సహజమైన భక్తితో రాగ జ్ఞానము కలిగిన వాడు ముక్తుడు. ఓ మనసా! హిమవత్పర్వతాలకు అధిపతి అయిన పరమశివుడు స్వరార్ణవము యొక్క రహస్యములను పార్వతీదేవి తెలిపాడు. విజయుడైన త్యాగరాజునకు ఈ రహస్యము ఎఱుక. విశ్వసించి తెలుసుకొనుము.
- సద్గురువులు కాకర్ల త్యాగరాజస్వామి
శాస్త్రీయ సంగీతానికి మూలాలు శృతి లయ రాగ యుక్తమైన స్వరములు. ఈ స్వరాలు ఓంకారము నుండి ఉద్భవించినవి అని మనకు సనాతన ధర్మం తెలుపగా దానినే వాగ్గేయకారులు కూడా ఘోషించారు. కర్ణాటక సంగీతానికి పితామహునిగా చెప్పబడే పురందరదాసు అద్భుతమైన భక్తి సాహిత్యానికి స్వరములను కూర్చి, అందులో విభాగములను ఏర్పరచి దానికి శాస్త్రీయతనిచ్చారు. ఆయన వారసత్వంగా దాస సాంప్రదాయంలో అభివృద్ధి చెందిన శాస్త్రీయ సంగీతం తరువాతి కాలంలో సంగీత త్రయమైన త్యాగయ్య, దీక్షితులు, శ్యామశాస్త్రుల వార్ల ద్వారా మరింత పవిత్రతను, ప్రాచుర్యాన్ని పొందింది. నాదోపాసనలో తరించిన వీరు శాస్త్రీయ సంగీతానికి ఉన్న ప్రాధాన్యతను, సంగీతం ద్వారా ముక్తులయ్యే మార్గాన్ని తెలిపారు. సంగీత జ్ఞానంపై త్యాగరాజస్వామి వారు ఇతర ఎన్నో కీర్తనలు రచించారు. శోభిల్లు సప్తస్వర, నాద తనుమనిశం శంకరం, రాగ సుధారస, నాద సుధారసం వంటివి సంగీతయోగం యొక్క గొప్పతనాన్ని చాటేవే. అటువంటి కీర్తనే స్వరరాగ సుధా రస యుత భక్తి. మన శరీరములో వేర్వేరు నాడుల యందు స్థితమైన చక్రముల నుండి నిరంతరం నాదం వెలువడుతూ ఉంటుంది. విశ్వజనీనమైన శక్తిచే ప్రేరితమైన ఈ నాడులను జాగృతము చేసి ఆ నాదమును అనుభూతి చెందటానికి కావలసినది భక్తితో కూడిన సాధన. మూలాధారం చక్రమునుండి జన్మించిన నాదమును తెలుసుకొనుటే మోక్షము అన్న కీలకమైన రహస్యాన్ని త్యాగయ్య ఈ కీర్తన మొదటి చరణంలో తెలిపారు. జాగృతమైన మూలాధార చక్రమే మోక్షానికి నాంది. ఈ విధంగా త్యాగరాజస్వామి ఈ దేహమనే దేవాలయంలోని నాదమును సప్తస్వరములతో రాగ తాళ భక్తి యుక్తముగా సాధించి మోక్షాన్ని పొందవచ్చును అని తెలియజేశారు. సహజమైన భక్తి, స్వర రాగ తాళ జ్ఞానము, శుద్ధమైన మనసు ఈ మోక్ష మార్గానికి సూత్రాలు అని చరణముల ద్వారా తెలిపారు. పరమశివుడు పార్వతికి తెలిపిన ఈ రహస్యమును తెలుసుకొని సాధన చేసి మోక్షమును పొందవచ్చునని పలికారు.
సంగీతానికి రాగ తాళ యుక్తమైన స్వరాలు ఎందుకు ముఖ్యమైనవి? హృదయము మరియు మనస్సుల స్పందన శరీరంలోని కర్మేంద్రియములు, వివిధ నాడులు ఎలా స్పందిస్తాయి అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఇంద్రియములు, నాడులు లయబద్ధమైన, శృతి పక్వమైన నాదానికి స్పందించే రీతి మనం ఊహించలేనంత విశేషంగా ఉంటుంది. ఈ స్పందనలు నిరంతర సాధనలో కొనసాగితే సుషుప్తమైన శక్తులు జాగృతమై దేహాత్మల జ్ఞానాన్ని కలిగేలా చేస్తాయి. ఆ అమృతాన్ని చవి చూసిన తరువాత ఇక వేరేమీ రుచించదు. దీనిని త్యాగరాజస్వామి వంటి వారు అనుభూతి చెంది తమ సాహిత్యంలో పొందుపరచారు. భక్తిలో తాదాత్మ్యం చెంది రస ప్రవాహంగా సాగే నాదయోగంలో కర్మఫలాలు తొలగుతాయి, తద్వారా దేహాత్మలు మరింత దివ్యత్వాన్ని పొంది జ్ఞానేంద్రియములు జాగృతమవుతాయి. నాదోపాసన అంత మహత్తరమైనది.
ధీరశంకరాభరణ రాగం పేరుకు తగ్గట్టు ధీరమైనది, అత్యంత సౌజన్యమైనది, అంతే లోకప్రియమైనది. కర్ణాటక సంగీత శాస్త్రంలో వైభవమైన రాగం ఈ శంకరాభరణం. వాగ్గేయకారులు ఈ రాగంలో ఎన్నో కృతులను స్వర పరచారు. మాధుర్యం, లాలిత్యం, గాంభీర్యం కలిగిన రాగం ఇది. త్యాగరాజస్వామి వారు ఈ కీర్తనలో తెలియజేయ దలచుకున్న సందేశానికి ఈ రాగం అత్యంత సముచితమైనది. అందుకే కళాకారులు ఈ కీర్తనను ఆలపించనప్పుడు రాగాన్ని విశేషంగా విశదీకరించి ఆలపిస్తారు. ఈ త్యాగరాజస్వామి కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి