కశ్మీర్ కీ కలీ చిత్రం కథ ప్రేమ, అపార్థాలు, కుటుంబ రహస్యాల నేపథ్యంలో సాగే అందమైన ప్రణయగాథ. సంపన్న కుటుంబానికి చెందిన రాజీవ్ లాల్ అనే యువకుడు తన తల్లి కుదిర్చే వివాహ సంబంధాలను తప్పించుకోవడానికి కాశ్మీరు చేరుకుంటాడు. అక్కడ పూలు అమ్ముకుంటూ జీవించే చంపా అనే యువతిని చూసి ప్రేమలో పడతాడు. మొదట అతని అల్లరి చేష్టలను పట్టించుకోని చంపా క్రమంగా అతని ప్రేమలోని నిజాయితీని గుర్తించి అతనికి దగ్గరవుతుంది. అయితే చంపాను పెళ్లి చేసుకోవాలనుకునే మోహన్ అనే వ్యక్తి వారి ప్రేమకు అడ్డంకులు సృష్టిస్తాడు. మరోవైపు చంపా జన్మరహస్యం, ఆమె కుటుంబానికి రాజీవ్ కుటుంబంతో ఉన్న అనుబంధం కథను అనూహ్యమైన మలుపులు తిప్పుతాయి. చివరకు అపార్థాలు తొలగిపోయి ప్రేమికులిద్దరూ ఒక్కటవుతారు.
ఈ కథలో షమ్మీ కపూర్ తనదైన ఉత్సాహభరితమైన నటనతో, చలాకీతనంతో, హాస్యచతురతతో ప్రేక్షకులను అలరిస్తారు. ముఖ్యంగా ఆయన హావభావాలు, సంభాషణలు పలికే తీరు, ప్రణయ సన్నివేశాలలో చూపే అల్లరి అప్పటి యువతరాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. షర్మిలా ఠాగూర్ చంపా పాత్రలో అమాయకత్వంతో పాటు ఆత్మాభిమానాన్ని, ప్రేమలోని సున్నితమైన భావోద్వేగాలను సహజంగా ఆవిష్కరించారు. ఆమె కళ్లతో పలికించే భావాలు, చిరునవ్వులు, అవసరమైనప్పుడు చూపే గాంభీర్యం పాత్రకు ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకువచ్చాయి. ప్రతినాయకుడిగా ప్రాణ్ తన పాత్రలోని స్వార్థాన్ని, కుతంత్రాలను సమర్థంగా ప్రదర్శించారు. హాస్యనటుడు అనూప్ కుమార్ కథలో వినోదాన్ని పండించారు. దర్శకుడు శక్తి సామంతా ప్రేమకథను కేవలం నాయకానాయికల మధ్య ప్రణయ సన్నివేశాలకే పరిమితం చేయకుండా, హాస్యం, ఉత్కంఠ, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలను సమపాళ్లలో మేళవించి ఆసక్తికరంగా నడిపించారు. ముఖ్యంగా కథలోని గంభీరమైన మలుపులకు, సరదాగా సాగే ప్రణయ సన్నివేశాలకు మధ్య సమతుల్యతను పాటించడంలో ఆయన దర్శకత్వ ప్రతిభ కనిపిస్తుంది. ఆ కాలపు హిందీ చలనచిత్రాలలో ప్రాచుర్యం పొందిన ప్రేమకథా సూత్రాలనే అనుసరించినప్పటికీ, కథనంలోని చురుకుదనం, నటీనటుల మధ్య సహజమైన అన్యోన్యత, ఆకర్షణీయమైన దృశ్యీకరణ ఈ చిత్రాన్ని చిరస్మరణీయమైన వినోదాత్మక ప్రేమకథగా నిలబెట్టాయి.
ఓపీ నయ్యర్ సంగీతంలో సంగీత వాద్యాలకు, మాధుర్య ప్రధానమైన స్వరాలకు ప్రముఖ స్థానం ఉంటుంది. అటువంటి సంగీతంలో ఆయన మహమ్మద్ రఫీ గారికి, ఆశా భోస్లే గారికి చక్కటి అవకాశాలిచ్చారు. అటువంటి ఒక చిత్రం కశ్మీర్ కీ కలీ. ప్రముఖ దర్శక నిర్మాత శక్తి సామంతా ఈ చిత్రానికి సారథ్యం వహించారు. ఆయన తొలుత సంగీత దర్శకత్వానికి శంకర్-జై కిషన్ ద్వయాన్ని ఎంపిక చేశారు. కానీ, ఓపీ నయ్యర్ గారు తాను స్వరపరచిన కొన్ని పాటలను కథానాయకుడు షమ్మీ కపూర్ గారికి వినిపించగానే అవి ఎంతో నచ్చి ఆయన శక్తి సామంతా గారికి నయ్యర్ గారే సంగీత దర్శకత్వం వహించాలని సిఫారసు చేశారట.
ఇక్కడ చిత్రంలో పాటల రచయిత ఎస్.హెచ్ బిహారీ గారి గురించి కూడా చెప్పుకోవాలి. మన తెలుగు సినిమాలలో స్వర్ణయుగంలో భావప్రాధాన్యమైన పాటలకు ఎలా పెద్ద పీట వేశారో హిందీలో కూడా అందమైన షాయరీకి అలాంటి ప్రాధాన్యతే ఇచ్చారు. ఎస్.హెచ్ బిహారీ అటువంటి గీతాలకు చాలా పేరొందిన వారు. కాశ్మీరు లోయ ఒకప్పుడు భారత చలన చిత్రాల షూటింగులకు అడ్డా. ప్రతి చిత్రంలోనూ కాశ్మీరులో ఒక్కపాటైనా చిత్రీకరించవలసిందే, అక్కడ లోయాల అందాలను సాహిత్యంలో ఏదో ఒక విధంగా పొందుపరచేవారు. ఇక అటువంటిది ఏకంగా కశ్మీరీ అమ్మాయి మీద తీసిన చిత్రం కాబట్టి పాటలు, సంగీతం తదనుగుణంగా ఉండాలి కదా. అందుకే ఎస్.హెచ్. బిహారీ మరియు ఓపీ నయ్యర్ల కాంబినేషన్‌ను ఈ చిత్రానికి హీరో-దర్శక నిర్మాతలు ఎంపిక చేశారు. అప్పట్లో షమ్మీ కపూర్ అగ్ర హీరో. ఆయన సరసన హిందీలో అరంగేట్రం చేశారు షర్మిలా ఠాగూర్. 1959లోనే బెంగాలీ చిత్రాలలో నటించటం మొదలు పెట్టిన షర్మిల, 1964లో విడుదలైన ఈ చిత్రంలో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేసి చిత్ర విజయంతో సంచలనం సృష్టించారు.
కశ్మీర్ కీ కలీ సంగీతం చిత్ర విజయానికి చాలా పెద్ద కారణం. పాటల సాహిత్యం, సంగీతం శృంగార మధుర భావనలకు ప్రతీక. కాశ్మీరు లోయలోని అందాలను ఆవిష్కరించటం, సంగీత సాహిత్యాల బలం, షమ్మీ కపూర్ జోష్, షర్మిల అమాయకత్వం, మంత్రముగ్ధులను చేసే అందం చిత్ర విజయానికి తోడ్పడ్డాయి. ఓపీ నయ్యర్ గారి సినీ ప్రస్థానంలో కశ్మీర్ కీ కలీ ఓ ముఖ్యమైన మైలురాయి.
చిత్రంలో మొత్తం 9 పాటలు - అందులో మహమ్మద్ రఫీ గారు 4 సోలో, ఆషాభోస్లే గారు 2 సోలో, వారివే మూడు యుగళ గీతాలు. అన్నీ బాగుంటాయి, నాకు బాగా నచ్చేది దీవాన హువా బాదల్ అన్న యుగళగీతం.శ్రీనగర్‌లోని ప్రఖ్యాత దాల్ సరస్సు, దాని పక్కనే ఉన్న నెహ్రూ పార్కులో ఈ పాటను చిత్రీకరించారు. అలాగే ఇషారో ఇషారో మే అన్న యుగళగీతం కూడా చాలా మధురంగా, హృద్యంగా ఉంటుంది. రఫీ, ఆశాల గళాలలో అమృతం ఒలికినట్లనిపిస్తుంది. సమయం ఉన్నప్పుడు ఈ చిత్రం పాటలు యూట్యూబ్‌లో వీక్షించండి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి