17, సెప్టెంబర్ 2020, గురువారం

సద్గురు శివానంద సరస్వతి బోధలు


సాధకుల ప్రశ్నలకు హృషీకేష్ దివ్య జీవన సంఘం వ్యవస్థాపకులు స్వామి సద్గురు శివానంద సరస్వతి గారి సమాధానాలు:

ప్రశ్న: మరణమనేది ఎప్పటికైనా రావలసినదే, అది జీర్ణించిన వస్త్రాలను త్యజించి కొత్తవి ధరించినట్లు ఆత్మ ఒక దేహాన్ని వీడటమనే ప్రక్రియ అయినప్పుడు, ఆత్మహత్య మరియు జంతుబలి ఎలా పాపం?

సమాధానం: ఆత్మహత్య మరియు జంతుబలి మహాపాపాలు అని ఎందుకు అన్నారు అంటే అవి ఆ జీవుని యొక్క జీవ పరిణామాన్ని అర్థాంతరంగా ఆపివేస్తాయి కాబట్టి. అంతే కాకుండా, దేహాన్ని అర్థాంతరంగా ముగించటం వల్ల ఆ జీవుని యాతనలను ఏ మాత్రం తగ్గించకపోగా మరింత పెంచుతున్నాము. ఆ జీవునికి పూర్వజన్మ కర్మఫలముల వలన కలిగే సుఖదుఃఖాలను అటువంటి హత్యల వలన మనం ఏ మాత్రం తగ్గించటం లేదు. ఆ ఫలాలు పూర్తిగా ఎప్పటికైనా, ఎన్ని జన్మలెత్తైనా సరే అనుభవించి తీరవలసిందే.

అంతే కాకుండా, ఆత్మహత్య వలన జీవుడు మరిన్ని క్లేశాలను కొని తెచ్చుకుంటాడు. ఎందుకంటే అటువంటి దశలో దేహాన్ని వీడిని జీవునకు తన కర్మఫలాలను అనుభవించటానికి మరొక దేహం పొందటానికి సహజ మరణం కన్నా ఎంతో ఎక్కువ సమయం పడుతుంది. ఈ దేహప్రాప్తి కోసం వేచియుండటంలో జీవుడు ప్రేతాత్మగా సంచరించవలసి రావచ్చు. ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా ఇటువంటి జీవహింస వల్ల కలిగే దోషాలను, జీవుని దుస్థితుల నుండి త్వరగా ముక్తి కలుగక పోవచ్చు. సహజ జీవన పరిణామంలో జీవికి కలిగే మార్పులు అత్యంత సహేతుకమైనవి, వెలకట్టలేనివి.

మహామృత్యుంజయ మంత్రం ఏమని చెప్పింది? ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ అని. అంటే, దోసపండులా తీగనుండి ఎటువంటి నొప్పి లేకుండా, అత్యంత తేలికగా విడిపోవాలని పరమశివుని ప్రార్థిస్తాం. దోస తీగ పూవు పూచి, కాయ ఏర్పడి, ఆ కాయ తగినంత పరిణామానికి చేరి, పండటం మొదలు పెట్టి, పూర్తిగా పరిపక్వత సాధించిన తరువాత తీగనుండి వీడటానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు కోస్తే తీగకు, పండుకు అతి తక్కువ క్లేశం ఉంటుంది. ఆత్మ కూడా అంతే. అర్థాంతరంగా ఆ దేహాన్ని బలవంతంగా విడిపోయేట్లు చేస్తే ఎంతటి క్షోభ అది? ఆలోచించండి.

జీవన క్రమంలో ఏ ఆశ్రమ ధర్మం పాటించినా, జీవికి విషయ వాంఛల నుండి, బంధనాల నుండి ముక్తి కలగటమే సహజమైన ప్రక్రియ. ఈ విధంగానే కర్మఫలానుభూతి పరిపూర్ణమయ్యేది. ఇది బలవన్మరణంలో కలుగదు. అది మానవ జన్మైనా, మరే ఇతర జంతు జన్మైనా సరే. సారాంశం - ఆత్మహత్య లేదా జంతుబలి అన్నది ఆధ్యాత్మిక ప్రగతికి పూర్తిగా విరుద్ధమైన కర్మ. ఆధ్యాత్మిక పురోగతే కదా సమాజ పురోగతికి ప్రధాన హేతువు? అందుకే, చట్టరీత్యా అవి నేరాలు అయ్యాయి.

ప్రశ్న: సాధకులు మాంసాన్ని తినటం ఏ ప్రాతిపదిక మీద మీరు నిషేధిస్తున్నారు?

సమాధానం: వైద్యపరంగా, మనస్తత్వశాస్త్రపరంగా, నైతికపరంగా, ఆధ్యాత్మికపరంగా. మనసు అనేది మనం తినే ఆహారం యొక్క సారాన్ని బట్టే ఉంటుంది. తామసమైన ఆహారం తామసమైన మనస్సును కలిగిస్తుంది. మాంసం తామసమైనది కాబట్టే దాన్ని వర్జించాలి.

ఒక జంతువును వధించినప్పుడు దాని నాడీమండలం భయంతో కుంచించుకుపోతుంది. మీరు గమనించి ఉండవచ్చు మనకు భయం కలిగినప్పుడు మన కడుపులో వికారాలు కలుగుతాయి. దీనికి కారణం కాలేయం నుండి కొన్ని విషపదార్థాలు వెలువడటం వలన. అలాగే, జంతువులలలో కూడా. ఈ విషపదార్థాలు పేరుకుపోయి, ఆ జంతు మాంసాన్ని ఉడికించినా, వండినా, ఏమి చేసినా అలాగే ఉండిపోతాయి. కాబట్టే మాంసం తినటం విషపూరితము మరియు తినే వారి దేహానికి దీర్ఘకాలంలో ప్రమాదకరం.

ఆత్మ దేహంలో నివసిస్తుంది అన్న ప్రాతిపదికన మనిషికి జంతువుకు తేడా లేదు. ఎలాగైతే మనకు పూర్తికాలం జీవించే హక్కుందో, అదే జీవ సిద్ధాంతం ప్రకారం జంతువులకు కూడా ఆయుః ప్రమాణమున్నంత వరకు జీవించి దేహాన్ని అనుభవించే హక్కుంది. కాబట్టి నైతికంగా జంతువులను చంపటానికి మనకు హక్కు లేదు.

చేతనము అనేక రకాల చరాచరములుగా ఆవిర్భవించింది. ఆ చేతనమే మనలను ఇతర జంతుజాలాలలో, చరాచరములలో ఒకరిని చేసేది. మనలో ఉన్నదే ఆ జంతువులలో కూడా ఉంది. ఇది మన ధర్మం యొక్క మూల సిద్ధాంతం. ఇది తెలిసి కూడా జంతువులను ఎలా హింసించగలము? ఎలా చంపి తినగలము? ఈ ఆత్మ యొక్క ఏకత్వము వల్లనే మనము మరల మరల ఈ ప్రపంచంలో వేర్వేరు జన్మలెత్తుతున్నామనే కదా మన ధర్మం చెప్పింది? ఇదే కదా మనం సాధనలో తెలుసుకునేది? మనం ఇతర జీవులను హింసించకుండా, ప్రేమతో చూసి, కరుణ కలిగి ఉంటేనే కదా ఈ ఏకత్వ భావాన్ని అనుభూతి చెందేది? అప్పుడే కదా మన ఆత్మ, వాటి ఆత్మ ఒకటే అని అర్థమయ్యేది? పరబ్రహ్మమే సమస్త చరాచరములలోని ఆత్మ, ఆయన సృష్టి క్రమంలోనే ఆ ఆత్మ వేర్వేరు దేహాలను ధరిస్తుంది. కాబట్టి మనం చేసే జీవహింస ఆ చేతనము పట్ల పూర్తి అగౌరవభావాన్ని, మన యొక్క తీవ్రమైన అజ్ఞానాన్ని సూచిస్తుంది.

కాబట్టే, జంతువులను చంపకుండా, హింసించకుండా వాటి పట్ల ప్రేమగా ఉండి నిజమైన ఏకత్వాన్ని చాటుదాం.

ప్రశ్న: ఉన్నదానితో తృప్తి చెందటం శాంతిని కలుగజేస్తోంది. కానీ నాదొక సందేహం. నేను సంతృప్తుడనైతే నా జీవిత ఆశయాలు చచ్చిపోతాయి, నేను బద్ధకస్తుడినిగా మారి అలసత్వం పాలవుతాను. అనేక ఆకాంక్షల వల్ల నేను వాటిని సాధించే తపనలో శ్రమపడి మరింత శక్తిమంతుడవుతాను. తృప్తి అనేది మానవ ప్రగతికి అవరోధంలాగా అనిపిస్తోంది. దీనిని నివృత్తి చేయగలరు.

సమాధానం: తృప్తి అనేది ఎన్నటికీ మనిషిని అలసత్వం, బద్ధకం వైపు నడిపించదు. ఇది ఒక ముఖ్యమైన సాత్త్విక ప్రవృత్తి. దాని వలన మనిషి భగవంతుని అన్వేషించే మార్గంలో నడుస్తాడు. అది మానసిక శక్తిని, శాంతిని కలుగజేస్తుంది. అనవసరమైన, స్వార్థపరమైన ఒత్తిళ్ళను పక్కకు పెట్టగలదు. మనిషి యొక్క అంతర్నేత్రాన్ని తెరచి మనసును దేవునివైపు దృష్టి పెట్టేలా చేస్తుంది. అతని శక్తిని అంతర్ముఖం చేస్తుంది. అత్యాశ రూపంలో స్థూలమై ఉన్న శక్తిని ఓజస్సుగా మారేలా చేస్తుంది. తృప్తితో ఉన్న మనిషి సత్త్వముతో పరిపూర్ణుడవుతాడు. అతని శక్తి మరింత పెరుగుతుంది, అంతర్ముఖుడై ఆత్మదృష్టి కలిగి ఉంటాడు. శాంతముతో, ఏకాగ్రతతో మరింత పనిని చేయగలుగుతాడు. చిత్తము యొక్క చెదరగొట్టబడిన కిరణాలు ఏకమై తేజోమయుడవుతాడు.

ఈ సంతృప్తి అన్న బలంతోనే సాధువులు, సన్యాసులు, భిక్షువులు స్వేచ్ఛగా దేశాటన చేయగలిగారు. సంతృప్తి వల్లనే మనిషికి అంతశ్శక్తి కలిగి ఆత్మజ్ఞానం కలిగే మార్గంలో నడుస్తాడు. ముళ్లమయమైన, కఠినతరమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో అతను భయాతీతుడై ముందుకు సాగుతాడు.

ప్రశ్న: పరమాత్మ అంతటి దయాళువైతే మరి మంచి వానిని పూర్వ జన్మ కర్మ ఫలాలను అనుభవించే పరిస్థితి నుండి తప్పించి శాశ్వత సుఖాన్ని ప్రసాదించవచ్చు కదా? మంచి వాళ్లకు ఈ దుర్భరమైన కర్మఫలానుభవాలెందుకు?

సమాధానం: ఇక్కడే మనం పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవటంలో తప్పటడుగు వేసేది. కర్మఫలమనేది తిరిగే చక్రం లాంటిది. దానిని తిప్పే శక్తి ఖర్చు అయ్యేంత వరకూ అది తిరుగుతూ ఉండవలసిందే. కర్మ-ఫలములు అనేవి గొలుసుగా ముడిపడినవి. వేటగాడు బాణాన్ని ఒకసారి సంధించిన తరువాత, తన గురి లక్ష్యాన్ని తప్పిందని తెలిసినా దానిని ఉపసంహరించలేనట్లు, పూర్వజన్మలలో చేసుకున్న కర్మలు, అనగా ప్రారబ్ధ కర్మల యొక్క ఫలాలను అనుభవించి తీరాల్సిందే. వాటిని ఉపసంహరించలేము.

మరి పరమాత్మ ఎలా సహాయం చేస్తాడు? భక్తునికి ఈ ప్రారబ్ధ కర్మల ఫలానుభవాలను తట్టుకునే ఓర్పును, చిరునవ్వుతో అనుభవించగలిగే సంకల్పాన్ని బలపరుస్తాడు. పూర్తిగా ప్రారబ్ధ కర్మల పాలిట వదిలి వేయకుండా, తన అనుగ్రహమనే రక్షణ కవచంతో భక్తుని కప్పుతాడు. భీకరమైన వృష్టిలో, శీతలంలో మనం మన గృహంలో వెచ్చని వస్త్రాలలో రక్షణగా ఉన్నట్లు మనం పరమాత్మ అనుగ్రహంతో ఈ బాధలను సంతోషంగా ఓర్చుకుంటూ ఆ సాగరాన్ని దాటతాము. భగవద్భక్తి యొక్క మహత్తు ఇది.

ప్రశ్న: నేను "మహారాజును" అనుకుంటే మహారాజును కాను, అలాగే "అహం బ్రహ్మాస్మి" అనుకుంటే పరబ్రహ్మమును కాను కదా?

నేను మహారాజును అని అనుకోవటంతో పాటు ఆ మహారాజత్వానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి. ఎందరినో కూడగట్టాలి, ఆయుధాలను, శక్తియుక్తులను చేపట్టాలి, ఎన్నో విద్యలు నేర్వాలి, పోరాడాలి, విజయం పొందాలి, కోటానుకోట్ల ప్రజల గౌరవం పొందాలి. అలాగే, అహం బ్రహ్మాసి అని భావించటానికి మనసును శుద్ధి చేసుకోవాలి, దానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి. వివేక వైరాగ్య, షడ్ సంపదలు, ముముక్షత్వమనే నాలుగు ప్రాతిపదికలను పొందాలి, సనాతన వాఙ్మయాన్ని శ్రవణం, మననం చేయాలి, నిరంతర కఠోర ధ్యానం చేయాలి. అప్పుడే ఆత్మసాక్షాత్కారానికి అర్హుడవై బ్రహ్మానుభూతిని పొందగలవు.

నేను చక్కెర చక్కెర చక్కెర అనుకుంటే చక్కెర లభించదు, అలాతే, రామ రామ రామ అనుకుంటే రాముడు లభించడు కదా?

చక్కెర కావాలంటే దానికి సరిపడ డబ్బు సంపాదించాలి, కొట్టుకు వెళ్లాలి, కొనుక్కోవాలి. అలాగే, రాముని దర్శించాలంటే, కామ క్రోధాది అరిషడ్వర్గాలను కోల్పోవాలి, పరిపూర్ణమైన శరణాగతితో, సద్భావముతో, తదేక భక్తితో రాముని స్మరించాలి, అప్పుడు తప్పక రాముడు గోచరిస్తాడు. కానీ, చక్కెర నీ దేహానికి బయట ఉన్న వస్తువు. రాముడు నీలోనే ఉన్నాడు, కాబట్టి నీ హృదయాన్ని సంపూర్ణంగా సమర్పిస్తే రాముడు తప్పక లభిస్తాడు.

ప్రశ్న: స్వామీ! భారతదేశంలో ఉన్న సాంప్రదాయం గురువును ఆరాధించటం. అది ఎంతవరకూ సబబు? అది బానిసత్వం కాదా?

సమాధానం: నీకు సహాయం చేసిన వ్యక్తికి నీవు ఏదో ఒక విధంగా కృతజ్ఞత కనబరుస్తావు కదా? ప్రాపంచిక విషయాలలో సహాయం చేసిన వాని పట్ల కనబరచిన కృతజ్ఞత మన జీవిత పరమావధి అయిన పరమాత్మను కనుగొనే మార్గాన్ని నీకు అందించే గురువు పట్ల ఎందుకు చూపకూడదు? గురువు నీకు కొత్త జీవితాన్ని, శాశ్వతానందాన్ని, పరమ జ్ఞానాన్ని అందించే వాడు. ఆయనకు కృతజ్ఞత చూపించటమే గురువును ఆరాధించటంలో పరమార్థం. భారతీయ సాంప్రదాయంలో ఆరాధన అంటే ఉత్కృష్టమైన కృతజ్ఞతా భావం. నీకు సాయం చేసిన వానికి ఏదైనా సమర్పించుకుని కృతజ్ఞత తెలిపినట్లు నీకు అత్యంత విలువైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందజేసిన గురువుకు నిన్ను నీవు సమర్పించుకోవటమనేదే సముచితమైన కృతజ్ఞత.

ఇది బానిసత్వం ముమ్మాటికీ కాదు. నిజమైన సద్గురువు ఎన్నటికీ బానిసత్వం కోరుకోడు. ముమ్మాటికీ శిష్యుని ఆత్మకు స్వేచ్ఛనే కోరుకుంటాడు. గురువుకు శిష్యుని పట్ల అత్యున్నతమైన ప్రేమ వాత్సల్యాలు ఉంటాయి. శిష్యుని హృదయాన్ని గెలుచుకుని ఆ హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటాడు గురువు. ఆ విధంగా రెండు వేర్వేరు దేహాలైనా వారు ఏకమైన వారు. 

ప్రశ్న: నేను బ్రహ్మసాక్షాత్కారం పొందిన ఒక గురువు కోసం తీవ్రంగా వెదుకుతున్నాను. అటువంటి గురువు జాడలు తెలుపగలరా? మీరు బ్రహ్మ సాక్షాత్కారం పొందారా?

సమాధానం:ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే ఎందరికో వచ్చే చాలా సామాన్యమైన ప్రశ్నలివి. సరే, నేను ఫలానా గురువు బ్రహ్మజ్ఞానం పొందినవాడు అని చెప్పానే అనుకో. దానిని నీవు ఎలా నిరూపించగలవు? అతని వలన నీవు ఎంత ప్రయోజనం పొందగలవు?

బ్రహ్మజ్ఞానం పొందిన గురువులు అరుదేమీ కాదు. అజ్ఞానంలో కొట్టుమిట్టాడే మానవులు వారిని అంత త్వరగా గుర్తించలేరు. శుద్ధ అంతఃకరణం వంటి అనేక సుగుణాలు కలిగిన వారు అటువంటి జ్ఞానులను గుర్తించగలరు, వారి ద్వారా ప్రయోజనం కూడా పొందగలరు. బ్రహ్మజ్ఞానులైన గురువులు కోసం ఆ మూల ఈ మూల పరుగెత్తి వెదుకనవసరం లేదు. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే నీతో ఉన్నా, నీవు ఆయనను గ్రహించేందుకు అర్హుడవైతే తప్ప ఆయన నీకు ఏమీ చేయడు. ఈ విషయం గ్రహించి, నిష్కామ కర్మయోగ సాధనతో నిన్ను నీవు శుద్ధి చేసుకో. దాన గుణము కలిగి, ఏకాగ్రతతో బ్రహ్మచర్యము, జపము, ధ్యానము ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని పొందు. సద్గురువు అనుగ్రహం అదే కలుగుతుంది.

ఒక గురువును పరీక్షించటం చాలా కష్టం. నీ మేధస్సును దానిపై వినియోగించకు. విశ్వాసము కలిగి ఉండు. నిజమైన సాధకుడు ఇటువంటి ప్రశ్నలకు, సంశయాలకు దూరంగా ఉంటాడు. నా మాటలు నమ్మితే నువ్వు అద్భుతమైన ప్రయోజనాలు పొందగలవు.

1 కామెంట్‌:

  1. చాలా చక్కటి ప్రశ్నలు... సమాధానాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి...🕉️🙏

    రిప్లయితొలగించండి