శ్రీరామ పరంధామ! జయరామ పరంధామ!
రఘురామ! రామ! రణరంగ భీమ! జగదేక సార్వభౌమ!
సూర్యాన్వయాబ్ది సోమ! సుగుణాభిరామ శుభ నామ!
కారుణ్య ధామ! దశకంఠ విరామ! రాఘవ రాజ లలామ!
సాకేతపురాధిప రామ! సీతామనోహరా శ్రీరామ!
అరవిందలోచన! సుందర! సురుచిర! ఇందీవర! శ్యామ!
శ్రీరామా! నీవు పరమాత్మవు! రఘురాముడవు! యుద్ధములో అమిత పరాక్రమవంతుడవు! ఈ జగత్తుకు ఒకే ఒక సార్వభౌముడవు, నీకు జయము. సూర్యవంశమనే సముద్రానికి చంద్రుని వంటి వాడవు, సుగుణములచే అలంకరించబడిన వాడవు, శుభకరమైన నామము కలవాడవు, కరుణకు నెలవైన వాడవు, దశకంఠుని సంహరించిన రాజశ్రేష్ఠుడవు, నీకు జయము. సాకేతపురానికి రాజువు నీవు, సీత మనస్సును దోచుకున్నవాడవు, కలువలవంటి కన్నులు గలవాడవు, సుందరమైన రూపము, మనోజ్ఞమైన దేహము కలిగిన వాడవు, సీతాపతివి, నీలమేఘ శరీరము కలవాడవు, నీకు జయము.
- సముద్రాల
ఎంతటి మనోజ్ఞ వర్ణనో! రామనామ గానము విన్నంత భక్త శిరోమణి, మహాజ్ఞాని, పరమ సేవకుడు అయిన సుందర మారుతి పరిస్థితి ఎలా ఉంటుందో!! అన్నీ వదలి, అన్నీ మరచి నర్తించాడట. ఆ రామభక్తి సామ్రాజ్యపు దొరయైన హనుమ ఎంత అదృష్టవంతుడు!! ఆ స్వామికి ఈ బంటుపై ఎంతటి వాత్సల్యం!! శతయోజనాలు లంఘించి సీతమ్మను చూచి లంకను కాల్చి రాక్షస పుత్రులను సంహరించి అత్యంత దుర్గమమైన కార్యాన్ని సాధించ గలిగాడు అంటే ఆ రామ నామ మహిమ ఎంతటిదో, మారుతికి ఆ నామముపై ఎంతటి నమ్మకమో!
లవకుశ చిత్రంలో సముద్రాల రాఘవాచార్యుల వారు రచించిన గీతాన్ని ఘంటసల మాష్టారు స్వరపరచగా సుశీల, లీల, జమునా రాణి గారు ఈ పాటను ఆద్భుతంగా ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి