"రామో ద్విర్నాభిభాషతే"
రాముడు రెండు మాటలు మాట్లాడడు.
(అయోధ్య కాండలో రాముడు కైకేయితో)
ఒక మనిషి ఆడిన మాట తప్పకుండా ఉండాలంటే ఎంత దృఢమైన వ్యక్తిత్వం, ఎంతటి పరిపుష్టమైన సిద్ధాంతాలు కలిగి, ఎంతటి స్థితప్రజ్ఞత ఉండాలో ఆలోచించారా? కైకేయి రామునితో తండ్రి మాటగా అరణ్యములకు వెళ్లమని చెప్పగా రాముడు అట్లే అని అంగీకరించాడు. కానీ, "అమ్మా! ఈ మాట నాన్న గారు నాతో స్వయంగా ఎందుకు చెప్పలేదు" అని ప్రశ్నించాడు. కైక దశరథుడు స్వయంగా చెప్పలేదని రాముడు తాను ఆడిన మాట తప్పుతాడేమో అని శంకిస్తుంది. అప్పుడు రాముడు పై వాక్యం పలికి తన వ్యక్తిత్వాన్ని తేటతెల్లం చేస్తాడు. ఆ సందర్భంలో రాముని నోట వెలువడిన మరొక ముఖ్యమైన వాక్యం:
విద్ధి మాం ఋషిభిః తుల్యం కేవలం ధర్మమాస్థితం
కేవలం ధర్మముననుసరించెడి ఋషులతో సమానునిగా నన్నెఱుగుము అని చెప్పి ఆడినమాటకు కట్టుబడి నిలిచాడు. ఇక్కడ రాముని మనస్సును మనం గ్రహించాలి. ధర్మాచరణలో సామాన్య క్షత్రియునిగా కాదు, ఋషుల వలె ఆలోచిస్తాడు అన్నది మనకు సుస్పష్టం. అనగా, రాగద్వేషాలకు అతీతంగా తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ధర్మానికి యశస్సు కలిగేలా నడచుకుంటాడు, దీక్షాబద్ధుడై ఉంటాడు. తల్లి కౌసల్య వద్దని వారించినా, లక్ష్మణుడు ప్రార్థించినా, మాటతప్పక వనవాసానికేగాడు. అరణ్యానికి భరతుడు వచ్చి రాజ్యాన్ని స్వీకరించమని కోరినా, ప్రజలు, తల్లులు, మంత్రులు భరతుని కోరికకు సమ్మతి తెలిపి రాముని తిరిగి రమ్మని కోరినా తన మాటకే కట్టుబడ్డాడు. జాబాలి నాస్తికవాదంతో మందలించ జూశాడు. వశిష్ఠుడు గురువుగా ఆదేశింప ప్రయత్నం చేశాడు. కానీ, రాముడు మాత్రం తన నిశ్చయానికి కట్టుబడి అడవులకేగాడు. అది రాముని సత్యవాక్పరిపాలనకు పరమోదాహరణము.
అందుకే రామో విగ్రవాన్ ధర్మః అన్నారు. ఎంతటి ధర్మమూర్తి అంటే, ఏ ఒక్క విషయంపై కూడా రాముడు రెండవమాట మాట్లాడలేదు, అటువంటి అవకాశముండేలా వ్యవహరించలేదు. ధర్మాచరణకు త్యాగం ఎంత అవసరమో రాముని జీవితం మనకు తెలుపుతుంది. అలా ఉన్నాడు కాబట్టే రాముడు యుగయుగాలుగా అనంతకోటి జీవులకు ఆరాధ్యదైవమైనాడు.
శ్రీరామ జయం!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి