మహారాష్ట్రలోని ప్రసిద్ధ శక్తి క్షేత్రాలలో తుల్జాపూర్ శ్రీ తుల్జా భవానీ దేవస్థానం అత్యంత పవిత్రమైనది. మాహూర్‌లోని రేణుకాదేవి, కొల్హాపూర్‌లోని మహాలక్ష్మీదేవి, వణిలోని సప్తశృంగీదేవి క్షేత్రాలతో పాటు తుల్జాపూర్‌లోని భవానీదేవి క్షేత్రాన్ని మహారాష్ట్రలోని నాలుగు మహా శక్తిపీఠాలలో ఒకటిగా భక్తులు భావిస్తారు. బాలాఘాట్ పర్వతశ్రేణిలోని యమునాచల పర్వతంపై ఈ పవిత్ర క్షేత్రం నెలకొని ఉంది. అమ్మవారు ఇక్కడ తుల్జా భవానీ, తులజా, తురజా, త్వరిత, అంబా మొదలైన నామాలతో ఆరాధింపబడుతున్నారు.
ఇంతవరకు ఎప్పుడూ వెళ్లలేదు అని మూడు రోజుల వారాంతం రావటంతో తీర్థయాత్ర సంకల్పం చేసుకున్నాము. ఏదో ఒక విధంగా తుల్జాపూర్, పండరిపూర్, అక్కల్‌కోట్ చూద్దామని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాము.
హైదరాబాదు షేక్‌పేట నుండి తెల్లవారుఝామున దాదాపు 5:30 గంటలకు నేను, శ్రీమతి, మా అత్తయ్య గారు కారులో తుల్జాపూర్ బయలు దేరాము. ఒక అరగంట కాఫీ, టిఫిన్ కొరకు ఆగి దాదాపుగా 10:30 గంటలకు తుల్జాపూర్ చేరుకున్నాము. పార్కింగ్ నుండి ఆటోలో దేవస్థానానికి ఒక 300 మీటర్లో దూరం వరకు వెళ్లాము. అక్కడి నుండి ఏటీవి వాహనాలు వికలాంగుల కోసం అని ఉన్నాయి. మా అత్తయ్య గారికి కాలి నొప్పి ఉండటం వల్ల వాడిని బతిమిలాడి గుడి వరకు అందులో వెళ్లాము. సింహద్వారం నుండి దాదాపుగా మూడంతస్థుల క్రిందకు దిగి క్యూ కాంప్లెక్సులో మళ్లీ కొంత ఎక్కి శీఘ్ర దర్శనం క్యూలో ఒక పావు గంట వెయిట్ చేశాము. శ్రీమతి ముందే 300 రూపాయల టికెట్ ఆన్లైన్లో బుక్ చేసింది కాబట్టి కంపార్టుమెంటుల్లో వెయిట్ చేసే పని లేకుండా శీఘ్ర దర్శనం క్యూలో గర్భగుడి వద్దకు వెళ్లాము. మరీ దూరంగా కాకుండా ఒక 15-20 అడుగుల దూరం నుండి అమ్మ వారిని చూసి బయటకు వచ్చాము. దక్షిణాది దేవాలయాల లాగా గర్భగుడిలో రాతి స్థంభాలు ఉన్నాయి. అలాగే క్యూ కాంప్లెక్షులోకి వెళ్లే ముందు అనేక కట్టడాలు పురాతనమైనవిగానే ఉన్నాయి. గర్భాలయం సమీపంలో వేప చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు ఉన్నాయి. మిగిలిన వివరాలు రెండు భాగాలుగ - స్థలపురాణం, ఆలయవిశేషాలుగా క్రింద పొందుపరచాను.
స్థలపురాణం
==========
మధు–కైటభుల గాథ:
మధు, కైటభులనే రాక్షసులు దేవతలను, మానవులను తీవ్రంగా బాధించగా, వారి పీడన నుండి విముక్తి పొందే మార్గం కోసం దేవతలు బ్రహ్మదేవుని ఆశ్రయించారు. బ్రహ్మదేవుని సూచనతో వారు ఆదిశక్తిని ప్రార్థించారు. వారి ప్రార్థనకు ప్రసన్నమైన దేవి సంహారరూపాన్ని ధరించి, వారాహి, బ్రాహ్మీ, వైష్ణవీ, కౌమారీ, ఇంద్రాణీ, శాంభవీ మొదలైన మాతృశక్తుల బలంతో రాక్షసులను సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించిందని క్షేత్రగాథ చెబుతుంది.
మహిషాసుర సంహారం
మహిషాసుర సంహారంతో కూడా తుల్జా భవానీ క్షేత్రానికి సంబంధం ఉందని మరో గాథ చెబుతోంది. మహిషరూపాన్ని ధరించిన రాక్షసుడిని దేవి సంహరించిన అనంతరం బాలాఘాట్ పర్వతశ్రేణిలో భాగమైన యమునాచల పర్వతాన్ని తన నివాసస్థానంగా చేసుకుందని విశ్వాసం. ఈ యమునాచలంపైనే నేటి తుల్జా భవానీ ఆలయం వెలసి ఉంది.
అనుభూతి – కుకురాసురుని గాథ
అమ్మవారి అవతారానికి సంబంధించిన ముఖ్యమైన స్థలపురాణం కర్దమ మహర్షి భార్య అనుభూతితో ముడిపడి ఉంది. కర్దమ మహర్షి మరణించిన తరువాత ఆయన భార్య అనుభూతి తన చిన్నబిడ్డ సంరక్షణ బాధ్యతను భవానీమాతకు అప్పగించాలనే సంకల్పంతో మందాకినీ నదీతీరంలో కఠోర తపస్సు చేసింది. ఆమె తపస్సులో నిమగ్నమై ఉండగా కుకురుడు అనే రాక్షసుడు ఆమెను వేధించి తపస్సుకు భంగం కలిగించడానికి ప్రయత్నించాడు. తనను రక్షించమని అనుభూతి జగన్మాతను ప్రార్థించగా దేవి ప్రత్యక్షమై కుకురాసురుని సంహరించి ఆమెను కాపాడింది. అనంతరం భక్తుల రక్షణార్థం ఆ ప్రాంతంలోనే కొలువై ఉండాలని అనుభూతి ప్రార్థించగా, అమ్మవారు అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారని, అప్పటి నుండి ఆమె తుల్జా భవానీగా ప్రసిద్ధి చెందిందని క్షేత్రగాథ తెలియజేస్తుంది.
శ్రీరాముడు – ఘాట్‌శిల గాథ
సీతాదేవిని రావణుడు అపహరించిన తరువాత ఆమెను అన్వేషిస్తూ శ్రీరాముడు, లక్ష్మణుడు ఈ పర్వత ప్రాంతానికి వచ్చారని విశ్వసిస్తారు. ఆ సమయంలో తుల్జా భవానీ దేవి శ్రీరామునికి దర్శనమిచ్చి, సీతాదేవి లంకలో ఉన్నదని సూచించి ఆయనకు మార్గదర్శనం చేసిందని స్థానిక స్థలపురాణం చెబుతుంది. శ్రీరామునితో ముడిపడిన ఈ ప్రదేశమే తరువాత ఘాట్‌శిలగా ప్రసిద్ధి చెందింది.
భారతి బువా గాథ
భారతి బువాను పరమశివుని అవతారంగా భావించే సంప్రదాయం తుల్జాపూర్‌లో ఉంది. తుల్జా భవానీ అమ్మవారు భారతి బువాతో సారిపాట్ అనే ఆట ఆడేందుకు ఆయన వద్దకు వస్తారనే ఆసక్తికరమైన స్థానిక విశ్వాసం కూడా ఉంది. ఈ గాథతో ముడిపడిన భారతి బువా మఠాన్ని ‘మాహేర్‌ఘర్’ అని కూడా పిలుస్తారు.
తుల్జా భవానీ ఆలయ విశేషాలు
======================
ఆలయ స్థానం
తుల్జా భవానీ ఆలయం బాలాఘాట్ పర్వతశ్రేణిలోని యమునాచల పర్వతంపై నెలకొని ఉంది. శక్తి ఆరాధనకు ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో తుల్జా భవానీ అమ్మవారు ప్రధాన ఆరాధ్యదైవంగా కొలువై ఉన్నారు.
ఆలయ ప్రవేశ ద్వారాలు
ఆలయ ప్రధాన ప్రవేశద్వారం సర్దార్ నింబాల్కర్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇతర ముఖ్య ప్రవేశద్వారాలు ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లిదండ్రులైన రాజా షాహాజీ మహారాజ్, రాజమాత జిజావు పేర్లతో ఉన్నాయి. సర్దార్ నింబాల్కర్ ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించగానే కుడివైపున మార్కండేయ మహర్షికి అంకితమైన ఆలయం కనిపిస్తుంది. అక్కడి నుండి మెట్లు దిగుతూ వెళితే ప్రధాన తుల్జా భవానీ ఆలయాన్ని చేరుకుంటారు. ప్రధాన ఆలయం ముందు యజ్ఞకుండం ఉంది.
తుల్జా భవానీ మూలవిగ్రహం
తుల్జా భవానీ అమ్మవారి విగ్రహాన్ని భక్తులు స్వయంభూ మూర్తిగా విశ్వసిస్తారు. నల్లని శిలతో రూపొందిన ఈ మూర్తి సుమారు మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. అమ్మవారు అష్టభుజాలతో దర్శనమిస్తూ చేతులలో వివిధ ఆయుధాలను ధరించి ఉంటారు. మహిషాసురుని సంహరించిన మహిషాసురమర్దినీ స్వరూపాన్ని ఈ మూర్తి ప్రతిబింబిస్తుంది. సంహారశక్తి, మాతృత్వం, భక్తరక్షణ అనే లక్షణాల సమన్వయంగా తుల్జా భవానీని భక్తులు ఆరాధిస్తారు.
గోముఖ తీర్థం
ప్రధాన ఆలయం వైపు మెట్లు దిగుతున్నప్పుడు కుడివైపున గోముఖ తీర్థం కనిపిస్తుంది. అమ్మవారి దర్శనానికి ముందు ఈ పవిత్ర జలాన్ని స్వీకరించడం, తీర్థస్నానం చేయడం సంప్రదాయంగా వస్తోంది.
కల్లోల తీర్థం
మెట్లకు ఎడమవైపున కల్లోల తీర్థం ఉంది. ఇది సుమారు 40 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో చుట్టూ రాతి గోడలతో నిర్మితమై ఉంది. బ్రహ్మదేవుని ఆహ్వానం మేరకు గంగా, యమునా, సరస్వతీ నదుల పవిత్ర జలాలు ఇక్కడికి వచ్చి సంగమించాయని విశ్వాసం. అందువల్ల ఈ తీర్థానికి విశేషమైన పవిత్రత ఉందని భక్తులు భావిస్తారు.
అమృతకుండం
ఆలయ ప్రాంగణంలో అమృతకుండం అనే మరో పవిత్ర జలస్థానం ఉంది. తుల్జా భవానీ ఆలయ సముదాయంలోని ముఖ్యమైన పవిత్ర ప్రదేశాలలో ఇది ఒకటి.
హవనకుండం
ప్రధాన ఆలయానికి ఎదురుగా హవన కుండం ఉంది. ఈ కుండం కింద రక్త భైరవుని విగ్రహం ఉంది. రక్తబీజుని సంహరించటానికి భవాని ఈ రక్త భైరవుణ్ణి సృష్టించిందని ఒక గాథ ఉంది.
విష్ణు తీర్థం
తుల్జా భవానీ ఆలయానికి ఈశాన్య దిశలో విష్ణు తీర్థం ఉంది. దీనికి మూడు ప్రవేశ మార్గాలు ఉన్నాయి. నిర్మాణరీత్యా ఇది కల్లోల తీర్థాన్ని పోలి ఉంటుంది. గంగా, యమునా, సరస్వతీ నదుల పవిత్ర జలాలు ఇక్కడ సంగమిస్తాయని భక్తుల విశ్వాసం. రాతి మెట్ల ద్వారా ఈ తీర్థం ప్రధాన ఆలయంతో అనుసంధానమై ఉంటుంది.
పాపనాశ తీర్థం
తుల్జాపూర్‌లోని ప్రముఖ తీర్థాలలో పాపనాశ తీర్థం మరొకటి. ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. ఇది ప్రధాన తుల్జా భవానీ ఆలయానికి వెలుపల సుమారు అర కిలోమీటరు దూరంలో సర్క్యూట్ హౌస్ సమీపంలో ఉంది. పురాతనమైన ఈ తీర్థం రాతి నిర్మాణంతో ఏర్పాటైంది.
ఆలయ సముదాయంలోని ఇతర దేవతలు
ప్రధాన ఆలయ సముదాయంలో లక్ష్మీనరసింహస్వామి, దత్తాత్రేయస్వామి, సిద్ధివినాయకుడు, ఆదిశక్తి మాతంగాదేవి, అన్నపూర్ణాదేవి ఆలయాలు ఉన్నాయి. మార్కండేయ మహర్షికి ప్రత్యేక ఆలయం కూడా ఉంది. అందువల్ల తుల్జా భవానీ దర్శనంతో పాటు ఈ దేవతలను దర్శించుకునే సంప్రదాయం ఉంది.
కాలభైరవుడు
తుల్జాపూర్ క్షేత్రంలో భైరవారాధనకు విశిష్టమైన స్థానం ఉంది. కాలభైరవుడు, తోల్‌భైరవుడు క్షేత్రపాలక దేవతలుగా పూజలందుకుంటున్నారు. వీరితో పాటు ఉన్మత్త భైరవుడు, రక్తభైరవుడు, బట్‌భైరవుడు మొదలైన భైరవ స్థానాలు కూడా తుల్జాపూర్ ప్రాంతంలో ఉన్నట్లు స్థానిక విశ్వాసం. వీటిలో కాలభైరవునికి అత్యంత ప్రాధాన్యం ఉంది.
ఘాట్‌శిల
ప్రధాన ఆలయానికి వెలుపల ఉన్న ముఖ్యమైన పవిత్ర ప్రదేశాలలో ఘాట్‌శిల ఒకటి. శ్రీరాముడు, లక్ష్మణుడు సీతాన్వేషణలో ఈ ప్రాంతానికి వచ్చారనే స్థలపురాణంతో దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
భారతి బువా మఠం
తుల్జా భవానీ ఆలయానికి పశ్చిమ దిశలో భారతి బువా మఠం ఉంది. దీనిని ‘మాహేర్‌ఘర్’ అని కూడా పిలుస్తారు. తుల్జా భవానీ ఆలయం వెనుకనున్న శివాజీ ద్వారం గుండా వెళ్లి ఆరాధ్‌వాడీని దాటితే ఈ మఠాన్ని చేరుకోవచ్చు.
యాత్రికులకు వసతులు:
తుల్జాపూర్ క్షేత్రానికి సమీపంలో అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. శాఖాహారం, దక్షిణాది ఆహారం దొరుకుతుంది. అలాగే, అక్కడి సంస్థాన్ వారి భక్త నివాస్ చాలా పెద్దది, ఆన్లైన్లో ఏసీ, నాన్ ఏసీ మొదలైన గదులు బుక్ చేసుకోవచ్చు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి