4, అక్టోబర్ 2026, ఆదివారం

సోలాపూర్ కేంద్రంగా మహారాష్ట్రలో తీర్థయాత్ర


ఎప్పుడైనా మూడు రోజులు సెలవు వస్తే హైదరాబాదుకు 4-5 గంటల ప్రయాణంలో తీర్థయాత్రలు ఏమి చేయవచ్చు? 

మహారాష్ట్రలోని సోలాపూర్ హైదరాబాదుకు 300 కిలోమీటర్ల దూరం. ఇది పెద్ద పట్టణమే. అన్ని వసతులు, అన్ని రకాల ఆహారాలు దొరికే ప్రదేశం. దీన్ని కేంద్రంగా చేసుకుని ఈ క్షేత్రాలు చూడవచ్చు:

1. తుల్జాపూర్ (భవాని అమ్మ వారి క్షేత్రం) - 45 కిలోమీటర్లు. 

2. పండరిపూర్ (రుక్మిణీ సమేత విఠలుని క్షేత్రం) - 75 కిలోమీటర్లు

3. అక్కల్‌కోట్ (దత్త సాంప్రదాయంలోని 19వ శతాబ్దపు అవతారంగా భావించబడే స్వామి సమర్థ క్షేత్రం) - 40 కిలోమీటర్లు

4. గాణగాపూర్ (దత్తావతారుడైన నృసింహసరస్వతీ స్వామి వారి నిర్గుణ పాదుకలున్న క్షేత్రం) - 110 కిలోమీటర్లు 

హైదరాబాదు నుండి, సోలాపూర్ నుండి అన్ని క్షేత్రాలకు అద్భుతమైన హైవేలున్నాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్లో వెళ్లవచ్చు. 

హైదరాబాదు నుండి వెళ్లేటప్పుడు తుల్జాపూర్ చూసుకుని సోలాపూర్ వెళ్లి అక్కడి నుండి పండరిపూర్ చూసుకుని తరువాత అక్కల్‌కోట్, అక్కడి నుండి గాణగాపూర్ వెళ్లి అక్కడి నుండి నేరుగా హైదరాబాద్ తిరిగి రావచ్చు. మూడు రోజులు పట్టే యాత్ర ఇది.

అన్ని చోట్లా యాత్రినివాస్, భక్తనివాస్ వంటి వసతులు, భోజన వసతులు ఉన్నాయి. తుల్జాపూర్, పండరిపూర్ దర్శన ఏరపాటు ఆన్లైన్లో ముందే చేసుకుని వెళితే చాలా సులభం అవుతుంది. 

తుల్జాపూర్‌లో కార్ పార్కింగ్ నుండి దేవస్థానానికి ఒక 3/4 కిలోమీటరు ఉంటుంది. నడవలేని వారికి ఆటో కొంతదూరం వరకు, తరువాత దేవస్థానం వారి ఏటీవీ వాహనాలు ఉన్నాయి. గుడిలో మాత్రం చాలా మెట్లు దిగి ఎక్కాలి. గుడికి వెళ్లే మార్గాని మెరుగు పరచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

పండరిపూర్‌లో దేవస్థాన సముదాయం వరకు పెద్ద వాళ్లకు ఏటీవీలు ఉన్నాయి. మిగిలిన వాళ్లు దాదాపు 1/2 కిలోమీటరు నడవాలి. ఇది పెద్ద క్షేత్రం, కాబట్టి ఒక ద్వారం నుండి వెళ్ళి ఇంకో ద్వారం గుండా బయటికి రావటానికి నడవాల్సిన అవసరం ఉంది. దేవాలయం లోపల పెద్దగా నడిచే అవసరం లేదు. ఇక్కడ రెండు రకాల దర్శనాలు - ముఖ దర్శనం, స్పర్శ దర్శనం. ముఖ దర్శనం అంటే దూరం నుండి దాదాపుగా అయ్యవారి, అమ్మ వారి ముఖాలు మాత్రమే కనబడతాయి. స్పర్శ దర్శనం అంటే మూర్తుల పాదాలు తాకవచ్చు. ముఖ దర్శనానికి తక్కువ సమయం పడుతుంది. దర్శనానికి ఆన్లైన్లో ఉచిత పాస్ బుక్ చేసుకోవచ్చు. బాగా రద్దీ ఉండే రోజుల్లో ఈ పాస్‌లను రద్దు చేస్తారు. స్పర్శ దర్శనానికి వారాంతాలలో, ఏకాదశి, పౌర్ణమి వంటి ప్రత్యేకమైన రోజులలో 3-4 గంటలకు పైగా పడుతుంది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పండరిపూర్ తీర్థయాత్ర మొదటి భాగం: విఠల రుక్మిణి మందిరం

సోలాపూర్‌లో రాత్రి బస చేసి మరునాడు తెల్లవారుఝామున 5 గంటల ప్రాంతంలో పండరిపూర్ బయలుదేరాము. దాదాపు గంట పది నిమిషాల ప్రయాణం తరువాత పండరిపూర్ క్ష...